సన్న బియ్యానికి గిరాకీ బాగా ఉండటంతో రైతులు కూడా వాటిని పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ రకాలతో పోలిస్తే క్వింటాలుకు రూ.250 వరకు అధిక ధర లభిస్తుంది. అయితే అన్ని రకాలూ అన్ని ప్రాంతాల్లో సాగుకు అనుకూలం కాకపోవడంతో.. సరైన దిగుబడులు రావడం లేదు. తమ ప్రాంతానికి ఏ రకం అనుకూలమైనదో గుర్తించి సాగు చేస్తే పంట లాభదాయకం అవుతుంది. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధన స్థానంలో ఎకరం భూమిలో 15 సన్న రకాల వరిని సాగు చేసి అక్కడి శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భూముల తీరుకు అనుగుణంగా అనువైన రకాల ఎంపిక, నారు నుంచి కోత వరకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై మార్టేరు వరి పరిశోధనా స్థానానికి చెందిన గోదావరి మండలం సహ పరిశోధన సంచాలకుడు టి. శ్రీనివాస్, విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త కృష్ణాజీ వివరాలు తెలియజేశారు.
సాగు విధానం ఇలా: విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. నానబెట్టి మడి కట్టి (విత్తనాలపై గడ్డి కప్పి) 24 గంటల తర్వాత నారుమడిలో చల్లితే బాగా మొలకలు వస్తాయి. నారు బాగా రావడానికి సెంటు మడికి నత్రజని, భాస్వరం, పొటాష్లు కిలో చొప్పున వేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ., కాలిబాట ఉండేలా నాట్లు వేయాలి. దీంతో తెగుళ్ల ఉనికి గమనించవచ్చు. కలుపు నివారణకు ఎకరాకు 1.25 లీటర్ల బుటాక్లోర్ వాడాలి. ఉల్లికోడు తెగులుకు ఎకరానికి 10 కిలోల కార్బోప్యురాన్ చల్లాలి. వ్యాధులు, తెగుళ్లకు అనుగుణంగా వ్యవసాయాధికారుల సలహాల మేరకు మందులు చల్లాలి.
లాభాలు మెండు.. 1000 సన్న గింజల బరువు 13 నుంచి 15 గ్రాములు ఉండాలి.. బియ్యం పొడవు వెడల్పు నిష్పత్తి 2:5 కన్నా ఎక్కువగా ఉంటుంది. అన్నం ముద్ద కాకుండా మెతుకు పై నిలువు గీత లేకుండా ఉంటుంది. ఈ లక్షణాల వల్ల సాధారణ రకాల కంటే బస్తాకు రూ.250 ఎక్కువ ధర ఉంటుంది.
ఎకరాకు 35 బస్తాలు.. రూ.9వేల అదనపు ఆదాయం: నారు నుంచి కోత వరకు శాస్త్రవేత్తలు చెబుతున్న యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 35 బస్తాల (బస్తా 75 కిలోలు) వరకు దిగుబడి సాధించవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం సన్నాలకు ఉన్న డిమాండ్ ప్రకారం ఆదాయం కూడా పెంచుకోవచ్చు. సాధారణ రకాల కంటే బస్తాకు రూ.250 వరకు అదనంగా బయట మార్కెట్లో ధర వస్తుంది. అంటే ఎకరా నికి దాదాపు రూ. 9 వేల వరకు అధిక ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాగుకు అనుకూల రకాలివే..
రాయలసీమ, తెలంగాణలో అన్ని ప్రాంతాలకు ఎన్ఎల్ఆర్ 34449, ఎన్ఎల్ఆర్ 3354, ఎన్ఎల్ఆర్ 3648, ఎన్డీఎల్ఆర్ 7, ఎంటీయూ 1282, ఎంటీయూ 1426, ఎంటీయూ 1224
ఏలూరు, కృష్ణా, బాపట్ల, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం: బీపీటీ 5204, ఎంసీఎం 103
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి: ఆర్ఎన్ఆర్ 15048, కెఎన్ఎం 1638, కేఎన్ఎం 733
పల్నాడు జిల్లా: జేజీఎల్ 348
అన్ని ప్రాంతాల్లో సేంద్రియ సాగుకు: జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా

3 May, 2025
