మామిడి తోటలలో కోత అనంతర యాజమాన్యం

మామిడిని సాగు చేసే రైతులు పూత ప్రారంభమైనప్పటినుండి పురుగులు తెగుళ్ల యాజమాన్యం మరియు పోషకాల యాజమాన్యంను  సరైన సమయంలో చేస్తూ  అధిక దిగుబడి  మరియు నాణ్యమైన దిగుబడిని  పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని కోత అనంతరం తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వలన తర్వాత సంవత్సరం దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మామిడి కోత తర్వాత  నిర్లక్ష్యం చేయకుండా రైతులందరూ సరైన యాజమాన్యం చేపట్టాలి.

మామిడి తోటల్లో కోత అనతరం తీసుకోవలసిన చర్యలు

1. కొమ్మ కత్తిరింపులు

మామిడిలో పూత రావటం అనేది వాతావరణంతో పాటు కొమ్మల వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. పూత వచ్చే సమయానికి కొమ్మలవయస్సు దాదాపు 4-5 నెలలు ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే  కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి కొమ్మల వయస్సు పూత రావటానికి అనువుగా ఉంటుంది. 

కొమ్మ కత్తిరింపులను కాయ కోత చేపట్టిన నెల రోజుల తర్వాత మొదలు పెట్టాలి. కాయలు పెరిగిన పూత  కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను (గొడుగు కొమ్మలు) కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి. కత్తిరించిన కొమ్మలకు శిలీంద్రాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు సోకకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.

కత్తిరింపుల వలన లాభాలు

  •   చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
  •   తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
  •   నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది
  •   చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు
  •   ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
  •   చీడ పీడల బెడద తగ్గుతుంది.

2. ఎరువుల యాజమాన్యం

కోత తర్వాత చెట్టు తన ఆహార నిల్వలను కోల్పోతుంది కాబట్టి కోత అనతరం తప్పనిసరిగా చెట్టుకు పోషకాలు అందించాలి. కొమ్మ కత్తిరింపులు చేపట్టిన వెంటనే ప్రతి చెట్టుకు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి. ఎరువులను తొలకరిలో అంటే జులై – ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి.  వర్షపాతం ఎక్కువగా ఉన్న  ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరలా వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి.  వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి. 

పది సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి చెట్టుకు 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్‌ ను ఇచ్చే ఎరువులను వేయాలి. సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువులను ఎక్కువగా వేసుకొంటే మంచిది. సేంద్రియ ఎరువులు చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోష్టు 20 కిలోలు తో పాటు 1 కిలో వేపపిండి, 250 గ్రా. చొప్పున  అజిటోబాక్టర్‌ లేదా అజోస్పైరిల్లం ను 25 0 గ్రా. ఫాస్ఫోబాక్టర్‌, 100 గ్రా. ట్రైకోడేర్మావిరిడిని కూడా వేసుకోవాలి.

మామిడిలో సూక్ష్మపోషకాల లోప లక్షణాలు కనిపిస్తే కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 5 గ్రా. జింక్‌ సల్ఫేట్‌, 2 గ్రా. బోరాన్‌, 2 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌, 2 గ్రా. కాల్షియం సల్ఫేట్‌ను 1 లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్కలకు అందించే పోషకాలను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. 

3. కలుపు యాజమాన్యం

మామిడిలో కోత తర్వాత వర్షాలు పడి కలుపు సమస్య ఎక్కువుగా వుంటుంది. కలుపును ఎప్పటికప్పుడు నివారిచుకోవాలి. లేకపోతే మామిడిని ఆశించే చాలా పురుగులు కలుపు మొక్కలపై నివాసం ఏర్పరుచుకొని వాటి జీవిత చక్రాలు  పూర్తి చేసుకొని మామిడిపై ఆసిస్తాయి. కలుపును సమర్ధవంతంగా నివారిచాలంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత నేలను 2 సార్లు దున్నుకొని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, నవధాన్యాలు వంటి పంటలను తోటల్లో చల్లుకొంటే వర్షాలకు అవి పెరిగి కలుపు మొక్కలు రాకుండా చేస్తాయి. ఈ పచ్చి రొట్ట పైర్లు పూత థకు రాగానే వాటిని మళ్ళీ నేలలో కలియ దున్నాలి. ఈ విధంగా చేయటం వలన మల్చింగ్‌గా పనిచేసి కలుపు రాకుండా చేయటమే కాకుండా అవి కుళ్ల్లి సేంద్రియ ఎరువుగా మారి నేల సారవంతం పెరుగుతుంది. అంతే కాకుండా కలుపు నివారణకు చేసే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో కలుపు నివారించుకోవాలి.

4. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం

  •   కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటపడి నాశనమౌతాయి.
  •  తేనెమంచు పురుగు ఉదృతి కొత్త చిగుర్లు వచ్చే సమయం నుండి ప్రారంభమవుతుంది. వీటి ఉధృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి. ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
  •   అక్టోబర్‌లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
  •  తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
  •  ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన  కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది. 
  •   పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం.మీ. వెడల్పు ఉన్న 400 గేజు మందం ఉన్న పాలీథీన్‌ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి. చెట్ల పాదుల్లో వేపపిండి వేయటం వలన కూడా వీటిని నివారించుకోవచ్చు.
  •   పండు ఈగ ఆశించిన కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
  •  ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
  •  తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
  •   సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని  జీవ సంబంధిత మందులు అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి   సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి. 

డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త (హార్టీకల్చర్‌), డా. బి. కనక మహాలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త (ప్లాంట్‌ పాథాలజీ) జి. శాలిరాజు, శాస్త్రవేత్త, (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు. ఫోన్‌: 9948977535

Read More

పిల్లల పెంపకం, ప్రవర్తనపై తల్లిదండ్రుల దృక్పథాల ప్రభావం

తల్లిదండ్రులు పిల్లల వికాసంపైన అత్యంత ప్రభావం చూపుతారు. శైశవథ మొదలుకొని జీవితాంతం వరకు కుటుంబ బాంధవ్యాల వివిధ ప్రభావాలు వ్యక్తి వికాసం మీద ఎంతగానో ఉంటాయి. పిల్లల పెరుగుదల, వికాసంతోబాటు వారి అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు గల అనుబంధం కూడా దానికి అనుగుణంగా మారుతూ ఉన్నప్పుడే వారు సరైన దృక్పథంతో ప్రవర్తించగలరు.

పిల్లలు కుటుంబ స్థాయికి, సంఘ సమరూపత పొందటం నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. దీని ఫలితంగా వచ్చే కొన్ని మానసిక ఒత్తిడులను తట్టుకొని పెద్దలు కోరిన విధంగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు పిల్లల మధ్యగల సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అంతేగాక, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఎటువంటి అనుబంధం ఉన్నదనే విషయం, తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల గల ధోరణిని బట్టి ఉంటుంది. వాంఛనీయమైన తల్లిదండ్రుల పిల్లలు అనుబంధం వాత్సల్యపూరితమైన బాంధవ్యం తల్లిదండ్రులకు వారి పిల్లల మీద భద్రత, నమ్మకం ఉన్నప్పుడే వారి పిల్లలకు తల్లిదండ్రుల మీద విశ్వాసం పెంపొందుతుంది. ఈ విధమైన అనుకూల బాంధవ్యం ఉన్నప్పుడే పిల్లలు బాధ్యతాయుత ప్రవర్తన కలిగి ఉంటారు. 

పిల్లల పెంపకం అన్నది ఒక కళ. తల్లిదండ్రుల పెంపక విధానాలపై పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. చిన్నప్పటి పెంపకం విధానాలపైనే పిల్లల భావి జీవితాలకు పునాది ఏర్పడుతుంది. తల్లిదండ్రుల పెంపక విధానాలలో లోపమున్నట్లయితే వాటి పర్యవసానాలు, దుష్పరిణామాలు పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది. కనుక, ప్రతి తల్లిదండ్రి పెంపక విధానాల గురించి వాటి పరిణామాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లల పెంపక విధానాలు – వాటి పరిణామాలు

*  విమర్శలతో పెంచబడిన బిడ్డ, తనను తాను దోషిగా తలుస్తాడు.

*  కోపతాపాలతో పెంచిన బిడ్డ, కయ్యానికి కాలు దువ్వుతాడు.

*  పరిహాసములతో పెంచబడిన బిడ్డ, పిరికివానిగా తయారవుతాడు.

*  అవమానాలతో పెంచబడిన బిడ్డ, న్యూనతా భావానికి గురవుతాడు.

*  సహనంతో పెంచబడిన బిడ్డ, క్షమాగుణాన్ని నేర్చుకుంటాడు.

*  రక్షణ భావంతో పెంచబడిన బిడ్డ, జీవితంపై దృఢమైన నమ్మకాన్ని పెంచుకొంటాడు.

*  నిష్పక్షపాతంగా పెంచబడిన బిడ్డ, నీతిగా పెరగటం నేర్చుకొంటాడు.

*  స్నేహ భావంతో పెంచబడిన బిడ్డ, ఇతరుల మీద ప్రేమ అభిమానాన్ని పెంచుకొంటాడు.

*  పిల్లలను పెంచే విధానం తల్లిదండ్రుల దృక్పథాల మీద ప్రేమ, అభిమానాన్ని పెంచుకొంటాడు.

*  పిల్లలను సక్రమ పద్ధతిలో పెంచితే వాళ్ళు మంచి అలవాట్లను, ఉత్తమ లక్షణాలను నేర్చుకొని కుటుంబంలోను సంఘంలోను ఉపయోగపడే వ్యక్తులుగా రూపొందగలరు. కాబట్టి పెంచటంలో తల్లిదండ్రులకు సరియైన దృక్పథాలు ఉండటం ఎంతో అవసరం.

తల్లిదండ్రుల దృక్పథాలు ముఖ్యంగా మూడు రకాలు: 1) స్వీకారం, 2) తిరస్కారం 3) అతి సంరక్షణ

స్వీకారం: తల్లిదండ్రులు ప్రేమగా చూడటమే ప్రతిబిడ్డకు జీవితంలో ప్రాథమిక అవసరం. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. ఇది వారు భారమైన విధి అని భావించకుండా ప్రకృతి సిద్ధమైన బాధ్యతగాను, ఆనందమయమైన కార్యంగాను గుర్తించాలి. పిల్లలను వారి అందచందాలు చూచిగాని, తెలివితేటలను చూచిగాని ప్రేమించకూడదు. బిడ్డలు ఎటువంటి వారయినా, ఎలాంటి గుణగణాలు ఉన్నా వారిని తల్లిదండ్రులు ఆత్మీయతతో ఆదరించి, సమభావంతో పెంచాలి. ఈ విధంగా పెంచిన బిడ్డలను స్నేహ సహకార స్వభావాలు, నిశ్చిలబుద్ధి ఉండి స్వయం శక్తితో సంతోషంగాను, సుఖంగాను వృద్ధిలోకి రాగలరు.

స్వీకారం వలన తల్లిదండ్రులకు, బిడ్డలకు కూడా ఆనందంగా ఉంటుంది. స్వీకారం తిరస్కారం దృక్పథాలు తల్లిదండ్రులలో సాధారణంగా కన్పించే లక్షణాలని మానసిక మనోవిజ్ఞాన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మానసిక పరిపక్వత ఉన్న తల్లిదండ్రులలో స్వీకారం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వారిలో సృజనాత్మక శక్తి సహకరించడం, ఆత్మవిశ్వాసం, సర్దుబాటుతత్వం లాంటి లక్షణాలు అలవాటవుతాయి. పిల్లలు, బాధ్యత, నమ్మకం, విధులు నిర్వహించడంలో నైపుణ్యం అలవాటు చేసుకొంటారు.

తల్లిదండ్రులు ఎక్కువ జోక్యం చేసుకొంటే పిల్లలు స్వార్ధపరులుగా, మొండిగా తయారవుతారు. అంతేకాక అటువంటి పిల్లలు, తల్లిదండ్రుల మరియు ఇతరులు కూడా వారిపైనే శ్రద్ధ చూపాలి అనే భావనలో ఉంటారు. ఇటువంటి పిల్లలను క్రమశిక్షణలో పెట్టినా ఓర్పులేక కోపాన్ని వెళ్ళబుచ్చుతారు. సాంఘికంగా అంటే ఇతరులు తమ గురించి ఏ విధంగా అనుకుంటారనే విషయం కూడా చాలా ముఖ్యమైనది. తమను జట్టులో గాని, సమూహాలలో గాని ఇతరులు స్వీకరించే విధానాన్ని బట్టి, ఇతరులు వారిపట్ల చూపే ఆదరాభిమానాలను బట్టి, వారి తప్పులను క్షమించి వారి ప్రయత్నాలను మెచ్చుకోవడాన్ని బట్టి, ఇతరులు తమ గురించి ఏ విధంగా భావిస్తున్నారో పిల్లలు తెలుసుకోగలరు.

సాంఘికంగా అంగీకారం పొందే వ్యక్తి చురుకుగా ఉంటాడు. మనసులోని మాటను పైకి చెప్తాడు. ఇతరుల కార్యక్రమాలలో సహకరిస్తాడు. ఇతరులకు సహాయం చేయటం, ఇతరులతో మర్యాదగా ఉండటం, విషయాలను పరిశీలించటం, విచారించడం మొదలైనవి సాంఘికంగా అంగీకరింపబడే వ్యక్తి లక్షణాలు. అటువంటి వ్యక్తి సమూహంలో నాయకత్వాన్ని వహిస్తాడు. ఇతను నిజాయితీ పరుడుగా ఉంటాడు. ప్రవర్తనలో ఒక మెట్టుపైన ఉంటాడు. తాము చేపట్టిన బాధ్యతలను స్వశక్తితో చక్కగా నెరవేరుస్తాడు.

ఈ దృక్పథం తల్లిదండ్రుల, పిల్లల బంధాన్ని బలపరుస్తుంది. పిల్లల అభివృద్ధికి అభ్యాసనకు ఎన్నో విధాల సహకరిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య చక్కని అవగాహన, ఆరోగ్యవంతమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇటువంటి పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరచాలని చూస్తారు.

తిరస్కారం: తల్లిదండ్రులు బిడ్డల పట్ల తిరస్కారాన్ని చాలా విధాలుగా వ్యక్తపరుస్తారు. కొందరు బిడ్డల పట్ల బాహ్యంగా శత్రు భావాన్ని చూపుతారు. మరికొందరు వారిని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు తిరస్కార భావం, ద్వేషం బాహ్యంగా చూపకుండా మనస్సులోనే ఉంచుకొని వారికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇవ్వక అన్ని విషయాలలోను ఆటంకపరుస్తారు. ఇలా చేయటం వల్ల పిల్లలలో క్రోధం, అణకువ, పిరికితనం, అశాంతి మొదలైన కొన్ని అవాంఛనీయమైన గుణాలు ఏర్పడతాయి.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పిల్లలలో ఏమి చేయలేని పరిస్థితిని కల్పించి భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. దీని వలన నిద్రలో పక్కతడపటం, గోళ్ళు కొరకటం, సరిగా తినకపోవటం లాంటి ప్రవర్తనా సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం కోరుకోవడం వలన వస్తాయని తెలుస్తోంది. ఎటువంటి బాధ్యతలు లేనివారుగా తయారవుతారు. బిడ్డలను పెంచడంలో తిరస్కారం లేక అతి సంరక్షణ అవలంబించితే పిల్లల అభివృద్ధి కుంటుపడుతుంది.

అతి సంరక్షణ వలన తల్లి, పిల్లల మధ్య అనుబంధం ఎక్కువయి, వారు తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఆధారపడతారు. దీని వలన వారు స్వశక్తితో ఏ పని చేయరు, చేయవలసి వచ్చినా భయపడతారు. అంతేకాక వారిలో ఇతర కార్యాలపైన ఉత్సాహం త్వరగా కలవలేరు. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనలేక, ఇంటికే పరిమితమైపోతారు. దీనితో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా విశ్వాసాన్ని కోల్పోతారు. ఇందువలన వారిలో ఆత్మవిశ్వాసం, సహనం, ఉత్సాహం తగ్గిపోతుంది. విమర్శలను తట్టుకోలేరు.

ఈ కాలంలో తల్లిదండ్రులు వివిధ కారణాల వల్ల ఒక బిడ్డను కని వారిని అతిగారాబంగా పెంచుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల అవసరాలను తీరుస్తూ వారికి ప్రేమ, వాత్సల్యాలతో కూడిన వాతావరణాన్ని ప్రసాదిస్తూ పిల్లల అభివృద్ధికి దోహదపడాలి తప్ప, అతి జాగ్రత్తతో పెంచి పిల్లలను ఎందుకూ పనికిరాని వాళ్ళుగా తయారు చేయకూడదు. తల్లిదండ్రులు ఈ దృక్పథాల ప్రభావాన్ని గుర్తించి పిల్లలను సక్రమంగా పెంచాలి.       

డా. పి. శ్రీదేవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, మానవ అభివృద్ధి మరియు కుటుంబ అధ్యయన విభాగం, సామాజిక విజ్ఞాన కళాశాల, సైఫాబాద్‌, హైదరాబాద్‌.

డా. బి. ప్రశాంతి, టీచింగ్‌ అసోసియేట్‌, ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామాజిక విజ్ఞాన కళాశాల, లాం, గుంటూరు.

ఫోన్‌: 8333850282

Read More

ఈనిన పశువులలో అజీర్తి

పశువులలో ఈనిన తరువాత వచ్చే అజీర్తి లేదా వాతం వలన పాల దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. పశువు ఈనిన తరువాత మొదటి రోజు నుండి మొదటిసారి ఎదకు వచ్చేకాలం, అంటే సుమారుగా 45 నుండి 60 రోజుల వరకు ఉన్నటువంటి పశువులను ఈనిన పశువులుగా పరిగణించవచ్చు. ఈ రెండు నెలలు పాల ఉత్పత్తికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో పశువు అనారోగ్యం బారిన పడితే, రైతాంగం నష్టపోవలసి వస్తుంది.

రైతులు నాశిరకం పశువులను, సరైన సమయాలలో అంటే పాల దిగుబడికి తగిన జాగ్రత్తలు పాటించని యెడల, రైతులు తీవ్ర నష్టానికి గురౌతారు. అధిక పాలదిగుబడి ఇచ్చే సంకరజాతి ఆవులకు, గ్రేడెడ్‌ జాతి ముర్రా గేదెలకు జన్యుపరంగా పాల ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పశువులకు అన్ని పశువులకంటే అధిక శక్తి అవసరం. అంటే తినే ఆహారం అరలపొట్టలో సరిగా జీర్ణమై, పశువుకి శక్తినిస్తేనే రైతుకు పాల దిగుబడి ఉంటుంది.

పశువు చూడి సమయంలో అరలపొట్ట యొక్క పనితీరు తగ్గి, ఆకలి మందగిస్తుంది. ఈనిన తరువాత ఆరోగ్యమైన పశువులలో సుమారుగా 5 వారాలకు తిరిగి మామూలు పనితనం పొందుతుంది. అరల పొట్ట పనితనం తగ్గడం వలన, అరల పొట్టలోని ద్రవంలో మార్పుతో పాటు కాలేయంలో మార్పులు ఏర్పడతాయి. దీని వలన ఆకలి మందగించడం, పాల ఉత్పత్తి తగ్గడం మరియు పోషకాహారం లోపం వలన, శరీర నిల్వలపై పశువు ఆధారపడి పాలను ఇస్తుంది. దీని మూలంగా పలురకాల జీవక్రియ వ్యాధులు లేక ఉత్పాదక వ్యాధులు బారిన పడతాయి.

పశువు ఎదకు సరిగా రాకపోవడం వంటివి జరుగుతాయి. మొదటి మూడు ఈతల వరకు శరీర నిల్వలపై ఆధారపడుతుంది. కానీ దాని సామర్థ్యానికి తగినంత పాలు ఇవ్వలేకపోతుంది. తరువాత ఈత నుండి పాల దిగుబడి అతిగా తగ్గడంతో పాటు, శరీరాకృతిలో కూడా మార్పు కనబడి బక్కచిక్కి పోతుంది. పశువులలో అజీర్తి వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు, ఈనిన తరువాత పశువులలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా మాయవేయకపోవడం, పొదుగువాపు వ్యాధి, గడ్ల మాయ గర్భాశయ వ్యాధులు మరియు మాయ తినడం వలన కూడా అజీర్తి సంభవిస్తుంది.

పశువులు ఈనిన రెండునెలల వెంటనే సంభవించు అజీర్తిని రైతు కొద్దిపాటి నైపుణ్యంతో గుర్తు పట్టవచ్చు. పశువు క్రిందటి ఈతలో కంటే తక్కువ తినటం, పాల దిగుబడి తగ్గటం వంటి లక్షణాలను బట్టి రైతు కనిపెట్టవచ్చు. మూత్ర పరీక్ష ద్వారా ఉత్పాదక వ్యాధులు (పాలజ్వరం, ఎండువాతం మొదలైనవి) గుర్తుపట్టవచ్చు. 

నివారణ చర్యలు

*  ఈనిన తరువాత పశువులలో వచ్చే అజీర్తికి నివారణగా, చివరి రెండు లేదా మూడు నెలల వ్యవధిలో సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. అలాగే అదనపు కాల్షియం ఇవ్వరాదు. 

*  పశువు ఈనే ముందు (12 గంటల ముందు), ఈనిన వెంటనే మరియు ఈనిన తరువాత (12 గంటల తరువాత) మూడు సార్లుగా కాల్షియం జెల్‌ను నోటిద్వారా త్రాగించాలి. దీని వలన పశువులలో పాలజ్వరం నివారించవచ్చు.

*  శక్తినిచ్చే ఆహారపదార్థాలు ముఖ్యంగా గ్లిజరిన్‌, కిటోనిల్‌ జెల్‌ లేదా ఈ-బూస్టర్‌ వంటి రైతు ఇంటి దగ్గరే పశువుకు దాణాలో కలిపి లేదా నోటిద్వారా ఇవ్వాలి. దీనివలన ఎండువాతం నుండి నివారించవచ్చు.

*  కాలేయం పనితీరుకు, లివర్‌ టానిక్‌లు త్రాగించాలి.

డా. కె. లక్ష్మి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌. ఫోన్‌: 8978154747

Read More

ప్రకృతి వ్యవసాయంలో 5 లేయర్‌ సాగు

పాలేకర్‌ బాటలో విజయరామ్‌

రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన, సంభవిస్తున్న అనర్ధాల నుండి బయటపడడానికి అనేకమంది నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు. వీటిలో ఫుకుఓక ప్రకృతి వ్యవసాయ పద్ధతి, భాస్కరసావే పద్ధతి, చౌహాన్‌క్యూ పద్ధతి, నమ్మళ్వార్‌ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి, సుభాష్‌పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతులోగిళ్ళకు చేరింది. ఇంకా చేరుతూనే ఉంది అని చెప్పవచ్చు. సుభాష్‌ పాలేకర్‌ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ పద్ధతి గురించి ప్రచారం చేయడంతోపాటు, కొన్ని ప్రభుత్వాలు ఈ పద్ధతిని ప్రోత్సహించడం మరియు రైతులు అమలుపరచటానికి అనుకూలంగా ఉండడం, ఈ పద్ధతిలో మన దేశీయ జాతి గోవు ప్రముఖ పాత్రను పోషించటం లాంటి వివిధ రకాల కారణాల వలన మిగతా పద్ధతులతో పోల్చుకుంటూ సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతు లోగిళ్ళకి చేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సుభాష్‌పాలేకర్‌ వలననే రసాయన వ్యవసాయం వలన జరిగిన, జరిగే నష్టాలు వేగంగా రైతులు తెలుసుకుంటున్నారు. రసాయన రహిత వ్యవసాయం ఇంత వేగంగా రైతులకు తెలియడంలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ప్రధాన పాత్ర పోషించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని సుభాష్‌ పాలేకర్‌ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే రసాయన రహిత వ్యవసాయం రైతులోగిళ్ళకు చేరటానికి చాలా సమయం పట్టేది కావచ్చు. పాలేకర్‌ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం, వారి పుస్తకాలు చదివిన వారు, వారి సభలకు హాజరయ్యి ఈ పద్ధతుల గురించి తెలుసుకున్న చాలామంది రైతులు తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాట పట్టించారు. ఇంకా పట్టిస్తున్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపారం లాంటి వేరే రంగాలలో ఉన్న వారు కూడా సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతుల గురించి తెలుసుకుని ఈ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణాజిల్లా, తరకటూరులో, వికారాబాద్‌ సమీపములో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి సాగు చేస్తున్న విజయరామ్‌.

వాస్తవానికి విజయరామ్‌ ఆర్టిస్ట్‌ (బొమ్మలు గీస్తుంటారు). ఆర్టిస్ట్‌గా తన వృత్తిని కొనసాగిస్తూ హైదరాబాదు నగరంలో ఇందిరాపార్కు సమీపంలో ఒక మిఠాయి దుకాణాన్ని నడుపుతూ వస్తున్న సమయంలో నీటి యొక్క విలువను తెలుసుకుని నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని మిఠాయి దుకాణంకి వచ్చిన వినియోగదారులకు తెలియచేస్తూ ఉండేవారు. అందుకు సంబంధించి చార్టులను తయారు చేయించి అవసరమైన వారికి ఆ చార్టులను ఉచితంగా అందిస్తూ ఉండేవారు. ఆవిధంగా తన ఆలోచనలని సామాజిక రంగాలవైపు కూడా మళ్లించి కొనసాగుతున్న క్రమంలో 2010వ సంవత్సరంలో సుభాష్‌పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి గురించి తెలుసుకొని తాను కూడా గో-ఆధారిత వ్యవసాయం చేయాలనే తలంపుతో అటువైపు అడుగులు వేసి ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టారు. ఈ పద్ధతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తలంపుతో సుభాష్‌పాలేకర్‌ గారి ద్వారా సదస్సులు ఏర్పాటు చేయడంలో తనవంతు పాత్రను పోషించారు…. పోషిస్తూన్నారు.

గోఆధారిత వ్యవసాయంలో ప్రధానమయినవి మన దేశీయ జాతి గోవులు, మన పురాతన నాటు విత్తనాలు కాబట్టి తన సాగులో ఈ పద్ధతులను అమలుపరచడంతో పాటు అంతరించి పోతున్న మన పురాతన విత్తనాలను అభివృద్ధి చేసి వాటి లభ్యత పెంచాలనే తలంపుతో మన పురాతన విత్తనాల సేకరణకు నడుంబిగించి వాటిని సేకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. వీటన్నింటికిగాను కృష్ణాజిల్లా తరకటూరులో, వికారాబాద్‌ సమీపంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతులు ఒంగోలు, గిర్‌ లాంటి ఆవులను మరియు ఎద్దులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటలసాగులో వినియోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా మన తాత, ముత్తాతలు పాటించిన పద్ధతులతో నాణ్యమైన ఆవు నెయ్యిని తయారు చేసి అవసరమైన వారికి అమ్ముతూ వస్తున్నారు.

వరి, చెరకు, ఉల్లి, పసుపు, అల్లం, వివిధ రకాల కూరగాయలు అరటి మొదలగు పంటలతో పాటు 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు జీవామృతాన్ని భూమికి అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి జీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ లాంటి వాటిని పంటలపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతుంటారు. పంట దిగుబడిలో నాణ్యతకు, పోషకాలకు ప్రాముఖ్యతని ఇస్తూ ఎంత దిగుబడి వచ్చిందనే దానిని పట్టించుకోకుండా వచ్చిన దిగుబడి నాణ్యమైనదా కాదా అనే కోణంలో ఆలోచిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి తాను సాగు చేసే పంటలన్నింటికీ నాటు విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. నాటు విత్తనాలను తన పంటల సాగులో వినియోగించడంతోపాటు తోటి రైతులకు కూడా అందచేస్తుంటారు. మన పురాతన విత్తనాలు అంతరించి పోతున్నవి కాబట్టి అందుబాటులో ఉన్న పురాతన విత్తనాలను ప్రత్యేకించి వడ్లను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి వాటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధిపరచి తోటి రైతులకు అందచేసి మన పురాతన విత్తన నిధిని కాపాడుటలో విజయరాం ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. పురాతన వడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు అని తెలుసుకొని పురాతన విత్తనాల అభివృద్ధి మరియు పంపిణీని ఒక ఉద్యమంగా చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి, దేశీయ జాతి గోసంతతిని, మన పురాతన విత్తనాలను అభివృద్ధిపరుస్తూ తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ పంట దిగుబడులు ముఖ్యం కాదు, నాణ్యమైన దిగుబడులు ముఖ్యం అంటూ విజయరాం ముందుకు నడుస్తున్నారు. మరిన్ని వివరాలు 83746 62262 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

ఐదు అంచెల సాగు విధానం

ఐదు అంచెల సాగు విధానాన్ని సుభాష్‌ పాలేకర్‌ బాగా ప్రచారం చేశారు. ఈ విధానంలో 36 అడుగుల దూరంలో మామిడి, నేరేడు లాంటి పెద్దగా ఎదిగే మొక్కలు పెంచుకొంటూ వాటి మధ్యలో వివిధ రకాల మొక్కలను, కూరగాయలు, ఆకుకూరలను 4 అంచలుగా సాగు చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం 36 * 36 అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ 36 * 36 విధానం ప్రచారంలోకి వచ్చిందేకాని క్షేత్రస్థాయిలో విజయం సాధించిన వారు పెద్దగా లేరు. కారణం ఈ విధానంలో దిగుబడులు సక్రమంగా రావడం లేదు అని తెలుసుకుని విజయరాం ఈ విధానానికి వేరే రూపం ఇచ్చారు. అంటే 36 కి బదులుగా 50 అడుగుల దూరం పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుని 50 * 50 అడుగుల దూరంలో 5 అంచెలుగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 50 అడుగుల దూరంలో మొదటి అంచెలో నేరేడు, మామిడి, పనస, బాదం లాంటి పెద్దగా ఎదిగే వృక్షాలు 50 అడుగులలో సగం అంటే 25 అడుగుల దూరంలో రెండో అంచెగా బత్తాయి, నిమ్మ, నారింజ లాంటి మొక్కలు, 25 అడుగులలో సగం అంటే 12 1/2 అడుగుల దూరంలో 3వ అంచెగా బొప్పాయి, అరటి లాంటి మొక్కలు, 12 1/2 లో సగం 6 1/4  లో 4వ అంచగా మునగ, అవిశ లాంటి మొక్కలు 61/4 అడుగులకు మధ్యలో సొర, బీర, కాకర, బెండ లాంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు, పసుపు, అల్లం, చేమ దుంపలాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నింటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో లైనుకి లైనుకి 6 1/4 అడుగుల దూరం ఉంటుంది. లైనుకి లైనుకి మధ్య ఒక కాలువ చేసుకుని ఆ వచ్చిన మట్టి లైనులో ఎత్తుగా వేసుకోవడం వలన కలుపు సమస్య తగ్గడంతో పాటు లైనులో ఉన్న మొక్కలకు పోషకాలు బాగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతూ ఎలాంటి కషాయాలు, ద్రావణాలు అవసరం పడటంలేదు. తప్పనిసరి పరిస్థితులలో నీమాస్త్రం, పుల్లటిమజ్జిగ, జీవామృతం లాంటివి పంటపై పిచికారి చేస్తుంటారు. విజయరాం పండించే అన్ని పంటలకు నీటిని అందించటానికి ఎలాంటి డ్రిప్పు, స్ప్రింక్లర్‌ లాంటి విధానాలను ఉపయోగించకుండా కాలువల ద్వారానే నీటిని అందిస్తుంటారు. 5 అంచెల విధానంలో కాలువ ద్వారా నీటిని అందిస్తూ ఆ కాలువలలో అరటి, బొప్పాయి లాంటి ఆకులు మల్చింగ్‌గా ఉపయోగిస్తుంటారు. 

Read More

విత్తనాలు కొనుగోలు చేద్దామిలా…

1) వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.

2) రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన సందర్భంలో, నిర్ణీత ఫార్మాట్‌లో ఉన్న బిల్లు (రసీదు) అనగా దుకాణదారుని పేరు, అడ్రస్‌, సీడ్‌ లైసెన్స్‌ నంబరు, స్త్రఐఊ నంబరు మొదలగునవి ఉన్న రసీదును మాత్రమే అంగీకరించాలి.

3) రసీదుపై విత్తన కంపెనీ పేరు, విత్తన రకం పేరు, లాట్‌ నెంబరు, గడువు తేదీ మరియు డీలర్‌ సంతకము తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

4) కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్‌, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా అని సరిచూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని బిల్లులో ఉన్న వివరాలతో సరిచూసుకోవాలి.

5) కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.

6) విత్తన ప్యాకెట్‌ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవడం తద్వారా జన్యు స్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతుకు ఉంటుంది.

7) లూజుగా ఉన్న సంచులు మరియు పగిలిన ప్యాకెట్లు, డబ్బాల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు.

8) గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనరాదు.

9) బిజి-3 పేరుతో చలామణి అవుతున్న HT విత్తనాలకు జిఇఏసి (GEAC) అనుమతి లేనందున ఈ రకం విత్తనాలను కొనడం, అమ్మడం మరియు సాగు చేయడం నేరము.

10) బీటీ కాటన్‌ విత్తన ప్యాకెట్లపై జి ఇ ఏ సి అప్రూవల్‌ నెంబర్‌ తేదీ, సదరన్‌ జోన్‌ అనగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయుటకు అనువైనదో కాదో విత్తన ప్యాకెట్‌పై ఉన్న సమాచారంతో సరి చూసుకోవాలి.

11) గ్రామాల్లో రాత్రికి రాత్రి వచ్చి అనధికారికంగా విక్రయించే నకిలీ విక్రయదారుల నుండి ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయరాదు.

12) అనధికారికంగా, బిల్లు లేకుండా కలుపు మందును తట్టుకొనే H.T. (B.T.) ప్రత్తి విత్తనాలు అమ్ముతున్నట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి లేదా జిల్లా వ్యవసాయ తనిఖీ బృందంకు ఫిర్యాదు చేయవలెను. 

13) కలుపు మందును తట్టుకొనే బి టి (B.T.) ప్రత్తి పంట సాగుకు మన దేశంలో ప్రభుత్వ అనుమతి లేదు. స్త్రజూజ్పు అనుమతి లేని కలుపు మందు తట్టుకొనే ప్రత్తి విత్తనాలు సాగు చేసినా, అమ్మినా చట్టరీత్యా నేరము.

14) కలుపు మందును తట్టుకొనే ప్రత్తి విత్తనాలు ఉత్పత్తి చేసిన మరియు రైతులు పంట పొలాల్లో సాగు చేసినా, విత్తన చట్టం 1966, పర్యావరణ పరిరక్షణ చట్టం (జూఆజు) 1986 ప్రకారము నేరము.

15) అటువంటి వ్యక్తులపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకొనబడును. మన రాష్ట్ర ప్రభుత్వము ఆ.ఈ. యాక్ట్‌ ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొనబడుతున్నవి. కనుక రైతు సోదరులు ఇటువంటి ప్రత్తి విత్తనాలు సాగు చేయకూడదని కోరుచున్నాను.

16) నకిలీ విత్తనాలు / నకిలీ ప్రత్తి విత్తనాలు / కలుపు మందును తట్టుకొనే బి.టి. విత్తనాలు మరియు లూజు విత్తనాలను అమ్ముతున్నట్లు నమ్మశక్యమైన సమాచారం తెలపడము ప్రతి ఒక్కరి బాధ్యత మరియ వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.

17) ఇట్టి సమాచారాన్ని మండల / డివిజన్‌ / జిల్లా వ్యవసాయాధికారికి తెలియచేయండి.    – వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Read More

జీవాలకు సోకే అంటువ్యాధులు… నివారణ చర్యలు

అంటువ్యాధులు ఒక జీవి నుండి మరొక జీవికి సోకి, వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా బాక్టీరియా వలన మరియు వైరస్‌ వలన ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు

చిటుకురోగం: చిటుక వేసేంతలోనే గొర్రెలు క్రిందపడి చనిపోతాయి. అందుకని ఈ వ్యాధిని చిటుక వ్యాధి అని లేక నెత్తిపిడుగు వ్యాధి అని లేదా గడ్డిరోగం అని పిలుస్తారు.

కారణాలు: బ్యాక్టీరియా వల్ల మరియు తొలకరి వర్షాలు తరువాత పెరిగిన గడ్డి తినడం వలన ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా జూన్‌ నుండి జులై నెలలలో ఎక్కువగా సంక్రమిస్తుంది.

లక్షణాలు: * ఎటువంటి లక్షణాలు కనపడకుండానే జీవాలు ముఖ్యంగా గొర్రెలు మరణిస్తాయి. *  నీరసంగా ఉండి, గిలగిలా కొట్టుకుని, గాలిలోకి ఎగిరి క్రిందపడి చనిపోతాయి.

చికిత్స, నివారణ: * వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.*  వ్యాధి సోకిన మందను, ఇతర మందల నుండి దూరంగా ఉంచి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. * స్థానిక పశువైద్యని వెంటనే సంప్రదించాలి.

కాలిపుండువ్యాధి: మేత సమయంలో మందలోని కొన్ని గొర్రెలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తడిచిన నేలలో తిరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు: బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతుంది.

లక్షణాలు:

* మందలోని ఒకటి, రెండు గొర్రెలు సరిగా నడవలేకపోవడం

* గిట్టల మధ్యభాగం ఎర్రగా మారి, నొప్పిని కలుగచేస్తుంది.

* వ్యాధి సోకిన గొర్రె మూడు కాళ్ళ మీద గెంతుతుంది.

* ఎర్రగా కందిన భాగం ఉబ్బి, చీము పట్టి నల్లగా కమిలిపోతాయి.

* ఆ భాగం చెడు వాసన వస్తుంది.

* వ్యాధి తీవ్రంగా సోకిన థలో గిట్టలు వూడిపోతాయి.

చికిత్స, నివారణ: * మందలో వ్యాధి లక్షణాలను గమనించిన వెంటనే దగ్గరలోని పశువైద్యుని పర్యవేక్షణలో పెన్సిలిన్‌ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి. * వ్యాధి సోకిన గిట్టలను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో కడిగి పశువైద్యుని సలహాలు పాటించాలి.

వైరస్‌ వలన వచ్చే వ్యాధులు

గాలికుంటు వ్యాధి: ఈ వ్యాధి గాలి ద్వారా సోకుతుంది. కనుక గాలికుంటువ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన జీవాలలో నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి.

కారణాలు: ఈ వ్యాధి ఫుట్‌ అండ్‌ మౌత్‌ వైరస్‌ వలన సోకుతుంది.

లక్షణాలు:

* తీవ్రమైన జ్వరం (104-106 డిగ్రీ ఫారెన్‌హీట్‌) ఉంటుంది.

* నోటిలో, నాలిక మీద, గిట్టల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి.

* నోటి నుండి చొంగ కారుతుంది.

* నోటిలోని పుండ్ల వలన జీవాలు, సరిగా మేత మేయవు. కాలిపుండ్లు వలన కుంటుతూ నడుస్తాయి.

* వ్యాధి సోకిన గొర్రె పిల్లలు ఎక్కువగా చనిపోతాయి.

చికిత్స, నివారణ: *  నోటిలో పుండ్లను మరియు కాలిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో కడిగి బోరిక్‌ గ్లిసరిన్‌ ఆయింట్‌మెంటును పెట్టాలి. జి   నోటి పుండ్ల వలన గొర్రెలు మేత మేయవు కనుక జీవాలకు గంజి లేక అంబలిని గ్లూకోజ్‌తో కలిపి త్రాగించాలి. * వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వేరు చేయాలి. జి  వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలి.

నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్‌)

ఈ వ్యాధిని మూతివాపు, మూతి పుండ్లువ్యాధి అని పిలుస్తారు.

కారణాలు: * ఈ వ్యాధి వైరస్‌ వలన కలుగుతుంది. *  దోమ కాటు వలన ఈ క్రిములు గొర్రెలోని శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగచేస్తాయి.

లక్షణాలు: * అధిక జ్వరం, గొర్రెలలో చొంగకారుతూ, పెదవులు మరియు చిగుళ్ళు వాచి, పెదవుల లోపల భాగం ఎర్రబడి, చిన్న చిన్న గుల్లలుగా ఏర్పడతాయి. * గిట్టల మధ్య భాగం ఎర్రగా ఉంటుంది. సరిగా నడవలేక మేత సరిగా మేయకుండా, నీరసించి పోతాయి. * నాలుక నీలి రంగులో మారుతుంది.

చికిత్స, నివారణ: వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. * తగు నొప్పి నివారణ మందులు, యాంటిబయోటిక్‌ మందులు వాడాలి. * నోటిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంలో కడిగి జింక్‌ పౌడర్‌ నీటితో రుద్దాలి.

పుర్రురోగం (పి.పి.ఆర్‌): 

ఈ వ్యాధిని ముసర వ్యాధి లేక పెద్ద రోగమును పోలి ఉంటుంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఫిబ్రవరి నుండి మే సమయంలో ఎక్కువగా వస్తుంది. మేక పిల్లలకు తీవ్రంగా సోకుతుంది.

కారణాలు: ఈ వ్యాధి వైరస్‌ వలన సంక్రమిస్తుంది. కొత్తగా కొనుగోలు చేసిన మేకలను మందలో చేర్చిన తరువాత ఈ వ్యాధి ప్రబలుతుంది. 

లక్షణాలు:

* వ్యాధి సోకిన మేకలలో జ్వరం తీవ్రంగా ఉంటుంది.

* జీవాలు సరిగా మేయకపోవడం, పలుచగా పారుతూ ఉంటాయి.

* నోటిలో, పెదవులు, నాలుక వాచి పొక్కులు ఏర్పడతాయి.

* చూడితో ఉన్న జీవాలు ఈసుకుని పోతాయి.

* డీహ్రైడ్రేషన్‌ సంభవించి, జీవాలు మరణిస్తాయి.

చికిత్స నివారణ: * వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి, వారి పర్యవేక్షణలో సరైన చికిత్స అందించాలి. * గ్లూకోజు మరియు ఎలక్ట్రోలైట్స్‌ కలిపిన నీటిని ఞ గంజిని త్రాగించాలి.

డా. కె. లక్ష్మి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ ఫోన్‌: 8978154747

Read More

ఆరోగ్యం లేకుంటే ఆదాయం వృథా అంటున్న  సునంద

ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఆనందంగా జీవితాన్ని గడపడమే. ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఆనందంగా జీవితాలను గడపలేము అనే విషయం అందరికి తెలిసిందే. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నపుడే ఎలాంటి ఆనందమయినా పొందగలం. మన ఆరోగ్యం మనం తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటిలో మనం తినే ఆహారం విషయం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనం తినే ఆహారం చాలా వరకు రైతులు రసాయన వ్యవసాయం చేసి పండిస్తున్నదే కాబట్టి విష రసాయన అవశేషాలు ఉన్న ఆహారాలు తినడము వలన మన ఆరోగ్యాన్ని పాడు చేయడములో రసాయన అవశేషాలు ఉన్న ఆహారాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది రైతులు సేంద్రియ బాటపట్టి విష రసాయనాలు లేకుండా సేంద్రియ ఆహారాలను పండిస్తున్నారు. వినియోగదారులు కూడా వారికున్న అవకాశాలను బట్టి సేంద్రియ ఆహారాలను తినడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సేంద్రియ ఆహారానికి ఉన్న ప్రాముఖ్యత గమనించి తాము సేంద్రియ ఉత్పత్తులను తినడంతో పాటు సమాజానికి కూడా నాణ్యమయిన సేంద్రియ ఉత్పత్తులు అందించడంలో తన వంతు పాత్రను పోషిద్దాము అనే లక్ష్యంతో సేంద్రియ సాగులో అడుగు పెట్టారు సునంద.

సునందది వ్యవసాయ నేపథ్యం. అయినా కాని ఉన్నత చదువులు చదివి అధ్యాపక వృత్తిలో ప్రవేశించి కొనసాగుతున్న క్రమంలో ఆసీఫాబాదు జిల్లాకు చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది. రవికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అప్పట్లో వీరి కుటుంబం హైదరాబాదు నగరం ఆల్వాలు ప్రాంతంలో నివాసం ఉండేది. ఎం.ఎస్సీ. కెమిస్ట్రీ పూర్తి చేసిన సునంద పీహెచ్‌.డి. పూర్తి చేసి ఏదైనా కాలేజీలో లెక్చరర్‌గా మరలా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా భర్త రవికుమార్‌ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడటము జరిగింది. అంతేకాకుండా వీరిపిల్లలు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో అనునిత్యం సతమతమవడం ప్రత్యక్షంగా అనుభవించారు. అదే సమయంలో రవికుమార్‌ ప్రాణ స్నేహితుడు క్యాన్సర్‌తో మరణించడం జరిగి భార్యా, పిల్లలను అనాథలను చేయడము సునంద మనసుని కలచి వేసింది. ఎంత డబ్బున్నా కాని ఆరోగ్యం సక్రమంగా లేకుంటే అంతా వృథా అని ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ పరిణామాలన్నీ అనారోగ్య సమస్యలకు కారణాలు వెతకడానికి ప్రేరేపించి కారణాలు తెలుసుకోగా, ప్రధానంగా ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు కారణాలు చాలావరకు తాము తినే ఆహారంలో ఉండే విషరసాయన అవశేషాలు అని గ్రహించి తాము విష రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని తినాలని నిశ్చయించుకుని అటువైపు అడుగులు వేయడం జరిగి, మొదటగా తాము ఉపయోగించే నూనెను మార్పు చేసి మార్కెట్‌లో దొరికే రిఫైండ్‌ నూనెకు బదులుగా కోల్డ్‌ ప్రెస్డ్‌ నూనెను ఉపయోగించడం మొదలు పెట్టారు. చాలా వరకు అనారోగ్య సమస్యలు దూరం అవటం గమనించిన తరువాత తాము తినే ఆహారాలను చాలా వరకు సేంద్రియ పద్ధతులతో పండించినవే తినడం మొదలుపెట్టారు. ఈ మార్పుల వలన తమ కుటుంబసభ్యులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు. అదే సమయంలో కరోనా మహమ్మారి వలన లాక్‌డౌన్‌ ప్రకటించడం జరిగి హైదరాబాదు నుంచి తమ కుటుంబాన్ని రవికుమార్‌ సొంత ఊరు అసీఫాబాదు జిల్లా విజయనగరంకి మార్చడం జరిగింది. 

వీరి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు మరియు కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న ఇబ్బందులు కక్షుణ్ణంగా అధ్యయనం చేసిన సునంద ఆదాయం కంటే ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం అని తెలుసుకుని తాను వ్యవసాయ రంగంలో దిగి పూర్తి సేంద్రియ పద్ధతులలో వివిధ రకాల పంటలు పండించాలనుకుంటున్నానని భర్త రవికుమార్‌కు తెలియచేయగా రవికుమార్‌ ఆనందంగా సునంద నిర్ణయాన్ని స్వాగతించి తను మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ రంగంలో కొనసాగుతూ, తన ఖాళీ సమయాన్ని వ్యవసాయంలో సునందకు సహకారం అందిస్తూ సునందని పూర్తిగా వ్యవసాయరంగంలో దించడం జరిగింది.

తమ సొంత పొలం 8 ఎకరాలలో సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల పంటల సాగు మొదలు పెట్టారు. సేంద్రియ పద్ధతులకు సంబంధించిన సమాచారం కొరకు వివిధ రకాల పుస్తకాలు చదవడం, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన రైతులను కలవడం, రైతుల యొక్క వీడియోలను యూట్యూబ్‌లో చూడడము, సేంద్రియ పద్ధతులను ప్రచారం చేస్తున్న నిపుణులను కలసి వివరాలు తెలుసుకోవడం లాంటివి చేస్తూ సేంద్రియ సాగు మొదలు పెట్టి అనుభవం గడించే కొలది తాము పాటించే పద్ధతులలో మార్పులు చేసుకుంటూ వస్తూ సుమారు 30 రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తూ ఆరోగ్యకరమయిన దిగుబడులు సాధిస్తూ వస్తున్నారు. వచ్చిన దిగుబడిని హోల్‌సేల్‌గా అమ్మినట్లయితే సరైన ధర రావడం లేదు కనుక సేంద్రియ సాగులో లాభాలు ఆర్జించాలంటే పంట ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడమే సరైన దారి అని నమ్మి తమ పంట ఉత్పత్తులకు విలువ జోడించి అనగా వడ్లను బియ్యం చేసి, కందులు, పెసలు, మినుములు లాంటివి పప్పులు చేసి… ఈ విధంగా తాము పండించే పంటలను సాధ్యమైనంతవరకు విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్మడం మొదలు పెట్టారు. తాము పాటించే సాగు పద్ధతులు మరియు తాము పండించే పంటల వివరాలు ఎక్కువమంది ప్రజలకు తెలియ చేయడానికి సామాజిక మాధ్యమాలను సరైన పద్ధతిలో వినియోగించుకుంటూ రోజురోజుకు వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు.

తమ ఈ ప్రయాణంలో అనేకమంది వినియోగదారులు సమకూరడంతో పాటు అనేక మంది సేంద్రియ రైతులు కూడా తమ ఉత్పత్తులకు ఆశాజనకమయిన ధర లభించడానికి గాను సునందను కలవగా తాము పండించే ఉత్పత్తులతో పాటు తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా కలిపి వినియోగదారులకు అందించగలిగితే అటు వినియోగదారులకు ఇటు రైతులకు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుందని గ్రహించి తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అమ్మకం చేయడం మొదలు పెట్టారు. 

వివిధ రకాల పంటల సాగులో వివిధ రకాల సేంద్రియ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమయిన దిగుబడి సాధిస్తున్న క్రమంలో తోటి రైతులు కూడా సేంద్రియ పద్ధతుల గురించి సునందను సంప్రదించటము మొదలయ్యింది. తన సేంద్రియ సాగు అనుభవాలు ఎక్కువమందికి చేరాలంటే హైదరాబాదు సమీపంలో పంటల సాగు మొదలు పెడితే ఫలితాలు బాగా ఉంటాయని, దానికి తోడు హైదరాబాదు మార్కెట్‌ చాలా పెద్ద మార్కెట్‌ కాబట్టి తాము ఆర్థికంగా కూడా ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయాన్ని వ్యవసాయం చేస్తూ కూడా పొందవచ్చు అని తోటి యువతకు ప్రత్యేకించి మహిళలకు చూపించాలనే లక్ష్యంతో ఉన్న సునంద హైదరాబాదు శివారు ప్రాంతాలు తిరిగి శంషాబాదు సమీపంలోని పెదవేడు గ్రామంలో 25 ఎకరాలు వివిధ రకాల పండ్ల తోటను 2023 ఆగస్టు నెలలో కౌలుకు తీసుకుని తమ కుటుంబాన్ని ఆ పొలంలోకి మార్చారు. రవికుమార్‌ ఉద్యోగ బాధ్యతలు కూడా హైదరాబాదులోనే కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం సునందగారు కౌలుకి తీసుకుని సాగు చేస్తున్న 25 ఎకరాల తోటలో మామిడి, సపోట, బత్తాయి మొదలగు వివిధ రకాల పండ్ల మొక్కలు దిగుబడిని ఇస్తున్నాయి. వచ్చిన దిగుబడిని నేరుగా వినియోగదారులకు, కొంత భాగం దిగుబడిని సేంద్రియ ఉత్పత్తులు అమ్మకం చేసే దుకాణాలకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. తాము పండించే పంట దిగుబడులతో పాటు తోటి రైతులు పండించే నాణ్యమయిన సేంద్రియ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్‌ చేస్తూ తోటి రైతులకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలు 7799544705కు ఫోను చేసి తెలుసుకోగలరు. 

కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగం, అదీను సేంద్రియ వ్యవసాయ రంగంలో కుంటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు లాంటి వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతో పాటు పంట ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు మార్కెటింగ్‌ లాంటి విషయాలలో కూడా కుటుంబ సభ్యుల సహకారం తప్పని సరి అవుతుంది. కాని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే చాలామంది మహిళలకు వ్యవసాయరంగం అంటే పెద్దగా ఇష్టం ఉండడం లేదు. కాబట్టే మగవారు వ్యవసాయం అంటే మక్కువ ఉన్నా కూడా తమ ఇంటి మహిళలకు వ్యవసాయరంగం అంటే ఇష్టం లేకపోవడం వలన వ్యవసాయరంగంలో అడుగు పెట్టలేక పోతున్నారు. కొంతమంది మగవారు అయితే తమ ఇంట్లోని మహిళల ఇష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయరంగంలోకి అడుగు పెట్టి తమ మక్కువను తీర్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలావరకు ఇలా ఉంటే సునంద గారి మనస్తత్వం ఇందుకు భిన్నంగా తోటి మహిళలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. ఉన్నత చదువులు చదివి కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి కుటుంబ బాధ్యతల నిమిత్తం ఉద్యోగం మానివేసి కుటుంబ బాధ్యతల నుంచి కొంచెం బయట పడ్డ తరువాత మరలా ఉద్యోగంలో చేరదామనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్న సమయంలో ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం అని తెలుసుకుని తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడడం ఒక ఇల్లాలిగా తన బాధ్యత అని గుర్తించి ఉద్యోగ ప్రయత్నాలు మానివేసి, తమ కుటుంబాన్ని నగరాన్నుంచి గ్రామానికి మార్చి వ్యవసాయరంగం అదీను శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సేంద్రియ వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టవలసి వచ్చింది. పరిస్థితులకు అనుకూలంగా తన లక్ష్యాన్ని మార్చుకుని ప్రత్యక్ష వ్యవసాయరంగంలోకి దిగిన సునందకు భర్త రవికుమార్‌ కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను ఉద్యోగం చేస్తూ, అవసరమయితే పంటల సాగు కొరకు తన డబ్బును ఇవ్వడముతో పాటు పంటల సాగు, విలువ జోడింపు మరియు మార్కెటింగ్‌ లాంటి విషయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్న భర్త రవికుమార్‌కు సునంద కృతజ్ఞతలు తెలియచేశారు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతుంటే ఆరోగ్యకరమయిన, ఆనందకర జీవితం పెద్ద కష్టం కాదు అని సునంద, రవికుమార్‌లు నిరూపిస్తున్నారు.

(గమనిక: సునంద గారు సాగు చేసే పంటలు, పాటించే పద్ధతుల గురించి ‘రైతునేస్తం’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఆవిడ మాటల్లోనే వినగలరు.)

Read More

ఆక్వారంగ సంక్షోభం… తాత్కాలికమా? దీర్ఘకాలికమా?

ఇటీవల కాలం వరకు దేశ వ్యవసాయ రంగంలో కాస్త లాభాలనిచ్చే రంగంగా ఆక్వా పరిశ్రమ పేరుగాంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యలకు గిరాకీ ఉండటం, దేశీయ మార్కెట్‌లో చేపల వినియోగం పెరగటం వల్ల వాటిని సాగు చేసే రైతులకు ఆకర్షణీయమైన ప్రతిఫలం లభించింది. చేపల చెరువులకు కౌలు ఎకరాకు 50 వేల రూపాయలకు, రొయ్యల చెరువులకు కౌలు ఎకరాకు లక్ష రూపాయల వరకు చేరింది. దాదాపు 30 శాతం చెరువుల్ని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా చేపలు, రొయ్యల్ని సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు తమకు లభిస్తున్న ధరల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల ఎగుమతులు మందగించడంతో రైతులకు లభిస్తున్న ధరలు ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువగా ఉంటున్నాయని వారు వాపోతున్నారు. దాణా ధరలు, కూలీల రేట్లు, విద్యుచ్ఛక్తి ఛార్జీలు పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగటం, ఉత్పత్తులకు లభిస్తున్న ధరలు మాత్రం పదేళ్ళ కింద స్థాయిలోనే ఉండటం వల్ల తమకు గిట్టుబాటు కాకపోవడం వల్ల ‘పంటవిరామం’ ప్రకటించే అవకాశముందని ఉత్పత్తిదార్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రొయ్య, చేపపిల్లల్ని సరఫరా హేచరీలు తమ కార్యకలాపాలను తగ్గిస్తున్నాయి. దాణాను సరఫరా చేసే కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. రైతులు కొంతమంది రెండవ, మూడవ పంటలను మానివేయటము, వేసే పిల్లల సంఖ్యను తగ్గించడం చేస్తున్నారు. ఎగుమతిదార్లు కొనుగోళ్ళు ఆపు చేయడం వల్ల ధరలు తగ్గాయి. కొనుగోలు చేసే వ్యాపారులు ఒక ‘సిండికేట్‌’గా ఏర్పడి ధరల్ని తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి సంక్షోభాలేర్పడటం ఆక్వా పరిశ్రమకు కొత్తకాదు. కరోనా ప్రబలినప్పుడు ఎగుమతులు తగ్గటం, ధరలు పడిపోవటం జరిగింది. కాని దాని ప్రభావం తగ్గగానే మళ్ళీ ఎగుమతులు పెరిగాయి. రైతులు సాగుని పెంచారు. 2022తో పోలిస్తే 2023లో ప్రపంచ రొయ్యల ఉత్పత్తి కొంత తగ్గింది. 2024లో అది మళ్ళీ పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమయింది. అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వినిమయదారులు తమ నెలవారీ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో రొయ్యలు వంటి అధిక ధర ఉన్న ఉత్పత్తులను తక్కువగా కొంటున్నారు. రొయ్యల్లో ‘కొలెస్ట్రాల్‌’ ఎక్కువగా ఉంటుందనే ప్రచారం కూడా గిరాకీ తగ్గటానికి కారణం కావచ్చు.

వేగంగా పెరిగిన గిరాకీ, ఉత్పత్తి

సాంప్రదాయంగా, సహజంగా సముద్ర జలాల్లో రొయ్యలు, చేపలు లభ్యమౌతుంటాయి. ఇప్పుడు వాటిని చెరువుల్లో పెంచటం మొదలైన తార్వత కూడా వాటిని ‘సముద్ర ఉత్పత్తులు’గా, ‘సముద్ర ఆహారం’గానే పరిగణిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950-51లో దేశంలో చేపల ఉత్పత్తి 7.5 లక్షల మెట్రిక్‌ టన్నులుగా అంచనా వేయబడింది. 2021-22లో దేశంలో చేపల ఉత్పత్తి 162.5 లక్షలకు పెరిగింది. 71 సంవత్సరాల్లో దేశంలో చేపల ఉత్పత్తి 22 రెట్లు పెరగటం విశేషం. 1970లో దేశంలో రొయ్యల ఉత్పత్తి కేవలం 20 టన్నులుగా నయోదైంది. తాజా అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తయ్యాయి. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో సాధించిన అద్భుత ప్రగతి వల్ల దేశంలో హరిత, శ్వేత విప్లవాలతో పాటు నీలి విప్లవం కూడా సంభవించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దేశంలో చేపల తలసరి లభ్యత 8.9 కిలోలకు పెరిగింది. దేశంలో ఉత్పత్తయ్యే చేపల్లో కొద్ది భాగమే ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కాని దేశంలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 90 శాతానికి పైగా ఎగుమతి అవుతున్నాయి. అందువల్ల తలసరి రొయ్యల వినియోగం దేశంలో కొన్ని గ్రాములకే పరిమితమైంది. 2022-23లో దేశం నుండి 17,35,286 మెట్రిక్‌ టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులు దేశం నుండి ఎగుమతయ్యాయి. వాటి విలువ 63,969.14 కోట్ల రూపాయలు (8.09 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు)గా ఉంది. 2023-24లో సముద్ర ఆహార ఉత్పత్తుల విలువ 9.25 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. కాని 2023 ఏప్రిల్‌ నుండి 2024 జనవరి వరకు జరిగిన సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతి విలువ అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఎగుమతుల విలువ 7.5 శాతం తగ్గినట్లు అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. ఐతే ఎగుమతుల పరిమాణం మాత్రం తగ్గలేదు. ‘వనామీ’ రకం రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గటం వల్ల ఎగుమతుల విలువ తగ్గింది. దక్షిణ అమెరికాలోని ఈక్వడార్‌ దేశంలో వాణిజ్య స్థాయిలో రొయ్యల సాగు జరుగుతున్నది. 11 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో భారతదేశాన్ని రెండవ స్థానానికి నెట్టి వేసింది. భారత దేశంలో రొయ్యల ఉత్పత్తి చిన్న చిన్న కమతాల్లో జరుగుతుండగా ఈక్వడార్‌లో పెద్దపెద్ద కంపెనీలు సగటున 250 హెక్టార్ల విస్తీర్ణంలో రొయ్యల ఉత్పత్తిని చేపట్టాయి. ఈక్వడార్‌ పోటీలో ఉండి అధిక మొత్తంలో వనామీ రొయ్యల్ని ఎగుమతి చేయడం వల్ల ధరలు తగ్గాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

పెరిగిన చేపలు, రొయ్యల సాగు

2023లో ప్రపంచంలో 186.6 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారు. సాంప్రదాయంగా సముద్రాలు, నదులు, జలాశయాలు, వాగులు వంటి జలవనరుల నుండి వలలు, బోట్లు, మరబోట్లు వంటి సాధనాల సాయంతో పట్టినవి 90.6 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుండగా, కృత్రిమంగా తవ్విన చెరువుల్లో పిల్లలను వేసి, మంచి నిర్వహణతో ఉత్పత్తి చేసిన చేపలు96.6 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా లెక్కించారు. 2022లో ప్రపంచంలో రొయ్యల ఉత్పత్తి 94 లక్షల మెట్రిక్‌ టన్నులుగా అంచనా వేశారు. అందులో 38 లక్షల టన్నుల రొయ్యలను సహజ వనరుల నుండి పట్టుకోగా, 56 లక్షల టన్నుల రొయ్యలను కృత్రిమంగా నిర్మించిన చెరువుల్లో సాగు చేసి ఉత్పత్తి చేశారు. 2023లో ప్రపంచ సాగర ఆహార ఉత్పత్తుల విలువను 155.32 బిలియన్‌ డాలర్లుగా అంచనా కట్టారు. ఇలా చేపలు, రొయ్యల ఉత్పత్తిలో సాగు ద్వారా ఉత్పత్తి చేసినవి సహజ వనరుల నుండి పట్టిన వాటికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తున్నది. భారతదేశంలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. 1980-81లో భారతదేశంలో సముద్ర వనరుల నుండి 15.55 లక్షల టన్నుల చేపల్ని పట్టగా కేవలం 8.87 లక్షల టన్నులు మాత్రమే అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. 2000-01లో సముద్ర వనరుల నుండి 28.11 లక్షల టన్నుల చేపల్ని పట్టగా అందుకు సమానంగా 28.45 లక్షల టన్నుల చేపలు అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. 2021-22లో సముద్ర వనరుల నుండి 41.27 లక్షల టన్నుల చేపల్ని పట్టగా, 121.21 లక్షల టన్నుల చేపలు అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. సముద్ర వనరుల నుండి ఒక వంతు చేపలు లభించగా, అంతర్గత వనరుల నుండి, ముఖ్యంగా కృత్రిమ చెరువుల ద్వారా మూడొంతులు ఉత్పత్తయ్యాయి. సహజ వనరుల్లో పట్టే చేపల కన్నా, కృత్రిమ చెరువుల్లోనే ఎక్కువగా చేపలు ఉత్పత్తవుతున్నాయి. మొత్తం చేపల ఉత్పత్తిలో దాదాపు 30 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. 11.4 శాతం వాటాతో పశ్చిమ బెంగాల్‌ రెండవ స్థానంలోనూ, 6.4 శాతం వాటాతో కర్నాటక మూడవ స్థానంలోనూ, 6.1 శాతం వాటాతో ఒడిస్సా నాల్గవ స్థానంలోనూ చేపల ఉత్పత్తిలో ప్రముఖంగా ఉన్నాయి. 5.4 శాతం వాటాతో గుజరాత్‌, 5.1 శాతం వాటాతో కేరళ, 5 శాతం వాటాతో తమిళనాడు రాష్ట్రాలు కూడా ముఖ్యమైన చేపల ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. గుజరాత్‌, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలకు సముద్ర వనరుల నుండి చేపలు లభిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిస్సా, కర్నాటక రాష్ట్రాల్లో అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి ఎక్కువగా చేపలు ఉత్పత్తవుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో అంతర్గత జల వనరుల నుండి, కృత్రిమ సాగు నుండి 3.9 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తయ్యాయి. రొయ్యల ఉత్పత్తిలో కృత్రిమ సాగుదే ప్రధాన పాత్రగా ఉన్నది. మొదట్లో చైనా, థాయ్‌లాండ్‌లలో ప్రారంభమైన రొయ్యల సాగు భారతదేశానికి పాకింది. ముందుగా నల్లటైగర్‌ రొయ్యలతో ప్రారంభైన సాగు ఆ రకం రొయ్యలకు వైరస్‌ తెగుళ్ళు ఎక్కువగా సోకటం వల్ల వనామీ రొయ్యల సాగు ప్రాచుర్యంలోకి వచ్చిందిప్పుడు. దేశంలో 108,526 హెక్టార్లలో వనామీ రొయ్యల సాగు జరుగుతుంది. 20-21లో 815,745 టన్నుల వనామీ రొయ్యలు ఉత్పత్తయ్యాయి. చేపల సాగులాగానే వనామీ రొయ్యల సాగులోనూ ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం వనామీ సాగు విస్తీర్ణంలో 66.3 శాతం వనామీ రొయ్యల ఉత్పత్తిలో 77.8 శాతం వాటాలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయి. గుజరాత్‌, తమిళనాడు, ఒడిస్సా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా కొంతమేరకు వనామీ రొయ్యల ఉత్పత్తి జరుగుతున్నది. భారతదేశంలో నల్ల టైగర్‌ రొయ్యల్ని 58,196 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 27,616 టన్నుల నల్లటైగర్‌ రొయ్యలు ఉత్పత్తవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్నాటక, ఒడిస్సా రాష్ట్రాల్లో ఈ నల్లటైగర్‌ రొయ్యలు సాగవుతున్నాయి. 

సంక్షోభ సూచికలు

రొయ్యలు, చేపల సాగులో సమస్యలు కొత్తకాదు. అనేక వైరస్‌ జబ్బులు వాటిని ఆశిస్తాయి. తెగుళ్ళ బెడద, మార్కెట్‌ ఒడిదుడుకుల వల్ల రొయ్యల సాగులో నాలుగైదేళ్ళకోసారి నష్టాలొస్తుంటాయి. ఐతే మిగిలిన సంవత్సరాల్లో ఆకర్షణీయమైన లాభాలుంటాయి. ఉప్పు కయ్యలకు సమీపంలోని చేలల్లోకి కావలసినప్పుడు ఉప్పు నీటిని పంపే అవకాశముండి, మురుగు నీటిని బయటకి పంపే సౌకర్యం ఉన్న చేలను చెరువులుగా మార్చి, హేచరీల నుండి పిల్లల్ని, కంపెనీల నుండి దాణాను, మందులను కొని, శ్రామికుల సాయంతో రైతులు, కౌలుదార్లు రొయ్యల సాగుని చేస్తున్నారు. కిలో రొయ్యల ఉత్పత్తికి దాణా ఖర్చు రూ. 90 నుండి 100 వరకు అవుతున్నది. పిల్లల ఖర్చు, విద్యుచ్ఛక్తి బిల్లు, కూలీల ఖర్చు, మందులు వగైరా ఇతర ఖర్చులన్నీ కలిపి దాదాపు రెండువందల వరకు ఉత్పత్తి వ్యయం అవుతున్నది. ఇక కౌలు, వడ్డీ, ఇన్సూరెన్స్‌ వంటి వాటిని లెక్కిస్తే ఉత్పత్తి వ్యయం కిలోకి రూ. 250 లకు చేరుతుంది. ప్రపంచ మార్కెట్‌లో ధరలు తగ్గటం, ఎగుమతిదార్లు కొనుగోలు చేయకపోవటం, ప్రాసెసర్లు క్రియాశీలకంగా లేకపోవటం వల్ల వ్యాపారలు చాలా తక్కువ ధరలకు మాత్రమే రైతులు, కౌలుదార్లు కొనుగోళ్ళు చేసారు. ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువ ధరకు అమ్మవలసి రావటంతో చాలామంది రైతులు, కౌలుదార్లు నష్టపోయారు. కొత్త పంట వేయటానికి ఆసక్తి, పెట్టుబడి లేక ఉత్పత్తి తగ్గటానికి చర్యలు తీసుకుంటున్నారు. కొందరు పంట వేయడం మానివేస్తే మరి కొందరు పిల్లల్ని తక్కువ సంఖ్యలో వేస్తున్నారు.

ఎగుమతులపై ఆధారపడ్డ రొయ్యల సాగు పరిస్థితి అలా ఉంటే దేశీయ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న చేపల సాగు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. చేపల దాణా కూడా కిలోకి 50 రూపాయల వరకు చేరింది. ఒక కిలో బరువు పెరగటానికి చేపలకు 1.1 కిలోల దాణా అవసరమౌతుంది. ఇక విద్యుత్‌ ఛార్జీలు, కూలీల ఖర్చులు, మందుల ఖర్చు, పెట్టుబడిపై వడ్డీ వంటి ఇతర ఖర్చులన్నీ కలిపితే కిలో చేపల ఉత్పత్తి వ్యయం రూ. 100లు దాటుతున్నది. శీలావతి రకం చేపలకు కిలోకి వంద రూపాయలు మాత్రమే లభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కిలోకి రూ. 120 ల ధర లభిస్తే తప్ప తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. రొయ్యల చెరువుల కన్నా చేపల చెరువుల్ని ఎక్కువ లోతు తవ్వాలి. మంచి నీరు రావటానికి, మురుగు నీరు బయటకు పోవటానికి ఏర్పాట్లు ఉండాలి. చేపలకు ఆక్సిజన్‌ లభించటానికి ఏరేటర్లు వంటి యంత్రాలను వాడాలి. వీటికయ్యే పెట్టుబడిపై వడ్డీ కూడా గణనీయంగా ఉంటుంది. ఆక్వాపరిశ్రమవల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. సముద్ర తీరానికి చేరువలో ఉండే మడ అడవులు తగ్గిపోతున్నాయి. ఈ దీర్ఘకాలిక సమస్యలు ఇలా ఉండగా చేపల రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులేర్పడటం వల్ల చేపల సాగు కూడా తగ్గవచ్చు. పది ఎకరాల లోపు సాగు చేసే రైతులకు యూనిట్‌కు రూ. 1.50 చొప్పున విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ పరిమితిని మించితే యూనిట్‌కు నాలుగు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. విద్యుత్‌ ఛార్జీల విషయంలో ప్రభుత్వం మరికొంత రాయితీని ఇవ్వాలని చేపలు, రొయ్యలను సాగు చేసే రైతులు కోరుతున్నారు.

సమస్యలు తాత్కాలికమే

ఆక్వారంగంలో ప్రస్తుతమున్న సమస్యలు దీర్ఘకాలం ఉండే అవకాశాలు లేవు. జంతువులన్నిటిలోనూ చేపలే అత్యంత సమర్ధవంతమైనవిగా దాణాను తమ శరీర బరువుగా మార్చుకుంటాయి. ఒక కిలో బరువు తమ శరీరంలో పెరగటానికి 1.1 కిలోల దాణా సరిపోతుంది. మాంసానికి పెంచే కోళ్ళు ఒక కిలో శరీర బరువు పెరగటానికి 1.7 కిలోల దాణా అవసరమౌతుంది. అదే పశువులు ఒక కిలో బరువు పెరగటానికి 6.6 కిలోల దాణా అవసరమౌతుంది. అత్యంత సమర్ధవంతంగా దాణాను వినియోగించుకొని బరువు పెరగగలిగిన చేపలకు గిరాకీ పెరుగుతున్నది. 2005 నుండి 2021 మధ్య దేశంలో చేపల తలసరి వినియోగం 81 శాతం పెరిగింది. ప్రస్తుతం 8.9 కిలోల తలసరి చేపల వినియోగం 2030 నాటికి 19.8 కిలోలకు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాంసాహారాలన్నిటిలోనూ పోషక విలువలు అత్యధికంగా చేపల్లో ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. వాటి ధరలు కోడి మాంసం ధరలకు సమానంగా ఉన్నాయి. అలాగే రొయ్యల ధరలు వేటమాంసం ధరల స్థాయిలో ఉన్నాయి. దేశంలో ప్రజల సగటు ఆదాయాలు పెరిగేకొద్దీ మాంసాహారానికి గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు ఎగుమతులకే పరిమితమయిన రొయ్యలకు దేశీయ మార్కెట్లో కూడా గిరాకీ ఏర్పడే అవకాశాలున్నాయి. రొయ్యల ధరలు గత 30 సంవత్సరాల్లో తగ్గాయి. 1994 ఏప్రిల్‌లో కిలో రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 12.73 డాలర్లుగా ఉంది. నవంబరు 2009లో అత్యల్పంగా కిలోకి 7.5 డాలర్లకు తగ్గింది. ఆగస్టు 2014లో గరిష్టంగా కిలోకి 19.25 డాలర్లకు పెరిగింది. అక్టోబరు 2023లో వాటి ధర కిలోకి 8.6 డాలర్లకు తగ్గింది. ఇలా రొయ్యల ధరల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆటుపోట్లు సాధారణమే. అప్పుడే ధరలు కొంత పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం తగ్గి, వడ్డీ రేట్లు తగ్గి, పెరుగుదల నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.1 శాతం పెరుగుదలను 2024లో నమోదు చేస్తుందనీ, 2025లో అది 3.2 శాతంగా ఉంటుందని ప్రపంచంలో ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత దేశంలో ఆర్థిక ప్రగతి 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ జోస్యం చెప్పింది. 2023లో సముద్ర ఆహార ఉత్పత్తులు 20.7 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయనీ అవి ఏటా 7.8 శాతం వృద్ధిరేటుతో 2032 నాటికల్లా 41.4 మిలియన్‌ టన్నులకు చేరతాయని ప్రభుత్వ మత్స్య శాఖ అంచనా వేసింది. వాటి విలువ 2024లో 21.04 బిలియన్‌ డాలర్లుగా ఉందనీ, 2028 నాటికల్లా వాటి విలువ 29.37 బిలియన్‌ డాలర్లకు చేరుతుందనీ ఆశిస్తున్నారు. స్థానిక, ప్రపంచ మార్కెట్లలో చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహార ఉత్పత్తులకు గిరాకీ పెరగటం ద్వారానే సాధ్యపడుతుంది. ప్రస్తుతం తాత్కాలిక సంక్షోభంలో ఉన్న ఆక్వా పరిశ్రమ త్వరలో బయటపడి రైతులకు లాభాలను, వినిమయ దారులకు ఆరోగ్యాన్నీ అందిస్తుందని ఆశిద్దాము.  

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ ఞ కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

వేసవి కాలంలో గేదెల యాజమాన్య పద్ధతులు

సహజంగా గేదెలు ఏడాది పొడవునా ఎదకు వస్తాయి, కాని వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత వలన మరియు పచ్చిమేత లభ్యత తక్కువగా ఉండడం వల్ల ఎద లక్షణాలు రైతుకు ప్రస్ఫుటముగా కనపడక, రైతు గేదెలను సరైన సమయములో చూలి కట్టించలేకపోవుట వలన చూడి కట్టే శాతం చాలా తక్కువగా ఉంది, రైతులు ఆర్థిక నష్టాలకు గురి అవుతారు.

గేదెలలో యుక్తవయస్సు ఆలస్యముగా రావడం, మూగ ఎద, తక్కువ ఎద లక్షణాలు మరియు ఈనిన తరువాత చూడి కట్టించుకాలం ఎక్కువగా ఉండడం వలన గేదెలు తక్కువ సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జంతువులుగా పరిగణించబడతాయి. గేదెలు వేసవిలో చూడి సరిగ్గా కట్టకపోవడానికి పలు కారణాలు మనం పేర్కొనవచ్చు. వాటిలో ముఖ్యమైనవి పోషకాహార లోపం, పర్యావరణ, హార్మోన్ల అసమతుల్యత మరియు యాజమాన్య లోపం.

వేసవిలో గేదెలు చూడి కట్టకపోవడానికి గల కారణాలు

1. వాతావరణము: ఆవులు కంటే గేదెలు యొక్క శరీరం మందంగా, నలుపు రంగులో ఉండడం మరియు స్వేద గ్రంథులు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఉష్ణతాపానికి గురవుతాయి. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం వలన పొలాల నీటి కుంటలలోని మురికి నీరు ఎక్కువగా తాగుతాయి. దీనివలన జలగ పురుగుల బారిన పడి రక్తహీనత మరియు దీర్ఘకాలిక విరోచనాలతో బాధపడడం వల్ల శక్తిహీనతకు గురై, ఎద లక్షణాలు సరైన విధంగా చూపించలేవు.

2. పోషక ఆహార లోపము: వేసవిలో అధిక వేడి కారణంగా గేదెలు మేతను తక్కువగా తీసుకుంటూ ఉంటాయి. శరీరములో శక్తి నిలువలు, పొడి పదార్థాన్ని జీర్ణించుకొనే శక్తి మరియు మాంసకృత్తులకు శరీర శక్తికి ఉండే నిష్పత్తి తగ్గుతాయి. అసమతుల్య పోషకాల వలన అండాశయములు స్పందించే స్వభావం తగ్గుతుంది, అందువల్ల అండాశయ స్థబ్దత, అండోత్పత్తిలో వ్యత్యాసాలు సంభవించి పశువులు తిరిగి పొర్లుతుంటాయి.

వేసవిలో పచ్చిమేత కొరత వలన ఎండు గడ్డి ఎక్కువగా మేపుట వల్ల కూడా ఖనిజ లవణాల లోపాలు ఏర్పడి, పశువుల్లో తాత్కాలిక వంధ్యత్వం ఏర్పడుతుంది.

3. యాజమాన్య పద్ధతులు: గేదెలు సంవత్సరం పొడవునా ఎదకు వచ్చే స్వభావం ఉన్నప్పటికి, వేసవిలో పునరుత్పత్తి ప్రక్రియకు విఘాతం కలగడం వల్ల, ఈతల మధ్య వ్యవధి పెరుగుతుంది. సాధారణంగా ఆవులతో పోలిస్తే ఎద లక్షణాలు తక్కువగా చూపుతాయి, ఈ సమస్య వేసవిలో మరింత జటిలం అవుతుంది. చాలావరకు గేదెలు వేసవి కాలంలో మూగ ఎదను చూపుతాయి, ఎద లక్షణాలు అయినటువంటి అరవటం, ఇతర పశువులపై ఎక్కటం, పశుమానం నుంచి స్రావాలు కారటం, చిరు ఉచ్చపోయటం వంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి, అంతేకాకుండా ఎదలక్షణాలు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటాయి. వేకువజామున లేదా రాత్రి సమయంలో మాత్రమే ఎద లక్షణాలను చూపుతాయి. ఈ కారణాలు వల్ల రైతులు ఎదను గమనించలేకపోతున్నారు. అందువలన చూడి కట్టించడానికి అధిక సమయం పడుతోంది.

వేసవిలో యాజమాన్య పద్ధతులు

వేసవిలో యాజమాన్యం పద్ధతులలో మార్పు చేసుకొన్న ఎడల గేదెలను విజవంతముగా చూడి కట్టించవచ్చు. వేసవిలో పశువులను సూర్యుని యొక్క ప్రత్యక్ష కిరణాలు నుండి కాపాడుట అనునది ప్రధానమైన సమస్య. దీనిని అధిగమించాలంటే పశువులకు చెట్ల కింద నీడ కల్పించి, తరుచుగా చల్లని నీళ్లతో కడగాలి లేదా కొద్దిసేపు పశువులను చెరువులు లేదా కాలువ నీటిలో ఈత కొట్టించవలెను. పశువుల కొట్టాల చుట్టూ గోనె పట్టాలు కట్టి వాటిని తరచూ చల్లని నీటితో తడుపుతూ ఉన్నచో గేదెలకు చల్లని వాతావరణము కల్పించవచ్చు. పశువుల మేపు సమయమున ఎండ తీవ్రత నుండి కాపాడుటకు పశువులను ఉదయం మరియు సాయంత్రం సమయంలో మాత్రమే ఆరుబయటకు మేపుకు వదలవలెను. ఇలా చేయటం వలన పశువుల పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావమును తగ్గించవచ్చు మరియు పశువుల పాల దిగుబడిని పూర్తి సామర్థ్యం మేర సాధించవచ్చు.

ఎద లక్షణాలను గుర్తించే అవకాశము మెరుగుపరచడం

పశువు యొక్క ఎదను సరిగ్గా గుర్తించకపోవుట వలన ఈనిన తర్వాత చూడి కట్టే కాలాన్ని పెంచుతూ రైతుకు ఆర్థికంగా నష్టము చేకూరుస్తుంది. సాధారణ రోజుల్లో మనము గమనించే పశు ఎద లక్షణాలు వేసవికాలంలో అంతగా గమనించలేము కావున చల్లని సమయాలలో ముఖ్యంగా పొద్దున మరియు రాత్రుల సమయంలో రైతులు ఎక్కువగా గమనించాలి.

వేసవిలో గేదెలలో పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావమును తగ్గించుట మరియు మూగ ఎదలను సరిగ్గా గుర్తించుట వలన సరైన సమయంలో చూడిని కట్టించడం ద్వారా పాల దిగుబడిని పెంచుకొనవచ్చు. సరైన ఎదకు రాని పశువులలో ఎద చక్రం క్రమబద్ధీకరించుట అను విధానమును పాటించవచ్చు. ఈ విధానం వలన పశువులను మనకు అనుకూల సమయంలో ఎదకి తెప్పించవచ్చు. పశువు ఈనిన తరువాత 90 రోజులలో ఎదకు రాని ఎడల ఈ విధానమును పాటించినచో మంచి ఫలితాలను పొందవచ్చును. ఎక్కువ పశువులు ఉన్న రైతులు ఈ విధానమును అవలంబించుటవలన సంవత్సరం పొడుగునా పాల ఉత్పత్తిని సాధించవచ్చు. పాడి పశువు దాని పునరుత్పత్తి కాలంలో ప్రతి సంవత్సరం ఒక దూడ పుట్టేటట్లు చేయవచ్చు. ఈ విధంగా పశుసంపదను పెంచుకోవచ్చు. ఈ విధానమును ఆచరించే ముందు పశువులను మంద నుంచి విడిగా ఉంచాలి. పశువులు గర్భందాల్చలేదని నిర్ధారించుకోవాలి. వాటికి నట్టల నివారణ, సమీకృత దాణ మరియు లవణ మిశ్రమమును అందించాలి. ఏ విధమైన గర్భకోశ వ్యాధులు గాని లోపాలుగాని ఉండకూడదు.

ఎద క్రమబద్ధీకరణ పద్ధతులు

ఎద చక్రం క్రమబద్ధీకరించడానికి చాలా రకాల విధానాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా రెండు పద్ధతులను అవలంబిస్తాము.

1. జి.పి.జి. పద్ధతి

ఈ పద్దతిలో మొదటి రోజున 5 మి.లీ. రిసెప్టాల్‌, గైనారిచ్‌ (బుసరెలిన్‌ అసిటేట్‌) కండకు ఇవ్వాలి. ఆ తర్వాత ఆరు రోజులకు 5 మి.లీ. లుటాలైజ్‌ (డైనోప్రాస్ట్‌ ప్రోమితమైన్‌) లేదా 2 మి.లీ. క్లోప్రోస్టినాల్‌ గాని ఇవ్వాలి. ఒకరోజు వ్యవధితో మళ్లీ 5 మి.లీ. బుసరెలిన్‌ అసిటేట్‌ ఇవ్వాలి తరువాత రోజు రెండు పూటలా ఎద ఇంజక్షను చేయించాలి.

2. రెండు డోసుల ప్రొస్టాగ్లాండిన్‌

ఈ పద్ధతిలో రెండు సార్లు 5 మి.లీ. డైనోప్రాస్ట్‌ ప్రోమితమైన్‌ లేదా 2 మి.లీ. క్లోప్రొస్టినాల్‌ గాని పదకొండు రోజుల వ్యవధిలో ఇస్తారు. రెండవ డోసు ఇచ్చిన తరువాత 48-72 గంటలలో పశువు ఎదకు వస్తుంది. రెండు పూటలా ఎద ఇంజక్షను చేయించడం మంచిది, లేదా రెండవ డోసు ఇచ్చిన తరువాత 72 గంటలకు ఒక ఎద ఇంజక్షను మరియు 96 గంటలకు మరియొక ఎద ఇంజక్షన్‌ చేయించడం ఉత్తమం. ఎదచక్రం క్రమబద్ధీకరించుట పద్ధతిని పాటించడం వలన రైతు సకాలంలో పశువులను ఎదకు తెప్పించి చూడి కట్టించి ఆర్థికంగా లాభాన్ని పొందవచ్చు. రాత్రి సమయంలో మంచి మేతను అందించుట, పశువులకు ఉదయము, సాయంత్రము సమయంలో మాత్రమే మేపుకు విడువుట వలన పశువులపై ఎండ తీవ్రత ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా లేతగా ఉండే పచ్చి మేతను మాగుడు గడ్డిని, ఎండు చొప్పను తిన్నంత అందించుట వలన చల్లని నీటిని, లవణ మిశ్రమం అందించుట వలన ప్రత్యుత్పత్తి సామర్థ్యం వేసవిలో కూడా మెరుగుగా ఉంటుంది. సరైన పోషణ అందించుటతో పశువులలో ఎద లక్షణాలను మంచి వేసవిలో కూడా గమనించవచ్చు. పశువుల మేపులో ఉండే లవణములు మరియు శక్తి లోపాన్ని ప్రత్యేకమైన దాణా అందించుట వలన నివారించవచ్చు. రాత్రి సమయంలో పీచు ఎక్కువగా ఉండే మేతను ఇవ్వడం వల్ల దేహములో ఉత్పత్తి అయ్యే వేడి తీవ్రతను తగ్గించవచ్చు. వేసవిలో మేలైన యాజమాన్య పద్ధతులు ఉపయోగించి పశువులను చూడి కట్టించడం వల్ల సంవత్సరం పొడవునా పాల దిగుబడి ఉండడం వలన, రైతు ఆర్థికంగా మెరుగుపడతారు.             

డా. బి. చంద్ర ప్రసాద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌; డా. చందన, M.V.Sc., ఫోన్‌: 80742 44537, ఎన్‌.టి.ఆర్‌. పశువైద్య కళాశాల, గన్నవరం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

Read More

ఇంటిపంటతో ఆరోగ్యం, ఆహ్లాదం

మనందరికి ఆరోగ్యం తప్పనిసరి. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం తప్పనిసరి అనే విషయం అక్షర సత్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, నీటితో పాటు మంచి ఆహారం తీసుకోగలగాలి. మన ఆరోగ్యం ప్రధానంగా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం కావాలంటే సాధ్యమయినంత వరకు వేరే వారి మీద ఆధారపడకుండా తామే సొంతంగా పండించుకుని తింటేనే మంచి ఆహారం దొరుకుతుందనే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయి. మనం తినే అన్ని రకాల ఆహారాలు అందరం పండించుకోలేము కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు పండించుకోవటానికి కొంతమంది ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టే ఇంటి పంటదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. వివిధ రంగాలలో ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్నంత మేరలో వారు కొన్ని మొక్కలు పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కలు పెంచుకోవటం వలన ఆరోగ్యకరమయిన ఆహారం సొంతంగా పండించుకొని తినడముతో పాటు శారీరక శ్రమకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంటిపంటలో గడిపిన సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మన శక్తి పెరుగుతుంది కాబట్టి మన రోజు వారి పనులలో సామర్థ్యం పెరిగి ఫలితాలు మంచిగా ఉంటాయనడములో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని గ్రహించి ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ తమ ఇంట్లో ఏ మాత్రం స్థలాన్ని వదలకుండా వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తున్నాడు.

శ్రీనివాస్‌ది సాఫ్ట్‌వేర్‌ రంగం. కరోనా తరువాత ఆరోగ్యం యొక్క విలువ తెలుసుకుని ఆరోగ్యకరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలంటే ఇంటి పంటే సరైన దారి అని నమ్మి 2022 వ సంవత్సరం ఆగస్టు నెలలో తమ ఇంటి మేడ మీద, బాల్కనీలో, మిద్దె మీద వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు. మొక్కల పెంపకంతో పాటు అక్వేరియంలో చేపల పెంపకం మరియు కొన్ని రకాల పకక్షులను కూడా పెంచడానికి తగిన ఏర్పాట్లు చేసుకుని పెంపకం చేస్తున్నాడు. పకక్షులకు అవసరమయిన గింజలు కోసం సజ్జ, జొన్న లాంటి విత్తనాలను తమ ఇంటి పంటలో చల్లి వాటి ద్వారా వచ్చే దిగుబడిని పకక్షులకు ఆహారంగా అందిస్తూ వస్తున్నాడు. చేపలు మరియు పకక్షులు పెంపకం వలన మనసుకు ఆహ్లాదం కలిగి రోజు మొత్తం ఆనందంగా గడపడం శ్రీనివాస్‌ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

తమ ఇంటిపంటలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు వివిధ రకాల పూలమొక్కలు పెంచుతున్నాడు. నీడపడే ప్రదేశంలో ఇండోర్‌ ప్లాంట్లని పెంపకం చేస్తున్నాడు. తనకు కొత్త రకాల మొక్కలంటే మక్కువ ఎక్కువ కాబట్టి ఏ కొత్తరకం మొక్క లేదా విత్తనం కనిపించినా వదలకుండా తన ఇంటి పంటలో పెంపకం మొదలు పెడుతుంటాడు. మొక్కల పెంపకానికి గ్రోబ్యాగ్స్‌, ప్లాస్టిక్‌ కుండీలను మాత్రమే వినియోగిస్తున్నాడు. మొక్కలలో పరపరాగ సంపర్కం సక్రమంగా జరగాలంటే సీతాకోకచిలకలు, తేనెటీగల లాంటివి కావాలి కాబట్టి వీటిని ఆకర్షించడానికి గాను పసుపురంగు పూవులుపూసే పూల మొక్కలను పెంపకం చేస్తున్నాడు. ఇంటిపంటలో నెమటోడ్స్‌ సమస్య రాకుండా ఉండటానికి గాను బంతి మొక్కలను పెంపకం చేస్తున్నాడు. సంవత్సరం పొడవునా ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన వివిధ రకాల పూల మొక్కలను పెంచుతూ ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నాడు కాబట్టే తమ ఇంటి పంట 365 రోజులు అందంగా ఉంటుందని శ్రీనివాస్‌ అంటున్నాడు.

మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి మరియు మంచి దిగుబడిని ఇవ్వడానికి అవసరమయిన సేంద్రియ పదార్థాలను సమయానుకూలంగా అందిస్తూ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఇంటి పంటను కొనసాగిస్తున్నాడు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం కలుస్తూ మెలకువలు తెలుసుకుంటూ అతి తక్కువ సమయంలో ఇంటి పంటలో నైపుణ్యం సాధించి అనేకమంది ప్రశంసలు పొందుతున్నాడు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునే వారికి శ్రీనివాస్‌ మార్గదర్శి కాగలడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.  

Read More