వ్యవసాయంలో బయోచార్ ఉపయోగాలు

బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పంటల పెరుగుదల, దిగుబడి మరియు సాగు స్థిరత్వాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవి:

• నేలలో సేంద్రియ కార్బన్ పెరిగి భూసారం మెరుగుపడుతుంది.
• నేలలో పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి, మొక్కలకు అవి క్రమంగా అందుబాటులోకి వస్తాయి.
• నత్రజని వంటి పోషకాలు వర్షం లేదా నీటితో కొట్టుకుపోవడం (లీచింగ్) తగ్గి, ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
• నేల నిర్మాణం మెరుగుపడి, గాలి ప్రసరణ మరియు వేర్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
• నేలలో నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరగడంతో ఎండ పరిస్థితుల్లో కూడా పంటలు మెరుగ్గా తట్టుకుంటాయి.
• ఆమ్ల నేలల్లో నేల ప్రతిచర్య (pH) సమతుల్యంగా ఉండేందుకు కొంతవరకు సహాయపడుతుంది.
• బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు మరియు వానపాములకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.
• నేలలో పోషకాల నష్టాన్ని తగ్గించడం ద్వారా రసాయన ఎరువుల అవసరాన్ని కొంత మేర తగ్గించవచ్చు.
• నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
• వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే వాతావరణ అనుకూల వ్యవసాయ సాంకేతికతగా బయోచార్ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది.
• బయోచార్‌లోని విస్తారమైన ఉపరితల వైశాల్యం మరియు సూక్ష్మ రంధ్రాల నిర్మాణం నీరు, పోషకాలను నిల్వ ఉంచడంతో పాటు నేలలోని ఉపయోగకరమైన జీవసంపద అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

బయోచార్ నాణ్యత ప్రమాణాలు

ప్రమాణం:
మంచి నాణ్యత గల బయోచార్ లక్షణం

రంగు:
నల్లని లేదా ముదురు నలుపు

ఉదజని సూచిక: 6.5–9.5

సేంద్రియ కార్బన్: 60% కంటే ఎక్కువ

స్థిర కార్బన్: 50-80%

తేమ: 10% కంటే తక్కువ

బూడిద శాతం: 20% కంటే తక్కువ (ముడి పదార్థాన్ని బట్టి మారవచ్చు)

C:N నిష్పత్తి: 25:1 కంటే ఎక్కువ (సాధారణంగా 30:1–100:1)

నిర్మాణం: తేలికగా, ఎక్కువ సూక్ష్మ రంధ్రాలు కలిగి ఉండాలి

కణ పరిమాణం: పొలంలో ఉపయోగానికి చిన్న ముక్కలు లేదా పొడి రూపంలో ఉండాలి

హానికర పదార్థాలు: ప్లాస్టిక్, రబ్బరు, పాలిథిన్, భారీ లోహాలు, రసాయన అవశేషాలు లేకుండా ఉండాలి

ప్రయోగశాల పరీక్షల ద్వారా ఉదజని సూచిక, సేంద్రియ కార్బన్, స్థిర కార్బన్ వంటి ప్రమాణాలను నిర్ధారించవచ్చు. రైతు స్థాయిలో మాత్రం నల్లని రంగు, తక్కువ బూడిద, తేలికైన రంధ్రాల నిర్మాణం మరియు హానికర పదార్థాలు లేకపోవడం మంచి నాణ్యత గల బయోచార్‌కు ముఖ్యమైన సూచికలుగా పరిగణించవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

వివిధ బయోచార్ తయారీ పద్ధతుల పోలికలు

బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.

పద్ధతి: గొయ్యి పద్ధతి
పెట్టుబడి: చాలా తక్కువ
సామర్థ్యం: తక్కువ
ప్రధాన లక్షణాలు: పొగ ఎక్కువ, నాణ్యత మధ్యస్థం, చిన్న రైతులకు అనుకూలం
ప్రయోజనాలు: పరికరం అవసరం లేదు
పరిమితులు: ఆక్సిజన్ నియంత్రణ కష్టం

పద్ధతి: డ్రమ్ (200 లీ)
పెట్టుబడి: తక్కువ
సామర్థ్యం: 20-60 కిలోలు/బ్యాచ్
ప్రధాన లక్షణాలు: పొగ తక్కువ, నాణ్యత అధికo, చిన్న రైతులకు అనుకూలం
ప్రయోజనాలు: తక్కువ ఖర్చు, సులభ నిర్వహణ
పరిమితులు: సామర్థ్యం తక్కువ

పద్ధతి: TLUD కిల్న్
పెట్టుబడి: మధ్యస్థం
సామర్థ్యం: మధ్యస్థం
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అధికo, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అనుకూలం
ప్రయోజనాలు: అధిక కార్బన్ నిల్వ
పరిమితులు: ప్రత్యేక కిల్న్ అవసరం

పద్ధతి: కాన్-టికీ కిల్న్
పెట్టుబడి: మధ్యస్థం – ఎక్కువ
సామర్థ్యం: 0.1-1.0 టన్ను/బ్యాచ్
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అత్యుత్తమం
ప్రయోజనాలు: అధిక ఉత్పత్తి, తక్కువ కాలుష్యం
పరిమితులు: పెట్టుబడి, శిక్షణ అవసరం

పద్ధతి: ఇటుకల కిల్న్
పెట్టుబడి: ఎక్కువ
సామర్థ్యం: అధికం
ప్రధాన లక్షణాలు: పొగ తక్కువ, నాణ్యత అధిక, గ్రామ కేంద్రాలకు అనుకూలం
ప్రయోజనాలు: పెద్ద మొత్తంలో ఉత్పత్తి
పరిమితులు: స్థిర నిర్మాణం అవసరం

పద్ధతి: ఇక్రిశాట్/ భోపాల్ పోర్టబుల్ యూనిట్
పెట్టుబడి: మధ్యస్థం
సామర్థ్యం: మధ్యస్థం
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అధిక, చిన్న రైతులు/ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అనుకూలం
ప్రయోజనాలు: తరలించవచ్చు
పరిమితులు: పరిమిత లభ్యత

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ (Top-Lit UpDraft – TLUD) కిల్న్ అనేది పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చే సమర్థవంతమైన సాంకేతికత. ఈ కిల్న్ సాధారణంగా ఇనుప లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడుతుంది. అడుగు భాగంలో నియంత్రిత గాలి ప్రవేశానికి రంధ్రాలు, పై భాగంలో పంట అవశేషాలను నింపేందుకు అనువైన ఏర్పాటు ఉంటుంది.

ముందుగా పొడి పంట అవశేషాలను 5–15 సెం.మీ. పొడవు ముక్కలుగా చేసి కిల్న్‌లో నింపాలి. అనంతరం పైభాగంలో కొద్దిపాటి పొడి గడ్డి, చిన్న చెక్క ముక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. మంట పైభాగం నుంచి క్రమంగా క్రిందికి వ్యాపిస్తుండగా, అడుగు భాగం నుంచి పరిమితంగా ప్రవేశించే గాలి కారణంగా అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

పైరోలిసిస్ పూర్తయిన తర్వాత గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి. అనంతరం తయారైన బయోచార్‌ను బయటకు తీసి నిల్వ చేయాలి లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఈ పద్దతిలో పొగ తక్కువగా విడుదలవుతుంది, బయోచార్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. తయారీ సమయం తగ్గుతుంది మరియు కార్బన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ కారణాల వల్ల చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలకు ఇది అనువైన, వాతావరణ అనుకూల సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

ఇటుకల కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

Read More

బయోచార్ తయారీ, వినియోగం మరియు వ్యవసాయంలో ప్రయోజనాలు

రైతు వ్యర్థంగా భావించే వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు, పప్పుధాన్యాల కాండాలు, కూరగాయ పంటల అవశేషాలు భూమికి అమూల్యమైన సహజ సంపద. వీటిలో సేంద్రియ పదార్థం, విలువైన పోషకాలు, నేల సారాన్ని పెంచే కార్బన్ సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చేస్తే ఈ సంపద మొత్తం నష్టపోతుంది. అదే శాస్త్రీయంగా వినియోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతమవుతుంది, సాగు ఖర్చు తగ్గుతుంది.

రైతులు పంట అవశేషాలను కాల్చడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక పంట కోసిన వెంటనే మరో పంట వేయాల్సిన అవసరం, కూలీల కొరత, అవశేషాలను తొలగించడానికి అయ్యే అధిక ఖర్చు, యంత్రాల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు వారిని ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి. కానీ తాత్కాలికంగా సమయం ఆదా చేసినా, దీర్ఘకాలంలో నేల సారాన్ని, పంట ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది.
అందుకే పంట అవశేషాలను కాల్చడం కంటే వాటిని కంపోస్టు, వర్మీ కంపోస్టు, మల్చింగ్, పశువుల మేత, బయోగ్యాస్ లేదా బయోచార్ రూపంలో వినియోగించడం ఉత్తమ పరిష్కారం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బయోచార్ సాంకేతికత నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీటి నిల్వను పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది. పంట అవశేషాలను సమస్యగా కాకుండా విలువైన వనరులుగా మార్చుకునే ఈ సాంకేతికత రైతులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి కొత్త దిశను చూపుతోంది.

బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.

  ప్రస్తుతం వాతావరణ మార్పులు, నేల సారం క్షీణించడం, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బయోచార్ ఒక స్థిరమైన పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది. ఇది నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాతావరణ అనుకూల మరియు సుస్థిర వ్యవసాయానికి కూడా కీలకమైన సాంకేతికతగా నిలుస్తోంది.

డ్రమ్ పద్ధతిలో బయోచార్ తయారి
చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో తక్కువ ఖర్చుతో బయోచార్‌ను 200 లీటర్ల సామర్థ్యం గల పాత ఇనుప డ్రమ్ సహాయంతో తయారు చేయవచ్చు. ముందుగా డ్రమ్ అడుగు భాగంలో మరియు కింది ప్రక్కవైపున కొద్దిపాటి గాలి ప్రవేశించేలా చిన్న రంధ్రాలు చేయాలి. అనంతరం పొడి పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి డ్రమ్‌లో గట్టిగా నింపాలి. తరువాత డ్రమ్‌కు మూత బిగించి, మూత అంచులను బంకమట్టితో మూసివేయాలి. దీంతో డ్రమ్‌లోకి గాలి ప్రవేశించడం నియంత్రించబడుతుంది.

ఆ తర్వాత డ్రమ్‌ను పొయ్యి లేదా ఇటుకలతో ఏర్పాటు చేసిన మంటపై ఉంచి వేడి చేయాలి. సుమారు 20-25 నిమిషాల తర్వాత మూత అంచుల వద్ద నుంచి నీలిరంగు వాయువు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో డ్రమ్‌లో ఉష్ణోగ్రత 300-400°C వరకు చేరుకొని పైరోలిసిస్ ప్రక్రియ పూర్తవుతుంది.

నీలిరంగు వాయువు విడుదల తగ్గిన తర్వాత మంటను ఆర్పివేయాలి. అనంతరం డ్రమ్‌ను జాగ్రత్తగా దించి నేలపై ఉంచాలి. వెంటనే అడుగు భాగంలోని రంధ్రాలను కూడా బంకమట్టితో మూసివేయాలి. దీంతో గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడి, పంట అవశేషాలు పూర్తిగా బూడిదగా మారకుండా కార్బన్ రూపంలో నిల్వ చేయబడతాయి.

డ్రమ్‌ను సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మూతను తీసి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను చిన్న ముక్కలుగా లేదా పొడి రూపంలో తయారు చేయాలి. అనంతరం దీనిని కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి కొంతకాలం ఉంచిన తర్వాత పొలంలో ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
బయోచార్ తయారీలో ఆక్సిజన్ ప్రవేశం పరిమితంగా ఉండాలి. గాలి ఎక్కువగా ప్రవేశించినట్లయితే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

పరిరక్షణ వ్యవసాయం: నేల ఆరోగ్యం, దిగుబడి మరియు వాతావరణ స్థితిస్థాపకతకు ఒక సుస్థిర మార్గం

పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.

పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ:
(1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.

తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.

నేల ఆరోగ్యంపై ప్రభావం

పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మృత్తిక స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.

చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ.

దిగుబడి, ఆర్థిక అంశాలు
మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయ ఆధారిత మొక్కజొన్న పంట దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన పొషకాల యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.

వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ
ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయం పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత
నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్‌లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్‌ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత హెర్బిసైడ్ ప్రయోగం వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.

చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది

సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు
పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.

ముగింపు
పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.

ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.

చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³*
¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు, భారతదేశం.

Read More

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

వ్యవసాయ రంగంలో బయోచార్ (Biochar) అనేది ఇప్పుడు ఒక కొత్త సంచలన పదం. ఒకే రకమైన పంటలు సాగు, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం మరియు పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకంతో భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటుతోంది. ఇదే కొనసాగితే భూములు సాగుకు పనికిరావు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో తయారుచేసే బయోచార్ (జీవ బొగ్గు) నేలలో సేంద్రియ కార్బన్ ను పెంచుతుంది.

సాధారణంగా పంట కోతలు పూర్తయ్యాక రైతులు పంట వ్యర్ధాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, నేలలో ఉండే మిత్రపురుగులు, మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఫలితంగా భూసారం క్షీణించి, సేంద్రియ కార్బన్ (Organic Carbon) శాతం పడిపోతోంది. అయితే, ఈ సమస్యకు పంట వ్యర్థాలతోనే అద్భుతమైన పరిష్కారం కనుగొనవచ్చు. పత్తి, కంది, మిరప, ఆముదం మరియు మొక్కజొన్న వంటి పంటల సేంద్రియ వ్యర్థాలను తగలబెట్టకుండా, ఒక ప్రత్యేక పద్ధతిలో ‘బయోచార్’ (జీవ బొగ్గు) గా మార్చవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతి ద్వారా నేలకు అధిక మొత్తంలో సేంద్రియ కార్బన్ను అందించి, భూసారాన్ని మళ్లీ పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం సాగుచేసే పంటలలో ఎక్కువగా రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటోంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు నేల సారాన్ని పెంచడానికి బయోచార్ ఉపయోగకరంగా ఉంటుంది.

బయోచార్: బయోచార్ అనేది ప్రాథమికంగా ‘కాల్చిన’ వ్యవసాయ వ్యర్థం. బయోమాస్ అనే సేంద్రియ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద నిదానంగా మండించడం (పైరోలైసిస్) ద్వారా తయారయ్యే నల్లటి కార్బన్ పదార్థాన్ని బయోచార్ అంటారు. ఇది రంధ్రాలు (సచ్చిద్రత) కలిగి ఉన్న, అత్యధిక కార్బన్ గల ఒక స్థిరమైన పదార్థాన్ని సృష్టిస్తుంది, దీనిని నేల లక్షణాలను మెరుగుపరచడానికి మట్టిలో కలపవచ్చు.

నేలలో బయోచార్ (ప్రత్యేక పద్ధతిలో తయారుచేసిన బొగ్గు) ఉపయోగించడం వల్ల భూసారం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా, నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, మరియు సేంద్రియ కార్బన్ లోపించిన భూముల్లో బయోచార్ వాడకం వల్ల ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి.

అంతేకాదు, ఇది నేలలో గాలి ప్రసరణను మెరుగుపరిచి, పంటల వేర్లు లోతుగా, బలంగా పెరగడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రసాయన లేదా సేంద్రియ ఎరువుల ద్వారా అందించే పోషకాలు త్వరగా కరిగి వృథా కాకుండా, మొక్కకు అవసరమైనప్పుడు అందేలా ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో బయోచార్ కీలక పాత్ర పోషిస్తుంది.

బయోచార్ వల్ల కలిగే ప్రయోజనాలు

  1. నేల ఉదజని సూచిక (pH) సర్దుబాటు :
    బయోచార్ క్షార గుణాన్ని (alkaline) కలిగి ఉంటుంది మరియు ఆమ్ల నేలల్లో నేల ఉదజని సూచిక స్థాయిని పెంచుతుంది. ఇది పోషకాలు మరియు ఖనిజ లవణాలల లభ్యతను, వాటి వినియోగ సామర్థ్యాన్ని
    పెంచుతుంది.
  2. నేల కాటయాన్ ఎక్స్ఛేంజ్ యజ్ కెపాసిటీ (CEC) పెరుగుదల :
    బయోచార్ తక్కువ పరిమాణంలో ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అత్యధిక నెగటివ్ ఛార్జ్ (negatively charged) కలిగి ఉంటుంది. ఇది నేలలోని పాజిటివ్ ఛార్జ్ కలిగిన కాటయాన్లను (positively charged cations) పట్టి ఉంచుతుంది, తద్వారా కాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ (CEC) ని మరియు నేల సారాన్ని పెంచుతుంది.
  3. బయోచార్ నేలకు పోషకాలను జోడిస్తుంది
    ఇది బయోచార్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల లోని పోషకాల పరిమాణం మరియు దానిని తయారు చేయడానికి ఉపయోగించిన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. పశువుల ఎరువు మరియు కంపోస్ట్ లాగే, బయోచార్ను నేలలో వేయడానికి ముందు దానిలోని పోషకాల పరిమాణాన్ని పరీక్షించాలి, ఎందుకంటే పోషకాల పరిమాణం చాలా భిన్నంగా ఉంటుంది మరియు బయోచార్ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో (bulky) ఉంటాయి. బయోచార్లో ఏవైనా విషపూరిత అయాన్లు (toxic ions) ఉన్నాయా అనేదానిని కూడా
    పరీక్షించాలి.
  4. నేలలో కార్బన్ పరిమాణం పెరుగుదల :
    బయోచార్లో 80% వరకు కార్బన్ బ్లాక్ (carbon black) ఉంటుంది. దీనిని మట్టిలో కలపడం వల్ల కార్బన్ పరిమాణం మరియు C:N నిష్పత్తి (కార్బన్-నైట్రోజన్ నిష్పత్తి) పెరుగుతాయి. బయోచార్లోని కార్బన్ శాతం
    అనేది ప్రధానంగా పైరోలైసిస్ ప్రక్రియ మరియు ఉపయోగించిన ముడి పదార్థాల కార్బన్ పరిమాణంపై
    ఆధారపడి ఉంటుంది.
  5. బయోచార్ నేలలో సూక్ష్మజీవుల క్రియాశీలతను మరియు వైవిధ్యాన్ని పెంచుతుంది :
    బయోచార్లో ఉండే అధిక రంధ్రాల గుణం, దాని నీటి మరియు పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యంతో కలిసి నేలలోని సూక్ష్మజీవులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తుంది. ఇది పొలాన్ని ఖాళీగా విడిచిపెట్టినప్పుడు (fallow) మరియు కరవు కాలంలో కూడా సూక్ష్మజీవులు మనుగడ సాగించేలా చేస్తుంది. బయోచార్ కొన్ని సూక్ష్మజీవులకు తగిన శక్తి వనరును కూడా అందిస్తుంది. సూక్ష్మజీవుల క్రియాశీలత పెరగడం వల్ల మొక్కలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాల పునరుత్పత్తి (nutrient re-cycling) పెరగడం, పోషకాలు కొట్టుకుపోవడం తగ్గడం, మొక్కలకు పోషకాలు మరింత సులభంగా లభించేలా చేయడం, గాలి నుండి నైట్రోజన్ ను గ్రహించడం, నేలలో కార్బన్ను నిలిపి ఉంచడం మరియు జోడించడం, తెగుళ్లు మరియు వ్యాధులను తగ్గించడం. ఇది కృత్రిమ ఎరువులు మరియు పురుగుమందుల అవసరాన్ని సాధారణంగా తగ్గిస్తుంది, తద్వారా వాణిజ్యపరమైన మరియు పర్యావరణపరమైన అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.
  6. నేలలోని విషపూరిత పదార్థాలను తగ్గించడం ద్వారా బయోరెమిడియేషన్ (Bioremediation) పెరిగిన సూక్ష్మజీవుల క్రియాశీలత నేలలోని విషపూరిత పదార్థాలను మరియు పురుగుమందుల అవశేషాలను విచ్చిన్నం చేస్తుంది. బయోచార్ కొన్ని పురుగుమందులను ‘చీలేట్స్’ (chelates) చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని నిష్క్రియం చేస్తుంది, తద్వారా సూక్ష్మజీవులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి.
  7. నేల ఆకృతి మెరుగుపడటం (Improvement of soil structure)
    బయోచార్ చేర్చిన నేలలో పెరిగే CEC (కాటయాన్ ఎక్స్ఛేంజ్ కెపాసిటీ), సూక్ష్మజీవుల మరియు వేర్ల క్రియాశీలత.. నేల కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని (soil aggregates) మరింత స్థిరమైన, నీరు చొరబడగలిగే భౌతిక ఆకృతిని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఇది నేలలోకి నీరు ఇంకడాన్ని మరియు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. రంధ్రాలు (porous) కలిగిన నేల మెరుగైన వాయు మార్పిడికి తోడ్పడుతుంది; దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడం, ఆక్సిజన్ లోపలికి రావడం మరియు మెరుగైన నైట్రోజన్ మార్పిడి జరిగి వేర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
  8. వ్యవసాయ కాలుష్యం తగ్గింపు (Agricultural pollution reduction)
    నేలలో పోషకాలను నిలిపి ఉంచే సామర్ధ్యం పెరగడం వల్ల, కరిగిపోయే ఎరువులు మరియు రసాయనాలు భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోవడం (leaching) తగ్గుతుంది. పెరిగిన సూక్ష్మ జీవుల క్రియాశీలత మరియు చెలేషన్ ప్రక్రియ పురుగుమందులను నిష్క్రియం చేస్తాయి. భౌతిక ఆకృతి మెరుగుపడటం వల్ల నీటి ప్రవాహం

(runoff) మరియు నేలకోత (erosion) తగ్గుతాయి. సాధారణంగా ఎరువులు మరియు రసాయనాల వాడకం తగ్గడం వల్ల వ్యవసాయ కాలుష్య ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

  1. కార్బన్ నిక్షిప్తం (Carbon Sequestration)
    బయోమాస్ కార్బన్ ను బయోచార్గా మార్చడం ద్వారా అసలు కార్బన్లో 50% వరకు కుళ్ళిపోవడానికి నిరోధకత కలిగిన ఒక స్థిరమైన రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. ఇది శతాబ్దాల పాటు నేలలోనే ఉండిపోతుంది, మిగిలిన 50% ఆహారం మరియు శక్తి కోసం ఉపయోగించవచ్చు. దీనికి భిన్నంగా, వ్యర్థాలను కాల్చడం ద్వారా కేవలం 3% కార్బన్ మాత్రమే, మరియు జీవసంబంధమైన కుళ్ళిపోవడం (biological decomposition) ద్వారా 20% కంటే తక్కువ కార్బన్ మాత్రమే నిక్షిప్తమవుతుంది. కాబట్టి వ్యవసాయ నేలల్లో కార్బన్ ను నిక్షిప్తం చేయడానికి మరియు నేలలపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి భారీ అవకాశం ఉంది. గమనిక: పునరుత్పాదక కార్బన్ పదార్థం నుండి బయోచార్ను తెలివిగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి. బయోదార్ను నేల సవరణగా చేర్చేటప్పుడు రైతు బయోదార్ యొక్క లక్షణాలను మరియు నేల యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బయోచార్ స్వయంగా ఒక కాలుష్య కారకంగా మారకుండా ఉండటానికి దానిని మట్టిలో బాగా కలపాలి.

జాగ్రత్తలు

  1. నేరుగా ఎక్కువ మోతాదులో వేయకూడదు
  2. కంపోస్ట్ లేదా పశువుల ఎరువుతో కలిపి వేయడం మంచిది
  3. పొడి రూపంలో వాడేటప్పుడు గాలి ద్వారా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  4. నేల పరీక్ష ఆధారంగా మోతాదు నిర్ణయించాలి

సిఫార్సు మోతాదు

  • ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్లు వరకు వేసుకోవచ్చు
  • సేంద్రియ ఎరువులతో కలిపి వేయాలి
    బయోచారును సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం, వర్మీకంపోస్ట్ వంటి వాటితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో బయోచారుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది.

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More