నానో బయోటెక్నాలజీతో సేంద్రియ సాగులో ఎన్నో ప్రయోజనాలు
ఉద్యానపంటలు, కూరగాయలు, ఆకుకూరల్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో నానో బయోటెక్నాలజీతో పోషక విలువలు పెంచవచ్చని, అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, బయోఫాక్టర్ సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకు నానో బయోటెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిచయం చేసి కూరగాయలు పండించారు. ఆయా కూరగాయల మొక్కలకు 40 శాతం పోషకాలు పెరగడంతోపాటు 15శాతం అధికంగా దిగుబడి వచ్చింది.
ఈ ప్రయోగ ఫలితాలను ధ్రువీకరించేందుకు ఇక్రిశాట్లోనిని వరల్డ్ వెజిటెబుల్ సెంటర్ ఆసియా శాఖకు తాజాగా హెచ్సీయూ, బయోఫాక్టర్ ప్రతినిధులు నమూనాలు పంపించారు. ధ్రువీకరణ లభించిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని రైతులను సేంద్రీయ సాగు వైపు ప్రోత్సహించనున్నారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని ఉద్యాన పంటల్లో 20-30 శాతం తగ్గించేందుకు హెచ్ సీయూ ఆచార్యులు డా. దివాకర్దాస్, బయోఫాక్టర్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సేంద్రీయ సాగులో ఫాలియర్ పిచికారీతో మొక్కలకు పోషకాలు అందుతాయి. పంటల ఉత్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతో కూరగాయలు రుచి పెరుగుతుంది.
నానో బయోటెక్నాలజీ పరిజ్ఞానంపై మూడేళ్లపాటు హెచ్సీయూ విద్యార్థులు, బయోఫాక్టర్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు. భవిష్యత్తులో కోళ్ల పరిశ్రమ, మత్స్యసంపద పరిరక్షణపై పరిశోధనలు చేసే అవకాశాలున్నాయి.
నానో బయోటెక్నాలజీ ఆకుకూరలు, కాయగూరలపై ప్రయోగించడం ద్వారా ఉద్యానపంటలకు ప్రయోజనం. యూరియా, రసాయన ఎరువులు వినియోగించినప్పుడు వర్షాలు కురిస్తే మొక్కలకు అవి ఎక్కువగా అందవు. భూమిలోకి వెళ్తాయి. నానోటెక్నాలజీతో నేరుగా మొక్కల్లోకే పోషకాలు వెళ్తాయి. రైతులకు ఈ సాంకేతికతో రైతులకు ప్రయోజనకరం కలుగుతుందని డా.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, ఇక్రిశాట్ అన్నారు.
ఉద్యాన పంటల్లో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పిచికారీ మందులను వినియోగిస్తున్నందువలన రసాయన అవశేషాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలి. ఇందుకు నానో బయోటెక్నాలజీ అవసరం. తద్వారా భూసారం పెరుగుతుంది. ప్రస్తుతం పొలాల్లో ఎక్కడా కనిపించని వానపాములు ఉనికి పెరుగుతుందని డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, సీఈవో, బయోఫాక్టర్ అన్నారు.

