గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు పెరుగుతుండటం వలన ఎత్తిపోతల పథకాల వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతూ ఉంది. సీతానగరం మండలంలోని గోదావరి ఎడమ గట్టున పురుషోత్తమపట్నం, పుష్కర, తొర్రిగడ్డ, సత్యసాయి తదితర ప్రాజెక్టుల వద్ద సోమవారం నాటికి నీటిమట్టం 14.2 మీటర్లకు చేరింది. మోటార్లు ఆన్ చేస్తే నీరు విడుదలయ్యేలా ప్రవాహం చేరింది. జులై రెండో వారానికల్లా ప్రాజెక్టుల నుంచి మెట్ట ప్రాంతానికి సాగు నీరు విడుదల చేసేలా కార్యాచరణ ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత రైతులకు వరప్రదాయిని అయన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు సోమవారం తెరుచుకున్నాయి. తెలంగాణ మరియు మహారాష్ట్రకు చెందిన ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బాబ్లీ ప్రాజెక్ట్‌కు ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. గేట్లు ఎత్తిన సమయంలో ప్రాజెక్ట్‌లో 0.2 టి.యం.సీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమైన జులై 1వ తేదీ నుంచి బాబ్లీ గేట్లను తెరచి అక్టోబరు 28వ తేదీన మూసి వేస్తారు. ఈపరిణామంతో నిజామాబాద్ రెంటల్ మండలం కందకుర్తి, త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లతో పాటు భూసమస్యల పరిష్కార భాద్యతలను తహసీల్దార్లు, సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల సేవలతోనే వారి సమయం గడచిపోతుంది. కాబట్టి భూసమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతుంది. ఈ క్రమంలో మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది అమలయితే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్‌ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తరువాత మొదటిసారిగా ఏర్పాటు చేసిన ‘మన్-కీ-బాత్’ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావిస్తూ అరకు కాఫీ అద్భుతం అన్నారు. దేశీయంగా తయారవుతున్న అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి అరకు కాఫీ రుచి గురించి ప్రపంచ దేశాలు సందర్శిస్తున్న సందర్భంలో విదేశీ ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోడి ప్రస్తావిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారు. మంచి రుచి, సువాసనకు అరకు కాఫీ పెట్టింది పేరు. సుమారు లక్షాయాభైవేల గిరిజన కుటుంబాలు మమేకమయిన మన అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొండం మన అదృష్టం. ఇప్పటికే అరకు కాఫీకి ఎన్నో గ్లోబల్ అవార్డులు లభించాయి. 2016లో ఒకసారి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి అరకు కాఫీ రుచి చూసే అవకాశం దొరికింది. రుచి అద్భుతంగా ఉంది అని మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అరకు కాఫీ గురించి ప్రధాని మోడి ఎక్స్‌లో చేసిన పోస్టుపై స్పందించి, ప్రధానితో కలిసి మరోసారి అరకు కాఫీ రుచిని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో సుదీర్ఘ కాలం పాటు రైతులు నిరసనలు తెలియచేసిన పరిస్థితులలో ప్రభుత్వం దిగివచ్చి రైతుల కోరిక మేరకు ఆ నల్ల చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు హామీ ఇచ్చి నిరసనలను విరమింప చేశారు. కాని ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రధాని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సంయుక్త కిసన్ మోర్చా డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల రైతుల మద్దతు కూడగట్టేందుకు చేపట్టిన యాత్ర నిన్న హైదరాబాదు చేరుకున్న సందర్భంలో నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. నిరసనలో పాల్గొన్న రైతులపై కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ లభించిన తూటాలను రైతు నాయకుడు సుర్జీత్‌సింగ్ ప్రదర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో ఇచ్చిన హామీలలో భాగంగా పంట రుణమాఫీ గురించిన మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజులలో విడుదల చేయనున్నారు. కుటుంబానికి రెండు లక్షల రూపాయలకు మించకుండా పంట రుణాలను మాఫీ చెయ్యాలనే యోచనలో ఉన్నారు. బంగారం తాకట్టుగా పెట్టి రుణాలు తీసుకున్న రుణాలు ఈ పరిధిలోకి రావని స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంటరుణాలు మాత్రమే మాఫీ అవుతాయి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడుభూములకు గోదావరి జలాలను అందించటమే మా ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాము. మీ తాతముత్తాతలకు సంబంధించిన భూమికి ఇచ్చే పట్టాదారు పుస్తకాలపై గత ప్రభుత్వం జగన్ బొమ్మను వేసుకొంది. మేము అలా చేయము. ఎవరి బొమ్మ వేయం. అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు మారుస్తాం. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు రైతులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షలకు పైబడి ఉన్న కౌలు రైతుకు రైతు భరోసా కోసం.. సబ్ కమిటీలో విధివిధానాలు ఖరారు చేసి, కౌలు రైతుల గుర్తింపుకు సంబంధించిన చర్చ జరుగుతుంది.
ఈ సీజన్ నుంచే కౌలు రైతులకు కూడా రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్‌కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. అయితే, కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, కౌలు రైతులు 25 లక్షల పైబడి ఉంటారని కౌలురైతు సంఘాల నేతలు చెప్తున్నారు.
2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కౌలు రైతు చట్టంలో పొందుపరచిన విధివిధానాల ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తారు. కౌలు రైతుకు ఇచ్చిన భూమి విస్తీర్ణంకు సంబంధించి కౌలుదారు మరియు యజమాని ఇద్దరూ ఒప్పంద పత్రంపై సంతకాలు చేయాలి. ఆ ఒప్పందం గ్రామసభ ఆమోదం పొందాలి.
ఇప్పటి వరకు భూమి కౌలు అనేది కేవలం నమ్మకాల మీదనే ఉంటుంది. కాని రైతు భరోసా పొందాలంటే నమ్మకం కంటే చట్టబద్ధం ముఖ్యం కాబట్టి కౌలుదారు యజమాని నుంచి చట్టపరంగా భూమిని కౌలుకు తీసుకుని ఒప్పంద పత్రంపై ఇరువురూ సంతకాలు చేసి ఒప్పందపత్రానికి చట్టభద్రత కల్పించాలి.
ఇందుకు సంబంధించిన విధివిధానాల కొరకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 15 లోపు పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీని ఆదేశించింది. కాబట్టి త్వరలో సబ్ కమిటీ పని మొదలు పెట్టబోతుంది.
”ఏంటి బాబాయ్ ఏదో దిగులుగా వున్నావ్?” అడిగాడు సుబ్బారావు రామయ్యను. ”ఏమి చెప్పమంటావు నాయనా మా అబ్బాయికి పెళ్లి చేసి నాలుగేళ్లు అయింది. ఇప్పటి వరకు నా కోడలికి కడుపులో కాయ కాయలేదు. అసలు నాకు మనవణ్ణో లేదా మనవరాలినో చూసే భాగ్యం ఉందో లేదో తెలియడం లేదు. అదే నా బాధ! ఇప్పటికే నా కోడలికి వైద్య పరీక్షలు జరిగాయి. ఆమెలో ఏ లోపం లేదని డాక్టర్లు చెప్పారు. ఇక మా అబ్బాయి తనలో ఏ లోపం లేదని అంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు! బస్తీకి వెళ్లి పెద్ద డాక్టర్‌ను కలిసి రమ్మని చెప్పినా వాడు నా మాట వినడం లేదు అని నిట్టూర్చాడు.
”అయితే నేను ఒక సలహా ఇస్తాను పాటిస్తావా బాబాయ్! ఇప్పుడు కడక్‌నాథ్ అనే కారు నలుపు కోళ్లు వస్తున్నాయి. వీటి మాంసంలో ఇతర కోళ్లు ముఖ్యంగా మన నాటుకోళ్ల మాంసం కంటే అనేక పోషకాలు ముఖ్యంగా ఇనుము చాలా ఎక్కువగా వుంటాయట! ఈ మాంసంలో పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధ లక్షణాలు కూడా ఉంటాయని మొన్న ఒక సైంటిస్ట్ చెబితే విన్నాను. ఎలాగూ మనం వారంలో రెండు మూడు సార్లు బ్రాయిలర్ చికెన్ వండుకుంటున్నాం కదా! ఇప్పటి నుండి వారానికి 4-5 సార్లు రెండు నెలల పాటు కడక్‌నాథ్ కోడి మాంసాన్ని ఇంట్లో వండించి మీ వాడితో తినిపించు. ఇది అందరికీ మంచిదే ఈ వయస్సులో నీకు కూడా.. అంటూ నవ్వాడు సుబ్బారావు. కావాలంటే మరికొంత సమాచారం తెలుసుకొని నీకు చెప్పగలను. అయినా కొంత ఖరీదైనప్పటికీ దీని ప్రత్యేక రుచి, సువాసన, పోషక విలువలను గుర్తిస్తే ఈ ధర అంత ఎక్కువేమీ కాదని చెప్పగలను.
నాలుగు నెలల తర్వాత – స్వీట్ ప్యాకెట్‌తో రామయ్య సుబ్బారావు ఇంటికి వచ్చి ‘ఒరేయ్ సుబ్బారావు నువ్వు చెప్పిన చిట్కా బాగా పనిచేసినట్లుంది. మా కోడలు మొన్న లేడీ డాక్టర్‌తో పరీక్షలు చేయించుకుంది. మా కోడలకు ఇప్పుడు మూడో నెల! ఇప్పుడు మా కోడలేకాక అందరమూ మునుపటి కన్నా అన్ని విధాలా ఎక్కువ ఆరోగ్యంగా, బలంగా ఉన్నాము! అంతా నువ్వు చెప్పిన కడక్‌నాథ్ కోడి మాంస మహత్యం మరి! అని నాకు స్వీట్ ప్యాకెట్ ఇస్తూ ఇవాళ మా కోడలు కడక్‌నాథ్ చికెన్ బిర్యాని వండింది అంటూ సుబ్బారావును భోజనానికి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు!
మానసిక, శారీరక వత్తిళ్ల వల్ల ఇటీవల యువతలో లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతోందని వైద్య అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. వత్తిళ్లు తగ్గించుకొని, మంచి పోషణ ద్వారా తమ శరీర పుష్టిని, వ్యాధినిరోధక శక్తిని, లైంగిక పటిష్ఠతను పెంచుకొనుటలో కడక్‌నాథ్ కోళ్ల ఉత్పత్తుల పాత్రను కూడా గుర్తించాలి.
ఈ కడక్‌నాథ్ కోళ్ల ప్రత్యేకత, పెంపకం, మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం! కారు నలుపు రంగులో వుండుట వల్ల వాటిని కాలిమసి కోళ్లు అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లోని ధర్ మరియు ఘాబువా జిల్లాల నుండి ఇవి, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జాతి కోడిపిల్లలు, పెట్టలు, పుంజులు హైదరాబాదులో కూడా లభిస్తున్నాయి. వీటి పెరుగుదల వేగం, శరీర తూకం, గుడ్ల ఉత్పాదక సామర్థ్యం ఇతర బ్రాయిలర్ కోళ్లు, కొన్ని నాటుకోళ్ల కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఈ కోళ్ల మాంసంతో పాటు గుడ్లలో కూడా ఉండే అదనపు పోషకాలు, కొన్ని ఔషధ ధాతువుల కారణంగా, వీటి మాంసం ధర, గ్రుడ్ల ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి ఖర్చుతో పాటు గిరాకీలు పెరుగుట వల్ల ప్రస్తుతం బ్రతికిన కోడి ధర కిలోకి 500 నుండి 550 రూపాయలు, మాంసం ధర 1000 నుండి 1200 రూపాయలు, గ్రుడ్లు ధర 15-16 రూపాయల వరకు ఉంటున్నాయి.
వీటి చర్మం నల్లగా ఉండి, మాంసం, రక్తం ముదురు రంగులో అంత ఆకర్షణీయంగా కనిపించక పోవుట వల్ల క్రొత్త వినియోగదారుల్ని ఈ మాంసం ఆకర్షించుటలో వెనుకబడింది. అయితే ఒకసారి రుచి చూసిన తర్వాత ఏ అభ్యంతరమూ వుండదు. లేత గోధుమ రంగులో ఉండే వీటి గ్రుడ్ల పరిమాణం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ అందులో 11.67 శాతం నాణ్యమైన మాంసకృత్తులు, ఇతర ముఖ్య పోషకధాతువులు ఎక్కువగానే ఉంటాయి.
కడక్‌నాథ్ కోళ్ల వెంట్రుకలు, చర్మం నల్లగా వుండుటకు మాంసము, రక్తము ముదురు రంగులో వుండుటకు వీటిలో ఎక్కువగా వుండే మెలనిన్ అనే నల్ల వర్ణ ధాతువుతో పాటు ఇతర మాంసాలలో కంటే సుమారు 10 రెట్లు ఎక్కువగా వుండే ఐరన్ కూడా కారణమని, వీటి వల్లనే ఇవి పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని అనుభవజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. కడక్‌నాథ్ కోడి మాంసంలో అధికంగా ఉండే నల్లని మెలనిన్ పిగ్మెంట్ వల్ల బొల్లి (చర్మపు వ్యాధి) వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయోగపడగలదు. కడక్‌నాథ్ జాతి కోళ్ల మాంసం తక్కువ క్రొవ్వు (0.73-2.8%), 18 రకాల ఎమైనో ఆమ్లాలు కలిగిన ప్రోటీన్స్ (25.47%), మరియు అతి తక్కువ కొలెస్టెరాల్ కలిగి గుండెకు ఆరోగ్య భద్రతను ఇస్తుంది. ఈ మాంసంలో ఉండే కొన్ని యాంటి ఆక్సిడెంట్సు మరియు ఇతర పోషకాల వల్ల వినియోగదారులలో రక్తపుష్టితో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతున్నదని అధ్యయనాలలో తెలిసింది.
కడక్‌నాథ్ కోళ్లు 22-25 వారాలకు యుక్త వయస్సుకు వస్తాయి. వీటిలో పెట్టలు 1.2 నుండి 1.5 కిలోలు, పుంజులు 1.8 నుండి 2.2 కిలోల వరకు తూకానికి, 5-6 నెలల వయస్సుకు వస్తాయి. ఇవి సంవత్సరానికి 110 నుండి 120 గ్రుడ్లను మాత్రమే ఉత్పత్తి చేయగలవు. ఇవి సుమారు 10 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కొంత ఎక్కువే అయినప్పటికీ 1-3 రోజుల వయస్సులో రానిఖెట్ (మారెక్స్) వ్యాక్సిన్, 14-16 రోజుల వయస్సులో ఐ.బి.డి. వ్యాక్సిన్, 21-30 రోజులకు రానిఖెట్ వ్యాక్సిన్, మరల 35-40 రోజుల వయస్సులో ఐ.బి.డి. వ్యాక్సిన్ చేయించుట మంచిది.
నానాటికి వినియోగదారుల నుండి ఈ కడక్‌నాథ్ కోడి మాంసానికి పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా శాస్త్రీయంగా ఫారాలలోనే కాక గ్రామీణ పెరళ్లలో కూడా వీటి పెంపకం మంచి లాభదాయకం కాగలదు. పండ్ల తోటలు, ఫారమ్ హౌస్‌లు, డెయిరీ మరియు జీవాల ఫారాల ఆవరణల్లో కూడా కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చును. సాధారణంగా ఇతర కోళ్లకు పాటించే యాజమాన్య పోషణ పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. నమ్మకమైన సరఫరా దారుల నుండి కొనుగోలు చేసిన కోడిగ్రుడ్లను పొదిగిస్తే 65 నుండి 70 శాతం వరకు పిల్లలు జన్మించగలవు. తొలుత 50 నుండి 100 కోడి పిల్లలతో వీటి పెంపకాన్ని ప్రారంభించి క్రమేపీ సంఖ్యను వేలకు పెంచుట మంచిది.
మార్కెటింగ్: మార్కెట్‌లోని ఇతర కోడి మాంసాల కంటే కడక్‌నాథ్ కోడి మాంసం ధర 3 నుండి 4 రెట్లు అధికంగా వుండటం, ఈ మాంసం రంగు ఆకర్షణీయంగా వుండకపోవడం మరియు ఎముకల బరువు ఎక్కువగా వుండుట వంటి కారణాల వల్ల మార్కెట్‌లో వినియోగదారులలో అవగాహన పెంచుటకు ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేయాలి. నిపుణులు, అనుభవజ్ఞులతో వండించిన బిర్యానీలు, కూరలు, ఫ్రైలను ఎగ్జిబిషన్‌లు, విందులు, వినోద స్థలాలలో తక్కువ ధరకు విక్రయించి ప్రజలకు వీటి రుచిని అలవాటు చేయాలి. వంటల పోటీలలో కడక్‌నాధ్ చికెన్ మరియు గ్రుడ్లను ప్రవేశపెట్టవచ్చును. ప్రత్యేక డిస్కౌంట్సు, పండుగలు (జాతరలు, సంక్రాంతి, దసరా పర్వదినాలు) సందర్భాలలో నల్లని ఈ కోళ్లను డిస్కౌంట్స్‌తో విక్రయించి వినియోగవర్గాలను ఆకర్షించవచ్చును.
వ్యూహాత్మక శాస్త్రీయ బ్రీడింగు పద్ధతుల ద్వారా కడక్‌నాధ్ కోళ్ల పెరుగుదల వేగాన్ని శరీర బరువును గ్రుడ్ల ఉత్పత్తిని, మెరుగుపరచి వీటి లాభదాయకతను పెంచే కృషి చేయాలని మన విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థలను కోరుచున్నాను. అదేవిధంగా అంతర్గత సంపర్కం వల్ల గానీ, విచక్షణా రహిత క్రాస్ బ్రీడింగ్ వల్ల గానీ ఈ జాతి యొక్క సహజత్వం ఈ జాతి జన్యు స్వచ్ఛత నశించకుండా, జాతి అంతరించకుండా పరిరక్షించవలసిన అవసరం కూడా వుంది.
మన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న గ్రామీణ పెరటి పరిశ్రమలో కడక్‌నాథ్ కోళ్లను ప్రవేశపెట్టి లబ్దిదారుల ఆదాయాలతో పాటు, వినియోగదారుల ఆరోగ్యాలను కూడా మెరుగుపరచవచ్చు.