చిరుధాన్యాలకు దక్షిణ భారత రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) అధ్యయనం వెల్లడించింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలలో వీటి సాగు భారీగా పెరుగుతోందని, వినియోగం విస్తరిస్తోందని పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, యాంత్రీకరణతో కూడిన నవీన సాగు విధానాలు, అధిక దిగుబడులకు అనుకూలతలు, ఆధునాతన శుద్ధి, మెరుగైన మార్కెటింగ్ మార్గాలు వీటి సాగు విస్తరణకు దోహదపడుతున్నాయని వివరించింది. ఈ పంటలను ప్రోత్సహిస్తే ఆదాయం 5 రెట్లు పెరుగుతుందని వెల్లడైనట్లు తెలిపింది. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో సంస్థ అధ్యయనం నిర్వహించి ''చిరుధాన్యాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. దక్షిణ భారత అధ్యయనం నుంచి పాఠాలు'' పేరిట తాజాగా నివేదికను విడుదల చేసింది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ అధ్యయనంలో అలివర్‌కింగ్, భారతీయ గణాంకసంస్థ ఆర్ధిక విశ్లేషణ విభాగ ''శాఖాధిపతి మధురస్వామినాథన్, ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ శాస్త్రవేత్త పి. పి.యువరాజ్, పోషకాహార శాస్త్రవేత్త డీజే నిత్యల బృందం పాల్గొంది. దేశంలో చిరుధాన్యాల స్థితిగతులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు, సాగు పునరుజ్జీవం, రైతులకు ఆదాయం పెంపు వంటి అంశాలపై తమ నివేదికను తాజాగా వెల్లడించింది. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని కె.హిల్స్ బ్లాక్ కేంద్రంలో అధ్యయనాంశాలను వెల్లడించింది.
స్థితిగతులు ఇలా..
దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 200 మిలియన్ టన్నులు కాగా.. అందులో చిరుధాన్యాల ఉత్పత్తి 20 మిలియన్ టన్నుల కంటే తక్కువగా ఉంది. దేశంలో చిరుధాన్యాలకు ప్రస్తుత నికర రాబడి హెక్టారుకు దాదాపు రూ.10,000 మాత్రమే. కందగడ్డను పండించడం ద్వారా హెక్టారుకు రూ.25 వేలు వస్తోంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ గణాంకాలను అనుసరించి ఆహారధాన్యాల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. 2011-15 సంవత్సరాలలో వరికి వెచ్చించిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయం 224 శాతం, గోధుమలకు 304 శాతం కాగా, చిరుధాన్యాలకు 100 శాతమే ఉంది.
ఆరోగ్యసిరి ధాన్యాలు
అత్యధిక పోషక విలువలకు చిరుధాన్యాలు పేరు పొందాయి. వాటిలో ప్రొటీన్, డైటరీ ఫైబర్, సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కరవు నిరోధక పంటలు. తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. వీటిని బంజరుభూముల్లోనూ సాగు చేయవచ్చు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019- 21)లో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల పెరుగుదల స్థాయి స్వల్పంగా తగ్గింది. బరువు తగ్గుతున్న వారి శాతం 38 నుంచి 36కి, తక్కువ బరువు ఉన్నవారి శాతం 21 నుంచి 19కి తగ్గింది. 6 నుంచి 59 నెలల వయస్సు ఉన్న పిల్లల్లో రక్తహీనత 59 నుంచి 67 శాతానికి పెరిగింది. మహిళల్లో ఊబకాయం 21 నుంచి 24 శాతానికి, పురుషులలో 19 నుంచి 23 శాతానికి హెచ్చింది. ఈ సమస్యలకు చిరుధాన్యాలు పరిష్కారం చూపగలవు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జొన్న ఆధారిత ఉత్పత్తులను, పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకంలోనూ ప్రయోగాత్మకంగా చేర్చింది.
కె. హిల్స్‌లో ఏం జరిగింది
చిరుధాన్యాల ఉత్పత్తిలో తమిళనాడు 7వ స్థానంలో ఉంది. మిల్లెట్ పంటల ఉత్పత్తిని పునరుద్ధరించడానికి, చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ 1990 నుంచి తమిళనాడులోని కె.హిల్స్ ప్రాంతంలో సాగును ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని చిరుధాన్యాల పరిశోధన సంస్థ, ఇక్రిశాట్ తదితర సంస్థల సహకారంతో వనరుల పరిరక్షణ, సాగు, వినియోగం, వాణిజ్యంపై దృష్టి సారించింది. కొత్త వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన విత్తనాలు, ఆవిష్కరణలు, ఆధునిక శుద్ధి, విలువ ఆధారిత విధానాలపై శిక్షణ ఇచ్చింది. మెరుగైన రకాలతో విత్తన బ్యాంకును ఏర్పాటుచేసింది. పంటల సాగు కోసం ఆధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసింది. ఫలితంగా ఇక్కడ సాగు పెరిగింది.
ఇదీ అధ్యయనం…
కె.హిల్స్‌లో స్వామినాథన్ పరిశోధన సంస్థ చేయూతతో జరిగిన మార్పులపై తాజాగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సర్వే ప్రకారం ప్రతి ఇంటికి 0.15 హెక్టార్ల భూమిలో జొన్నలు సాగు చేశారు. హెక్టారుకు 1157 కిలోలు దిగుబడి వచ్చింది చిన్నకమతాలు గల సాగుదారులకు ఆధికాదాయం సమకూరింది. చిరుధాన్యాల సాగుకు హెక్టారుకు రూ.11,644 ఖర్చు కాగా.. రూ. 16,868 ఆదాయం వచ్చింది. 2021-22 నాటికి గ్రామంలో అన్ని కుటుంబాలు నెలకు 9 రోజుల చొప్పున చిరుధాన్యాలను తింటున్నాయి. 46 శాతం మంది సగటున నెలలో ప్రతి మూడు రోజులకోసారి చిరుధాన్యాలను వినియోగిస్తున్నారు. 42 శాతం మంది నెలకు రెండుసార్లు వాటిని భుజిస్తున్నారు. పండించిన చిరుధాన్యాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక విధానాలు చేపట్టారు. చిన్న పిండిమిల్లులు అందుబాటులోకి వచ్చాయి. కె. హిల్స్ ఆగ్రో డైవర్సిటీ కన్జర్వర్స్ ఫెడరేషన్ పేరిట 92 గ్రామాల్లోని 109 స్వయం సహాయక సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. వాటితో వివిధ ఆహార పదార్థాలను తయారుచేసి ‘కొల్లి హిల్స్ నేచురల్ ఫుడ్ బ్రాండ్’ పేరిట తమిళనాడులోని 12 జిల్లాల్లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాల శుద్ధి యంత్రాలను ఉపయోగించడంపై శిక్షణ పొందిన తర్వాత తనకు ఆత్మ విశ్వాసం పెరిగిందని హిల్స్‌లోని ఎట్టడిపరై గ్రామ మహిళ పూంగోడి తెలిపారు. 2020కి ముందు నామక్కల్ జిల్లాలో బరువు తక్కువగా ఉన్న పిల్లల నిష్పత్తి 39 శాతం కాగా చిరుధాన్యాల ఉత్పత్తులను భుజించడం వల్ల ఆ నిష్పత్తి 18 శాతానికి తగ్గింది.
నివేదికలో సిఫార్సులు
- దిగుబడే కాకుండా మిల్లెట్ సాగు ద్వారా రాబడిని పెంచడానికి చర్యలు చేపట్టాలి.
- చిరుదాన్యాల శుద్ధి వల్ల మహిళలకు వంటింట్లో పనిభారం తగ్గుతుంది.
- రైతు నేతృత్వంలోని మార్కెటింగ్ సమాఖ్య వంటి కొత్త సంస్థలను నెలకొల్పాలి.
- ప్రభుత్వ సంస్థల ‘మధ్య సమన్వయం, భాగ స్వామ్యాలు అవసరం.
- జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజనం, ఇతర పోషక కార్యక్రమాల్లో చిరుధాన్యాలను అందించాలి.
చిరుధాన్యాలకు భారీగా ప్రోత్సాహకాలుండాలి
-ప్రొఫెసర్ మధుర స్వామినాథన్, భారతీయ గణాంక సంస్థ ఆర్థిక విశ్లేషణ విభాగం శాఖాధిపతి
చిరుదాన్యాలు వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తాయి. కొత్త వ్యవసాయ పద్ధతులతో మంచి నాణ్యమైన విత్తనాల లభ్యత ఫలితంగా ఉత్పత్తి పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. మెరుగైన శుద్ధి సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల లభ్యత వల్ల చిరుదాన్యాల వినియోగం ఎక్కువగా ఉండటంతో పాటు అధిక ఆదాయాలు కూడా పెరిగాయి. దక్షిణ భారతదేశంలోని ఈ అధ్యయనాన్ని ప్రాతిపదికగా తీసుకొని చిరుధాన్యాల సాగును పెద్దఎత్తున చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. పెంపకందారులకు భారీగా ప్రోత్సాహకాలుండాలి. పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు భారీగా నిధులందించాలి. లాభదాయక ధరలు, నమ్మకమైన మార్కెటింగ్ మార్గాలుండాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చిరుధాన్యాల పంటలకు ధర మద్దతు లభించేలా చర్యలుండాలి.

