తెలంగాణా రాష్ట్ర సచివాలయంలోని సీఎంవో సెక్రెటరీ శేషాద్రితో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమావేశమయ్యారు. రైతు కమిషన్ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చేసిన పర్యటనలు, అక్కడ అమలవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలపై కమిషన్ తయారు చేసిన నివేదికలను ఆయనకు అందించారు. ప్రధానంగా ఎఫ్‌పీవోల విషయంలో తెలంగాణ రాష్ట్రం వెనుకంజలో ఉందని, ఇతర రాష్ట్రాల్లో ఎఫ్పీవోలు బలంగా పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ఆర్ధికంగా బలోపేతం కావడంలో ఎఫ్‌పీవోలు కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పుకొచ్ౘ్ారు. రైతు కమిషన్ కేరళ, మహారాష్ట్రలోని నాసిక్‌లో పర్యటించిన సమయంలో ఎఫ్‌పీవోల ప్రభావం స్పష్టంగా కనిపించిందన్నారు. కేంద్రం కూడా ఎఫ్‌పీవోల ఏర్పాటుకు సానుకూలంగా వున్న విషయాన్ని కూడా సీఎంవో సెక్రెటరీ శేషాద్రికి కోదండరెడ్డి గుర్తుచేశారు. నాసిక్ లోని సహ్యాద్రి ఎఫ్ పీవో దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తుందని వివరించారు. తెలంగాణలో కూడా ఎఫ్‌పీవోల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటాదన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థ, కౌలు రైతు విధానాలపై కేరళ రాష్ట్రంలో అమలవుతున్న పాలసీలపై కమిషన్ రూపొందించిన నివేదికలను సైతం సీఎంవో సెక్రెటరీకి అందించారు.