దేశవ్యాప్తంగా మత్స్యరంగం పురోగమిస్తుండగా… కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు) ప్రధాన కార్యాలయాన్ని రూ.100 కోట్లతో భారీగా విస్తరించాలని కేంద్ర మత్స్యశాఖ నిర్ణయించింది. పది ఎకరాల్లో పెద్ద ఆడిటోరియం, ప్రదర్శనశాల, ప్రయోగశాలలను ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతించింది. 2006లో హైదరాబాద్‌లో ఎనఎఫ్‌డీబీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజేంద్రనగర్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా… 2012లో చేప ఆకారంలో దానిని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఐదు ఎకరాల స్థలం సరిపోనందున మరింత భూమి కావాలని కేంద్ర మత్స్యశాఖ రాష్ట్ర ప్రభుత్త్వాన్ని కోరగా దానికి అనుగుణంగా సర్కార్ ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పది ఎకరాలను కేటాయించింది. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపట్టనున్నారు.*ప్రత్యేక ఎగుమతుల విభాగం…* దేశంలో మత్స్య ఎగుమతుల ప్రోత్సాహానికి వీలుగా ఎగుమతుల విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. భారీ భవనాన్ని నిర్మిస్తారు. ప్రాంగణంలో పెద్ద మత్స్య ప్రదర్శన కేంద్రం నిర్మిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేపలు, రొయ్యలు, ఇతర జలచరాలను ప్రదర్శిస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎక్జిబిషన్ లను నిర్వహిస్తారు.*అనేక సౌకర్యాలు* ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఉపయోగపడేలా జాతీయ స్థాయి మత్స్యప్రయోగశాలను నిర్మిస్తారు. దాదాపు ఆరు వందల సీట్లలో ఆడిటోరియాన్ని ఏర్పాటు చేస్తారు. మత్స్య నిర్వహణ కేంద్రాలను నెలకొల్పుతారు. రైతుల కోసం వసతిగృహాన్ని నిర్మిస్తారు.

30 Apr, 2026
