ఔషధ మొక్క… మిరప
మిరప వార్షిక లేదా తక్కువ కాలం బ్రతికే బహుళ వార్షిక మొక్క. పూలు తెలుపు రంగులో ఉంటాయి. కీటకాల ద్వారా లేదా స్వపరాగ సంపర్కం ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. కాయలు నిటారుగా, అండాకారంశంఖాకారం నుండి బల్లెం ఆకారంలో ఉంటాయి. అవి సాధారణంగా అతి చిన్నగా, అతి కారంగా ఉంటాయి. 10-20 మి.మీ. పొడవు పెరుగుతాయి. 3-7 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. కాయలు లేత పసుపు రంగుకి మారి పక్వదశలో కాంతివంతమైన ఎరుపు రంగుకి మారతాయి.
సాధారణ నామం : కూరమిరప శాస్త్రీయ నామం : క్యాప్సికం ఫ్రూటెసెన్స్ కుటుంబం: సొలనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- మిరప అనేక జీర్ణ సంబంధ సమస్యలయిన కడుపునొప్పి, జీర్ణకోశంలో గ్యాస్, డయేరియాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది హృదయ, రక్త సంబంధ సమస్యలకు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, గుండెజబ్బులు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
- రక్తాన్ని పలుచన చేసి గుండెజబ్బుల రిస్క్‌ని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
- మిరపలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- మిరపలో ఉన్న క్యాపెå్ససినాయిడ్స్ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. మిరప అనేక సమస్యలకు ఉపయోగపడే గొప్ప ఔషధ మొక్క.
- మనుషులలో మలేరియా, బోదకాలు, డెంగు, జపనీస్ ఎన్సిఫలైటిస్ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమ యీడెస్ యీజెప్టీ రెండవ దశ లార్వాలను మిరప ఆకు, కాయ ద్రావణాలు సమర్ధవంతంగా చంపాయి (వినాయక, అతని అనుచరులు, 2010)

వ్యవసాయరంగంలో
- మిరపకాయ ఇథనాల్ ద్రావణం (30%) మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలిస్ జియామెయిస్ పురుగుని వికర్షణ చర్య ద్వారా నివారించింది (అకిన్ బులుమ, అతని అనుచరులు, 2015).
- మిరప ఆకు ద్రావణం వేరు శనగ నిల్వ సమయంలో నష్టం కలిగించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను 88.06% అరికట్టింది. కాయ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ నైగర్ శిలీంద్ర పెరుగుదలను 88.3% అరికట్టింది. మిరప కాయ ద్రావణంతో శుద్ధి చేసిన వేరుశనగ గింజలలో శిలీంద్రాల పెరుగుదల అధికంగా అరిక\్టబడింది. వేరుశనగ గింజలలో శిలీంద్రాలాశించడాన్ని అరికట్టడానికి మిరపకాయ ద్రావణం బాగా పనిచేస్తుందని ఫలితాలు వెల్లడించాయి (సౌమ్య, నాయర్, 2012).
- మిరపకాయ ద్రావణం చెదపురుగులను (కాప్టోఎర్మెస్ గెస్ట్రాయ్) నివారించింది (కోలన్, అతని అనుచరులు, 2016).
- మిరప కాయల ద్రావణం తయారు చేయడానికి 2 పిడికెళ్ళ మిరపకాయలను ఎండబెట్టి మెత్తని పొడి చేయాలి. ఈ పొడిని 2 లీ. నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టాలి.
- మిరప విత్తన పొడి అలసంద, మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే బ్రూచిడ్స్, కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్, సైటోఫిలా జియామెయిస్ పురుగులను నివారించింది (ఓని, 2010).
- మినుము గింజలను మిరపకాయ ద్రావణం (600 పిపియం)తో శుద్ధి చేసి కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్రూచిడ్ని 91% నివారించవచ్చు. (మొరాల్లోరీసస్, అతని అనుచరులు).
- మిరప కాయ ద్రావణం క్యాబేజి పంటనాశించే పేనుబంక, బ్రెవికారినెబ్రాసికె, డైమండ్ బ్యాక్‌మాత్‌ని రసాయన పురుగుమందులతో సమానంగా నివారించింది (అమోనాబెంగ్, అతని అనుచరులు, 2013).
- మిరప చీమలు, పేనుబంక, లార్వాలు, రైస్‌వీవిల్, అనేక బీటిల్స్ మొదలైన పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది. 300 గ్రా. మిరప కాయలను రోట్లో బాగా దంచి మెత్తని పొడి చేయాలి. దంచేటపుడు చేతులకు గ్లౌస్ తొడుక్కోవాలి. శరీరంపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ పొడిని 2 లీ. నీటికి కలిపి 7 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత ఇంకొక 4 లీ. నీరు కలిపి పిడికెడు సబ్బు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి పిచికారి చేయాలి.
- మిరప కాయలను ఎండలో ఆరబెట్టి దంచి పొడి చేయాలి. ఈ పొడి నిల్వ చేసిన ఉత్పత్తులనాశించే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది.
- మిరప ద్రావణం వైరస్‌లను కూడా నివారిస్తుంది. అయితే ఈ ద్రావణాన్ని వైరస్ ఆశించక ముందు పంటపై పిచికారి చేయాలి (ప్లూక్, 1999).
పురుగులను నివారించే మిరప ఫార్ములేషన్లు
- అన్ని పురుగుల నివారణ ద్రావణం (ఆర్గానిక్ గార్డెనింగ్, 1996)
కావలసిన పదార్థాలు : ఎండు మిరప పొడి 1 చెంచా; వెల్లుల్లి గడ్డ 1, చిన్న ఉల్లి గడ్డ 1, నీరు 1 లీటరు, సబ్బుపొడి 1 చెంచా, కత్తి 1, స్టెయినర్ (వడపోయడానికి) 1, బేసిన్ 1
తయారు చేసే విధానం : వెల్లుల్లి, ఉల్లి గడ్డలను తరగాలి. ఎండుమిరప కాయ పొడి కలపాలి. వీటన్నింటినీ నీటిలో కలిపి ఒక గంట నానబెట్టాలి. తర్వాత వడపోసి సబ్బు పొడి కలిపి బాగా కలపాలి. స్ప్రేయర్లో నింపి మొక్కలు బాగా తడిసేలా పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : ఆకులను తినే పురుగులు
- మిరప కషాయం (హెచ్డిఆరఎ, 2000)
కావలసిన పదార్థాలు : ఎండుమిరపకాయలు 4 కప్పులు, లేదా మిరప విత్తనాలు 5 కప్పులు, సబ్బుపొడి 30 గ్రా., మట్టి కుండ 1, స్టెయినర్ 1
తయారు చేసే విధానం : మట్టికుండలో ఎండు మిరపకాయలు లేదా మిరప విత్తనాలను నీటిలో కలిపి 15-20 ని. మరగబెట్టాలి. కుండని పొయ్యిమీద నుంచి దించి 3 లీ. నీరు కలపాలి. చల్లార్చి వడపోయాలి. సబ్బుపొడిని వేసి బాగా కలపాలి. తర్వాత పంటపై పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : చీమలు, పేనుబంక, లార్వాలు, దోమలు, పిండి నల్లులు.
- మిరప వేప ఆకుల ద్రావణం (స్టోల్, 2000)
కావలసిన పదార్థాలు : పచ్చి మిరపకాయ ముక్కలు 10-20, తాజా వేప ఆకులు 2 -2.5 కి., నీరు 2 లీ., సబ్బుపొడి 2 చెంచాలు, రోలు, బండ 1, పాత్ర 1
తయారు చేసే విధానం : మిరపకాయ ముక్కలను, వేప ఆకులను దంచి ఒక లీటరు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వడపోసి దీనికి 20 లీ. నీరు, సబ్బుపొడి కలపాలి. ఉదయం వేళల్లో గానీ, సాయంత్రం వేళల్లోగాని మొక్కలపై పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : లద్దె పురుగు, తెల్లదోమ, మొజాయిక్ వైరస్.
- మిరప-వేపగింజల ద్రావణం (స్టోల్, 2000)
కావలసిన పదార్థాలు : కత్తిరించిన పండు మిరప కాయ ముక్కలు 12, పూర్తిగా ఎండిన తొక్కతీసిన వేప గింజలు 200 గ్రా., నీరు 2 లీ., పాత్ర/కుండ 1, గ్రైండర్ 1, కత్తి 1
తయారు చేసే విధానం : వేప గింజలను నూరి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పండు మిరప కాయ ముక్కలను కలిపి వడపోయాలి. స్ప్రేయర్లో నింపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : పేనుబంక, డైమండ్‌బ్యాక్‌మాత్, రసంపీల్చే పురుగులు, తెల్లదోమ
మిరప – సీతాఫలం – వేప ద్రావణం (శ్రీధర్, అతని అనుచరులు, 2002)
కావలసిన పదార్థాలు : ఎండుమిరపకాయలు 25 గ్రా., సీతాఫలం ఆకులు 100 గ్రా., దంచిన వేపకాయలు 50 గ్రా., సబ్బు ద్రావణం 20 మి.లీ., గ్రైండర్ 1, వెడల్పు మూత సీసాలు, ప్రాత 1
తయారు చేసే పద్ధతి : ఎండుమిరప కాయలను నూరాలి. 100 మి.లీ. నీటిలో నానబెట్టాలి. నూరిన వేపకాయలను 200 మి.లీ. నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు రెండు ద్రావణాలను కలపాలి. సీతాఫలం ఆకులను నూరి 500 మి.లీ. నీరు కలపాలి. వడపోసి అన్ని ద్రావణాలను కలపాలి. దీనికి 5-6 లీ. నీరు కలపాలి. సబ్బు ద్రావణం పోసి బాగా కలిపి మొక్కలపై ఉదయం లేదా సాయంత్రం పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : పేనుబంక, ఆకుచుట్టు పురుగులు, ఎర్రపొలుసు పురుగులు, మచ్చల బీటిల్స్
- క్యాబేజి పంటలో ఆశించే ప్లూటెల్లా క్జ్లైలోస్టెల్లా, బ్రెవికారిని బ్రాసికె, హెలుల్లా ఆండాలిస్, ట్రైకోఫ్లూసియా ని పురుగులపై మిరప, వెల్లుల్లి ప్రభావాలను రసాయన పురుగు మందు ‘అటాక’ తో పోల్చి చూశారు. ఈ ద్రావణాలు క్యాబేజి పంటపై పురుగులను 10.76% నుండి 55.94% నివారించాయి. రసాయన పురుగుమందు అటాక్ పిచికారి చేసిన మొక్కలకన్నా మిరప, వెల్లుల్లి ద్రావణాలు పిచికారి చేసిన మొక్కలలో సహజ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి. సస్యరక్షణ ఖర్చు అటాక్ పిచికారి చేసిన ప్లాటులో మిరప, వెల్లుల్లి ద్రావణాలు పిచికారి చేసిన ప్లాట్లలో కన్నా అధికంగా ఉంది (బయిడూ, మోచయ్య, 2015).
సేంద్రియ పురుగు మందులు రసాయన పురుగమందుల కన్నా సురక్షితమైనవి మరియు అధిక పర్యావరణహితమైనవి. వాతావరణ కాలుష్యం కలిగించే వ్యర్థాలలో ఒకటైన మానవ లేదా పశువుల మూత్రాన్ని సేంద్రియ పురుగు మందు తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. 100 లీ. మూత్రం {1 కి. సుగంధ ద్రవ్యాలను కలిపి సేంద్రియ పురుగు మందు తయారు చేస్తారు.
సేంద్రియ పురుగు మందు
కావలసిన పదార్థాలు : మానవ లేదా పశువుల మూత్రం 100 లీ., పసుపు, ఫిలెసెలోచి మంజారింగ, పార్కియాస్పీసియోసా , టైనోస్పోరాక్రిస్సా ఒక్కొక్కటి 250 గ్రా., మిరప, ఉల్లి 750 గ్రా., ఎంపిక చేసిన సుగంధ ద్రవ్యాలలో మొక్కలలో పురుగుల పెరుగుదలనరికట్టే లక్షణాలున్నాయి.
సేంద్రియ పురుగు మందు తయారు చేసేవిధానం
- 250 గ్రా. చొప్పున పసుపు, పిథకలోబియం జిరింగి, పార్కియా స్పీసియోసా, టినోస్పొరా క్రిస్పా లను నీటిలో 24 గంటలు నానబెట్టాలి.
- తర్వాత వీటిని మరిగించాలి.
- మూత్రాన్ని పెద్దగిన్నెలో పోసి మరగబెట్టిన సుగంధ ద్రవ్యాలను కలపాలి
- మూత్రం, మరగబెట్టిన సుగంధ ద్రవ్యాలను 2-3 వారాలు పులియబెట్టాలి.
- 750 గ్రా. పండుమిరప, ఎర్రుల్లి ముక్కలను పులిసిన మిశ్రమానికి కలిపి గిన్నెని 34 రోజులు మూసి ఉంచాలి
- సేంద్రియ పురుగుమందు ఉపయోగించడానికి సిద్ధం
- 1 లీ. సేంద్రియ పురుగు మందుని 10 లీ. నీటిలో కలపాలి (రొజాక్, సోఫ్రియాని, 2009)
- మిరప ఆకు ద్రావణం (5 మి.గ్రా. / మి.లీ.) ఆల్టర్నేరియా (75%), కొల్లెటోట్రైకం (12.5%), ఫ్యుజేరియం (17.5%) శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది (దేవ్, వేణు, 2016).
- మిరప పొడి, మిరియాల పొడి గోధుమ ధాన్యాన్ని నిల్వలో ఆశించే రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ గ్రానరీస్ పురుగుల నుండి కాపాడే సామర్థ్యం కలిగి ఉన్నాయి. (అఫౌరి, షాయేస్టే, 2010).
- మునగ ఆకులు, మిరపకాయలను నూరి ద్రావణాలు తయారు చేయాలి. ఈ రెండు ద్రావణాలను కలిపి 5-7 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత పురుగుల నివారణకు పంటపై పిచికారి చేయాలి.
- మిరప కాయల ద్రావణం, ఎమామెక్టిన్ బెంజొయేట్ (ఎటాక్) క్యాబేజి పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్ (ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా, పేనుబంక (బైవికారినె బ్రాసికె), తెల్లదోమ (బెమిసియా టబాసి)ను, ఫ్రెంచి చిక్కుడు నాశించే ఫ్లవర్ త్రిప్స్ (మెగాల్యూరోత్రిప్స్ జోస్టెడ్రి), తెల్లదోమ (బెమిసియా టబాసి), దీపపు పురుగులు (ఎంపోవాస్కా స్పీసీస్) అలసంద పేనుబంక (ఎఫిస్ క్రాకివొరా)లను సమర్ధవంతంగా నివారించాయి. క్యాబేజి పంటలో సహజ శత్రువులు కొటేసియా ప్లుటెల్లా, అక్షింతల పురుగు, కెలోమెనెస్ స్పీసీస్, హోవరఈగ, సాలీళ్ళు, ఫ్రెంచి చిక్కుడులో అక్షింతల పురుగులు, సాలీళ్ళకు హాని కలిగించకుండా సంరక్షించాయి (అడమ, టెగ్బె, 2014).
- మిరప పొడి (5 గ్రా.), మిరప పొడి { మెత్తని ఇసుక (5 గ్రా.) చొప్పున ప్రతి జొన్న మొక్క మొగిలో 10 రోజుల వ్యవధిలో 4 సార్లు వేసి జొన్నలో కాండం తొలుచు పురుగును నివారించారు (ఒక్రికట, అతని అనుచరులు, 2016)
- మిరప ద్రావణం (100%), 80% మిరప ద్రావణం { 20% మేక ఎరువు టీ శనగపచ్చ పురుగు లార్వాలను చంపాయి (ల్యూటాప్, అతని అనుచరులు, టెక్నికల్ ప్రాజక్ట్ రిపోర్టు)
- ఉగాండాలోని విక్టోరియా బేసిన్లో రైతులు మిరప ద్రావణాలను సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు (మికిండి, అతని అనుచరలు, 2015)
- కిలో వరి ధాన్యానికి 10-20 గ్రా. మిరప పొడి చొప్పున కలిపి ధాన్యాన్ని ఆశించి నష్టపరిచే పురుగులను నివారించవచ్చు.
- మిరప, వెల్లుల్లి ద్రావణాలకు టమాట పంటనాశించే ఎర్రనల్లి (టెట్రానైకస్ ఎవాన్సి)ని నివారించే శక్తి ఉంది (ఫాతిమా, ఆమె అనుచరులు, 2015).
- మిరప ద్రావణాన్ని నేరుగా వ్యవసాయ పంటలలో పిచికారి చేసి బీటిల్స్, పేనుబంక, నల్లి, చిత్త పురుగులు, క్యాబేజి సీడ్పాడ్ వీవిల్స్, చారల కుకుంబర్ బీటిల్, మచ్చల కుకుంబర్ బీటిల్, కొలరాడోపొటాటో బీటిల్, డైమండ్ బ్యాక్‌మాత్, మొక్కజొన్న కండె తొలుచు పురుగు, తెల్లదోమ, ఇంపోర్టెడ్ క్యాబేజివర్మ్, క్యాబేజి మాగట్, ఆనియన్ మాగట్, కాటన్ బోల్‌వర్మ్ పురుగులను నివారించవచ్చు.
- నిల్వ ఉంచిన అలసంద గింజల నాశించే అలసంద వీవిల్ కాల్లసో బ్రూకస్ మాక్యులేటస్‌ని మిరప, వెల్లుల్లి పొడి, ద్రావణాలతో నివారించవచ్చు (వహేది, అతని అనుచరులు, 2014).
- మిరపలో ఉండే ఆల్కలాయిడ్లు క్యాబేజి నాశించే పేనుబంక, బ్రెవికారినె బ్రాసికే ని 100% నివారించాయి (హబియన, హకిజయేజు, 2014).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

