పెరుగు పచ్చడి పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే కానీ, అందులో కూడా మళ్ళీ పోపు పెడతారు. పోపు వల్ల నూనె కాలుతుంది. కాలిన నూనె, క్యాన్సర్ కారకం. పెరుగు పచ్చడిలో ఉప్పు నూనె అవసరం లేదు.
లీటరు పెరుగును గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి.
రెండు ముల్లంగి దుంపలను మట్టి లేకుండా నీటితో శుభ్రంగా కడగాలి. ముల్లంగి దుంపలను శుభ్రంగా కడిగి ‘కోరు’ మీద సన్నగా తరుగాలి. ఆ తరిగిన కోరును పెరుగు గిన్నెలో వేసి బాగా కలపాలి.ఉంటే ఒక టొమాటో పండును చిన్నచిన్న ముక్కలు చేసి కలుపుకోవాలి. కాస్తా పసుపు వెయ్యాలి.కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలు చేసి వెయ్యాలి. తగినన్ని పచ్చడి మిరపకాయలను చిన్న చిన్న ముక్కలు చేసి పచ్చడిలో వెయ్యాలి. ఉల్లిగడ్డ తరుగు కూడా వెయ్యాలి. లేత కరివేపాకును ముక్కలు చేసి కలపాలి. ముల్లంగి దుంపల్లో సోడియం ఎక్కువ ఉంటుంది కనుక చప్పగా కాకుండా ఉప్పగానే ఉంటుంది.
అయినా ఉప్పు లేకుండా తినలేని వారు, స్వల్పంగా రాక్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి, ఇంగువ పొడిని కూడా కలుపుకోవచ్చు. మరింత రుచికరంగా ఉంటుంది.
నిజానికి పెరుగు పచ్చడిలో ఉప్పు అవసరం లేదు.పెరుగులో కూడా సోడియం ఎక్కువ ఉంటుంది. ఉప్పు లేకుండా కూడా రుచికరంగా ఉంటుంది.
ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని, వేడి వేడి అన్నంలో కలుపుకుని తినవచ్చు. ఎక్కువ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది. పెరుగు పచ్చడి ఉంటే, మరో కూర అవసరం లేదు.
- స్నేహా తిలక్

