సముద్రపాల అడవిలో ఇతర పొదలపై లేదా చెట్లపై ప్రాకే పెద్ద తీగ. దాదాపు 10-15 మీ. వరకు ప్రాకుతుంది. దాదాపు మొక్కలోని అన్ని భాగాలు తెల్లని రోమాలతో కప్పబడి ఉంటాయి. కొమ్మలు కత్తిరించినపుడు తెల్లని పాలవంటి జిగట పదార్థం వస్తుంది. ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో ప్రతికణుపు వద్ద ఒకటి చొప్పున వస్తాయి. ఆకుల అడుగు భాగాన నూగు ఉంటుంది. పూలు పెద్దవిగా, గంట ఆకారంలో లేత వంగపండు రంగు లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి రక్షణ పత్రావళిలో కప్పబడి ఉంటాయి.
సాధారణ నామం : చంద్రపాల / కొక్కిత తీగ / ఎలిఫెంట్ క్రీపర్ శాస్త్రీయ నామం : ఆర్ౙిరీయా నెర్వోసా కుటుంబం: కన్వోల్యులేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వేర్లు, ఆకులు, లేతకాండాలను, గింజలను ఔషధాలుగా ఉపయోగిస్తారు.
గింజలలో అరజైన్, ఐసోఅరజైన్, పెన్నిక్లావైన్ అనే రసాయనాలున్నాయి.
ఆకులు మరియు లేత కాండాలను అజీర్ణం, మలబద్ధకం నివారణలో ఉపయోగిస్తారు.
ఆకుల నుండి తయారు చేసిన మాత్రలను మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో :
సముద్రపాల కాయలలో స్టీరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాల్స్, టెర్పినాయిడ్స్ ఉంటాయి. వీటిలో లైసర్గమైడ్, స్టిగ్మాస్టన3, 5డైయిన్, ఎర్గాటమైన్ అనే మొక్కలకు పర్యావరణపరంగా ఉపయోగపడే ముఖ్యమైన జీవ చురుకుదనం గల పదార్థాలుంటాయి. వీటిని ఔషధాలు, డ్రగ్స్ ఫార్ములేషన్‌లో ఉపయోగిస్తారు (ఎకడె అండ్ మానిక్, 2015).
సముద్రపాల ఇథనాల్ ద్రావణాలు టెట్రోసైక్లిన్‌కి సమానంగా యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి. (మోడి, అతని అనుచరులు, 2010).
భారతదేశంలో సముద్ర పాల రసాన్ని, సమాన పరిమాణంలో నువ్వుల నూనె, కొంచం డిల్ గింజల పొడితో కలిపి స్కాబీస్ నివారణకు పైపూతగా పూస్తారు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
మైకోరైజా బహుళ ప్రయోజనకారి. పంటలను వేరుకుళ్ళు, ఎండుతెగులు వంటి తెగుళ్ళనుండి కాపాడటమేగాక, వర్షాభావ పరిస్థితుల్లో సుదూర లోతులో ఉన్న నీరు, పోషకాలను సంగ్రహించి మొక్కల వేర్లకు అందిస్తుంది. మైకోరైజాను రైతు వ్యవసాయ క్షేత్రంలోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం : 4 మీ. పొడవు, వెడుల్పు, అరగజం లోతులో గొయ్యి తీసుకోవాలి. అందులో మట్టి మృదువుగా ఉంటే అదే మట్టిని వాడుకోవచ్చు లేదా బయట నుండి మెత్తని మన్ను సేకరించి ఎండబెట్టి శుద్ధి చేసుకుని గోతిలో నింపాలి. దానిలో మెత్తని పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టు కలుపుకోవాలి. గోతిలో ప్లాస్టిక్ షీట్ పరవాలి. అందులో ఎరువు కలిపిన మట్టిని వేసి దానిలో 100 గ్రా. మైకోరైజా కల్చర్ ని కలిపి దానిలో వివిధ రకాల పప్పుధాన్యపు గింజలు, తృణధాన్యపు గింజలు, కూరగాయల గింజలు వరుసల వారీగా విత్తుకుని 40 రోజుల వరకు పెంచాలి. పెరిగిన పైరుకు వారం రోజుల పాటు నీటి తడిని ఆపి మట్టి పొడిబారిన తర్వాత మొక్కలపై కాండాలను కోసి వేయాలి. వేర్లను మట్టితో పాటు పెకలించి పొడి చేసుకుని సంచుల్లో నింపుకోవాలి. క్వింటాళ్ల కొద్ది మైకోరైజా వేర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని మెత్తగా దంచి అన్ని రకాల పైర్ల సాగులో, నారు మడుల పెంపకంలో వినియోగించుకోవచ్చు.
కదంబం మధ్యస్థం నుండి పెద్దగా పెరిగే ఆకురాల్చే వృక్షం. దీని మాను స్థూపాకారంలో ఉంటుంది. శాఖలు సమాంతరంగా ఉండి శిఖర భాగం గుండ్రంగా ఉంటుంది. బెరడు చిక్కటి గోధుమ రంగులో ఉండి నిలువుగా పగుళ్ళు కలిగి పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు అండాకారం లేదా దీర్ఘ అండాకారంలో ఉండి ఎదురెదురుగా ఏర్పడతాయి. ఆకుల అడుగు భాగంలో నూగు ఉంటుంది. పూలు సువాసన కలిగి పసుపు లేదా నారింజ రంగులో గుండ్రంగా ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి పండితే పసుపు రంగులోకి మారతాయి.
సాధారణ నామం : వైల్డ్ సింఖోన / రుద్రాక్షాంబ శాస్త్రీయ నామం : ఆంతోసిఫాలస్ కైనెన్సిస్, ఆంతోసిఫాలిస్ కదంబం కుటుంబం: రూబియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కదంబం బెరడు, ఆకులు, పండ్లు ఔషధగుణములు కలిగి ఉంటాయి. వాటిలో కాడంబైన్, ఆకడమైన్, బీటాసైటోస్టిరాల్ మొదలగు ఆల్కలాయిడ్లు మరియు కాదంబజెనిక్ ఆమ్లం ఉంటాయి.
కదంబం బెరడు టానిక్‌లా పనిచేస్తుంది. జ్వరాలను తగ్గిస్తుంది.
ఆకుల కషాయం పుండ్లు, గాయాలు మొదలైన వాటిని తగ్గిస్తుంది. పండ్లు కడుపులో వికారం మరియు జ్వరాలను తగ్గిస్తాయి.
కదంబం కాయలు మరియు పండ్లు ఆల్కహాలిక్ మరియు నీటి ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి.
కదంబం మిథనాల్ ఆకుద్రావణం మరియు బయోసింథసిస్ చేసిన నిమ్మగడ్డి గోల్డ్ నానోపార్టికల్స్ క్యూలెక్స్ క్వింక్వెఫాసియేటస్ మొదటిదశ లార్వాలు ప్యూపాలు, పెద్దపురుగుల జీవితకాలాన్ని పెంచాయి. ఈ మొక్కలో ఉన్న చురుకైన రసాయనాలు లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా అరికట్టాయి. (జయలలిత, ఆమె అనుచరులు, 2016)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
రెండు ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిపాయ (వెల్లుల్లి). కొంచెం జీలకర్ర, ఎండుకారంతో చేస్తే, ఇది ఉల్లిగడ్డ కారం అయితది.
ముందుగా ఉల్లిగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా కోసి, అందులో పొట్టు తీసిన ఎల్లిపాయలను వేసి, తగినంత కారం, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. ఎండు కారానికి బదులుగా, పచ్చిమిర్చి కూడా వాడవచ్చు. అవసరమైన వారు పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోయినా రుచికరంగానే ఉంటుంది. ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, ఏది తినాలని అనిపియ్యనప్పుడు, ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటది. ఇంట్లో కూరగాయ లేనప్పుడు, రెండు నిమిషాల్లో అయిపోతుంది. పచ్చి నూనె కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఈ కారాన్ని పేలాలలో, సలాడ్లలో, అన్నంలో, రొట్టెల్లో, దేంట్లో అయినా కలిపి తినొచ్చు. అన్నిటిలోకి కలిసిపోతుంది.
రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.
తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.
తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్‌లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.
వాటి మదర్ కల్చర్లను వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.
పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ: (1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.
తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.
నేల ఆరోగ్యంపై ప్రభావం
పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మృత్తిక స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.
చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ.
దిగుబడి, ఆర్థిక అంశాలు మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయ ఆధారిత మొక్కజొన్న పంట దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన పొషకాల యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.
వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయం పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్‌లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత హెర్బిసైడ్ ప్రయోగం వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.
చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది
సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.
ముగింపు పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.
ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.
చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³* ¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు, భారతదేశం.
సాధారణ నామం : కస్టర్డ్ యాపిల్ శాస్త్రీయ నామం : అనోనా స్క్వామోసా కుటుంబం: అనోనేసి
సీతాఫలం పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చు. సీతాఫలం పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, రాగి, పీచుపదార్థం, తక్కువ కొవ్వు కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుస్తాయి. సీతాఫలం ఆకులు, గింజలు మరియు ఇతర భాగాల్లో ‘అనోనైన’ అనే పదార్థం ఉండటం వలన చేదు గుణం కలిగి ఉంటుంది. అందుకే సీతాఫలం ఆకులను పశువులు, మేకలు తినవు. ఆకులు, గింజల నుండి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలున్నాయి.
సీతాఫలం ఆకు కషాయం : 500 గ్రా. సీతాఫలం ఆకులను 2 లీ. నీటిలో ఉడికించాలి. ఒక లీటరు ద్రావణం మిగిలే వరకు ఉడికించాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 10 15 లీ. నీటిలో కలిపి పురుగులు సోకిన మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేసి పేనుబంక, సుడిదోమ, గొంగళిపురుగులు, డైమండ్ బ్యాక్ మాత్, పచ్చదోమ, పచ్ౘ్నల్లి పురుగులను నివారించవచ్చు.
వివిధ ఆకుల కషాయం : వేపాకు1 కి., కానుగ 1 కి., బిల్వం 1కి., విషముష్టి 1/2 కి., వావిలాకు 1 కి., తంగేడు 1 కి., సీతాఫలం 1/2 కి., పిచ్చి తులసి 1 కి., పుదీనా 1/2 కి., పాలకొడిస 1/2కి., కొత్తిమీర 1/2కి., నేరేడు 1 కి., నేలవేము 1/2 కి., యూకలిప్టస్ 1 కి., అత్తాకోడలు ఆకు 1 కి., ఈ ఆకులలో ఏవైనా 5 రకాల ఆకులను పైన చెప్పిన మోతాదులో తీసుకుని 10 లీ. నీటిలో అరగంట సేపు బాగా ఉడికించి, ఉడుకుతున్న ఈ ద్రావణాన్ని కర్రతో మధ్య మధ్య కలుపుతూ, కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రా. సబ్బుపొడి లేదా 500 గ్రా. కుంకుడు రసం కలిపి, ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి సాయంత్రం వేళ పంటపై పిచికారి చేయాలి.
ఈ కషాయం అనేక పంటలనాశించే రసం పీల్చే పురుగులు, పెద్ద దశలోనున్న లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఆకులనుతినే గొంగళిపురుగులపై బాగా పనిచేస్తుంది.
దశపర్ణి కషాయం : వేప ఆకులు 5కి., నల్లేరు ఆకులు 2కి., అరిస్టాలోకియా ఆకులు 2కి., బొప్పాయి ఆకులు 2కి., సీతాఫలం ఆకులు 2 కి., కానుగ ఆకులు 2 కి., ఆముదం ఆకులు 2 కి., గన్నేరు ఆకులు 2 కి., జిల్లేడు ఆకులు 2 కి., టైనోస్పోరా కార్డిఫోలియా ఆకులు 2 కి., పచ్చి మిరప కాయల పేస్టు 2 కి., వెల్లుల్లి పేస్టు 2కి., ఆవుపేడ 3 కి., ఆవు మూత్రం 5 లీ.
వీటినన్నింటినీ నూరి 200 లీ. నీటిలో కలిపి ఒక నెల రోజులు పులియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి మూడుసార్లు కలియతిప్పాలి. నెల రోజుల తర్వాత వడపోయాలి. ఈ కషాయాన్ని 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఈ కషాయాన్ని ఒక ఎకరం పొలంలో ఫాగింగ్ మెషిన్‌తో చల్లి తామర పురుగులు, ఆకుముడత పురుగు, లీఫ్ హాపర్స్‌ని నివారించవచ్చు.
సీతాఫలం విత్తన నూనె కషాయం : పచ్చి కాయల నుండి గింజలను తీసి గ్రైండర్‌లో వేసి నూనె తీయాలి. ఒక భాగం నూనెని 20 భాగాల నీటిలో కలిపి డైమండ్ బ్యాక్‌మాత్ ఆశించిన పంటపై పిచికారి చేయాలి.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
ఈ వ్యాధిని మూతివాపు, మూతిపుండ్లు, పూతరోగం మొదలగు పేర్లతో వివిధ ప్రాంతాలలో వ్యవహరిస్తారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గొర్రెలలో నాలుక నీలిరంగుకు మారుతుంది. కావున ఈ వ్యాధిని నీలిరంగు వ్యాధి అని వ్యవహరిస్తారు.
వ్యాధి ఎలా వస్తుంది? ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. దోమకాటు వలన ఈ క్రిములు గొర్రె శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలంలో వ్యాధి క్రిముల అభివృద్ధికి మరియు అవి విస్తరింపచేసే దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది.
వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన గొర్రెలలో జ్వరం ఎక్కువగా ఉంటుంది.
క్రమేణా జ్వరం ఉన్న గొర్రెలకు చొంగ కారుతూ, పెదవులు మరియు చిగుళ్ళు వాచి, పెదవుల లోపలి భాగం ఎర్రబడి, చిన్న చిన్న గుల్లలు ఏర్పడతాయి.
వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెలలో ఈ వ్యాధి కాళ్ళకు కూడా పాకుతుంది. గిట్టల మొదటి భాగం వాచి, గిట్టల మధ్య ఎర్రగా ఉంటుంది. కావున గొర్రెలు సరిగా నడవలేక మేత సమయంలో వెనుకపడతాయి.
వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుకు మారుతుంది. మరియు మెడ వంకర పోతుంది.
వ్యాధి తీవ్రతను బట్టి 5Ð6 రోజులు మేత మేయక, నీరు త్రాగకపోవుట వలన గొర్రెలు నీరసించి చివరికి చనిపోతాయి.
వ్యాధిని ఎలా నివారించాలి?
వ్యాధి నివారణ టీకాల ఉత్పత్తికి ప్రస్తుతము పరిశోధనలు చివరి దశలో ఉన్నాయి.
వర్షాకాలంలో కొట్టం, పరిసర ప్రాంతాలలో ఈగలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
రోజుకు రెండు పర్యాయాలు వేపాకుతో పొగ వేసిన యెడల దోమలను నివారించవచ్చు.
చికిత్స:
వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించి, యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడడం ద్వారా వ్యాధిగ్రస్తమైన గొర్రెలు చనిపోకుండా కాపాడుకోవచ్చు.
నోటిలోని పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేటు ద్రావణంలో కడిగి జింక్ పౌడర్ నీటితో రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి హిమాక్స్, నీమ్‌లెంట్ వంటి ఆయింట్‌మెంటులు పూయాలి.
మామిడి పిందెలను కొన్నిటిని, నీళ్లలో వేసి కొద్దిగా నాననిచ్చి, పిందెల మీద గట్టిపడి ఉన్న సొనను కడగాలి. కడిగిన మామిడి పిందెలను శుభ్రంగా గుడ్డతో తుడవాలి.
ఏ మాత్రం తేమ లేకుండా, నీడకు ఆరబెట్టాలి. నీటి తేమ ఉంటే, పచ్చడి నిల్వ ఉండదు, బూజు పడుతుంది.
ఉప్పు తగినంత లేకపోయినా, నిల్వ పచ్చడి బూజు పడుతుంది.
పిందెలను కత్తితో నాలుగు ముక్కలు కోసుకోవాలి. ముక్కల్లో ఉన్న జీడిని తీసెయ్యాలి. అప్పటికి ఇంకా పిందెల్లో పిక్క గట్టి పడదు. పిక్క పొయ్యని పిందెలను, మామిడి రోటి పచ్చడి చేసుకోవచ్చు. లేదా ముదిరితే, కండను కోసుకుని, పిక్కను జీడిని తీసేసి, పచ్చడి చేసుకోవచ్చు.
మనకు లభించిన మామిడి పిందెలను బట్టి చేసుకోవాలి. మార్కెట్లో కూడా దొరుకుతాయి.
ఒక రకం మామిడి మొక్కలు, సంవత్సరం పొడవునా పూత పిందె వచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని మిద్దెతోట, పెరటితోట సేద్యంలో చక్కగా పెంచుకోవచ్చు. (మామిడి జీడిని కూడా ఎండబెట్టి పొడి చేసుకొని వాడుతారు అని, నేలకొండపల్లి ప్రకృతి వైద్యుడు ఒకరు చెప్పారు)
జీడి తీసిన మామిడి పిందె ముక్కలకు తగినంత ఉప్పు, కారం, ఆవపొడి, కొద్దిగా మెంతిపొడిని కలపాలి.
తగినన్ని వెల్లుల్లి పాయలను, జీలకర్రను కూడా మెత్తగా నూరి ముక్కల్లో కలపాలి. ఇక్కడి వరకు, ఇది మామిడి బద్దల పచ్చడి పద్ధతి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసి మెత్తగా నూరి, కొద్దిగా గానుగ నూనె పోసుకుని, సీసాలోకి ఎత్తుకోవాలి.
బయట వాతావరణంలో కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి బూజు పట్టింది అంటే, ఉప్పు తక్కువ అవడం వలన కానీ, తడి తగలడం వలన కానీ అవుతుంది. జాడి లేదా సీసా నుండి నిల్వ పచ్చడిని స్పూన్‌తో తీసేటప్పుడు, మన చేతి వ్రేళ్లకు కూడా ఏ మాత్రం తేమ ఉండకూడదు.
వేడివేడి అన్నం మీద, మామిడి పిందెల రోటి పచ్చడి వేసుకొని, కాస్తా గానుగ నూనె లేదా నెయ్యి వేసి తింటే, ఆవ ఘాటుతో ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఇందులోని దినుసుల్లో ఎవరి అభిరుచి ప్రకారం వారు, స్వల్ప మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం తగినంత ఉండాలి. వంటలకు కొత్తవారు కూడా ట్రై చెయ్యవచ్చు. మొదట ఉప్పు తక్కువగా వేసి, రుబ్బిన తరువాత రుచి చూసుకుని, అవసరం ఉంటే, మరింత కలుపుకోవాలి.
మామిడి పిందెలతో వేపని, ఉడికించని, నిల్వ రోటి ‘పచ్చి పచ్చడి’ తయ్యారు!
మామిడి పిందెలు కుటుంబం అవసరాలకు మించి, చెట్ల నుండి రాలుతున్నప్పుడు, ఇలా నిల్వ పచ్చడి పెట్టి అమ్మవచ్చు.
రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి