నాఫెడ్‌ ద్వారా పసుపు కొనుగోలు చేయాలి

కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌కు మంత్రి తుమ్మల లేఖ

భారత వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌) ద్వారా మార్కెట్‌ జోక్య పథకం (ఎంఐఎస్‌) కింద తెలంగాణలో పసుపు పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు లేఖ రాశారు. మార్చి నెలలో అధిక మొత్తంలో పసుపు పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Read More

మహిళా స్వయం సహాయక బృందం ద్వారా పసుపుకు విలువ జోడింపుతో మహిళా సాధికారత

వ్యవసాయంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. విత్తనం నాటడం నుండి  పంట కోత వరకు అన్ని వ్యవసాయ కార్యకలాపాలలో  మహిళల పాత్ర విడదీయలేనిది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కుటుంబ వ్యవసాయంలో మహిళలు లేకుండా పంట పండించడం అసాధ్యమని చెప్పవచ్చు. మన దేశంలో సుమారు 78 శాతం మహిళలు వ్యవసాయం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 70 శాతం వ్యవసాయ పనులలో మహిళలు ముందుండి పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సుమారు 50%  మహిళలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వివిధ ఆహార ఉత్పత్తులలో 60% మహిళలు ఉత్పత్తి చేస్తున్నవే. అనాదిగా మహిళలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నప్పటికీ మహిళా సాధికారత ముఖ్యంగా ఆర్థిక సాధికారత అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ముఖ్యంగా మహిళల్లో ఆర్థిక సాధికారత,  ఆరోగ్యం,  పోషకాహార భద్రత, వ్యవసాయంలో బరువు పనులు, ముఖ్యంగా చాకిరి తగ్గించడం వంటి అంశాలపైనా ఈ రోజు ప్రపంచ దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను వివిధ కార్యక్రమాలలో భాగస్వామ్యులు చేయడంతోపాటు, మహిళా సంఘాల ద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు  స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి.

ఆహారం, సౌందర్య సాధనాలు మరియు ఔషధ పరిశ్రమలకు పసుపు అత్యంత విలువైన మరియు ముఖ్యమైన ముడిసరుకు. భారతదేశంలో సుమారు 0.29  మిలియన్‌ హెక్టార్లలో పసుపు సాగు చేస్తున్నారు. తద్వారా ఏటా 1.1 మిలియన్‌ టన్నుల పసుపు ఉత్పత్తి జరుగుతుంది. ఇది ప్రపంచంలోని మొత్తం పసుపు ఉత్పత్తిలో సుమారు 70 శాతం. తెలంగాణ రాష్ట్రంలో 0.3 మిలియన్‌ టన్నుల పసుపును  సుమారు 49,000 హెక్టార్లల లో సాగు చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నాము. తెలంగాణ వాటా దేశ పసుపు ఉత్పత్తిలో సుమారు 29.5%. పూర్వపు నాలుగు జిల్లాలు కరీంనగర్‌ (29%), ఆదిలాబాద్‌ (23%), వరంగల్‌ (22%), నిజామాబాద్‌ (18%) రాష్ట్రంలోని పసుపు ఉత్పత్తిలో 92% వాటాను కలిగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  నీటి ప్రాజెక్టులు,  24 గంటల ఉచిత కరెంటు,  రైతుబంధు, రైతు బీమా మరియు వ్యవసాయ మరియు ఇతర అనుబంధ రంగాల సబ్సిడీల వలన ఈరోజు  తెలంగాణ రాష్ట్రంలోని  వివిధ ప్రాంతాలలో పసుపుతో పాటు ఇతర వ్యవసాయోత్పత్తుల పెరుగుదలకు  ఎంతో దోహదం చేశాయి. ఇక్కడ మనం ఒక సామెతను గుర్తు చేసుకోవాలి ”ధాన్యం ప్రాసెసింగ్‌, ధాన్యం ఉత్పత్తికి సమానం”. కావున పండించిన పంటలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి, విలువ జోడించి  నాణ్యమైన ఆహార పదార్థాలు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేసి సరసమైన ధరలకు  ప్రజలకు  అందించవలసిన అవసరం ఉంది. తద్వారా క్షేత్రస్థాయిలో పంట నష్టాలను తగ్గించి, ఇటు ఉత్పత్తిదారుడుకి మరియు వినియోగదారుడికి  లాభంచేకూర్చేవిధంగా  మహిళల ద్వారా పసుపుకు  విలువ జోడించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల కూరలలో మరియు వివిధ రకాల ఆహార పదార్థాలలో పసుపు పొడి విరివిగా వినియోగిస్తున్నాం. మనం మార్కెట్లో చూసే చాలా రకాల ఆహార పదార్థాలలో పసుపు పొడి తో పాటు వాటి నుండి తీసిన ఓలియోరెసిన్‌, నూనె మరియు కర్క్యుమిన్‌ రంగు పదార్థాలను వివిధ రకాల మసాలాలు, ఊరగాయలు, సాస్‌ మరియు గ్రేవీస్‌,  పొడి చేర్పులు, బేకింగ్‌ మిశ్రమాలు, టేస్ట్‌ మేకర్స్‌, మాంసాహార ఉత్పత్తులలో, బేకరీ, స్నాక్స్‌, చాక్లెట్‌, పానీయాల, సౌందర్య సాధనాలు, రోగనిరోధక ఏజెంట్‌, ఫార్మాస్యూటికల్స్‌ అప్లికేషన్స్‌, సబ్బులు, జీవ పురుగుమందు మరియు టూత్‌ పేస్ట్‌ తయారీలో భాగంగా పరిశ్రమల ముడిసరుకుగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు.

పసుపు : ప్రసిద్ధ వాణిజ్య రకాలు

*    దుగ్గిరాల (ఎర్ర గుంటు), ప్రతిభ, ఆర్మూర్‌, మైదుకూరు, రోమా

*    అలెప్పీ ఫింగర్‌ టర్మరిక్‌

*    మద్రాస్‌ పసుపు (ఈరోడ్‌ / సేలం)

*    లక డాంగ్‌ పసుపు 

*    రాజపోరి పసుపు

*    టేకూర్పేట్‌, సుగంధం

*    వైనాడ్‌, మన్నుతి

టర్మరిక్‌ (పసుపు పొడి) ప్రాసెసింగ్‌ యూనిట్‌

నిర్మాణం: మహిళలు వారి యొక్క గ్రామాలలో అందుబాటులో ఉన్న చిన్న పాటి 150 నుండి 250 చదరపు మీటర్ల షెడ్‌ లేక గోడౌన్‌ వంటి  నిర్మాణంలో గాని  లేదా పాత ఇల్లు, బిల్డింగ్‌ వంటి నిర్మాణంలో  చిన్న చిన్న మార్పులు చేసి పసుపు పొడి యంత్రాలను వాటి సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేసుకుని శుభ్రమైన పరిసరాలలో పసుపు కొమ్ములను పసుపు పొడిగా మార్చి మంచి అందమైన, సౌలభ్యంగా ఉండే  ప్లాస్టిక్‌ కవర్‌, డబ్బాలు లేదా  సీసాలలో  నింపి మార్కెటింగ్‌ చేసినట్లయితే మంచి లాభం ఉంటుంది.

యంత్రాలు: నెలకు 15  టన్నుల పసుపు పొడి  తయారు చేయడానికి ఈ క్రింది  యంత్రాలు  అవసరం.  మార్కెట్లో చాలా రకాల కంపెనీలు  వాటి సామర్థ్యము, నిర్మాణం  మొదలైన అంశాలపై నా  ఆధారపడి  వాటి ధరలు ఉంటాయి.  

మనదేశంలో పసుపు  కొమ్ములు లేదా పసుపు పొడి  వ్యాపారం ప్రారంభించాలంటే  కేంద్ర ఆహార భద్రత ప్రామాణిక సంస్థ (FSSAI) నుండి లైసెన్సు తీసుకోవాలి. అంతేకాకుండా సంస్థ నిర్దేశించిన  ప్రమాణాలు పాటించాలి.

Turmeric powder

కేంద్ర ఆహార భద్రత ప్రామాణిక సంస్థ (FSSAI) ప్రకారం మిరపకాయలు మరియు పసుపు పొడిలో ఈ క్రింద ప్రమాణాలు  ఉండాలి.

పసుపు పంటలకు విలువ జోడించడం వలన కలిగే లాభ నష్టాల పైన వ్యాపార (SWOT) విశ్లేషణ

బలాలు: 

  • తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో పసుపు యొక్క ప్రధాన ఉత్పత్తిదారు.
  • వివిధ జిల్లాలలో  సారవంతమైన నేలలు ఉండడం
  • విస్తృత అనుకూలత/ఆమోదయోగ్యత/ దేశీయ ఞ ఎగుమతి మార్కెట్‌లు  రెండింటికీ అనువైన మరియు అవసరమైన పసుపు  రకాలను మన రాష్ట్రంలో సాగు చేస్తున్నాము.
  • రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో   రైతులు మరియు వారి కుటుంబ సభ్యులకు  పసుపు ప్రాథమిక ప్రాసెసింగ్‌  థలో చేపట్టవలసిన పసుపు తవ్వడం, శుభ్రపరచడం, రైజోమ్‌లను వేరు చేయడం, ఉడకబెట్టడం,  ఎండబెట్టడం వంటి వాటిపైన  విశేష అనుభవం ఉన్నది.
  • హైదరాబాద్‌ మరియు దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార, ఫార్మాస్యూటికల్‌, న్యూట్రాస్యూటికల్‌, ఆయుర్వేద,  కాస్మోటిక్‌  వంటి తయారుచేసే   కంపెనీలు ఎక్కువ మోతాదులో  వస్తున్నాయి కాబట్టి వాటికి  పసుపు ఒక ముఖ్యమైన ముడిసరుకు.
  • అన్ని రకాల రవాణా వ్యవస్థలు దేశం నలుమూలల నుండి మన రాష్ట్రానికి అభివృద్ధి చెంది ఉండటం   వలన పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులను  సులభంగా మార్కెట్‌ చేసుకోవచ్చు 
  • వేగవంతమైన పట్టణీకరణ మరియు పెరుగుతున్న టైర్‌-|| & టైర్‌ -3 నగరాలు
  • గ్రామీణ ప్రాంతాలలో కూడా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు  పెరుగుతున్న అనుకూల వాతావరణం,  ఆహారశుద్ధి పాలసీలు
  • వివిధ ప్రాంతాల ప్రజల రుచికి తగినటువంటి  ఆహార పదార్థాలు,  ఇతర స్నాక్స్‌, తిను బండారాలు మొదలైనవి తయారు చేసే ఆధునిక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అందుబాటులో ఉండడం
  • గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన గ్రామీణ యువతీ యువకులు  అధికంగా ఉండడం
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ద్వారా రైతుల ఆదాయం రెట్టింపుతో పాటు పంట కోత అనంతరం నష్టాలను తగ్గిస్తుంది. అన్ని కాలాలకు అనుగుణంగా  పండే వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత పదార్థాలుగా మార్చడం ద్వారా అన్ని సమయాలలో ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు.

బలహీనతలు

  • వర్షాధార పరిస్థితులు, పంట వైవిధ్యం లేకపోవడం
  • మెరుగైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మిల్లుల నిర్వహణ పద్ధతులను అవలంబించలేదు తద్వారా ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలలో నాణ్యత లోపించడం, ఎక్కువ కాలం నిలువ చేయలేకపోవడం
  • వివిధ జిల్లాలలో పండించే పసుపు పంటకు అనువైనటువంటి ఆహార శుద్ధి పరిశ్రమలు లేకపోవడం.   
  • ఎక్కువ మొత్తంలో  ఆహారశుద్ధి పరిశ్రమలు పట్టణ ప్రాంతాలలో నెలకొల్పడం 
  • మార్కెట్లోకి ఎక్కువ మోతాదులో  పంట చేతికి వచ్చినప్పుడు ధరల ఆటుపోట్లకు లోనవ్వడం
  •  ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని సందర్భాల్లో పంట కోత సరైన నిల్వ చేసే గోడౌన్లు లేకపోవడం అనంతరం తీవ్ర నష్టం జరగడం 

అవకాశాలు

  • జీవ సంబంధ కారకాలు, వాతావరణ (తేమ, అధిక లేదా చల్లని ఉష్ణోగ్రత) మార్పులను తట్టుకొనే వంగడాలను తయారు చేయడం
  • పండించిన మొత్తం  పసుపు కొమ్ములు ఎక్కువ కాలం నిల్వ చేయడం, వివిధ రుచులతో కూడిన నాణ్యమైన  ఆహారపదార్థాలను ప్రజలకు అందించడం కోసం సరికొత్త టెక్నాలజీ వృద్ధి చెందే అవకాశం
  • తక్కువ కాలవ్యవధి కలిగిన వంగడాల అభివృద్ధి
  • గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి మరియు విత్తనం నుండి తయారు చేసిన ఆహార పదార్థాలు వినియోగదారుడి వంటశాలకు చేరే వరకు విలువ గొలుసు (VALUE CHAIN)ను అభివృద్ధి పరచడం
  • భవిష్యత్తులో భౌగోళిక ప్రయోజనాలు, రవాణా సౌకర్యాల మూలంగా తెలంగాణలో ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలకు మరింత గిరాకీ ఉండే అవకాశం ఉంది.
  • తలసరి ఆదాయం పెరగడంతో వినియోగదారుడు నాణ్యమైన ఆహారం కోసం  వెతకటం
  • ఆర్గానిక్‌ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలకు మరింత విలువ ఉండడం
  • తగినంత ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ ఉంటుంది

అపాయాలు

  • వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా సరైన సమయంలో  తగినంత వర్షపాతం లేకపోవడం మరియు  అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురవడం.
  • తక్కువ ఉత్పాదకత
  • ఈ ప్రాంతంలో కొత్త తెగుళ్లు మరియు వ్యాధులు
  • చిన్న మరియు మధ్య తరహా యూనిట్లలో నాణ్యత లోపించడం, ఎక్కువ కాలం నిలువ చేయలేకపోవడం
  • కల్తీ మరియు నాణ్యత లోపించడం
  • బహుళజాతి కంపెనీలు మరియు రిటైల్‌ సంస్థల నుండి తీవ్ర పోటీ ఉండడం.

మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న మరియు సూక్ష్మతరహా ఆహారశుద్ధి పరిశ్రమలు మరియు మహిళలు నడుపుతున్నటువంటి అసంఘటిత  కుటీర పరిశ్రమలను అధికారికంగా  నమోదు చేసి  వాటి ఆధునీకరణకు కావలసిన శాస్త్రీయ సాంకేతిక  మద్దతుతో పాటు, వ్యాపార అభివృద్ధికి కావాల్సిన  ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అధికారికీకరణ, ఒక జిల్లా ఒక రకమైన ఆహార ఉత్పత్తి  కేంద్రం వంటి విధానాలతో  స్థానిక పంటలకు విలువ జోడించుట, రైతులకు గిట్టుబాటు ధర అందించడం, ఆయా ప్రాంత ప్రజలకు కావలసిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం, గ్రామీణ మహిళలు, స్వయం సహాయక బృందాలు,  డ్వాక్రా బృందాల  ఉపాధి అవకాశాలను పెంపొందించడం  వంటి ముఖ్య ఉద్దేశాలతో  ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కింద ప్రారంభించిన పథకాలను రాష్ట్రంలోని మహిళా రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా బృందాలు ఉపయోగించుకుని  రేపటి మహిళా సాధికారత కొరకు అడుగులు వేయవచ్చు.

కేంద్ర ప్రాయోజిత  ప్రైమ్‌ మినిస్టర్‌ ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (PM-FME)  స్కీం మరియు ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP) పథకాల ద్వారా  నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ జిల్లాలలో ఉన్నటువంటి సూక్ష్మ మరియు చిన్న తరహా ఆహారశుద్ధి మిల్లులు ముఖ్యంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుండి  లేదా అంతకంటే ఎక్కువ కాలం నుండి నడుస్తున్నటువంటి పసుపు పొడి మిల్లులు, కారం పొడి, మరియు మసాలా దినుసుల మిల్లులు మొదలైనటువంటి యూనిట్‌ యజమానులు PM-FME పథకం కింద అప్లికేషన్‌  పెట్టుకుంటే  వారి యూనిట్‌ సాంకేతిక అభివృద్ధి మరియు మార్కెటింగ్‌ సదుపాయాలు అభివృద్ధి కోసం  సుమారు 10  లక్షల క్రెడిట్‌ లింక్‌  కల్పించి 3.5 లక్షల  సబ్సిడీ సదుపాయం లభిస్తుంది. పెట్టుబడి కోటి రూపాయల వరకు ఉన్నా  ప్రభుత్వం నుండి 10 లక్షల  సబ్సిడీ సాయం అందుతుంది. 10 లక్షల లోపు ఉంటే 3.5 లక్షల  సబ్సిడీ సాయం  లభిస్తుంది.  పైన పేర్కొన్న నిజామాబాద్‌ జిల్లాలో పసుపు ఎక్కువగా పండిస్తున్నారు కావున  ఈ జిల్లాలో కొత్త  కుటీర పరిశ్రమలు మహిళలు ఒక బృందంగా ఏర్పడి పసుపుకు విలువ జోడిస్తే  బాగా లాభం ఉంటుంది.  ఈ కొత్త పరిశ్రమ ఏర్పాటుకు సుమారు 10 లక్షల పెట్టుబడి పెట్టినట్లయితే 3.5 లక్షల  సబ్సిడీ సాయం లభిస్తుంది. తద్వారా  నెలకు 15 టన్నుల  పసుపు పొడి తయారు చేసి అమ్మవచ్చు. దేశవ్యాప్తంగా మహిళలు మరియు మహిళా సంఘాలు నడుపుతున్నటువంటి సుమారు 31,195 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, సుమారు 174.88  కోట్ల  వ్యయంతో వివిధ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పారు. తద్వారా 17026  స్వయం సహాయక  మహిళా బృందాలు లబ్ది పొందుతున్నారు. కావున మన రాష్ట్రంలో కూడా మహిళలు, డాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు  మరియు ఇతర సహకార సంఘాలు  ముందుకు వచ్చి పసుపు పొడి మరియు  ఇతర ఆహారశుద్ధి పరిశ్రమలను PM-FME పథకం కింద నెలకొల్పి ఆదాయంతోపాటు మహిళా సాధికారత దిశగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.  

ఎ. పోశాద్రి, యం. సునీల్‌ కుమార్‌, జి. శివ చరణ్‌, డి. మోహన్‌ దాస్‌, కె. రాజశేఖర్‌, వై. ప్రవీణ్‌ కుమార్‌, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్‌. ఫోన్‌: 9492828965

Read More