ఐకార్ మాజీ డీడీజీ ఆర్సీ అగర్వాల్
దేశంలో వ్యవసాయ ఉద్యోగావకాశాలు ఏటా 8 శాతానికి పైగా పెరుగుతున్నాయని 2040 నాటికి 17.7 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ) డాక్టర్ ఆర్సీ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు మానవ వనరులను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో శుక్రవారం ‘వ్యవసాయ విద్య, అవకాశాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ”భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడంలో వ్యవసాయాధారిత అంకుర పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తాయి. కృత్రిమ మేధతో భవిష్యత్తులో గ్రామీణ విప్లవం వస్తుంది. రైతుల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల ఆధారిత ఉత్పత్తులతో పరిశ్రమలు, వ్యాపారాలు పెద్దఎత్తున సాగుతాయి. వ్యవసాయ విద్యార్థులు కమ్యూనికేషన్స్, పారిశ్రామిక నైపుణ్యాలు సాధించాలి” అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాలపై వివిధ ప్రచురణలను ఆవిష్కరించారు. రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్, శాస్త్రవేత్తలు, ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.

