మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

కేంద్ర పథకం కింద ఏర్పాటు

దేశంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌-ఎఫ్పీవో)ల ఏర్పాటు, ప్రోత్సాహక పథకం కింద తెలంగాణలో 311 సంఘాలు ఏర్పాటు కానున్నాయి. 2025లో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా 10వేల సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో తెలంగాణకు 311 కేటాయించింది. అన్నదాతల ఆదాయం పెంపు, పెట్టుబడి రాయితీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సభ్యులకు తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ, పంట ఉత్పత్తులశుద్ది, గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెట్‌ అనుసంధానానికి ప్రస్తుతం దేశంలోని ఎఫ్పీవోలు కృషి చేస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎఫ్‌పీవోలో ఇలా..: కేంద్ర పథకం కింద ఎంపికయ్యే సంఘాలలో కనీసం 300 మంది సభ్యులు ఉండాలి. రూ.2 వేలు వాటాధనం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. సంఘం యాజమాన్య బోర్డులలో మహిళా రైతులు ప్రాతినిధ్యం ఉండాలి. సంఘాల సభ్యులకు వ్యాపార ప్రణాళికల తయారు, వాటి అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి సంఘానికి ఈక్విటీ గ్రాంట్‌ కింద కేంద్రం రూ.15 లక్షలు, నిర్వహణకు ఏటా రూ.6 లక్షల చొప్పున మూడేళ్లు గ్రాంటు ఇస్తుంది. కేంద్ర పథకం కింద ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ రూ.1500 కోట్లు కేటాయించారు. దీని కింద సంఘాలకు రుణాలు ఇస్తారు. ఇందులో 85 శాతం వరకు పూచీకత్తును కేంద్రం ఇస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)నే ఎఫ్‌పీవోలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థంగా నడుస్తున్న పీఏసీఎస్‌లను ఎంపిక చేయాలని సహకార యూనియన్‌ను ఆదేశించింది.

Read More