బ్రహ్మి
బ్రహ్మి లేదా గోటుకోలా మొక్కలో ట్రైటెర్పినాయిడ్స్ అదికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆసియాటికోసైడ్స్ గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి.
ఈ మొక్క చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు యాంటీఆక్సీడెంట్ స్థాయిలను పెంచుతుంది. గాయపడిన ప్రాంతానికి రక్తప్రసరణ మెరుగుపడటానికి, కొత్త కణాలు మరియు కణజాలం ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
బ్రహ్మి ఆకుల రసాన్ని చిన్న గాయాలు, కాలిన గాయాలు, మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలపై సంప్రదాయంగా లేపనంగా ఉపయోగిస్తారు. గాయపడిన లేదా కాలిన భాగంలో కొత్త కణాల ఏర్పాటుకు, కణజాల వృద్ధికి మరియు చర్మ దృఢత్వం పెరగడానికి ఇది సహాయపడుతుంది. దీనిలోని ఆసియాటికోసైడ్స్ సంధాన కణజాలం ఏర్పడటాన్ని ప్రోత్సహించి, యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అందువల్ల చిన్న గాయాలు, మచ్చలు, శస్త్రచికిత్స అనంతరం ఏర్పడే గాయాలు, కాలిన చర్మ గాయాలు మరియు వెరికోస్ అల్సర్లలో సహాయకంగా ఉపయోగించబడుతుంది.
బ్రహ్మీ ఆకులను శుభ్రంగా కడిగి తయారు చేసిన పసరును సంప్రదాయంగా గాయంపై లేపనంలా పూసి, గాజు గుడ్డతో కట్టు కడతారు. అయితే లోతైన గాయాలు, తీవ్రమైన కాలిన గాయాలు లేదా ఇన్ఫెక్షన్ ఉన్న గాయాలకు స్వయంగా ఆకు పసరు లేదా ఇతర పదార్థాలు ఉపయోగించకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.
బ్రహ్మీ/గోటుకోలా ఆధారిత గుళికలు, క్రీములు మరియు ఆయింట్‌మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని వైద్యుల లేదా అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల సూచన మేరకు ఉపయోగించడం మంచిది.

బ్రహ్మీ/గోటుకోలా సాగు సాంకేతికతః
- అనుకూలమైన నేల
సారవంతమైన, మంచి నీటి పారుదల కలిగిన ఇసుక-లోమి లేదా లోమి నేలలు అనుకూలం. నేలలో సేంద్రియ పదార్థం అధికంగా ఉండటం మంచిది. నీరు నిలిచిపోయే నేలలను నివారించాలి. సుమారు ఉదజని 5.5-7.0 మధ్య నేల అనుకూలంగా ఉంటుంది. తేమను నిలుపుకునే నేలలో మంచి పెరుగుదల ఉంటుంది. - వాతావరణం:
ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల వాతావరణం అనుకూలం.
- సుమారు 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మంచి పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
- అధిక తేమ మరియు మితమైన నీడలో కూడా బాగా పెరుగుతుంది.
- నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాగు చేయవచ్చు.
- నీటి పారుదలః
బ్రహ్మీకి నేలలో తగినంత తేమ నిరంతరం ఉండటం అవసరం. వేసవిలో సాధారణంగా 3-5 రోజులకొకసారి, నేల పరిస్థతిని బట్టి నీరు ఇవ్వవచ్చు. డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతులను ఉపయోగించవచ్చు. నీరు నిలిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. - ఎరువుల యాజమాన్యం:
భూమిని సిద్ధం చేసేటప్పుడు బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేయాలి. సాధారణంగా హెక్టారుకు సుమారు 10-15 టన్నుల సేంద్రియ ఎరువు ఉపయోగించవచ్చు. నేల పరీక్ష ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఇవ్వడం మంచిది. సేంద్రియ సాగులో వర్మీకంపోస్ట్, జీవ ఎరువులను ఉపయోగించవచ్చు. సమతుల్య పోషక యాజమాన్యం పాటించాలి. - కోత మరియు దిగుబడి:
నాటిన తరువాత సుమారు 3-4 నెలలకు మొదటి కోత తీసుకోవచ్చు. నేలకు దగ్గరగా ఆకులు మరియు కొమ్మలను కోయాలి. తగిన నీరు, పోషకాలు అందిస్తే తదుపరి కోతలు కూడా తీసుకోవచ్చు. సాగు విధానం, నేల, వాతావరణం మరియు నిర్వహణను బట్టి సాధారణంగా హెక్టారుకు సుమారు 10-20 టన్నుల తాజా ఆకులు/హెర్బ్ లభించవచ్చు. - విలువ ఆధారిత ఉత్పత్తులు:
బ్రహ్మీ ఆకులను తాజా రూపంలో లేదా ఎండబెట్టి వివిధ ఉత్పత్తులుగా మార్చుకోవచ్చు.- బ్రహ్మీ ఆకుల పొడి
- బ్రహ్మీ టీ
- బ్రహ్మీ హెర్బల్ డ్రింక్
- బ్రహ్మీ జ్యూస్/స్క్వాష్
- బ్రహ్మీ ఎక్స్‌ట్రాక్ట్
- బ్రహ్మీ క్యాప్సూల్స్ మరియు టాబ్లెట్లు
- బ్రహ్మీ హెర్బల్ ఆయింట్‌మెంట్/క్రీమ్
- బ్రహ్మీ సబ్బులు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులు
- హెర్బల్ హెయిర్ ఆయిల్
- బ్రహ్మీ ఆధారిత న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులు
డా. యం.ఆర్. భానుశ్రీ, డా. వి. జయశ్రీ, డా. యం. జగన్‌మోహన్‌రెడ్డి
వ్యవసాయ కళాశాల, పాలెం, నగర్ కర్నూల్ జిల్లా. ఫోన్ : 9618874445









