జూన్ 12న తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

దేశంలోనే రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964 జూన్ 12 వ తేదీన రాజేంద్రనగర్‌లో ఏర్పాటు అయింది. ప్రస్తుత వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనంతో పాటు ఇతర మౌలిక వసతుల సముదాయాన్ని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జూన్, 1966 లో ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రముఖ తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్బంగా జూన్ 12 వ తేదీన నిర్వహించ తలపెట్టిన 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భారత హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఇవ్వనున్నారు. అదే విధంగా యం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ ఈ జాతీయ సదస్సు అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్, విధాన విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం
ఈ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం, ఇతర మౌలిక వసతులని ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించి 60 ఏళ్ళు అయిన సందర్బంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశ్వవిద్యాలయం కోరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని నిర్వహించనున్నట్లు అల్దాస్ జానయ్య తెలిపారు.1966-84 మధ్యలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసి దేశానికి ఆహార భద్రతని అందించిన ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని, ఆనాటి రైతు అనుకూల విధానాలని, వివిధ సంస్థలని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉప కులపతి పేర్కొన్నారు. అందుకే ఈ 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.

Read More

మొక్కజొన్న పంట సాగు, దిగుబడులు పెరగాలి

మొక్కజొన్నను ఇథనాల్‌ ఉత్పత్తికి వాడటము వలన డిమాండ్‌ భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా సాగు, దిగుబడులు పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) డైరెక్టర్‌ హెచ్‌ఎస్‌ జాట్‌ తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ (నార్మ్‌)లో ‘మొక్కజొన్న పరిశోధనలో డేటా సేకరణ, విశ్లేషణ’ అంశంపై జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. డేటా ఆధారిత పరిశోధన విధానాలు మొక్కజొన్న సాగు విస్తరణలో కీలకపాత్ర పోషిస్తాయి. మొక్కజొన్నలు ఇథనాల్‌ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో కంపెనీలు అధికశాతం ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నాయి’ అని సూచించారు. నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ లాల్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రీసెర్చ్‌ ఛటర్జీ, అగ్రివర్సిటీ సీడ్స్‌ డైరెక్టర్‌ నగేశ్‌కుమార్‌ లుథియానా వ్యవసాయ శాస్త్రవేత్త సునిల్‌ పాల్గొన్నారు.

Read More

ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు, శిక్షణ

రసాయన ఎరువులు- మందులు వినియోగించకుండా.. సహజ పద్ధతుల్లో సేద్యంతో పర్యావరణానికి, రైతులకు, ఆయా ఉత్పత్తుల వినియోగంతో ప్రజలకూ ప్రయోజనం కలుగుతుందని గుర్తించిన విజయవాడకు చెందిన వైద్య దంపతులు డాక్టర్‌ చదలవాడ సుధ, డాక్టర్‌ నాగేశ్వరరావులు ఈ విధానాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు తమవంతు సేవలు అందించాలని, 11 ఏళ్ల క్రితం ఏపీలోని నూజివీడు సమీప కొండపర్వ గ్రామంలో శ్రీపద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అక్కడ 38 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వేర్వేరు పంటలు పండిస్తున్నారు. రసాయనాలు విని యోగించకుండా సాగుచేయడం, ప్రకృతి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. దేశవిదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. విషపూరిత రసాయనాలతో వ్యవసాయం చేయకూడదన్న ప్రధాన లక్ష్యంతో ఈ దంపతులు మూడేళ్ల క్రితం ఫౌండేషన్‌కు అనుబంధంగా కృష్ణసుధా అకాడమీ ఫర్‌ ఆగ్రో ఎకాలజీని స్థాపించారు. కొండపర్వలోనే అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించి పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశా లను అందుబాటులోకి తెచ్చారు.
”సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పటివరకు సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌, ఆగ్రో ఫారెస్ట్రీ, ట్రీ-హబ్‌, స్విట్జర్లాండ్‌లోని ది రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ సంస్థలతో.. సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాం” అని చదలవాడ సుధ తెలిపారు. శిక్షణ కోసం 85002 83300 నంబరులో సంప్రదించాలని సూచించారు. https://Krishnasudha academy.org / లోనూ సంప్రదించవచ్చు.

Read More

వ్యవసాయ పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలి

వ్యవసాయం వాటి అనుబంధరంగాల పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో సోమవారం వ్యవసాయ పరిశోధన సర్వీసు (ఏఆర్‌ఎస్‌) 115వ ఫౌండేషన్‌ కోర్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ సభ్యుడు, ఐకార్‌ మాజీ కార్యదర్శి చబిలేంద్రరౌల్‌ అన్నారు. పోషకాహార భద్రత, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధానాలు, సహజ వనరుల పరిరక్షణ తదితర కోణాల్లో నూతన ఆవిష్కరణలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జయకృష్ణజెనా, మిసైల్‌ సైంటిస్ట్‌ అరుణ్‌ తివారి, నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌లాల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 మంది ఏఆర్‌ఎస్‌ ప్రొబేషనర్లకు మూడు నెలల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది.

Read More