నల్లేరు పొదలు, చెట్ల మీద దాదాపు 10 మీ. ఎత్తు పెరిగే బహు వార్షిక తీగ. దీని శాఖలు నాలుగు పలకల కాడల్లా ఉంటాయి. ఈ మొక్క కణుపులు కలిగి ఉండి ప్రతి కణుపు వద్ద హృదయాకారంలో గానీ, గుండ్రంగా గానీ పెళుసైన పత్రాలు కలిగి ఉంటుంది. ఈ కణుపుల వద్ద సన్నని తీగలు కూడా వస్తాయి. పూలు వంగ పండు రంగులోను, ఫలాలు సన్నగా, ఎరుపు రంగులో ఉంటాయి. నల్లేరు కాడ అంతా నారతో కూడి ఉండి చేతితో నలిపితే చేయి దురద పెడుతుంది. కాండం గుండ్రంగాను, బల్ల పరుపుగాను ఉండే మొక్కలు కూడా అక్కడక్కడ అరుదుగా కనిపిస్తాయి.
సాధారణ నామం : అడమెంట్ క్రీపర్ / ఎడిబుల్ స్టెమ్‌డ్‌లైన్ / హడ్‌జోడ్ శాస్త్రీయ నామం : సిస్సస్ క్వాడ్వాంగ్యులారిస్ కుటుంబం: వైటేసి²
ఉపయోగాలు : ఔషధరంగంలో …
నల్లేరు కాడలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఈ మొక్కల నుండి టెట్రాసైక్లిన్ ట్రైటెర్పినాయిడ్లు మరియు స్టెరాయిడ్లు లభిస్తాయి. నల్లేరు లేత కాడలను దంచి ఉప్పు, కారం, జీలకర్ర, మిరియాలు చేర్చి తింటే జీర్ణ శక్తి పెరుగుదలకు, కీళ్లనొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
బాగా ముదిరి లావుగా ఉన్న నల్లేరు కాడల్ని ఎండబెట్టి చూర్ణం చేసి పిప్పిళ్ళ చూర్ణం కలిపి తేనెతో సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. నల్లేరు చూర్ణం మూలవ్యాధికి, బహిష్టు క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. నల్లేరు రసం చెవి నుంచి చీము కారడం తగ్గిస్తుంది. నల్లేరుకి విరిగిన ఎముకలను అతికించే గుణం కూడా ఉంది.
వ్యవసాయరంగంలో
నల్లేరు కాండం పెట్రోలియం ఈదర్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను, ప్యూపాలను అత్యంత సమర్ధవంతంగా నివారించింది (రమేష్ కుమార్ అండ్ నట్టుతురాయ్, 2012).
నల్లేరు తాజా మరియు ఎండిన కాండాల ఇథైల్ అసిటేట్ ద్రావణం మరియు మిథనాల్ ద్రావణాలు బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ సీరియస్, స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ స్పీసీస్‌పై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (చిదంబర మూర్తి, అతని అనుచరులు, 2004).
వేప ఆకులు, నల్లేరు ఆకులు సమపాళ్ళలో కలిపి నూరి ఆవుమూత్రంలో ఒక వారం నానబెట్టి వడపోసి, 1:9 నిష్పత్తిలో నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి వరిలో పురుగులను నివారించవచ్చు (పిఒపి, తమిళనాడు)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
జాఫ్రా 4-5 మీ. ఎత్తు పెరిగే చిన్న చెట్టు. గులాబి రంగు పూలు కొమ్మల చివర్లో గుత్తులుగా ఏర్పడతాయి. ముదురు ఎరుపు రంగులో పండ్లు ముళ్ళతో నిండి, అండాకారంలో కొంచెం నొక్కినట్లు ఉంటాయి. గింజలు ముక్కోణాకారంతో ముదురు నారింజ రంగులో 3-4 మి.మీ. పరిమాణం కలిగి ఉంటాయి. ఇవి సామాన్యంగా ఫిబ్రవరి – మే మాసాల్లో లభిస్తాయి. దాదాపు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు ఫలసాయం పొందవచ్చు.
సాధారణ నామం : అనాటో / సింధూర శాస్త్రీయ నామం : బిక్సా ఒరెల్లానా కుటుంబం: బిక్సేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
బెరడు, విత్తనాలు, గుజ్జు, ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
గింజలలో “బిక్సిన్” అనే రసాయనముంటుంది.
గింజల గుజ్జులో రంగును కలుగచేసే కెరోటినాయిడ్ ఉంటుంది.
దీని బెరడును గనేరియా వ్యాధి, తరచూ వచ్చే జ్వరాల నివారణకు పయోగిస్తారు.
గింజల గుజ్జును బంక విరేచనాల నివారణకు ఉపయోగిస్తారు.
ఆకులను కామెర్ల వ్యాధి నివారణకు, పాముకాటుకు ఉపయోగిస్తారు.
వైద్యపరంగానే గాక గింజల నుండి తీసిన సహజ రంగును ఆహార పదార్థాలలో విరివిగా వాడతారు.
వ్యవసాయరంగంలో …
జాఫ్రా గింజల ద్రావణం శాండ్ ఫ్లై, లుట్జోమియా లాంగిపాల్పిస్ చావు శాతాన్ని పెంచింది. బలమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. (డిఆరియాస్, అతని అనుచరులు, 1992).
జాఫ్రా ఆకులు జీవపురుగు మందు సామర్థ్యం కలిగి ఉన్నాయి (కేల్, అతని అనుచరులు, 2012).
జాఫ్రా ఇథనాల్ ఆకు ద్రావణం గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్య ప్రదర్శించింది.
జాఫ్రా గింజల ద్రావణం టిక్స్‌పై పురుగు వికర్షక, పారసైట్ నాశక, దోమవికర్షక చర్యలను ప్రదర్శించింది (డి బోయిర్, అతని అనుచరులు, 2010)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
అనాస ఒక మీటరు వరకు ఎత్తు పెరిగే బహువార్షిక మొక్క. కాండం దృఢంగా ఉండి, ఆకులు పొడవుగా, ముళ్ళు కలిగి ఉంటాయి. పండ్లు ఎరుపు, పసుపు మిశ్రమ రంగు కలిగి, రసంతో నిండి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని పిలకమొక్కలు, క్రౌన్స్ మరియు స్లిప్స్ ద్వారా వ్యాప్తి చేస్తారు.
సాధారణ నామం : పైనాపిల్ శాస్త్రీయ నామం : అనానాస్ కామోసస్ కుటుంబం: అనోనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
అనాస పండ్లు మరియు ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. అనాస పండులో “బ్రోమోలిన” అనే ప్రోటీన్‌ని విడగొట్టే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా పెంపొందిస్తుంది.
అనాస పండ్లలో ఎక్కువగా విటమిన్ ‘ఎ’ మరియు ‘సి’ లభిస్తాయి.
భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.
మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”
ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.
గోంగూర సాగు: ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.
పాలకూర: పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.
తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.
బచ్చలికూర : బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.
చుక్క కూర: చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.
పుదీన: పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.
మెంతి కూర: దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258
పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పండించడానికి భూమి దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50చ.మీ. స్థలం సరిపోతుంది. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సరైన పాళ్ళలో ఉండాలి. పెరటిలోను, ఇంటి పైకప్పుపైనా మొక్కలు సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండించి ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందంపొందవచ్చు.
ఇంటి మిద్దెపై ఒక సెంటు స్థలం ఉన్నప్పటికీ ఇంటికి సరిపడా కూరగాయలు చాలా సులువుగా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేని చక్కని రుచికరమైన కూరగాయలన్నింటినీ స్వయంగా పండించవచ్చు.
మిద్దె తోటలో మొక్కల పెంపకము వల్ల లాభాలు: మిద్దె తోటలో మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా పురుగు మందుల అవశేషాలు లేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య భద్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి పై మిద్దె తోటలో మొక్కల పెంపకం వలన మంచి వ్యాయామం లభిస్తుంది. పండ్ల, కూరగాయల ఖర్చు తగ్గుతుంది. స్థలం, అపార్టుమెంట్ల విలువ పెరుగుతుంది. పైగా ఈ మిద్దె తోటల పెంపకం వలన వేసవిలో ఉష్ణోగ్రతలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
మిద్దె తోటను ఏర్పాటు చేసుకునే విధానం : పీవీసీ పైపులతో స్టాండ్లు ఏర్పాటు చేసుకొని, వాటిపై ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు పెట్టాలి. ఆ ఖాళీ డబ్బాల్లో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, పశువుల పేడ నింపాలి.
మిద్దెపై వార్షిక కూరగాయల మరియు పండ్ల మొక్కల పెంపకం యొక్క ప్రణాళిక: మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పారించాలి. డాబాలపైన, బాల్కనీలలోనూ పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్ నెట్ కాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు.
కుండీల ఎంపిక: కుండీలను ఎంచుకునేటప్పుడు మురుగునీరు పోవడానికి రంధ్రాలున్న వాటినే ఎంచుకోవాలి. కుండీలలోపల వైపు మెరుపులేని కుండీలు ఎంచుకోవాలి. మెరుపు ఉంటే సీసం, మట్టి మిశ్రమంలో కలుస్తుంది. కుండీలను బంకమట్టితో, ప్లాస్టిక్, చెక్క లేదా లోహంతో తయారుచేస్తారు. కుండీల ఎంపికలో మొక్కలు పెరిగే ఎత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
తొట్టి/ప్లాస్టిక్ సంచులు: మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి కావలసినంత పొడవు 9-20″ లోతు సిమెంట్ తొట్లు నిర్మించుకొని /ప్లాస్టిక్ సంచులు ఉపయోగించుకొని మట్టి మిశ్రమాన్ని (2 భాగాలు ఎర్రమట్టి + 1 భాగం ఇసుక + 1 భాగం కంపోస్టు) నింపుకొని పండ్లు, కూరగాయల పంటలను పెంచుకోవచ్చు. పై అంచునుండి అంగుళం ఖాళీని నీరు పెట్టడానికి వీలుగా వదలాలి.
మట్టి కుండీలు: కుండీల ప్రక్క నిలువుగాను, పైభాగం వెడల్పుగాను ఉంటుంది. ఇటువంటి కుండీలలో ఎక్కువ మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపవచ్చు.
ప్లాస్టిక్ కుండీలు: గుండ్రంగా, చదరంగా ఉన్న ప్లాస్టిక్ కుండీలను ఇంటిలో పెరిగే మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి తేలికగా మరియు రంధ్రాలు కలిగి తిరిగి వాడుకోవడానికి అనువుగా ఉండి తక్కువ స్థలంలో నిల్వచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.
కుండీలు నింపే పద్ధతి: మిద్దె తోటల పెంపకంలో మట్టి అతి ముఖ్యమైనది. మంచి మట్టి వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి. మార్కెట్లో అనేక పాటింగ్ మిశ్రమాలు లభిస్తాయి. 3 భాగాల కంపోస్ట్ లేదా కంపోస్టు ఎరువును ఒక భాగం తేలిక బరువున్న పీట్ తో కలిపి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. నాటే కూరగాయలకు నారు మొక్కల పెంపకానికి లోతు తక్కువ పళ్ళాలను /తొట్లను మట్టి, ఇసుక, కంపోస్ట్ (1:1:1) మిశ్రమంతో కలిపి విత్తనాలను చల్లాలి. మట్టి మిశ్రమాన్ని తొట్లు/బారిల్స్/బకెట్లు/ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటి అడుగున నీరుపోయే రంధ్రాన్ని ఏర్పర్చాలి. తొలుత నీరుపోయే రంధ్రాన్ని చిన్న చిన్న పెంకులతో కప్పాలి. దీని వలన నీరుపోయే రంధ్రం గుండా మట్టి మిశ్రమం జారిపోకుండా అదనపు నీరు మాత్రమే బయటకు పోతుంది. ఆ తర్వాత గరుకు ఇసుక పోసి సమం చేయాలి. దానిపై ఒక అంగుళం మందంతో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టు పరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచువరకు నింపాలి. ఇంటి మేడపైన మొక్కలు పెంచే కంటైనర్లను ఒక పద్ధతిలో ఉంచాలి. నీరు పోయడం, కలుపు తీత అంతరకృషి కాయ/ఆకు కోతకు అనువుగా మనిషి నడిచేందుకు వీలుగా దారి వదలాలి. మిద్దెపై చుట్టూ ఉండే పెరాపెట్ గోడపై 6 అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లీస్ లా బైండింగ్ వైర్ అల్లించాలి. వాటిపైకి తీగజాతి కూరగాయల్ని పాకించి, నిలువు స్థలంలోను ఫలసాయం పొందవచ్చు.
ఎరువుగా ఇంటి వ్యర్థాలు: మొక్కల ఎండిన ఆకులను తొలగించి ఓ బకెట్‌లో నిల్వ ఉంచాలి. కూరగాయల వ్యర్థాలను సైతం అందులో వేయాలి. వాటిపై కొద్దిగా మట్టి వేసి ఆవు మూత్రం చల్లితే కంపోస్టు ఎరువు వాటంతట అదే తయారవుతుంది. రోజూ కొంత సమయం కేటాయించగలిగితే కుటుంబానికి అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు డాబా పైనే పండించుకోవచ్చు.
డా. పోతురాజు ప్రదీప్ కుమార్, డా. మీగడ లక్ష్మి కమల, డా. యల్లపు రామ్ మోహన్ డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. Ph: 9160477365
విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళన కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో రేపు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ప్రథమ ప్రోత్సాహకులు డాక్టర్ కోటపాటి గంగాధరం అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్, విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్, ఎంపీ గురుమూర్తి, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ సావల రేవద్దత్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హాజరవుతారన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అయ్యపనాయుడు, రాంజీ, జయరాం, పరమేశ్వరి పాల్గొన్నారు.
ప్రకృతి ప్రసాదించిన వెల్లుల్లిలోని ఎలిసిన్… అంటువ్యాధులు, శ్వాసకోశ రుగ్మతలపై పనిచేస్తుంది. గంధక ధాతువులు.. అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. సెలీనియం క్యాన్సర్ కణాలవ్యాప్తిని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్లు గుండె ధమనులను కాపాడతాయి. యాంటీఆక్సిడెంట్లు మధుమేహం, వృధ్ధాప్యం మీద పనిచేస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. వెల్లుల్లిపై సరికొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. వెల్లుల్లికి ఉన్న ఈ సహజ రోగ నిరోధక లక్షణాలను నానో టెక్నాలజీతో మరింత ఇనుమడింపజేయవచ్చని అలహాబాద్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు కె.ఎన్. ఉత్తమ్ నిర్ధారించారు. ఆయన ఆధ్వర్యంలో పరిశోధకులు వెల్లుల్లి మొక్కపై టైటానియం డయాక్సైడ్ నానో పార్టికిల్స్‌ను ప్రయోగించారు. ఈ నానో అణువులు వెల్లుల్లిలోని పోషక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. ఫలితంగా వెల్లుల్లిలో గంధకం, భాస్వరం, క్యాల్షియం, జింక్, ఇనుము ధాతువులు సాధారణం కన్నా ఎక్కువగా ఏర్పడ్డాయి. యాంటీ ఆక్సిడెంట్లు 30 నుంచి 40 శాతం పెరిగాయి. వెల్లుల్లిలోని ఏ ధాతువు ఏ వ్యాధి చికిత్సకు తోడ్పడుతుందో నిర్ధారించుకుని ఆయా రోగాల చికిత్సకు పరిశోధనశాలలో వేర్వేరు వెల్లుల్లి రకాలను రూపొందించి పొలాల్లో సాగు చేయించాలని ఉత్తమ్ బృందం యోచిస్తోంది. ఇలాంటి రకాలకు పేటెంట్లు తీసుకుని రెండేళ్లలో రైతులకు అందించాలనుకుంటున్నమని ఉత్తమ్ చెప్పారు.