సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి “ఫుడ్ బాస్కెట్” యాప్
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని, ఈ నెల 21న కృష్ణారావు పాలెం నాగసింధు స్పిన్నింగ్ మిల్లు ఆవరణలో నిర్వహించనున్న ఎన్టిఆర్ జిల్లా స్థాయి సేంద్రియ మేళాను విజయ వంతం చేయాలని రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ కోరారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో వారికి సేంద్రియ వ్యవసాయం, ఎరువులు వినియోగంపై అవగాహన కల్పించడానికి ఈ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు, అధికారులు వస్తున్నారని తెలిపారు. పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకొచ్చిందని, వీరు ఎన్టిఆర్ జిల్లాలో పండిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి ‘ఫుడ్ బాస్కెట్’ అనే యాప్ ద్వారా విక్రయిస్తారని వెల్లడించారు.

