బయోచార్ రీఛార్జ్ విదానము
బయోచార్ను స్వతంత్ర ఎరువుగా కాకుండా, కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు లభిస్తాయి. తాజా బయోచార్లోని సూక్ష్మ రంధ్రాలు ప్రారంభంలో మట్టిలోని పోషకాలను శోషించుకునే అవకాశం ఉన్నందున, దానిని నేరుగా ఉపయోగించకుండా ముందుగా రీచార్జ్ చేయడం మంచిది. ఇందుకోసం బయోచార్ను బాగా కుళ్లిన కంపోస్టు లేదా పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి, బెల్లం (1–2 కిలోలు/100 కిలోల బయోచార్) కరిగించిన ద్రావణంలో అజోటోబాక్టర్/అజోస్పిరిల్లం, ఫాస్ఫేట్ ద్రావణీకరణ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవ ఎరువులను కలిపి బయోచార్పై సమానంగా చల్లి తేమ 50–60% ఉండేలా చేసి 7–15 రోజుల పాటు నీడలో నిల్వ చేయాలి. ఈ ప్రక్రియ వల్ల ప్రయోజనకర సూక్ష్మజీవులు బయోచార్లో స్థిరపడి, పోషకాల నిల్వ మరియు విడుదల మెరుగుపడటంతో పాటు నత్రజని తాత్కాలిక స్థిరీకరణ తగ్గుతుంది. ఫలితంగా ఎరువుల వినియోగ సామర్థ్యం, నేల జీవక్రియ, వేర్ల పెరుగుదల మరియు పంట దిగుబడి మెరుగుపడతాయి.
బయోచార్ వినియోగం – మోతాదు మరియు వాడుక
బయోచార్ను ఎంత మోతాదులో ఉపయోగించాలనేది నేల రకం, పంట, బయోచార్ నాణ్యత మరియు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా హెక్టారుకు 5-10 టన్నులు (ఎకరానికి సుమారు 2-4 టన్నులు) బయోచార్ను కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. నేల పరిస్థితులు మరియు పంటను బట్టి కొన్ని సందర్భాల్లో మోతాదును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
బయోచార్ను చివరి దుక్కి సమయంలో నేలలో బాగా కలిసేలా వేయాలి. తోట పంటల్లో మొక్కల వేర్ల పరిధిలో కలిపి ఉపయోగించడం మంచిది. నాట్లు వేసే ముందు లేదా విత్తే ముందు బయోచార్ను సేంద్రియ ఎరువులతో కలిపి కొంతకాలం ఉంచి (చార్జింగ్ చేసి) ఉపయోగిస్తే పోషకాల వినియోగ సామర్థ్యం మరింత పెరుగుతుంది.
బయోచార్ నేలలో చాలా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతుంది. అందువల్ల ఒకసారి వేసిన బయోచార్ ప్రభావం అనేక సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ కారణంగా రసాయన ఎరువుల మాదిరిగా ప్రతి పంటకు మళ్లీ మళ్లీ బయోచార్ వేయాల్సిన అవసరం ఉండదు. అయితే నేల పరిస్థితులు, పంటల అవసరాలను బట్టి అవసరమైనప్పుడు అదనపు మోతాదును ఉపయోగించవచ్చు.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

