- మందం, ప్రకాశంతమైన రంగుతో ప్రత్యేకత
- సౌందర్య సాధనాలు, ఆహార, పానీయాలు, వస్త్ర పరిశ్రమల్లో వినియోగం
వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) దండా రాజిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప 984వది అని, తెలంగాణ నుంచి నమోదైన వాటిలో అది 18వది అని ఆయన వివరించారు. పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీ… జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి. వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోద ముద్ర వేస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది.
వరంగల్ నేలలు, వాతావరణం అనుకూలం
వరంగల్ చపాటా మిరపకాయ పండ్లు లావుగా, ప్రకాశంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. కొద్దిగా టమాటా ఆకారంలో ఉండే వీటిని ‘టమాటా మిరప కాయ’ అని కూడా పిలుస్తారు. తక్కువ ఘాటుతో రుచికరంగా, శుద్ధికి,ఎగుమతికి అనువువగా ఉంటాయి. పచ్చళ్లకు చపాటా మిర్చి పొడిని అధికంగా వాడుతుంటారు. మిఠాయితో పాటు ఆహార, సౌందర్యసాధనాలు, పానీయాలు, ఔషధ, వస్త్ర పరిశ్రమల్లోనూ చపాటా మిర్చిని రంగుగా ఉపయోగిస్తున్నారు. స్థానిక నేలలు, వాతావరణ అనుకూలతల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ పంట ఎక్కువగా సాగవుతోంది. ఇక్కడ 20 వేల మందికి పైగా రైతులు ఏటా దాదాపు 7 వేల ఎకరాల్లో 10 వేల టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ పంటను 80 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. భౌగోళిక గుర్తింపు లభించడం ద్వారా వరంగల్ చపాటా మిర్చి పంటకు డిమాండ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి లభించనుందని ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. చపాటా మిర్చి సాగు చేసే రైతులకు భౌగోళిక గుర్తింపు ద్వారా ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయని మల్యాల లోని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె. భాస్కర్ వివరించారు. జీఐ కారణంగా చపాటా మిరపకు అంతర్జాతీయ విపణిలో మంచి ధర లభించి రైతుల ఆదాయం పెరగనుందని తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యకక్షుడు రాజ్కుమార్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

