నేటి నుంచి 7 మార్కెట్ యార్డుల్లో హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు
ప్రాసెసింగ్ మామిడి రకాలకు కిలో రూ.12 – కోకో కిలో ధర రూ.500..- సీఎం సమీక్షలో నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా శుక్రవారం నుంచే సేకరణ ప్రారంభించనున్నారు. ఇక, ప్రాసెసింగ్ రకం మామిడికి కిలో రూ.12 చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని ఆహారశుద్ధి పరిశ్రమలు, ట్రేడర్లను ఆదేశించింది. ఇందులో వ్యాపారులు రూ.8, ప్రభుత్వం రూ.4 చొప్పున భరించాలని నిర్ణయించింది. కోకో రైతులకు కిలోకు రూ.500 దక్కేలా… వ్యాపారులు రూ.450, ప్రభుత్వం రూ.50 చొప్పున చెల్లించనుంది. పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధరలపై గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు. గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 550 కోట్ల వరకు భారం పడుతుందన్నారు. *సీఎం సమీక్షలోని ప్రధానాంశాలు*- హెచ్‌డీ బర్లీ పొగాకును ఐటీసీ, జీపీఐ సంస్థలు కలిపి 25 మిలియన్ కిలోలు, చిన్న కంపెనీలు 20 మిలియన్ కిలోల చొప్పున కొనాలి. రెండు, మూడు గ్రేడ్ల రకాలు కొనేలా కంపెనీలతో మాట్లాడాలి. ప్రధాన రకాన్ని క్వింటాలుకు రూ.12 వేలకు తగ్గకుండా సేకరించాలి. మిగతా రెండు రకాలకు పరిస్థితులను బట్టి ధర నిర్ణయిస్తాం. ఈ పొగాకు కొనుగోళ్లతో ప్రభుత్వం పై రూ.300-350 కోట్ల భారం పడనుంది.- ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి వచ్చింది. ఇదంతా ప్రాసెసింగ్ రకం, ఇప్పటికే ప్రాసెసింగ్ సంస్థల వద్ద 43 వేల టన్నుల మామిడి గుజ్జు నిల్వలున్నాయి. పార్లే ఆగ్రో, కోకకోలా, పెప్సికో సంస్థల నుంచి ఆర్డర్లు రాకపోవడమే సమస్యకు కారణం, రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్లను రిజిస్టర్ చేయాలి. రికార్డులు నిర్వహించాలి. కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తే, ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా కిలోకు రూ.4 చొప్పున జమ చేస్తుంది. ఇందుకు రూ.100-150 కోట్ల వరకు భరించనుంది.- రైతుల నుంచి ఇప్పటికే 465 టన్నుల కోకో కోనుగోలు చేశారు. ఇంకా 745 టన్నుల నిల్వలు రైతుల వద్దే ఉన్నాయి. కనీసం కిలోకు రూ.500 దక్కేలా చేసేందుకు ప్రభుత్వం కిలోకు రూ. 50 చొప్పున చెల్లించనుంది. మొత్తం రూ.10.50 కోట్లు ఖర్చవుతుంది. – రాష్ట్రంలో కోకో పాలసీ తీసుకురావాలి. నాణ్యత కలిగిన ఉత్పత్తులు వచ్చేలా రైతుల్ని చైతన్యపరచాలి. రైతుబజార్లను 116 నుంచి 200కు పెంచాలి. మొబైల్ మార్కెట్లు తీసుకురావాలి.- పీఎం కిసాన్ డేటాకు అనుగుణంగా అన్నదాతా సుఖీభవ లబ్దిదారుల జాబితా రూపొందించాలి.- పామోలిన్ పై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రైతులు ఎలా నష్టపోతున్నారో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను కేంద్ర మంత్రులు, ఎంపీలు తీసుకోవాలి.- ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదే.

