తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) డైరెక్టర్‌ చెరుకుమల్లి శ్రీనివాసరావు తెలిపారు. డైరెక్టర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన్ను భారత మృత్తికా శాస్త్ర సంఘం హైదరాబాద్‌ చాప్టర్‌ సోమవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో సన్మానించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వర్సిటీ శాస్త్రవేత్తలు నూతన పరిశోధనలతో ముందుకు సాగాలని, విద్యార్థులు ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, మృత్తికా శాస్త్రం మరింత కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌, విస్తరణ సంచాలకుడు యాకాద్రి, పూర్వ ఉపకులపతి డాక్టర్‌ పద్మరాజు, మృత్తికా శాస్త్ర విభాగాధిపతి జయశ్రీ. హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రధాన కార్యదర్శి పవన్‌ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వర్సిటీలో యంత్ర ప్రదర్శన
వ్యవసాయ వర్సిటీలో సోమవారం రాష్ట్రస్థాయి వ్యవసాయ యంత్రాల ప్రదర్శన నిర్వహించారు. న్యూమాటిక్‌ ప్లాంటర్‌, రిమోట్‌ ఆపరేటెడ్‌ మల్టీపర్సన్‌ అగ్రికల్చర్‌, ఇతర ఆధునిక యంత్రాలు, వాహనాలను ప్రదర్శించారు. వ్యవసాయ యంత్ర పరికరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త రాజయ్య, వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త దామోదర్‌రాజు, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుజాత, ఏరువాక తాండూరు కేంద్రం కోఆర్డినేటర్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొని వాటి గురించి తెలిపారు.