ఔషధ మొక్క… దేవ కాంచనం
దేవ కాంచనం ఒక చిన్న పరిమాణం నుండి మధ్య పరిమాణం కలిగి కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ, వేగంగా పెరిగే పొద లేదా చెట్టు. ఈ చెట్టు గుండ్రని, వత్తయిన గుబురులాంటి క్యానపి, 10 మీ. ఎత్తు కలిగి, లేత కొమ్మలు మెత్తగా, నునుపుగా ఉంటాయి. పొడి వాతావరణం గల ప్రాంతాలలో చెట్టు పరిమాణం అతి చిన్నదిగా ఉంటుంది. బెరడు తెల్లబారిన బూడిద గోధుమ వర్ణంలో, నున్నగా, కొద్దిగా బీటలు వారిన పొలుసులు కలిగి ఉంటుంది. రెమ్మపుల్లలు సన్నని, లేత ఆకుపచ్చ రంగులో, కొంచెం నూగుతో, కోణాలు కలిగి గోధుమ బూడిద రంగులో ఉంటాయి. హార్ట్‌వుడ్ గోధుమరంగులో గట్టిగా మన్నిక కలిగి ఉంటుంది. ఆకులు సామాన్యంగా, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఆకు ఆధారం గుండ్రంగా ఉండి 12 సెం.మీ. x 12 సెం.మీ. పరిమాణం, చివరి భాగం లోతుగా రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఆకుపైభాగం, అడుగు భాగం నున్నగా, 9-12 ఈనెలు కలిగి ఉంటాయి. ఆకు కాడలు 2.5 – 3.5 సెం.మీ. పొడవుంటాయి. పూరెమ్మ 6-10 ఎరుపు, నీలం కలిసిన రంగు గల పూలను కలిగి ఉంటుంది. పూమొగ్గలు గద ఆకారంలో ఉంటాయి. కాయలు గోధుమ రంగులో 15-30 సెం.మీ. పొడవు, 1.5-2.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కాయలో 10-15 మెరిసే గోధుమ రంగు గింజలు ఏర్పడతాయి..
సాధారణ నామం : పర్పుల్ బాహినియా/ఆర్కిడ్ ట్రీ / బటర్‌ఫ్లెå ట్రీ శాస్త్రీయ నామం : బాహినియా పర్పురియా కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- దేవకాంచనం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీని కషాయం అల్సర్లను నివారిస్తుంది. గాయాలు, దెబ్బలను నయం చేస్తుంది. బొబ్బలు, వ్రణాలను నయం చేయడానికి ఆకులను నూరి తయారు చేసిన పేస్టుని పూస్తారు.
- కీళ్ళనొప్పులు, వాపులు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఆస్త్మా, జలుబు, దగ్గులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వ్యాధులు, జలోదరం వంటి జబ్బులను నయం చేయడానికి సహాయ పడుతుంది. యాంటిక్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంది. దేవకాంచనం బెరడుని డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. పూమొగ్గలను డిసెంట్రి, మొలల చికిత్సలో ఉపయోగిస్తారు.
- ఇది మహిళలకు మంచి ఔషధం. బహిష్టు సమయంలో అధిక రక్త స్రావాన్ని ఆపుతుంది. జంతువుల గాట్లకు మంచి మందు. వాయు రోగాన్ని తగ్గించడానికి రోజుకి రెండుసార్లు 10 మి.లీ. వేరు కషాయాన్ని త్రాగాలి. డయేరియా నివారణకు రోజుకి రెండు సార్లు వేరు కషాయం త్రాగాలి.
- అల్సర్ల నివారణకు బెరడు కషాయంతో కడగాలి. 5 మి.లీ పూల కషాయం రోజుకి రెండు సార్లు త్రాగితే విరేచనాలవుతాయి.
వ్యవసాయరంగంలో
- దేవకాంచనం ఆకు మిథనాల్ ద్రావణం వరి ధాన్యం నిల్వలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెని 75% చంపింది దీనిని రసాయన పురుగు మందుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు (డెర్బాలా, అతని అనుచరులు, 2012).
- దేవకాంచనం మిథనాల్ ద్రావణం గోధుమ ధాన్యం నిల్వలో ఆశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగులను చంపడంలో అధిక సామర్థ్యతను ప్రదర్శించింది (డెర్బాలా, 2012).
- దేవకాంచనం వేడి నీటి ద్రావణం మామిడి పండ్ల నిల్వ సమయంలో ఆశించే ఆంత్రాక్నోస్ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (విచమ్ కోర్ప్రాడిట్‌స్కల్, 1991).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.













