ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలను పండిస్తూ రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. 2024-25లో ఈ పంటల సాగులో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు రూ.30 వేల కోట్ల స్థూల ఉత్పత్తి విలువ జోడింపు (జీవీఏ) సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండ పాలెం లాంటి మండలాలూ జీవీఏ సాధనలో అగ్రభాగాన ఉండటం గమనార్హం. ఉద్యాన పంటల జీవీఏలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన జిల్లాలు, డివిజన్లు, మండలాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. లింగాల మండలం అగ్రస్థానంలో… వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల మండలం అత్యధికంగా రూ.2,130 కోట్ల జీవీఏ సాధించింది. బత్తాయి, అరటి, పుచ్చ, టమాటా పంటల సాగు ద్వారా అధిక ఆదాయం లభించినట్లు ఉద్యానశాఖ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా కడియంలో అలంకరణ మొక్కలు, పండ్ల నర్సరీల ద్వారా గణనీయమైన ఆదాయం లభించింది. ఈ మండలం మొత్తం జీవీఏ రూ. 1,758 కోట్లుగా ఉంది. అగ్ర స్థానంలో ఉన్న జిల్లాలను పరిశీలిస్తే.. అనంతపురం జిల్లా పుట్లూరు, ఎల్లనూరు, ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం, ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల, అనంతపురం జిల్లా నార్పల, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు తర్వాత స్థానాల్లో నిలిచాయి. మొదటిస్థానం అనంతపురం.. తర్వాత పులివెందుల డివిజన్లలో… రాష్ట్రంలోనే అత్యధిక జీవీఏ సాధించిన డివిజన్గా అనంతపురం డివిజన్‌ నిలిచింది. అరటి, బత్తాయి పంటల ద్వారా అక్కడ రూ.9,876 కోట్ల జీవీఏ సాధించింది. రెండోస్థానంలో వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల డివిజన్‌లో అరటి, బత్తాయి, టమాటా పంటల ద్వారా రూ.6,177 కోట్ల జీవీఏ లభించింది. మూడోస్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లో మిరియాలు, పసుపు, కాఫీ ద్వారా రూ.5,674 కోట్లు వచ్చింది. అక్కడ మిరియాల పంట ద్వారా రూ.2,326 కోట్లు, పసుపు ద్వారా రూ.552 కోట్లు, కాఫీ ద్వారా రూ.534 కోట్ల జీవీఏ సమకూరింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం రూ.5,264 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ రూ.4,433 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రూ.4,175 కోట్లు, ప్రకాశం జిల్లా మార్కాపురం రూ.4,028 కోట్లు, అన్నమయ్య జిల్లా రాజ పేట రూ.4,003 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం రూ.3,793 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూ.3,594 కోట్ల జీవీఏ సాధించాయి.