నెలలు నిండక ముందే పుట్టిన ఆవు దూడ పోషణ

నెలలు తక్కువగా పుట్టిన దూడకు చలిగాలుల నుండి రక్షణ కల్పించాలి. బాగా వెచ్ౘ్గా వుండే విధంగా గడ్డి, గోనె సంచులతో పడక ఏర్పాటు చేయాలి. జున్నుపాలు మితంగా రోజుకు 4 పర్యాయాలు త్రాగించాలి.

హోమియో: 1. ముందుగా ఫైవ్ ఫాస్ 30, తదుపరి కార్బో వెజ్ 30 రోజుకు 10 మాత్రలు, ఓపియం 30 మడు రోజులకొక పర్యాయం చొప్పున 10 రోజుల తినిపించాలి. 2. ఆల్ఫాల్ఫా 30, జిన్సెంగ్ 30 కలిపిన మందు ఒక చెంచా, కొద్దిపాటి నీళ్ళలో కలిపి, రోజుకు 3 సార్లు చొప్పున 20 రోజులు త్రాగించాలి. అల్లోపతి : 1. విటామిక్స్ లిక్విడ్ (VITAMIX LIQUID) వంటి మందు రోజుకు ఒక పర్యాయం వారం రోజులు త్రాగించాలి. 2. టెట్‌వ్యాక్ (TETVAC) ఇంజక్షన్ 1 మి.లీ. కండకు (IMగా) ఒకసారి మాత్రమే చేయించాలి. 3. సూచించిన ఫెర్రిటాస్ (FERRITAS) ఇంజక్షన్ 2 మి.లీ. (IM) కండకు 3వ రోజున, అవసరాన్నిబట్టి పదవ రోజున చేయించాలి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

పుష్టికరమైన ఆవు దూడ పుట్టుక లక్ష్యం

ఆవు ఈనటానికి కనీసం 2 నెలల ముందే పాలు పిండటం మానెయ్యాలి.

తల్లి నుంచి పాలు త్రాగకుండా దూడను వేరుచేయాలి. అప్పటి నుండి చూడిగోవును శ్రద్ధగా పోషించాలి.

చూడి గోవుకు ఈనటానికి కనీసం 6 వారాల ముందు, పరాన్న జీవుల నిర్మూలనకు మందులు యివ్వాలి.

సాధారణంగా ఇచ్చే ఆహారం కంటే, చూడి గోవుకు ఎక్కువ పోషక విలువలు గల మేతలు మేపాలి.

చూడిగోవుకు తప్పనిసరిగా ఉప్పు, ఖనిజ లవణాలు ప్రతిరోజూ ఇవ్వటం మరిచిపోకూడదు.

చూడిగోవు పోషణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే పుష్టికరమైన, ఆరోగ్యవంతమైన, సంపదను పెంచగల దూడ పుట్టాలనే లక్ష్యం తప్పక నెరవేరుతుంది.

ఆవు దూడ పుట్టుక
ముందుగా – తల్లి గోవు ఉమ్మనీటి బుడగ వేసిన తరువాత,

  1. రెండు గంటలలోపు గనుక దూడను ఆవు ఈనలేక పోయినట్లయితే, వెంటనే పశువైద్యుని సహాయంతో దూడను తియ్యాలి. సహజంగా ముందు కాళ్ళపై తల పెట్టి దూడ బైటకు రావాలి. అలా కాకుండా దూడ తల అడ్డం తిరగటం, వెనుక కాళ్ళు ముందుకు వుండటం, లేదా పొట్ట క్రింది భాగంలోకి దూడ దిగిపోవటం మొదలైన సమస్యలు అప్పుడప్పుడు కలుగుతాయి.
  2. ఎక్కువ సమయం, దూడ లోపలే వున్నట్లయితే, ‘ఉమ్మనీరు’ త్రాగి ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తి, శ్వాస సరిగా ఆడక, దూడ చనిపోవచ్చు. అటువంటి సందర్భాలలో దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు శుభ్రంచేసి, వెనుక కాళ్లతో పట్టుకొని తలక్రిందులుగా, గుండ్రంగా త్రిప్పి, వెల్లుల్లిపాయను చిదిమి, ముద్దగా చేసి, దూడకు వాసన చూపించాలి. దూడ వెన్నుపై చేతితో తట్టాలి.
  3. ఆపద్ధర్మంగా, దూడ నోట్లోకి మన నోటితో గాలి ఊది, శ్వాస కలిగిస్తే (దూడకు) ప్రాణాపాయం తప్పించవచ్చు.
  4. దూడపై గల జిగురు పదార్థాన్ని తల్లి నాకేటట్లు చేయాలి. లేచి నిలబడే శక్తి దూడకు కలుగుతుంది.
  5. ఈనిన వెంటనే దారం బొడ్డుకు ముడివేసి, దిగువన బొడ్డును కోసి, పసుపు లేదా టింక్చర్ అయోడిన్ రాయాలి.
  6. ఈనిన వెంటనే దూడ గోళ్ళు (గిట్టలు, మెత్తని స్పాంజిలా వున్న భాగం) గిల్లి, తల్లికి ఆహారంగా పెట్టాలి. ఎందుకంటే అలా గిల్లి తినిపించిన గోళ్ళ ద్వారా తల్లికి తక్షణం కాల్షియం అందించినట్లవుతుంది.
  7. సుమారు 2 కేజీల ధాన్యం దంచి పెడితే, మాయ త్వరగా వేయడానికి ఉపయోగపడుతుంది.
  8. ఈనిన వెంటనే 2 కె.జి.ల ముల్లంగి దుంపలు, 2 గంటల తరువాత 1 కె.జి. బెండకాయలు తినిపించాలి.
  9. ఈనిన వెంటనే దూడకు తాగినన్ని జున్నుపాలు రోజుకు 3 లీటర్లకు మించకుండా కుడిపించాలి. ఈ జున్నుపాలలో వ్యాధి నిరోధక శక్తి వుంటుంది. జున్నుపాలు సత్వరమే కుడిపించడం మలంగా, గర్భాశయ కదలికల ద్వారా తల్లి తొందరగా మాయ వేస్తుంది.
  10. పుట్టిన వెంటనే అరగంటలోపుగా, మొదటిసారి రేణం (MUCONIUM) వేసిన విషయం నిర్ధారించుకోవాలి. పెయ్యదూడలు అరగంటలోపుగాను, గిత్తదూడలు కాస్త ఆలస్యంగాను లేచి నిలబడతాయి.
  11. ఈనిన వెంటనే ఆర్నికా 200 ముందు 20 మాత్రలు, 2 గంటల తరువాత హైపరికం 200 ఒక మోతాదు తినిపించాలి.
  12. టెట్‌వాక్ (TETVAC) ఇంజక్షను 1 మి.లీ. కండకు (IMగా) ఒకసారి మాత్రమే చేయించాలి.
  13. పుట్టిన దూడ బలహీనంగా వుంటే, విటమిన్ ఎ, డి3, ఇ (VITAMIN A, D3, E) ఇంజక్షన్ 1 మి.లీ. చొప్పున, రోజు విడిచి రోజు 5 పర్యాయాలు కండకు (IM)గా చేయించాలి.
  14. ఫెర్రిటాస్ (FERRITAS) ఇంజక్షన్ 2 మి.లీ. (IM) కండకు 3వ రోజున, అవసరాన్నిబట్టి పదవ రోజున చేయించాలి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

చూడి పశువుల శాస్త్రీయ సంరక్షణ – పాడి రైతు విజయానికి మూలాధారం

పరిచయం
పాడి పరిశ్రమలో రైతు విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశాల్లో పునరుత్పత్తి నిర్వహణ (Reproductive Management) ఒకటి. పాడి ఆవు లేదా గేదె ప్రతి సంవత్సరం ఒక ఆరోగ్యవంతమైన దూడను ఈని, సకాలంలో మళ్లీ చూడి కడితేనే పాల ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగి రైతుకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల చూడి కాలం (Gestation Period) పాడి పశువుల జీవితంలో అత్యంత కీలకమైన దశగా భావిస్తారు. ఆవులలో చూడి కాలం సుమారు 280–285 రోజులు, గేదెలలో 300–310 రోజులు ఉంటుంది. ఈ కాలంలో గర్భస్థ దూడ ఎదుగుదలతో పాటు తల్లి పశువు శరీరంలో కూడా అనేక శారీరక, హార్మోన్ల మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో సమతుల్య పోషకాహారం, సరైన యాజమాన్యం, పరిశుభ్రమైన వాతావరణం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు సకాలంలో పశువైద్య సేవలు అందించడం అత్యంత అవసరం.

రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది రైతులు చూడి పశువులను సాధారణ పాల పశువుల మాదిరిగానే నిర్వహిస్తూ, ఈనడానికి కొద్ది రోజుల ముందు మాత్రమే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనివల్ల పాలజ్వరం (Milk Fever), మాయ నిలిచిపోవడం (Retained Placenta), ప్రసవ సమస్యలు, బలహీన దూడలు పుట్టడం, పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయి.అందువల్ల చూడి నిర్ధారణ అయిన రోజు నుంచే శాస్త్రీయ సంరక్షణను ప్రారంభించడం ఎంతో అవసరం. ఈ వ్యాసంలో చూడి కాలంలోని వివిధ దశలు, పోషకాహార యాజమాన్యం, డ్రై పీరియడ్ నిర్వహణ, పొదుగు సంరక్షణ, ప్రసవానికి సన్నాహాలు, ఈనిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ముఖ్యమైన అంశాలను శాస్త్రీయంగా, రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం.

చూడి కాలం – దశలు మరియు వాటి ప్రాముఖ్యత
ఆవులలో చూడి కాలం సగటున 280–285 రోజులు, గేదెలలో 300–310 రోజులు ఉంటుంది. ఈ మొత్తం చూడి కాలాన్ని పిండం ఎదుగుదల, పోషక అవసరాలు మరియు నిర్వహణను దృష్టిలో ఉంచుకొని మూడు ప్రధాన దశలుగా విభజిస్తారు. ప్రతి దశలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన దూడతో పాటు ఈనిన తర్వాత అధిక పాల ఉత్పత్తిని కూడా పొందవచ్చు.

మొదటి దశ (0–3 నెలలు) – పిండం స్థిరపడే దశ
ఈ దశలో ఫలదీకరణం చెందిన అండం గర్భాశయంలో స్థిరపడి, మావి (Placenta) ఏర్పడటం ప్రారంభమవుతుంది. పిండం పరిమాణం చిన్నదిగా ఉన్నప్పటికీ, గర్భధారణ కొనసాగడానికి ఇది అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో పశువుకు మానసిక ఒత్తిడి, ఎక్కువ దూరం నడిపించడం, జారుడు నేలపై తిరగనివ్వడం, ఆకస్మికంగా మేత లేదా దాణా మార్పులు చేయడం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల ప్రారంభ గర్భస్రావం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం కల్పించి, సమతుల్య పోషకాహారం, పరిశుభ్రమైన తాగునీరు అందించడం అవసరం. గర్భధారణను 60–90 రోజుల మధ్య పశువైద్యుని ద్వారా నిర్ధారించుకోవడం ఉత్తమ యాజమాన్య పద్ధతి.

రెండవ దశ (4–6 నెలలు) – పిండం అవయవాల అభివృద్ధి దశ
ఈ దశలో పిండం శరీర అవయవాలు పూర్తిగా రూపుదిద్దుకుని, కండరాలు మరియు ఎముకల నిర్మాణం వేగంగా అభివృద్ధి చెందుతుంది. గర్భస్థ దూడ జీవన సామర్థ్యానికి ఈ దశ చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో పశువు పాల ఉత్పత్తి కొనసాగుతుంటే, నిర్వహణ పోషక అవసరాలతో పాటు పిండం ఎదుగుదలకు అవసరమైన అదనపు శక్తి, మాంసకృత్తులు, కాల్షియం, ఫాస్పరస్ మరియు సూక్ష్మ ఖనిజాలు అందేలా ఆహారం ఇవ్వాలి. ఖనిజ మిశ్రమం (Mineral Mixture) మరియు పరిశుభ్రమైన నీటిని క్రమం తప్పకుండా అందించడం వల్ల గర్భస్థ దూడ ఎదుగుదల మెరుగుపడటంతో పాటు, భవిష్యత్తులో పాల ఉత్పత్తికి కూడా అనుకూలంగా ఉంటుంది.

చూడి కాలం – రెండవ దశ (4–6 నెలలు) – పిండం అవయవాల అభివృద్ధి దశ

మూడవ దశ (7–9 నెలలు) – వేగవంతమైన పిండం పెరుగుదల దశ
చూడి కాలంలో దూడ బరువులో సుమారు 70 శాతం చివరి మూడు నెలల్లోనే పెరుగుతుంది. అందువల్ల ఈ దశలో పశువుకు పోషకాహార అవసరాలు అత్యధికంగా ఉంటాయి. సరిపడా శక్తి, మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజాలు అందకపోతే బలహీనమైన దూడలు పుట్టడం, తక్కువ జనన బరువు, ఈనిన తర్వాత పాలజ్వరం (Milk Fever), గర్భకోశం ఆలస్యంగా బయటకు రావడం (Retained Placenta), కీటోసిస్ వంటి జీవక్రియ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఈ దశలోనే ఈనడానికి సుమారు 60 రోజుల ముందు పాలు పితకడం నిలిపివేసే కాలాన్ని “డ్రై పీరియడ్” అంటారు. ఈ కాలంలో పాల గ్రంథి కణజాలం పునరుద్ధరణ చెందుతుంది మరియు తరువాతి ఈతలో అధిక పాల ఉత్పత్తికి సిద్ధమవుతుంది. కాబట్టి డ్రై పీరియడ్‌ను నిర్లక్ష్యం చేయకుండా, సమతుల్య పోషకాహారం, ఖనిజ మిశ్రమం, పరిశుభ్రమైన నీరు, తగిన వ్యాయామం మరియు పశువైద్యుని సూచించిన టీకాలు, నులిపురుగుల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి.

మూడవ దశ (7–9 నెలలు) – వేగవంతమైన పిండం పెరుగుదల దశ

పోషకాహార యాజమాన్యం
చూడి పశువులలో ఆరోగ్యవంతమైన దూడ జననం, సులభ ప్రసవం మరియు ఈనిన తర్వాత అధిక పాల ఉత్పత్తికి సమతుల్య పోషకాహారం అత్యంత అవసరం. చూడి కాలంలో పిండం ఎదుగుదల దశను బట్టి శక్తి (Energy), మాంసకృత్తులు (Protein), ఖనిజాలు (Minerals), విటమిన్లు (Vitamins) మరియు పరిశుభ్రమైన తాగునీరు తగిన మోతాదులో అందించాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిండం వేగంగా పెరుగుతుంది కాబట్టి పోషకాహార అవసరాలు కూడా పెరుగుతాయి.

తొలి మరియు మధ్య దశల్లోపోషణ (0–6 నెలలు)

  • పశువు శరీర స్థితి స్కోరు (BCS) 3.0–3.5 మధ్య ఉండేలా చూసుకోవాలి.
  • పచ్చిమేత, ఎండుమేత, సమతుల్య దాణాను శరీర బరువు, పాల దిగుబడి మరియు చూడి దశకు అనుగుణంగా అందించాలి.
  • పప్పుజాతి, గడ్డి జాతి పచ్చిమేతలను సమతుల్యంగా ఇవ్వడం మంచిది.
  • అధిక దాణా ఇచ్చి పశువును లావుగా చేయకూడదు. ఇది ప్రసవ సమయంలో ఇబ్బందులు మరియు జీవక్రియ సమస్యలకు దారితీయవచ్చు.
  • ఎల్లప్పుడూ పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి.

డ్రై పీరియడ్ (ఈనడానికి 60 రోజుల ముందు)
ఈనడానికి సుమారు 60 రోజుల ముందు పాలు పితకడం నిలిపివేయాలి. ఈ కాలంలో పాల గ్రంథి పునరుద్ధరణ చెంది, తదుపరి ఈతలో అధిక పాల ఉత్పత్తికి సిద్ధమవుతుంది. డ్రై పీరియడ్‌ను రెండు దశలుగా విభజిస్తారు.

  • డ్రై పీరియడ్ (60–21 రోజులు): నాణ్యమైన పచ్చిమేత, ఎండుమేతతో కూడిన సాధారణ నిర్వహణ ఆహారం సరిపోతుంది.
  • ట్రాన్సిషన్ పీరియడ్ (చివరి 21 రోజులు): శక్తి, మాంసకృత్తుల మోతాదును క్రమంగా పెంచుతూ, ప్రసవం మరియు తదుపరి పాల ఉత్పత్తికి పశువును సిద్ధం చేయాలి. ఆకస్మికంగా ఆహారం మార్చకూడదు.

ఖనిజ మిశ్రమం (Mineral Mixture) సప్లిమెంటేషన్
చూడి పశువులకు కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, జింక్, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలు తగిన మోతాదులో అందకపోతే పాలజ్వరం, మాయ నిలిచిపోవడం, బలహీనమైన దూడలు పుట్టడం వంటి సమస్యలు సంభవిస్తాయి. అందువల్ల రోజువారీ దాణాతో పాటు నాణ్యమైన ఖనిజ మిశ్రమాన్ని అందించడం అవసరం.

తెలంగాణ రాష్ట్రంలోని పి.వి. నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన “తెలమిన్” వంటి సమతుల్య ఖనిజ మిశ్రమాల వినియోగం వల్ల చూడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరు మెరుగుపడినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, పశువైద్యుని సలహా మేరకు సిఫారసు చేసిన మోతాదులో ఖనిజ మిశ్రమాన్ని వాడటం ఉత్తమం.

ఖనిజ మిశ్రమం (Mineral Mixture) సప్లిమెంటేషన్

పొదుగు సంరక్షణ
డ్రై పీరియడ్ ప్రారంభంలో పొదుగును పూర్తిగా పరిశీలించి, పొదుగువాపు (Mastitis) లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి. ప్రతి చనుమొనలో గాయాలు, వాపు, గడ్డలు లేదా అసాధారణ స్రావం ఉన్నాయో లేదో గమనించాలి. పశువైద్యుని సలహా మేరకు డ్రై కౌ థెరపీ (Dry Cow Therapy) చేయించడం వల్ల డ్రై పీరియడ్‌లో పొదుగు ఇన్ఫెక్షన్లను నివారించడమే కాకుండా, తదుపరి ఈతలో పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఈనడానికి కొద్ది రోజుల ముందు పొదుగు క్రమంగా నిండడం, గట్టిపడటం సహజం. అయితే అధిక వాపు, వేడి, ఎర్రబడటం లేదా నొప్పి కనిపిస్తే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఈనడానికి ముందు కనిపించే లక్షణాలు
ఈనడానికి కొన్ని రోజులు లేదా గంటల ముందు పశువులో ఈ మార్పులు కనిపిస్తాయి.

  • పొదుగు పూర్తిగా నిండి, చనుమొనల వద్ద మైనం వంటి పదార్థం (Waxing) కనిపించడం.
  • పెల్విక్ కండరాలు వదులై, తోక రెండువైపులా గుంతలు పడటం.
  • యోని నుండి పారదర్శక జిగురు (మ్యూకస్) స్రావం రావడం.
  • పశువు అశాంతిగా ఉండటం, పదేపదే పడుకోవడం, లేవడం, ఆహారం తగ్గించడం లేదా ఒంటరిగా ఉండాలని ప్రయత్నించడం.

ప్రసవానికి సన్నాహాలు

  • శుభ్రమైన, పొడి, గాలి ప్రసరణ బాగా ఉండే ప్రత్యేక ప్రసవ స్థలాన్ని సిద్ధం చేయాలి.
  • నేలపై పొడి ఎండుగడ్డి లేదా పరిశుభ్రమైన పరుపు వేయాలి.
  • పరిశుభ్రమైన నీరు, తువాళ్లు, అయోడిన్ ద్రావణం, గ్లౌజులు వంటి అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచాలి.
  • స్థానిక పశువైద్యుని ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి.
  • నీరు పగిలిన తర్వాత 2–3 గంటల్లో ప్రసవం పూర్తికాకపోయినా లేదా దూడ తప్పు భంగిమలో కనిపించినా వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఈనిన తర్వాత తలెత్తే సాధారణ సమస్యలు
పోషకాహార లోపం, అపరిశుభ్రత లేదా సరైన యాజమాన్యం లేకపోవడం వల్ల ఈనిన తర్వాత కొన్ని సమస్యలు కనిపించవచ్చు.

సమస్య
పాలజ్వరం (Milk Fever):

వివరణ / జాగ్రత్తలు: రక్తంలో కాల్షియం తగ్గడం వల్ల వస్తుంది. పశువు నిలబడలేకపోవడం, తలను పక్కకు వంచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే చికిత్స అవసరం.

సమస్య: మాయ నిలిచిపోవడం (Retained Placenta)

వివరణ / జాగ్రత్తలు: ఈనిన 12–24 గంటల్లో మాయ పడకపోతే బలవంతంగా లాగకూడదు. వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

సమస్య గర్భాశయ ఇన్ఫెక్షన్ (Metritis)*

వివరణ / జాగ్రత్తలు: అపరిశుభ్ర ప్రసవం వల్ల వస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే తదుపరి చూడిపై ప్రభావం పడుతుంది.

సమస్య కీటోసిస్ (Ketosis):

వివరణ / జాగ్రత్తలు: ఈనిన తర్వాత శక్తి కొరత వల్ల వస్తుంది. ఆకలి తగ్గడం, పాల దిగుబడి తగ్గడం ప్రధాన లక్షణాలు.

జున్ను (Colostrum) నిర్వహణ
ఈనిన వెంటనే వచ్చే మొదటి పాలను జున్ను (Colostrum) అంటారు. ఇందులో రోగనిరోధక ప్రతిరక్షకాలు (Antibodies), విటమిన్-ఎ మరియు అధిక పోషక విలువలు ఉంటాయి. దూడకు జీవితంలో మొదటి రోగనిరోధక శక్తి జున్ను ద్వారానే లభిస్తుంది. అందువల్ల ఈనిన 1–2 గంటల్లోపు దూడకు తగిన మోతాదులో జున్ను తాగించాలి. ఆలస్యమైతే దూడ పేగులు ప్రతిరక్షకాలను గ్రహించే సామర్థ్యం వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి మొదటి 24 గంటల్లో శరీర బరువులో సుమారు 10% మేర జున్ను అందించడం ఉత్తమ నిర్వహణ పద్ధతిగా భావిస్తారు.

రైతులు తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు

చేయవలసినవి
✔️ డ్రై పీరియడ్‌ను కనీసం 45–60 రోజులు తప్పనిసరిగా పాటించాలి.
✔️ సమతుల్య పోషకాహారం, ఖనిజ మిశ్రమం మరియు పరిశుభ్రమైన నీటిని ప్రతిరోజూ అందించాలి.
✔️ టీకాలు, నట్టల నివారణ, ఆరోగ్య పరీక్షలను షెడ్యూల్ ప్రకారం చేయించాలి.
✔️ ఈనడానికి ముందు లక్షణాలను గమనిస్తూ పశువును ప్రత్యేకంగా పరిశీలించాలి.
✔️ ప్రసవం అనంతరం పశువు మరియు దూడ ఆరోగ్యాన్ని మొదటి 24 గంటలు ప్రత్యేకంగా గమనించాలి.

చేయకూడనివి
✘ చివరి మూడు నెలల్లో అధిక దూరం నడిపించడం లేదా అధిక శ్రమ చేయించడం.
✘ ఆకస్మికంగా దాణా లేదా మేతలో పెద్ద మార్పులు చేయడం.
✘ మాయ నిలిచిపోయినప్పుడు స్వయంగా లాగే ప్రయత్నం చేయడం.
✘ అనుభవం లేని వ్యక్తులతో కష్టమైన ప్రసవాలు చేయించడం.

ముగింపు
చూడి పశువుల సంరక్షణ అనేది ఆరోగ్యవంతమైన దూడ, సులభ ప్రసవం, అధిక పాల ఉత్పత్తి మరియు పశువు దీర్ఘకాలిక పునరుత్పత్తి సామర్థ్యానికి పునాది. సమతుల్య పోషకాహారం, సరైన డ్రై పీరియడ్ నిర్వహణ, ఖనిజ మిశ్రమం వినియోగం, సకాలంలో టీకాలు, పరిశుభ్రమైన ప్రసవ నిర్వహణ మరియు పశువైద్యుని సలహాలను పాటించడం ద్వారా ఈనిన తర్వాత వచ్చే సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రతి పాడి రైతు ఆరోగ్యవంతమైన పశువులు, అధిక పాల దిగుబడి మరియు మెరుగైన ఆర్థిక లాభాలను సాధించగలడు.

డా. ఎ. సురేష్ నాయక్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌. Ph: 9491394455

Read More