ఆహార ధాన్యాల పంటలకు విస్తృత నష్టం కలిగించడంతోపాటు మనుషుల్లో, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే ఒక ప్రమాదకర ఫంగస్‌ను అమెరికాలోకి ప్రవేశ పెట్టిన ఇద్దరు చైనా జాతీయుల్ని అరెస్టు చేసినట్టు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సంస్థ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. ”ఫ్యుసేరియం గ్రామినేరియం” అనే ఈ ఫంగస్.. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి వంటి పంటల్లో ”తల తెగులు”(హెడ్ బ్రైట్) అనే వ్యాధిని కలిగిస్తుంది. మొక్కల పూతను ఈ వ్యాధి దెబ్బతీసి దిగుబడిని నాశనం చేస్తుంది. తెగులు సోకిన ఆహారధాన్యాలు సేవించిన మనుషులు, జంతువుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఫంగస్‌ను చైనా నుంచి అమెరికాలోకి తీసుకొచ్చిన యున్కింగ్ జియాన్ అనే మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలిని, ఆమె స్నేహితుడు జుయోంగ్ లియులను అరెస్టు చేశామని కాష్ పటేల్ చెప్పారు. అత్యంత ప్రమాదకర వ్యాధికారకమైన ఫంగస్‌పై మిషిగన్ విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిపేందుకు దాన్ని అమెరికాలోకి తీసుకొచ్చినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి జియాన్ విధేయురాలని, ఆమె ఈ వ్యాధి కారకంపై గతంలో చైనాలో కూడా పరిశోధన జరిపేందుకు నిధులు పొందారని పటేల్ తెలిపారు. ఫంగస్ నమూనాను అమెరికాలోకి తేవడంలో తన ప్రమేయం లేదని తొలుత బుకాయించిన చైనా పరిశోధకురాలు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించారని పటేల్ వివరించారు. ఈ చర్యను ఆగ్రో టెర్రరిజంగా అభివర్ణించారు.