సహజ వ్యవసాయం – భవిష్యత్ తరాలకు స్థిరమైన వ్యవసాయ మార్గం

సహజ వ్యవసాయం (Natural Farming) అనేది రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి లేదా పూర్తిగా నివారించి, ప్రకృతిలో లభించే వనరులతో పంటలను సాగు చేసే పద్ధతి.

సహజ వ్యవసాయం ప్రాముఖ్యత

  • నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది – నేలలో సూక్ష్మజీవుల సంఖ్య, సేంద్రియ పదార్థం పెరుగుతాయి.
  • నీటి వినియోగం తగ్గుతుంది – నేల తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
  • పర్యావరణ పరిరక్షణ – నేల, నీరు, గాలి కాలుష్యం తగ్గుతుంది. సాగు ఖర్చులు తగ్గుతాయి – బయటి నుంచి కొనుగోలు చేసే రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటం తగ్గుతుంది.
  • సురక్షితమైన ఆహారం – రసాయన అవశేషాలు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది.
  • జీవ వైవిధ్యం పెరుగుతుంది – మిత్ర కీటకాలు, సూక్ష్మజీవులు మరియు ఇతర జీవుల సంరక్షణ జరుగుతుంది.
  • దీర్ఘకాలిక నేల సారవంతత – నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలు మెరుగుపడతాయి.
  • రైతుల ఆదాయం మెరుగుపడే అవకాశం – సాగు ఖర్చులు తగ్గడంతో నికర ఆదాయం పెరగవచ్చు.
  • స్థానిక వనరుల వినియోగం – పశువుల ఆధారిత వనరులు, పంట అవశేషాలు, స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించవచ్చు.
  • స్థిరమైన వ్యవసాయానికి దోహదం – భవిష్యత్ తరాలకు నేల, నీరు, పర్యావరణ వనరులను కాపాడుతుంది.

ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే ముఖ్యమైన తయారీలు మరియు వాటి ఉపయోగాలు
బీజామృతం
పదార్థాలు: 20 లీటర్ల నీరు, 5 కిలోల దేశీ ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 50 గ్రాముల సున్నం, ఒక గుప్పెడు రైజోస్పియర్ మట్టి.
తయారీ: ఆవు పేడను గుడ్డలో కట్టి 20 లీటర్ల నీటిలో 12–16 గంటలు నానబెట్టి, సున్నం నీరు, ఆవు మూత్రం మరియు రైజోస్పియర్ మట్టిని కలిపి 8–12 గంటలు ఉంచాలి.
ఉపయోగం: విత్తన శుద్ధికి ఉపయోగించాలి; విత్తనాల ద్వారా వచ్చే వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

జీవామృతం
పదార్థాలు: 200 లీటర్ల నీరు, 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పుల పిండి, ఒక గుప్పెడు రైజోస్పియర్ మట్టి.
తయారీ: అన్ని పదార్థాలను డ్రమ్లో కలిపి, కర్రతో బాగా కలపాలి; నీడలో గోనె సంచితో కప్పి 4 రోజులు కిణ్వ ప్రక్రియకు ఉంచాలి.
ఉపయోగం: నీటిలో సుమారు 5–10% కలిపి పిచికారీ చేయాలి లేదా సాగునీటితో పాటు పారించాలి.

ఘన జీవామృతం
పదార్థాలు: 100 కిలోల ఆవు పేడ, అవసరమైనంత ఆవు మూత్రం, 1 కిలో బెల్లం, 2 కిలోల పప్పుల పిండి, ఒక గుప్పెడు రైజోస్పియర్ మట్టి.
తయారీ: పేడను పలుచగా పరచి ఆవు మూత్రం, పప్పుల పిండి, బెల్లం, రైజోస్పియర్ మట్టిని కలిపి బంతులుగా చేసి నీడలో ఆరబెట్టి, ఎండిన తరువాత చూర్ణం చేసి గోనె సంచుల్లో నిల్వ చేయాలి.
ఉపయోగం: విత్తే సమయంలో ఎకరానికి 100 కిలోల ఎండిన ఘన జీవామృతాన్ని వేయాలి.

నీమాస్త్రం
పదార్థాలు: 5 కిలోల వేప ఆకులు లేదా వేప పిండి, 5 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో ఆవు పేడ, 100 లీటర్ల నీరు.
తయారీ: వేప ఆకులను ముద్దగా చేసి నీటిలో కలిపి, ఆవు మూత్రం మరియు ఆవు పేడను వేసి 3 రోజులు ఉంచాలి; రోజుకు 3 సార్లు కలిపి తరువాత వడకట్టాలి.
ఉపయోగం: నీరు కలపకుండా పంటపై పిచికారీ చేసి రసం పీల్చే పురుగులు మరియు చిన్న గొంగళి పురుగుల నియంత్రణకు ఉపయోగించాలి.

బ్రహ్మాస్త్రం
పదార్థాలు: వేప ఆకులు 3 కిలోలు, కానుగ ఆకులు 2 కిలోలు, సీతాఫలం ఆకులు 2 కిలోలు, బొప్పాయి ఆకులు 2 కిలోలు, జామ ఆకులు 2 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు.
తయారీ: అన్ని ఆకులను ముద్దగా చేసి ఆవు మూత్రంలో కలిపి మరిగించాలి; 2–3 గంటల తరువాత దించి 2 రోజులు చల్లారనిచ్చి వడకట్టాలి.
ఉపయోగం: 2–3% ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారీ చేసి రసం పీల్చే పురుగులు మరియు కాయ, పండు తొలిచే పురుగుల నియంత్రణకు ఉపయోగించాలి.

అగ్నాస్త్రం
పదార్థాలు: 5 కిలోల వేప ఆకులు, 0.5 కిలోల పచ్చిమిర్చి, 0.5 కిలోల వెల్లుల్లి, 20 లీటర్ల ఆవు మూత్రం.
తయారీ: వేప ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లిని ముద్దగా చేసి ఆవు మూత్రంలో కలిపి మరిగించాలి; 3–4 గంటల తరువాత దించి 2 రోజులు చల్లారనిచ్చి వడకట్టాలి.
ఉపయోగం: 2–3% ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారీ చేసి కాండం/బెరడులో ఉండే పురుగులు, కాయతొలిచే పురుగులు మరియు గొంగళి పురుగుల నియంత్రణకు ఉపయోగించాలి.

దశపర్ణి కషాయం
పదార్థాలు: వేప ఆకులు 5 కిలోలు, వావిలాకు 2 కిలోలు, ఈశ్వరి 2 కిలోలు, బొప్పాయి 2 కిలోలు, తిప్పతీగ 2 కిలోలు, సీతాఫలం 2 కిలోలు, కానుగ 2 కిలోలు, ఆముదం 2 కిలోలు, గన్నేరు 2 కిలోలు, ఉమ్మెత్త 2 కిలోలు, పచ్చిమిర్చి పేస్ట్ 2 కిలోలు, వెల్లుల్లి పేస్ట్ 250 గ్రాములు, ఆవు పేడ 3 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు.
తయారీ: వేప ఆకులతో పాటు పైన పేర్కొన్న ఆకులలో అవసరమైన మిశ్రమాన్ని, పేడ, మూత్రం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని 200 లీటర్ల నీటిలో 15 రోజులు మరగబెట్టాలి; రోజుకు 3–4 సార్లు కలిపి చివరలో వడకట్టాలి.
ఉపయోగం: 2–3% ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారీ చేసి రసం పీల్చే పురుగులు మరియు గొంగళి పురుగుల నియంత్రణకు ఉపయోగించాలి.

“సహజ వ్యవసాయం = తక్కువ ఖర్చు + ఆరోగ్యకరమైన నేల + సురక్షిత ఆహారం + పర్యావరణ పరిరక్షణ + స్థిరమైన రైతు జీవనం.”
K. కురవ రామకృష్ణ, పిహెచ్.డీ .పరిశోధనా విద్యార్థి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), రాజేంద్రనగర్, హైదరాబాద్, తెలంగాణ. Ph: 8688097548

Read More

ఔషధ మొక్క… సీతాఫలం

సాధారణ నామం : కస్టర్డ్ యాపిల్ శాస్త్రీయ నామం : అనోనా స్క్వామోసా కుటుంబం: అనోనేసి

సీతాఫలం పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చు. సీతాఫలం పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, రాగి, పీచుపదార్థం, తక్కువ కొవ్వు కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుస్తాయి. సీతాఫలం ఆకులు, గింజలు మరియు ఇతర భాగాల్లో ‘అనోనైన’ అనే పదార్థం ఉండటం వలన చేదు గుణం కలిగి ఉంటుంది. అందుకే సీతాఫలం ఆకులను పశువులు, మేకలు తినవు. ఆకులు, గింజల నుండి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలున్నాయి.

ఉపయోగాలు : పురుగుల నివారణలో ఉపయోగించు సీతాఫలం ఆకులు, గింజలు, గింజల నూనె కషాయాలు

  • సీతాఫలం ఆకు కషాయం : 500 గ్రా. సీతాఫలం ఆకులను 2 లీ. నీటిలో ఉడికించాలి. ఒక లీటరు ద్రావణం మిగిలే వరకు ఉడికించాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 10 15 లీ. నీటిలో కలిపి పురుగులు సోకిన మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేసి పేనుబంక, సుడిదోమ, గొంగళిపురుగులు, డైమండ్ బ్యాక్ మాత్, పచ్చదోమ, పచ్ౘ్నల్లి పురుగులను నివారించవచ్చు.
  • వివిధ ఆకుల కషాయం : వేపాకు1 కి., కానుగ 1 కి., బిల్వం 1కి., విషముష్టి 1/2 కి., వావిలాకు 1 కి., తంగేడు 1 కి., సీతాఫలం 1/2 కి., పిచ్చి తులసి 1 కి., పుదీనా 1/2 కి., పాలకొడిస 1/2కి., కొత్తిమీర 1/2కి., నేరేడు 1 కి., నేలవేము 1/2 కి., యూకలిప్టస్ 1 కి., అత్తాకోడలు ఆకు 1 కి., ఈ ఆకులలో ఏవైనా 5 రకాల ఆకులను పైన చెప్పిన మోతాదులో తీసుకుని 10 లీ. నీటిలో అరగంట సేపు బాగా ఉడికించి, ఉడుకుతున్న ఈ ద్రావణాన్ని కర్రతో మధ్య మధ్య కలుపుతూ, కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రా. సబ్బుపొడి లేదా 500 గ్రా. కుంకుడు రసం కలిపి, ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి సాయంత్రం వేళ పంటపై పిచికారి చేయాలి.
  • ఈ కషాయం అనేక పంటలనాశించే రసం పీల్చే పురుగులు, పెద్ద దశలోనున్న లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఆకులనుతినే గొంగళిపురుగులపై బాగా పనిచేస్తుంది.
  • దశపర్ణి కషాయం : వేప ఆకులు 5కి., నల్లేరు ఆకులు 2కి., అరిస్టాలోకియా ఆకులు 2కి., బొప్పాయి ఆకులు 2కి., సీతాఫలం ఆకులు 2 కి., కానుగ ఆకులు 2 కి., ఆముదం ఆకులు 2 కి., గన్నేరు ఆకులు 2 కి., జిల్లేడు ఆకులు 2 కి., టైనోస్పోరా కార్డిఫోలియా ఆకులు 2 కి., పచ్చి మిరప కాయల పేస్టు 2 కి., వెల్లుల్లి పేస్టు 2కి., ఆవుపేడ 3 కి., ఆవు మూత్రం 5 లీ.
  • వీటినన్నింటినీ నూరి 200 లీ. నీటిలో కలిపి ఒక నెల రోజులు పులియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి మూడుసార్లు కలియతిప్పాలి. నెల రోజుల తర్వాత వడపోయాలి. ఈ కషాయాన్ని 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఈ కషాయాన్ని ఒక ఎకరం పొలంలో ఫాగింగ్ మెషిన్‌తో చల్లి తామర పురుగులు, ఆకుముడత పురుగు, లీఫ్ హాపర్స్‌ని నివారించవచ్చు.
  • సీతాఫలం విత్తన నూనె కషాయం : పచ్చి కాయల నుండి గింజలను తీసి గ్రైండర్‌లో వేసి నూనె తీయాలి. ఒక భాగం నూనెని 20 భాగాల నీటిలో కలిపి డైమండ్ బ్యాక్‌మాత్ ఆశించిన పంటపై పిచికారి చేయాలి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More