పంటల్లో బెట్టను తట్టుకునేందుకు పశువుల పేడ, మూత్రం ద్రావణం
పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలు, ద్రావణాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పశువుల పేడ, మూత్రం ద్రావణం ఒకటి.
పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తిని ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు/పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి.
ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలు) వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ ద్రావణాన్ని పంటకాలంలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు: పశువుల పేడ : 5 కిలోలు; పశువుల మూత్రం : 5 లీటర్లు; సున్నం : 150 గ్రా॥
తయారు చేసే విధానం:
- 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రం తీసుకుని, 5 లీటర్ల నీటిని కలిపి ఒక తొట్టిలో నిలువ చేయాలి.
- తొట్టిపై మూత పెట్టి, 4 రోజులపాటు ఆ మిశ్రమాన్ని మురగబెట్టాలి.
- పై మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో, సవ్య మరియు అపసవ్య దిశలలో బాగా కలియపెట్టాలి.
- ఈ మిశ్రమానికి 4 రోజుల తర్వాత కొద్దిగా నీరు చేర్చి, వడపోసి, 150 గ్రాముల సున్నం కలపాలి.
- ఈ ద్రావణానికి 100 లీటర్ల నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో ఒకసారి పిచికారీ చేయాలి.
జాగ్రత్తలు:
- పశువుల పేడ, మూత్రం ద్రావణం చిక్కగా ఉంటుంది. అందువల్ల వడపోయటానికి ముందు ఒక మెష్‌నిగానీ, పలుచటి గోనెసంచిని గానీ ఉపయోగించాలి.
- తర్వాత దానికి నీరు కలిపి పలుచటిగుడ్డతో వడపోసుకోవాలి.
- తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి.
- ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ద్రావణం చెడిపోయే అవకాశం ఉంది.
పంటలలో తెగుళ్ళ సమస్య వుంటే పశువుల పేడ, మూత్రం ద్రావణానికి ఇంగువ కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఉపయోగాలు:
- ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే దాని ఘాటైన వాసనకు రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు.
- ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారీ చేయటం వల్ల పంటలు బెట్టను సుమారు వారం రోజులవరకూ తట్టుకుంటాయి.
- ఈ ద్రావణం పంటలలో వ్యాధినిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఈ ద్రావణాన్ని బాగా వడపోసి “డ్రిప్” లేదా “స్ప్రింక్లర” పద్దతి ద్వారా పంటలకు అందజేయవచ్చు.
- పశువుల పేడ, మూత్రం ద్రావణాన్ని కూరగాయ పంటలలోనూ, ఇండ్ల వద్ద పెంచే ఆకుకూరలపైనా ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు. పశువుల పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం వరి పైరులో వచ్చే అగ్గి తెగులును సమర్ధవంతంగా నివారిస్తుంది. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేయాలి










