తెలంగాణా చరిత్రలో తొలిసారిగా మొక్కజొన్న పండిన పంటలో 50 శాతం మేరకు… 14.89 లక్షల టన్నులను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధర చెల్లించి కొనుగోలుకు గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన రూ.4,000 కోట్ల రుణం పొందడానికి బ్యాంకు పూచీకత్తు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో సుమారు 11,21,494 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. ఎకరాకు సగటు దిగుబడి 26.57 క్వింటాళ్లని అంచనాలు ఉన్నాయి. దీనిప్రకారం మొత్తం 29.79 లక్షల టన్నులు రావచ్చు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,400గా మద్దతు ధర నిర్ణయించింది. మార్కెట్లలో రూ.1,760 వరకు మాత్రమే లభిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు మార్కెట్ యార్డులకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. మొక్కజొన్న ధరల మద్దతు పథకంలో లేనందున కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మొక్కజొన్న కొనుగోళ్లను చేపట్టింది. గత ఏడాది రూ. 902 కోట్లతో 3.76 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. ఇప్పటిదాకా అదే అత్యధికం. ఇప్పుడు పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని రైతులు పండించిన పంటలో సగం మేరకు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.4,000 కోట్లు అవసరం కాగా దానికి బ్యాంకు నుంచి రుణం పొందేందుకు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. దీనికి మంత్రిమండలి ఆమోదించింది.కొనుగోలు కేంద్రాలు పెరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పంట భారీఎత్తున సాగయిన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా జిల్లాల వారీగా మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు కోరింది. మార్కెట్ యార్డులతో పాటు సహకార సంఘాల్లోనూ కేంద్రాలను ప్రారంభించనుంది. ఇప్పటి వరకు 209 కేంద్రాలు ఏర్పాటు చేసి 36 వేల మంది రైతుల నుంచి 1,67,715 టన్నులు కొనుగోలు చేసింది.

24 Apr, 2026
