భూమి రసాయనమయంగా మారుతుంది

అధిక రసాయన ఎరువుల వాడకంతో భూమి సారం కోల్పోయి రసాయనమయంగా మారుతోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. రైతుల శ్రేయస్సు, సహజ సాగు విధానాలపై అవగాహన కోసం ఆయన మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రధాన కూడలి వరకూ రైతు సుఫలా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బౌద్ధ మహా స్తూపం వద్దనున్న సిద్ధార్థ యోగా విద్యాలయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని చినజీయర్ మాట్లాడారు. భూమికి సైతం విరామం అవసరమని, పంటల మార్పిడి, వ్యవధి పాటించడం వంటి పద్ధతులతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకంతో సగానికి పైగా సమస్య పరిష్కార మవుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు చినజీయర్‌కు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు డా. పద్మారామచంద్రారావు, పర్యావరణవేత్త విజయ్‌రాం, సీపీఐ నాయకుడు నారాయణ, రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాస్, ఏర్నేని రామారావు, రైతునేస్తం వెంకటేశ్వరరావు, గున్నా రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.

Read More

మూడు ఎకరాలకు 391 టన్నుల చెరకు దిగుబడి

కర్ణాటకలోని బెళగావి జిల్లా కల్లోళి గ్రామానికి చెందిన 72 ఏండ్ల అభ్యుదయ రైతు బాళప్ప బసప్ప బెళకోడ మూడెకరాల్లో పండిన మొత్తం 391 టన్నుల చెరకును మిల్లుకు తరలించి రూ.12,90,300 బిల్లును పొందారు. ‘సీఓ 86032’ రకం చెరకును నాటుకున్నారు. ‘నాటే ముందు మట్టి పరీక్షలు చేయించా. ఫలితాల ఆధారంగా భూమికి అవసరమైన పోషకాల కోసం సేంద్రియ, పరిమితంగా రసాయనిక ఎరువులను డ్రిప్‌ ద్వారా తోటకు అందించా. ఎకరానికి రూ.65 వేల చొప్పున ఖర్చు వచ్చింది. చెరకు ఎదిగే వరకూ అంతర పంటలుగా మినుము, శనగ, టమాటా, ఉల్లి పండించా. వాటి ఫలసాయం అందాక ఆ మొక్కలను తోటలోనే తొక్కి, ఎరువుగా మార్చా. జీవామృతం, సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టును స్వయంగా చేసుకుంటున్నా. సాగు విధానాలు తెలుసుకునేందుకు చైనా, ఇజ్రాయెల్‌, జపాన్‌లకు వెళ్లి వచ్చా. ఎకరానికి 200 టన్నుల దిగుబడి సాధించే దిశగా ఈసారి ఐదెకరాల్లో చెరకు సాగు చేయాలనుకుంటున్నా’ అని బాళప్ప వివరించారు.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More

రానున్న సంవత్సరాలలో ప్రకృతి వ్యవసాయానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయశాఖా మంత్రి తెలిపారు. సెక్రటేరియట్‌లో ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్‌ విజయ కుమార్‌, ఇతరులు, పక్క రాష్ట్రాలలో, వివిధ దేశాలలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను మరియు వారి అనుభవాలు ప్రకృతి వ్యవసాయం ఆచరించి అధిక ఆదాయం పొందుతున్న రైతుల విజయ గాధలు, ప్రకృతి వ్యవసాయంలో మెరుగైన నేల ఆరోగ్యం మరియు ఆరోగ్యకర ఉత్పత్తులను మంత్రికి వివరించి తాము తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.
సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌, వ్యవసాయ శాఖా సంచాలకులు డా. గోపి ఈ సంవత్సరం నుండి ఆరంభించిన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రగతిని వివరించి ఇప్పటికే రాష్ట్రంలో 489 క్లస్టర్లు ఏర్పాటు చేసి 61,125 రైతులను ఎంపిక చేసినట్లు (50 హెక్టార్లు ప్రతి క్లస్టర్లు), దీనికి గాను కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 42.07 కోట్లు కేటాయించిందని రిసోర్స్‌ పర్సన్‌లకు వాలంతరి ఆధ్వర్యంలో శిక్షణను పూర్తి చేశామని తెలియచేసారు. ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు సూచించిన విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసారు.
తరువాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటిదాకా రైతులలో ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయని ఒక అపోహ ఉందని, కానీ ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధుల అనుభవాలు మరియు నా అనుభవం, తోటి రైతుల అనుభవాలు ఇది తప్పని నిరూపించాయని, రైతుల నికరాదాయం, మొదటి సంవత్సరం నుండి పెరగడం ఆరంభమైందని తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు తీసి మార్కెటింగ్‌ అవకాశాలను పెంచుకొనే అవకాశం కలదని, వర్షాధార ప్రాంతాలలో కూడా 3 పంటలు తీసే అవకాశం కలదని, అలాగే కలుపు, చీడపీడల సమస్య కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత కర్తవ్యం నేల ఆరోగ్యాన్ని కాపాడడం తద్వారా మానవాళి ఆరోగ్యం కాపాడడమే కాకుండా రైతుకు నికర ఆదాయం పెంచడమని, ఇది ఒక్క ప్రకృతి వ్యవసాయంతోనే సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More

సన్న వడ్లకు బోనస్‌ వలన ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది

వరి సన్నాలకు బోనస్‌ ఇవ్వడంతో దాని సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరితో పాటు ఇతర పంటలను ప్రోత్సహించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సూచించారు. సోమవారం ఆయన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ నిపుణుడు నరసింహారెడ్డి, కమిషన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఆ పంటల విస్తీర్ణం పెరిగేందుకు కృషి చేయాలన్నారు. కొత్త విత్తన చట్టం వస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

Read More

ఇంటిపంటల సంరక్షణకు మాలి

చెన్నై నగరంలో ఇంటిపంటను పెంచుకునేవారు ఏదైనా సమస్య ఎదురైతే ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తారు. కాసేపటికే ఓ మహిళ వచ్చి తోటను బాగుచేసి వెళ్తారు. అంతేకాదు, ఆ తోటకు కావాల్సినప్పుడల్లా కేర్‌ టేకర్‌గానూ ఉంటారు. నగర ఇళ్లలో తోటల పెంపకం కోసం ఈ తరహా మహిళలు ప్రత్యేక నిపుణులుగా ఎదిగారు. వాళ్లనే ‘మద్రాస్‌ మాలి’గా పిలుస్తున్నారు.

ఇంట్లో కాస్త ఖాళీ స్థలమున్నా ఏదో ఒక మొక్క వేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్రత్యేకంగా నగరాల్లో ఇలాంటి ఆవరణ, మిద్దెతోటలు చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే చెన్నై రెసిలెన్స్‌ సెంటర్‌ (సీఆర్‌సి) స్వచ్చంద సంస్థ ఏళ్లుగా ఇంటి ఆవరణల్లో తోటలు పెంచేలా ప్రోత్సహిస్తోంది. వేలాది మంది ఈ ఒరవడికి అలవాటుపడ్డారుగానీ.. వారికి తోటపనిలో తరచుగా వచ్చే సమస్యల్ని తీర్చేందుకు నిపుణులు లేక నిరుత్సాహపడేవారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆలోచించిన సంస్థ సభ్యులు.. మహిళా తోట సంరక్షణ నిపుణుల్ని తీసుకొచ్చారు. స్వయం సహాయక బృంద సభ్యులు (ఎస్‌హెచ్‌జీ)గా ఉంటూ చురుకైన పాత్ర పోషించే 250మందిని చెన్నైలో ఎంపికచేశారు. రెండేళ్లు శిక్షణ ఇవ్వడంతో పాటు ‘మద్రాస్‌ ‘మాలి’ పేరుతో వారికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ఇంటి తోటల్ని పెంచుతున్నవారికోసం వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

నెలనెలా ఆదాయం
మద్రాస్‌ మాలి.. ఇప్పుడు ఎస్‌హెచ్‌జీలోని పేద, మధ్యతరగతి మహిళలకు ఆదాయవనరుగా మారుతోంది. ‘ఆసక్తి చూపినవారి తోటలకు కేర్‌టేకర్లుగా ఉంటారు. ప్రతీవారం వారి ఇళ్లను సందర్శిస్తారు. ఏ సమయంలో ఏ మొక్కలు నాటాలి. మంచి దిగుబడి ఎలా రాబట్టాలి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు నిర్వహణ… వంటివి వారికి వివరిస్తుంటారు. ఇలా నెలకు రూ.20వేల దాకా సంపాదిస్తున్నారు.

ఇంటి పంటపై అవగాహన
ఇళ్లలోనే కాదు.. చెన్నైలోని 114 అంగన్వాడీ కేంద్రాలు, 16 ప్రభుత్వ పాఠశాలల్ని ‘మద్రాస్‌ మాలి’ సభ్యులు తోటలతో పర్యావరణహితంగా మార్చారు. అక్కడ పనిచేసే ఆడవారికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లోని పిల్లలకు ఈ తోటల్లోని ఆరోగ్యకర కూరగాయలే వండి తినిపించేలా చేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని వివిధ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లతో కలిసి ఆయా కాలనీల్లో పట్టణ తోటలమీద అవగాహన పెంచుతున్నారు. కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోన్న చెన్నైలాంటి నగరాలు దేశంలో చాలా ఉన్నాయి. వాటన్నింటికీ పరిష్కారంగా మేం ‘మద్రాస్‌ మాలి’ వ్యవస్థను రూపొందించాం అని సంస్థ సభ్యులు అంటున్నారు.

Read More

వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉజ్వల భవిత

వికసిత భారత్‌ కింద ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్‌ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్‌ దివ్యకుమార్‌ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్‌ పాల్గొన్నారు.వికసిత భారత్‌ కింద ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్‌ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్‌ దివ్యకుమార్‌ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్‌ పాల్గొన్నారు.

Read More

పర్యావరణ మార్పులను తట్టుకోవడంలో ఉద్యాన పంటలసాగు దోహదపడుతుంది

ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి

పర్యావరణ మార్పులను అదుపులో ఉంచడానికి ఉద్యాన పంటలను విరివిగా పెంచాలని ఆచార్య కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ దండా రాజిరెడ్డి అన్నారు. పర్యావరణ మార్పులు, పంటలు సంబంధిత అంశాలపై లోతైన పరిశోధన చేసేందుకుగాను ప్రత్యేక పరిశోధన స్థానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వనపర్తి జిల్లా మోజెర్లలోని ఉద్యాన కళాశాలలో పర్యటించాక మదనాపురంలోని విద్యార్థుల ఉద్యాన బోధనా క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పండ్లతోటల సాగుతో పాటు అంతర పంటలు సాగు చేయాలని, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో తోటలకు నీటిని అందించవచ్చన్నారు. తక్కువ నీటితో బాగా దిగుబడినిచ్చే ఉద్యాన పంటలైన ఉసిరి, చింత, నేరేడు, సపోటా, వాక్కాయ, కుంకుడు, దానిమ్మ, సీతాఫలం, మునగ లాంటి వాటిపై దృష్టి సారించాలని అన్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఏక వార్షిక రకాలు, ప్రాంతానికి అనువైన ఔషధ మొక్కలను సాగుచేయాలని తెలిపారు.

Read More

అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం

– మిరప, మొక్కజొన్నల్లో భారీగా వాడుతున్నారు

– జొన్నలోనూ యూరియా వాడకం 417% అధికం

రసాయన ఎరువుల బస్తాలు ఎన్ని ఎక్కువ వాడితే.. పంట దిగుబడి అంత ఎక్కువగా వస్తుందనే ఆలోచనే రైతులను పరిమితికి మించిన వాడకం దిశగా నడిపిస్తోంది. పెట్టుబడి వ్యయం పెరగడానికి ఇదీ ఒక కారణం. ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 సంవత్సరంలో పంటల వారీగా చూస్తే ఎరువుల వాడకంలో మిరప అగ్రస్థానంలో ఉండగా మొక్కజొన్న రెండోస్థానంలో నిలిచింది. జొన్న, వేరు శనగ, పసుపు, పప్పుధాన్యాలు తదితర పంటలకూ యూరియాను కుమ్మరిస్తున్నారు. *మిరపలో ఎరువుల వాడకం అధికం* రాష్ట్రంలో రసాయన ఎరువులు అత్యధికంగా వాడే పంట మిరప.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే హెక్టారుకు 1,325 కిలోల వాడకం ఉంది. సిఫార్సు చేసిన మోతాదు కంటే యూరియా 78%, భాస్వరం 122% అధికంగా వాడుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులు ఇంతకు రెట్టింపుస్థాయిలోనే వాడుతున్నారు. ఫలితంగా మిరపకు ఎకరాకు రూ. 3 లక్షల పెట్టుబడి అవుతోంది. తీరా చూస్తే ధరలు దక్కడం లేదు. క్వింటాలుకు రూ.10 వేలు ఉన్నా గిట్టుబాటు కాని పరిస్థితి. లక్షల్లో నష్టపోతున్నారు. ఎరువుల వాడకం తగ్గించుకుంటే పెట్టుబడి కూడా తగ్గుతుందని ఆలోచించడం లేదు.*మొక్కజొన్న సాగులోనూ భారీగా…* ఎరువుల వినియోగం అధికంగా ఉండే రెండో పంట మొక్కజొన్న. హెక్టారుకు 565 కిలోలు వాడుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవ వినియోగం ఇంకా ఎక్కువే. రెండు మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో అధిక శాతం రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపిస్తున్నారు. ఇతర పంటల సాగులో నష్టాలతో.. ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్ననే ఎంచుకుంటున్నారు

.*జొన్న సాగుకు 417% అధికంగా యూరియా:* జొన్న సాగులో సిఫారసు చేసిన మోతాదుకు మించి 417% అధికంగా యూరియాను వినియోగిస్తున్నారు. వేరుశనగకు కూడా 303% అధికంగా వేస్తున్నారు. గడ్డి పెంపకానికి 283% అధికంగా వాడటం గమనార్హం.

*అపోహ మాత్రమే* భూసార పరీక్షలు చేయించుకుని.. అవసరం మేరకు రైతులు ఎరువులు వాడాలి. ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నత్రజని ఎక్కువగా వాడితే చీడపీడలు పెరుగుతాయి. వాటి నివారణకు పురుగుమందులు ఎక్కువగా చల్లాలి. పంటల నాణ్యత దెబ్బతింటుంది. భూగర్భజలాలు కలుషితమవుతాయి. ఎరువుల్ని సిఫార్సు మేరకు మాత్రమే అందించాలి. లేదంటే మొక్కల్లో రోగనిరోధకత తగ్గుతుంది. కరవు పరిస్థితుల్లో నానో ఎరువులు పిచికారి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే నేల ద్వారా అందించడమూ ముఖ్యమే.- *వి. శైలజ,* ప్రధాన శాస్త్రవేత్త, సాయిల్‌ సైన్స్‌, ప్రాంతీయ పరిశోధనాస్థానం, లాం, గుంటూరు

Read More