తెలంగాణా రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా కొత్త విత్తన చట్టం-2025 ముసాయిదాను పకడ్బందీగా రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. ఆదివారం సచివాలయంలో కొత్త విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన కమిటీతో తుమ్మల సమావేశమయ్యారు. వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ముసాయిదా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘నాణ్యమైన విత్తనోత్పత్తికి కంపెనీలను ప్రోత్సహించేలా, మోసం చేసే వాటి పట్ల కఠినంగా వ్యవహరించేలా ముసాయిదా రూపొందించాలి. అది న్యాయ సమీక్షకు అనుగుణంగా ఉండాలి. పంట నష్టపోయే రైతులకు సంపూర్ణ పరిహారం అందేలా చొరవ చూపాలన్నారు. కొత్త విత్తన చట్టం రూపకల్పన అనంతరం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపుతాం’ అని తుమ్మల పేర్కొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ‘విత్తన రైతులకు రుణ సౌకర్యం, సాంకేతిక శిక్షణ వంటి అంశాలను జోడించాలి. విత్తనోత్పత్తి సంఘాల ఏర్పాటు, లైసెన్సు కలిగిన సంస్థలకే విక్రయ అనుమతివ్వాలి. రైతు, ఆర్గనైజర్‌, కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉండాలి’ అని సూచించారు.