లంపీ స్కిన్ వ్యాధికి టీకా
- భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ
- దేశంలోనే ఇది మొదటిది
- ఈ వ్యాధితో గత రెండేళ్లలో 2 లక్షల పశువుల మృతి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి (ఎల్సిడి) టీకా అందుబాటులోకి రాబోతోంది. పాడి పశువులకు ఈ టీకా ఇస్తారు. ‘బయో లంపివ్యాక్సిన్’ అనే ఈ టీకా మనదేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నుంచి లైసెన్సు వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని పేర్కొంది. దీన్ని ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)లలో విస్తృతంగా పరీక్షించినట్లు వివరించింది. హిస్సార్‌లోని ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ అందించిన ఎల్ఎస్డీ వైరస్ / రాంచీ/ 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్‌తో బయోవెట్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు సీడీఎస్సీఓ లైసెన్సు లభించడం, మనదేశంలో పశుసంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఎల్ఎస్డీ వ్యాధి వల్ల మనదేశంలో గత రెండేళ్లలో 2 లక్షల పశువులు చనిపోయాయి. ఇంకొన్ని లక్షల పాడి పశువులు వట్టిపోయాయి.
ఏటా 50 కోట్ల డోసుల తయారీ
‘బయోలంపివ్యాక్సిన్’ను వెంటనే విడుదల చేస్తామని కృష్ణ ఎల్ల తెలిపారు. బయోవెట్‌కు కర్ణాటకలోని మల్లూర్‌లో ఉన్న యూనిట్లో ఏటా 50 కోట్ల డోసులు టీకాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్ఎస్డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్ వర్గాలు వివరించాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొన్నాయి.

