వర్షాకాలంలో పశుసంరక్షణ…!
వర్షాకాలం వచ్చింది. భారతదేశంలో పశుపోషణ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది, అయితే తొలకరిజల్లులు కురుస్తూ మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే ఈ వర్షాకాలం వేసవి వేడిని తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ, అధిక తేమ, బురద, నీటి నిల్వలు వంటి పరిస్థితులు పశువుల ఆరోగ్యానికి సవాళ్లను సృష్టిస్తాయి. ఈ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవులు మరియు వ్యాధి వ్యాప్తి చేసే కీటకాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆశ్రయం, పోషణ మరియు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

- పశువుల షెడ్ మరియు నివాస నిర్వహణ:
వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను కాపాడుకోవడానికి శాస్త్రీయమైన షెడ్ మరియు నివాస నిర్వహణ అత్యంత కీలకం.

వర్షాకాలంలో పశువుల షెడ్ చుట్టూ డ్రైనేజీ కాలువలను శుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా చూడాలి, ఎందుకంటే నిల్వ నీటిలో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. షెడ్ నేలను పొడిగా ఉంచడం చాలా ముఖ్యం; బురదగా లేదా తడిగా ఉన్న నేల వల్ల ఫుట్ రాట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల పొడి గడ్డి, వరి పొట్టు లేదా సా డస్ట్ పరచి వాటిని తరచూ మార్చాలి. నేలపై సున్నం (లైమ్ పౌడర్) చల్లడం ద్వారా తేమ తగ్గడమే కాకుండా క్రిముల సంఖ్య కూడా తగ్గుతుంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందు పైకప్పు లీకేజీలను సరిచేసి షెడ్లోకి నీరు రాకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే తడి వాతావరణం ముఖ్యంగా పిల్ల దూడలు, గొర్రె పిల్లలు మరియు మేక పిల్లల్లో న్యుమోనియా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే షెడ్లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి; పూర్తిగా మూసివేయకుండా ఉండటం వల్ల మూత్రం నుంచి విడుదలయ్యే అమోనియా వాయువు పేరుకుపోకుండా ఉండి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

- మేత మరియు పోషకాహార నిర్వహణ:
మేత మరియు పోషకాహార నిర్వహణ విషయానికి వస్తే, వర్షాకాలంలో లభించే లేత పచ్చి మేతను పశువులకు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పరిచయం చేయాలి. పచ్చి గడ్డిలో నీటి శాతం, సులభంగా పులిసే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పశువుల్లో ‘బ్లోట్’ (కడుపుబ్బరం) మరియు తీవ్రమైన విరేచనాలు (Diarrhea) వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని పొడి గడ్డి (Hay/Straw) తో కలిపి సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా, చిన్న వయస్సు లేదా తక్కువ ఎత్తు ఉన్న జొన్న (Sorghum) మొక్కల్లో ‘హైడ్రోసయానిక్ యాసిడ్’ (HCN / Prussic acid) అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు వచ్చే వరకు వాటిని మేపకూడదు. అధిక తేమ కారణంగా పశుగ్రాసం, పిండి పదార్థాలు త్వరగా బూజు పడతాయి. ఇటువంటి బూజు పట్టిన ఆహారం ద్వారా పశువుల శరీరంలోకి ప్రవేశించే మైకోటాక్సిన్లు ‘అఫ్లాటాక్సికోసిస్’ (Aflatoxicosis) అనే కాలేయ సంబంధిత విష ప్రభావానికి దారితీస్తాయి, కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి. వర్షాల వల్ల నేలలోని ఖనిజ లవణాలు కొట్టుకుపోయి మేతలో వాటి శాతం తగ్గుతుంది కాబట్టి, పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి మినరల్ మిక్స్చర్ లేదా మినరల్ బ్లాక్ లను శాస్త్రీయంగా అందించాలి. - ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ
వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులను అరికట్టడానికి ముందస్తు రోగనిరోధక చర్యలు మరియు వ్యాధి నివారణ అత్యవసరం. వర్షాలు పడటానికి ముందే పశువైద్యుల సలహా మేరకు ఖచ్చితంగా టీకాలు వేయించాలి. ఆవులు, గేదెలకు గొంతువాపు (Hemorrhagic Septicemia – HS), జబ్బవాపు (Black Quarter – BQ), మరియు గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD) నివారణ టీకాలు వేయించాలి. అలాగే గొర్రెలు, మేకలకు బొబ్బరోగం లేదా ఇ.టి (Enterotoxemia – ET), పి.పి.ఆర్ (Peste des Petits Ruminants) మరియు నీలి నాలుక వ్యాధి (Blue Tongue) వంటి వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక టీకాలు ఇప్పించాలి. వ్యాధి కారక కీటకాలైన దోమలు, ఈగలు మరియు పేల నియంత్రణకు షెడ్ లోపల, గోడలకు అనువైన క్రిమిసంహారక మందులను క్రమం తప్పకుండా స్ప్రే చేయడం ద్వారా బాహ్య పరాన్నజీవుల జనాభాను అదుపులో ఉంచవచ్చు. - పరాన్నజీవుల (Worms) నియంత్రణ:
పశువులలో అంతర్గత మరియు బాహ్య పరాన్నజీవుల (Parasites) నియంత్రణ చేయడం వల్ల పశువు యొక్క ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడుతుంది. వర్షాకాల వాతావరణం పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, పశువైద్య నిపుణుల సూచనల ప్రకారం సరైన డోసేజ్తో డీ-వార్మింగ్ (నట్టల నివారణ) మందులు ఇప్పించాలి. పేలు (Ticks), మైట్స్, మరియు లైస్ వంటి బాహ్య పరాన్నజీవులు పశువుల రక్తాన్ని పీల్చడమే కాకుండా, రక్తం ద్వారా వ్యాపించే ప్రాణాంతక ప్రోటోజోవా వ్యాధులైన ‘బేబిసియోసిస్’ (Babesiosis) మరియు ‘అనాప్లాస్మోసిస్’ (Anaplasmosis) వంటి వాటికి కారణమవుతాయి కాబట్టి వీటి నిర్మూలన అవసరం. - మాస్టిటిస్ మరియు కాళ్ల సంరక్షణ:
చివరగా, పాడి పశువులలో మాస్టిటిస్ (పొదుగు వాపు వ్యాధి) మరియు కాళ్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాలు పితికే ముందు పొదుగును పొటాషియం పర్మాంగనేట్ లేదా శుభ్రమైన నీటితో కడిగి ఆరనివ్వాలి. పాలు పితికిన వెంటనే బాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ‘టీట్ డిప్’ పద్ధతిలో ఐడోఫోర్ (Iodophor) ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా మాస్టిటిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు. పశువుల గిట్టలను తరచూ పరిశీలిస్తూ, ఏవైనా గాయాలు లేదా ఫుట్ రాట్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయాలి. గిట్టల ఇన్ఫెక్షన్లను నివారించడానికి పశువులను 5% కాపర్ సల్ఫేట్ ద్రావణంతో కూడిన ‘ఫుట్ బాత్’ (Foot Bath) గుండా నడిపించడం అత్యంత శాస్త్రీయమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి.
- Dr. Vaishnavi Polapelli, MVSc Scholar
Department of Veterinary Surgery and Radiology, Ph: 9100725211

