వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, గతంలో సర్వేల కోసం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ముందుకు పడని పలు ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 16 పథకాలకు సర్వే, ఇన్వెస్టిగేషన్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు (జీవో ఎం.ఎస్‌.నం-34) జారీ చేశారు. ఇన్ని పథకాలకు ఒకేసారి, అదీ ఒకే ఉత్తర్వుతో డీపీఆర్‌ల తయారీకి ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ పలు దఫాలుగా నీటిపారుదలశాఖ అధికారులు, సీనియర్‌ న్యాయవాదులు, సలహాదారులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లతో చర్చించిన తర్వాత అన్ని పథకాలకు ఒకేసారి ఆదేశాలు జారీ అయ్యాయి. *ముఖ్య వివరాలివీ…*ఈ నెల 23 నుంచి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వచ్చిన జీవో లోని ముఖ్యమైన అంశాలు, ఏయే పథకాలకు డీపీఆర్‌ తయారీ అన్న వివరాలు ఇలా ఉన్నాయి.

* రేలంపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరును నాలుగు నుంచి పది టీఎంసీలకు పెంచడం. గట్టు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 1.32 నుంచి ఐదు లేదా పది టీఎంసీల సామర్థ్యానికి పెంపు. జూరాల నుంచి నాలుగు టీఎంసీలు తీసుకొని అదనంగా 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నెట్టెంపాడు రెండో దశ

* పులిచింతల వెనక భాగం నుంచి బొజ్జతాండా, భీమతాండా ఎత్తిపోతలు. 0.5 టీఎంసీ వినియోగంతో మట్టంపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో 1,380 ఎకరాల ఆయకట్టుకు నీరందించడం. .

* కల్వకుర్తి ఎత్తిపోతల రెండో దశ కింద శ్రీశైలం నుంచి 13 టీఎంసీలను మళ్లించి 93,531 ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి. ఇందుకోసం కాలువలు, హెడ్‌వర్క్స్‌ సామర్థ్యం పెంచడంతోపాటు తాగునీటికి 7.12 టీఎంసీలు వినియోగించుకొనేలా మౌలిక సదుపాయాల కల్పనకు నివేదిక తయారీ.

* జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 టీఎంసీలు మళ్లించేలా వరద కాలువ పథకం. నల్గొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో 11.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు… మార్గం మధ్యలో చెరువులను నింపడం. జూరాల వెనక భాగం నుంచి వరద సమయంలో 123 టీఎంసీలను మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు సరఫరా చేయడం.

* కోయిల్‌సాగర్‌ కింద 3.3 టీఎంసీలతో అదనంగా 13,500 ఎకరాలకు సాగునీరు.

* మహబూబాబాద్‌ జిల్లాలో 1.3 టీఎంసీలతో 13,201 ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు మహబూబాబాద్‌ మండలం ఏదుల పూసపల్లి వద్ద మున్నేరు నదిపై బ్యారేజీ నిర్మాణం. ఇదే జిల్లాలోని మరిపెడ మండలం విసంపల్లి గ్రామం వద్ద ఆకేరు నదిపై 1.2 టీఎంసీలతో బ్యారేజీ నిర్మాణం. గార్ల మండలం ముల్కనూరు గ్రామం వద్ద 11,871 ఎకరాలకు నీరిచ్చేందుకు మున్నేరుపై 1.2 టీఎంసీలతో బ్యారేజీ.

* మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ముల్కపల్లి వద్ద 25 నుంచి 35 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం.

ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం ఏదులచెరువు గ్రామం వద్ద ఆకేరు నదిపై బ్యారేజీ నిర్మించి 1.3 టీఎంసీల వినియోగంతో 13,129 ఎకరాలకు నీటిసరఫరా. శ్రీశైలం ఎడమగట్టు కాలువకు కొనసాగింపుగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామం వద్ద నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ రోజుకు ఒక టీఎంసీ చొప్పున మళ్లించి 35 టీఎంసీల వినియోగంతో 3.99 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటిసరఫరా. క హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటి అవసరాలకు 3 రిజర్వాయర్ల నిర్మాణం. దేవులమ్మనగరం, దండుమల్లారం వద్ద పదేసి టీఎంసీల చొప్పున, ఆరుట్ల వద్ద 5 లేదా 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లకు డీపీఆర్‌ తయారీ.