ఉద్యాన పంటల సాగు పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) అమలు చేస్తున్నాయి. వీటి అమలుతో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు భారీగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. 2025-2026 సంవత్సరానికి రాయితీలకుగాను కరీంనగర్ జిల్లాకు రూ. 3,11,00,000 నిధులు కేటాయించారు. పంటనుబట్టి ఎకరాల పరిమితి వేర్వేరుగా ఉంటుంది.*ప్రతి ఎకరాకు రాయితీ వివరాలు ఇలా (రూ.లలో)..* డ్రాగన్ ఫ్రూట్ 65,000, ముదురు మామిడి తోటల పునరుద్ధరణ 9,600, టిష్యు కల్చర్ అరటి సాగుకు 16,800, అవకాడో 12,000, బొప్పాయి 7,200, అధిక సాంద్రత విధానంలో మామిడి సాగుకు 19,200, నిమ్మ సాగుకు 19,200, జామ చెట్లకు 19,200. మిర్చి, టమాట, వంకాయ (వంగ), క్యాబేజి, కాలిఫ్లవర్ నారుకు ఎకరాకు 10 వేలు, వంకాయ, కాకర, బీర అంట్లు కట్టిన మొక్కలు అందిస్తారు. తాడు సాయంతో కూరగాయల సాగుకు, షేడ్‌నెట్ విధానంలో పువ్వులు, కూరగాయల సాగుకు 4 వేల చొప్పున రూ.35.5 లక్షల వరకు రాయితీ ఇస్తారు. గులాబీ, మల్లె తోటల పెంపకానికి 8 వేలు, దుంప లిల్లి, తదితర దుంప పువ్వుల సాగుకు 16 వేలు, మల్చింగ్ విధానంలో పండ్లు, కూరగాయలు, పువ్వుల సాగులకు 8 వేలు, కనీసం పన్నెండు ఏళ్లపాటు శాశ్వత పందిరి సాగు చేసే రైతులకు అర ఎకరాకు 50 వేలు.*ఇతర అంశాలకు..* సమీకృత సమగ్ర సస్యరక్షణ కింద వేసే అన్ని పంటలకు ఎకరాకు రూ.600 చొప్పున రాయితీ ఇస్తారు. తేనెటీగల పెంపకానికి 700 బాక్స్‌లకు, ఒక్కో దానికి రూ.2,400, తేనె తీసే పరికరానికి రూ.8 వేలు రాయితీ ఇస్తారు. ప్యాకింగ్, గ్రేడింగ్ షెడ్డు కింద నాలుగు యూనిట్లకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రాయితీ ఇస్తారు. మామిడి, అరటి పండ్ల బ్యాగులకు 12.5 ఎకరాల్లో, ఎకరాకు రూ.10 వేలు ఇస్తారు. 1100 ఎకరాల్లో బిందు సేద్యానికి, 275 ఎకరాల్లో స్ప్రింక్లర్లు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, సన్న, చిన్న కారు, బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ ఉంటుంది. ప్రీ కూలింగ్ 2 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.1,75,000, కాయలను పండ్లుగా మాగబెట్టే 1 యూనిట్‌కు రూ. 35 లక్షలు, 3 చిన్న ట్రాక్టర్లకు రూ.2.45 లక్షల చొప్పున, 9 పవర్ టిల్లర్లకు రూ. లక్ష చొప్పున రాయితీ, 18 పవర్ వీడర్లకు ఒక్కో దానికి రూ.75 వేల రాయితీ, 29 బ్రష్ కట్టర్లకు ఒక్కో దానికి రూ.20 నుంచి 25 వేల రాయితీ, 5 వర్మికంపోస్టు యూనిట్లకు ఒక్కో దానికి రూ.50 వేల రాయితీ ఇస్తారు. కరీంనగర్ జిల్లాలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. కరీంనగర్- 89777 14035, హుజూరాబాద్-89777 14037, చొప్పదండి 89777 14036, మానకొండూర్- 89777 14034 ఉద్యాన అధికారుల చరవాణి నంబర్లలో సంప్రదించవచ్చు.*అర్హుల నుంచి త్వరలో దరఖాస్తులు* అర్హులైన రైతులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తాం. కరీంనగర్ జిల్లాలో పండ్లు, కూరగాయలు, పువ్వుల తోటల పెంపకానికి కృషి చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వారు సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. *- ఆర్. శ్రీనివాస్ రావు, డీడీ, జిల్లా ఉద్యాన శాఖ*

3 May, 2025
