కాన్-టికీ కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

కాన్-టికీ (Kon-Tiki) బయోచార్ కిల్న్ అనేది ఫ్లేమ్ కర్టెన్ (Flame Curtain) సూత్రం ఆధారంగా పనిచేసే తలక్రిందుల శంఖాకార కిల్న్. పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో తక్కువ పొగతో బయోచార్‌గా మార్చడానికి ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో కొద్దిపాటి పొడి చెక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు లేదా ఇతర పొడి పంట అవశేషాలను దశలవారీగా చిన్న పరిమాణాల్లో వేయాలి. పైభాగంలో ఏర్పడే మంట (Flame Curtain) పొగను దహనం చేస్తూ, కింది భాగంలోని అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ద్వారా బయోచార్‌గా మారుస్తుంది. చివరలో అవసరమైన స్థాయిలో బయోచార్ ఏర్పడిన తర్వాత మంటను ఆపి, నీరు చల్లి లేదా గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి.

     కిల్న్ పరిమాణాన్ని బట్టి ఒక్కో బ్యాచ్‌లో వంద కిలోల నుంచి సుమారు ఒక టన్ను వరకు పంట అవశేషాలను ప్రాసెస్ చేయవచ్చు. ముడి పదార్థం స్వభావాన్ని బట్టి సుమారు 10-20 శాతం బయోచార్ లభిస్తుంది. సాధారణంగా ఒక బ్యాచ్ పూర్తవడానికి 2-4 గంటల సమయం పడుతుంది.

     కాన్-టికీ కిల్న్ ద్వారా పొగ తక్కువగా విడుదలవుతుంది, నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి అవుతుంది, తయారీ వేగంగా పూర్తవుతుంది మరియు పంట అవశేషాల దహనం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఈ కారణాల వల్ల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, వ్యవసాయ శిక్షణా కేంద్రాలు మరియు పెద్ద రైతులకు ఈ సాంకేతికత అనువైన ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందుతోంది.

భారతదేశంలో అనేక సంస్థలు మరియు ఫ్యాబ్రికేషన్ యూనిట్లు వివిధ పరిమాణాల కాన్-టికీ కిల్న్‌లను తయారు చేస్తున్నాయి. కిల్న్ పరిమాణం, ఉక్కు మందం, తయారీ నమూనాను బట్టి ధర ₹40,000 నుండి ₹70,000 ల మద్య ఉండవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

సాగు ఖర్చును తగ్గించే ‘మట్టికుండ రసాయనం’

తయారీ విధానం – కావల్సిన వస్తువులు :

  • 100 గ్రాముల విటెక్స్ నెగుండ ఆకులు (వావిలాకులు)
  • 100 గ్రాముల కలోట్రాపిస్ ఆకులు (జిల్లేడు)
  • 100 గ్రాముల వేపాకులు
  • 50 గ్రాముల పప్పు (ఏదైనా)
  • 1 లీటరు పెరుగు లేదా చిక్కటి మజ్జిగ
  • 1.5 లీటర్లు మంచి నీరు ముందుగా మూడు రకాల ఆకులను మెత్తటి గంధంలా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. దీనికి నీరును చేర్చాలి. దీనిని ఒక కుండలో పోసి మూతికి గుడ్డ కట్టాలి. కుండలోని మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తిర్లమర్ల కలపాలి (కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి). పదిహేను, ఇరవై రోజుల తరువాత సేంద్రియ జీవ రసాయనం తయారవుతుంది. తయారైన జీవ రసాయనాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పొలం మీద పిచికారి చేయాలి. ఇది ఒక ఎకరా పొలానికి సరిపోతుంది. పిచికారీని ఆకుల మీదే చేయాలి. తెల్లవారుజామున లేదా సాయంత్రం పొద్దు గూంకే వేళలో పిచికారి చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ఇది వివిధ రకాల కీటకాలనాశినిగానే కాక మొక్కలకు పోషకాలను అందించి పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా రసాయనాల వలన వాతావరణం, నేల విషపూరితం కాకుండా కాపాడుతుంది.
Read More

గనోడెర్మా పుట్టగొడుగుల సాగు

హరియాణాలోని బడియాల్‌ గ్రామానికి చెందిన వీరేంద్ర బజ్వాన్‌.. గనోడెర్మా పుట్టగొడుగులను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వీటి పెంపకంపై సోలన్‌లోని మష్రూమ్‌ రీసెర్చ్‌ డైరెక్టరేట్‌లో వీరేంద్ర శిక్షణ పొందారు. గనోడెర్మా పుట్ట గొడుగులకు ఉండే ఔషధ గుణాల వల్ల దీన్ని ‘మ్యాజికల్‌ మష్రూమ్‌’ అని పిలుస్తారు. ఈ పుట్టగొడుగు నుంచి తయారైన ఉత్పత్తులు షుగర్‌ నియంత్రణ, క్యాన్సర్‌, అల్సర్లు, చర్మ వ్యాధులను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ‘వీఎండబ్ల్యూ న్యూట్రాస్యూటికల్స్‌’ అనే కంపెనీని స్థాపించిన వీరేంద్ర బజ్వాన్‌.. గనోడెర్మా, శిటాకే, కార్డి సెప్స్‌ వంటి హెర్బల్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తన ఉత్పత్తులను 28 దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బజ్వాన్‌ తెలిపారు. కొన్నిదేశాలకు ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైందని.. మరికొన్నింటిలో లైసెన్స్‌ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం గనోడెర్మా పౌడర్‌ను కిలో రూ.21,000లకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సాగులో మంచి ఫలితాలు సాధించిన వీరేంద్రను 2025 ఆగస్టు 21న హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ సత్కరించారు. హిస్సార్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రగతిశీల రైతు అవార్డును పొందారు. అంతేకాదు పుట్టగొడుగుల ప్రచార కమిటీలో వీరేంద్రను సభ్యుడిగా నియమిస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి పెంపకంపై లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఆయనకు అప్పగించింది.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More

వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర

PJTAU పరిధిలోని అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఈరోజు 15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు గుర్తింపు పత్రాలని ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య అందజేశారు. ఈ సంస్థలు PJTAU అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్ లో విజయవంతంగా సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకున్నాయి. అగ్రి హబ్ తరఫున ఇప్పటికి సుమారు 150 అంకుర సంస్థలకు నాబార్డ్ సహాయంతో తోడ్పాటు నందించామని జానయ్య వివరించారు. ఇందులో భాగంగా కూరగాయల సాగులో మానవ ప్రమేయం తగ్గించి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవిష్కరించిన రోబో ని అల్దాస్ జానయ్య ఈ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే గ్రామీణ యువత, అభ్యుదయ రైతులకు చేయూతనందించే కార్యక్రమంలో భాగంగా నాబార్డ్ ఆర్థిక సహకారాన్ని ఆరుగురికి అందజేశారు. అంతేకాకుండా మరో రెండు అంకుర సంస్థలకు ఒక్కొక్క దానికి 40 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం PJTAU అగ్రి హబ్ ద్వారా అందజేశారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్ గా రూపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని అల్థాస్ జానయ్య అన్నారు. ఆ వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు. దేశ సంపద మూలాలు ఈనాటికీ గ్రామీణ భారతంలో, వ్యవసాయ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నందున ఈ రంగాలకి పెద్దపీట వేసి వ్యవసాయంతో పాటు వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జానయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నాబార్డ్ DGM దీప్తి, WE HUB ప్రతినిధి సీత, PJTAU రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH విద్యాసాగర్, AG HUB MD G. వెంకటేశ్వర్లు, వివిధ అంకుర సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Read More