వెటర్నరీ వర్సిటీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 253 బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2005లో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించగా, ఈ స్థాయిలో నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రత్యక్ష నియామకాలు చేపట్టేలా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పశుసంవర్ధక శాఖ) బి. రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ 253 ఉద్యోగాల్లో 81 బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఆచార్యులు-56, సంయుక్త ఆచార్యులు-78, సహాయ ఆచార్యులు-119 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించింది.

