గోవులలో వ్యాధి నిర్ధారణ ప్రాముఖ్యత

పశువైద్యంలో వ్యాధినిర్ధారణ అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అంశం.

యజమానిని లేదా సంబంధిత వ్యక్తుల్ని, గోవుకు సోకిన వ్యాధి పూర్తి వివరాలు, పూర్వాపరాలు, వారు గమనించిన లక్షణాలు, మేపిన మేతల వివరాలు, ఇతర ప్రత్యేక అంశాలు, క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలి.

పరిసరాల్ని పరిశీలించాలి. లక్షణాలను స్వయంగా గమనించాలి.

గోవు యొక్క ప్రవర్తన, అవయవాలు అంటే నోరు, నాలుక, ముక్కు, కళ్లు, చెవులు, చర్మం, వెంట్రుకలు, గుండె, నాడి, శ్వాస, పొట్ట, గోవుల్లో అయితే యోని, చూడి గోవు అయితే అవసరాన్ని బట్టి గర్భకోశం, దానిలోని పిండాన్ని, పొదుగును, చన్నుల్ని, వృషభాల్లో అయితే బీర్జాలు, చేరు మొదలైన అవయవాల్ని, నడకను పరీక్షించాలి.

వ్యాధుల భేదాత్మక పరిశీలన (Differencial Diagnosis) ద్వారా ఏ జబ్బు అయి వుంటుందో ఆలోచించి, రోగాన్ని నిర్ధారించాలి.

శరీర ఉష్ణోగ్రత, పేడ, రక్తం, చీమిడి ఇంకా మరికొన్ని పరీక్షలు వ్యాధి నిర్ధారణకు ఉపకరిస్తాయి.

రోగనిర్ధారణ సామర్థ్యం వల్లనే వైద్యుని యొక్క ప్రతిభ ప్రకటితమవుతుంది.

ఇంతకుముందు చేసిన చికిత్సల వివరాలు తెలుసుకోవడం వలన, చికిత్సా ప్రణాళిక సమర్థవంతంగా రూపొందించుకునే వీలు కలుగుతుంది. దాని ఆధారంగా చేసే చికిత్స మెరుగైన సత్ఫలితాలను ఇస్తుంది.
తరువాత చికిత్సా ఫలితాలను సమీక్షించుకోవడం వలన, పశ”వైద్యుని సామర్థ్యం ఇనుమడిస్తుంది.
గోవు యొక్క బరువు ఆధారంగానే మందుల మోతాదులు నిర్ణయించబడతాయి.

గోవు బరువు లెక్కించు సూత్రం:
పొడవు x (చుట్టుకొలత)² / 660 = శరీర బరువు (కిలో గ్రాములలో)

పొడవు… ముందు జబ్బనుంచి వెనుక తొడ వరకు (అంగుళాలలో) ఛాతీ చుట్టు కొలత…(అంగుళాలలో)

మోతాదుల నిర్ణయం: మందుల స్వభావం, వాటి సాంద్రతను బట్టి, బరువు ప్రాతిపదికగా వాడవలసిన మందుల మోతాదులు నిర్ణయించాలి.

గోవు బరువును, మందులో వుండే రసాయన శక్తిని ప్రాతిపదికగా మందు మోతాదును నిర్ణయించాలి.
నిర్దిష్ట మోతాదులను మించి మందు వినియోగించరాదు.

ఏ విధంగా మందును శరీరంలోనికి పంపాలో, అలాగే పంపాలి. అంటే తినిపించవలసినవి, చర్మంపై వాడవలసినవి, కండకు చేసే ఇంజక్షన్లు (।/M), రక్తంలోకి ఎక్కించే ఇంజక్షన్లు (।/V), చర్మం క్రిందకు చేసే ఇంజక్షన్లు (S/C), దేనికవే చేయటంలో బహుజాగ్రత్త వహించాలి. రక్తంలోనికి ఎక్కించే ఇంజక్షన్లు నిదానంగా చేయాలి.

మందు మోతాదు నిర్ణయించటానికి పరిగణనలోనికి తీసుకునే పశువు బరువు షుమారు (కిలోలలో):
లేగదూడ 25 కిలోలు
5-6 నెలల వయస్సున్న దూడ 60 కిలోలు
సంవత్సరం వయస్సున్న దూడ 120-150 కిలోలు
3 సంవత్సరాలు పైబడిన ఆవు 250-300 కిలోలు
గిత్తలు 300-400 కిలోలు
ఆంబోతులు 500 కిలోలు పైగా
……………………………………………………………………………………….
సకాలంలో వ్యాధి నిర్ధారణ – సరైన చికిత్సతో వ్యాధి నివారణ

——————————————————————————————————–
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

గోపోషణ… అనారోగ్యంగా వున్న గోవు ప్రవర్తన

ఏ మాత్రం హుషారు లేక, యజమానిని, తోటి గోవులను పట్టించుకోకుండా వుంటుంది. బాధతో వున్నప్పుడు తల వాల్చి, చెవులు వేళ్ళాడవేసి, కాంతి లేని కళ్ళతో, కన్నీరు కారుస్తూ, కనుగుంటలు వదిలి, ముట్టె తడి ఆరిపోయి వుంటుంది.

వెంట్రుకలు నిక్కపొడిచి, రోమాలు నల్ల కప్పు వేసి, ముణగదీసుకొని, డొక్కలో తల పెట్టుకొని పడుకుంటుంది.

చలాకీతనంలేక స్తబ్ధుగా వున్నట్లుగా, ప్రశాంతత లేక అస్థిరంగా కదులుతున్నట్లుగా, హుషారుగా లేక దుఃఖంతో బాధపడుతున్నట్లుగా అసాధారణ చర్యలు, నడక, నిలబడే పడుకునే విధానాలు, ముఖకవళికలు, ప్రవర్తనను బట్టి గోవును చూడగానే, అనారోగ్యంతో వున్నట్లు తేలికగా గ్రహించగలిగే వీలుంటుంది.

ఇంకా ముట్టెవిరుస్తూ, ముక్కుల వెంట నీరు, చీమిడి కారుస్తూ, శ్వాస దుర్వాసనతో వుండి, ఆయాస పడుతూ, మలుగుతూ, మందకొడిగా వుంటుంది.

ఎంతో జాలిగా అరుస్తూ, అలసటగా, అసౌకర్యంగా కదులుతూ, వణుకుతూ, కాళ్ళు తడబడుతూ, నిలబడలేక పోతుంది. 

నోటి వెంట చొంగ కారుస్తూ, చిక్కని నురుగు వేస్తూ, పళ్ళు నూరుతూ, నాలుక ఆడించలేకుండా వుంటుంది.

ఆకలి మందగించి, మేత మేయక లేదా అరమేత మేస్తూ, నీరు త్రాగక, నెమరు వేయక, చర్మంపై, ముఖంపై వాలిన ఈగలను తోలుకోలేక, నిస్త్రాణంగా వుంటుంది.

జాలిగా, దిగాలుగా, బాధవున్న భాగాన్ని తరచూ చూస్తూ, నాకుతూ, కాళ్లతో తన్నుతూ వుంటుంది.

జ్వరం వుండవచ్చు, గురక వుండవచ్చు, కంతులు ఏర్పడవచ్చు, కుంటవచ్చు.

మలమత్రాలు రాకపోవచ్చు లేదా తక్కువ, ఎక్కువ పరిమాణంలో, ముక్కుతూ, బాధ పడుతూ, రంగు మారి, దుర్వాసనతో, పలుచగా, గట్టిగా చీము, రక్తంతో కూడి వుండవచ్చు.

దూడను కుడవనివ్వకపోవచ్చు. పాలు ఇవ్వకపోవచ్చు లేదా తగ్గవచ్చు, పొదుగు పట్టుకోనివ్వకపోవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More