దిగుమతి సుంకం సున్నా శాతంతో అమెరికా నుండి పండ్లు, కూరగాయలు
భారత్ సున్నా శాతం సుంకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 98% నుంచి 99% ఉత్పత్తులపై అమలు చేయనుందని అమెరికా పేర్కొంది. పండ్లు, కూరగాయలుసహా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు ఉండబోవని స్పష్టం చేసింది. కొన్ని కీలక ఉత్పత్తులపై మాత్రం భారత్ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని వివరించింది. మంగళవారం సీఎన్బీసీ కార్యక్రమంలో భారత్ తో వాణిజ్య ఒప్పందం పై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ స్పందించారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ మీడియాతోనూ, ఫాక్స్ న్యూస్ నూ మాట్లాడారు.
‘భారత్పై అమెరికా 18శాతం సుంకాలను కొనసాగిస్తుంది. ఆ దేశంతో మాకు వాణిజ్య లోటు ఉంది. వారు పలురకాల వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ వస్తువులు, రసాయనాలు, వైద్య పరికరాలపై సుంకాలను తగ్గిస్తామని అంగీకరించారు. ప్రస్తుతం భారత్లో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై సగటున 13.5 శాతం సుంకాలున్నాయి. అవి సున్నాకు చేరతాయి. కానీ బాదం, పిస్తా వంటి ఉత్పత్తులు, వైన్, ఆల్కహాల్ పానీయాలు, పండ్లు, కూరగాయలపై సున్నా శాతం సుంకాలే అమలవుతాయి. ఇది పెద్ద విజయం’ అని గ్రీర్ పేర్కొన్నారు.

