రెండేళ్లలో కోటిమంది రైతులకు లబ్ధి
కేంద్ర క్యాబినెట్ ఆమోదం
రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రూ. 2,481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 నాటికి సుమారు కోటి మంది రైతులు 7.5 లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగును చేపట్టడానికి ఈ నిధులు వెచ్చిస్తారు. భూసార నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార-ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. సుముఖత వ్యక్తం చేసిన పంచాయతీల పరిధిలో 15,000 క్లస్టర్లు ద్వారా ప్రకృతి సేద్యం జరిగేలా ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. 2019-20 నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే 10 లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు.

