జూన్ 12న తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

దేశంలోనే రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964 జూన్ 12 వ తేదీన రాజేంద్రనగర్‌లో ఏర్పాటు అయింది. ప్రస్తుత వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనంతో పాటు ఇతర మౌలిక వసతుల సముదాయాన్ని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జూన్, 1966 లో ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రముఖ తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్బంగా జూన్ 12 వ తేదీన నిర్వహించ తలపెట్టిన 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భారత హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఇవ్వనున్నారు. అదే విధంగా యం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ ఈ జాతీయ సదస్సు అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్, విధాన విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం
ఈ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం, ఇతర మౌలిక వసతులని ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించి 60 ఏళ్ళు అయిన సందర్బంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశ్వవిద్యాలయం కోరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని నిర్వహించనున్నట్లు అల్దాస్ జానయ్య తెలిపారు.1966-84 మధ్యలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసి దేశానికి ఆహార భద్రతని అందించిన ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని, ఆనాటి రైతు అనుకూల విధానాలని, వివిధ సంస్థలని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉప కులపతి పేర్కొన్నారు. అందుకే ఈ 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.

Read More

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి

అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ అదికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలో వర్షాల బీభత్సంపై ఆయన బుధవారం ఆ జిల్లాతో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసు కురావాలని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు మార్కెటింగ్ అదికారులను వెంటనే మంచిర్యాలకు వెళ్లాలని ఆదేశించారు.

Read More

భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతుల్లో భయం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ…”రైతులు పంటల ఎంపిక, పెట్టుబడుల ప్రణాళిక, మార్కెట్ పరిస్థితుల అంచనాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిస్థితి ప్రతికూలంగా మారింది. వాణిజ్య ఒప్పందం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ఏ పంట వేయాలి… ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాల్లో రైతులకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందడం లేదు. దీంతో రాష్ట్రాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఎరువుల సరఫరా విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఏప్రిల్‌కు కేటాయించిన ఎరువులు ఇంకా అందలేదు. రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించాలి. ఎరువుల సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి” అని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

Read More

తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతః మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని కెఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో నిర్వహించిన వ్యవసాయ ఎగుమతులపై అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ మరియు వ్యవసాయ అభివృద్ధి విధానాల ఫలితంగా తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. అదే సమయంలో ఉద్యానవన పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందని, పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓ) సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.

ఉత్పత్తి పెంపుతోపాటు రైతులకు మెరుగైన ధరలు అందేలా చేయడం, కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను అంతర్ౙాతీయ మార్కెట్లకు తీసుకెళ్లాలంటే కేవలం ఉత్పత్తి పెరగడం మాత్రమే సరిపోదని, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ మరియు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కూడా అత్యంత అవసరమని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద మెగా ఫుడ్ పార్క్ ద్వారా ఆధునిక ప్రాసెసింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పించిందని వివరించారు. దీని ద్వారా రైతుల పంటలకు మెరుగైన మార్కెట్ లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉద్యానవన పంటల ఎగుమతులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరైన సరఫరా వ్యవస్థలు, ప్యాక్ హౌసులు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తే రాష్ట్రం అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ముందుకు వెళ్లగలదని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అదే సమయంలో రైతుల ప్రయోజనాలను కాపాడటం కూడా ఎంతో ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ మరియు వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలపై రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాలు దేశీయ రైతులపై ప్రభావం చూపే అవకాశముందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అలాగే అమెరికా వంటి దేశాలతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం అవసరమైనదే అయినా, అది దేశీయ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓ) వ్యవసాయ ఎగుమతులను విస్తరించడంలో కీలక పాత్ర పోషించగలవని మంత్రి చెప్పారు. రైతుల ఉత్పత్తులను సమీకరించడం, నాణ్యతను నిర్ధారించడం మరియు రైతులను నేరుగా ఎగుమతిదారులతో అనుసంధానం చేయడం ద్వారా చిన్న రైతులు కూడా ప్రపంచ మార్కెట్లలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. ఓఆంలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి మరియు ఇతర పరిశ్రమల సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రైతులు మరియు పారిశ్రామికవేత్తలలో అవగాహన పెంచేందుకు పలు శిక్షణ కార్యక్రమాలు మరియు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్-2047 వ్యవసాయం మరియు ఉద్యానవన రంగాల దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో ఉత్పత్తి పెంపుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహం మరియు రైతుల ఆదాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ముందంజలో నిలిచే పూర్తి సామర్థ్యం ఉందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలు మరియు రైతులు-పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ విస్తరణ మరియు వ్యవసాయ ఎగుమతుల పెంపుకు పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు నిర్వహించిన ఈ సెమినార్ వంటి కార్యక్రమాలు రైతులు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు మరియు విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకువస్తాయని మంత్రి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవడంలో, కొత్త ఎగుమతి అవకాశాలను గుర్తించడంలో మరియు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా ఉంటాయని చెప్పారు. ఈ సెమినార్‌లో ఎఫఐసిసి ప్రతినిధులతో పాటు ఎపిఇడిఎ, డిజిఎఫ్‌టి మరియు ఎగుమతి రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణాకు వెన్నెముక రైతులే

హైదరాబాదులో నిన్న ప్రారంభమయిన గ్లోబల్‌ సదస్సులో ”విలువ ఆధారిత ఉత్పత్తుల గొలుసు విధానం-రైతుల ఆదాయం రెట్టింపు” అనే అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”తెలంగాణకు వెన్నెముక రైతులే. జనాభాలో ఎక్కువ మంది జీవనోపాధికి సేద్యం వనరుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. గత రెండేళ్లలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయం, దాని అనుబంధ ఆర్థిక వ్యవస్థ దాదాపు 34.6 బిలియన్‌ డాలర్లు. 2047 నాటికి దీనిని 400 బిలియన్‌ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ఆ స్థాయిలో వృద్ధి సాధించడానికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌, రంగాల వారీ వ్యూహంతో పనిచేస్తున్నాం. అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్‌ వ్యవసాయం, డ్రోన్లు, యాంత్రీకరణ, మార్కెట్‌ లింకేజీలు, ఈ-ట్రేడింగ్‌ బలోపేతం, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీ.. లాజిస్టిక్‌ వ్యవస్థలు, సహకార సంస్థలు, వ్యవసాయ స్టార్టప్‌ల బలోపేతం, రైతు భరోసా, పంటలబీమా, వ్యవసాయ యంత్రాలకు రాయితీ, ఆహార శుద్ధి జోన్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం. ఇవి రైతుల ఆదాయాలను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయి. పొలం నుంచి మార్కెట్‌ వరకు మార్కెట్‌ ఆధారిత గొలుసు వ్యవస్థలను నిర్మించడం, గిట్టుబాటు ధరలను నిర్ధారించడం, వృథాను తగ్గించడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం’ అని తెలిపారు. చర్చలో భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు సలహాదారు శ్రీనివాసన్‌, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత మోదడుగు విజయ్‌ గుప్తా, కోసాంబ్‌ ఎండీ జె.ఎస్‌. యాదవ్‌, ఆదిత్య బిర్లా గ్లోబల్‌ ట్రేడింగ్‌ ఎండీ, సీఈవో రాజేష్‌ సోమాని, వ్యవసాయ పరిశోధన సంస్థ మాజీ అధిపతి డాక్టర్‌ సమరేందు మహంతి, మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్‌ అధ్యకక్షుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More

తడిసిన ధాన్యం కొంటాం

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు అందాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని, ప్రతి రైతునూ ఆదుకుంటామని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావిత కాలనీలు, నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయి… అక్కడి నుంచి మున్నేరుకు భారీగా వరద వస్తుండటంతో ఖమ్మంలోని కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.

Read More

డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పురుగుల మందుల, ఎరువుల వాడకాన్ని తగ్గే విధంగా 'ఏఐ' సాంకేతికతను వినియోగించాలి
  • తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్‌ లా కాకూడదు
  • నాణ్యమైన ఉత్పత్తులు తీసే విధంగా తెలంగాణ వ్యవసాయ విధానములో సమూలంగా మార్పులు తెచ్చే దిశలో యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • శాటిలైట్‌ డేటాతో నేలలో పోషకాల లభ్యతను పరీక్షించే సాంకేతికతను వివరించిన జర్మనీ ప్రతినిధులు
  • నేడు సెక్రటేరియట్‌లో ACRAT ప్రతినిధులతో సమావేశమై చర్చించిన మంత్రి తుమ్మల డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి తేవాలని, పర్యావరణానికి మేలు చేసే స్మార్ట్‌ వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు సచివాలయంలో జర్మనీకి చెందిన ACRAT ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ”డిజిటల్‌ అగ్రికల్చర్‌ తెలంగాణ రోడ్‌మ్యాప్‌” పత్రాన్ని మంత్రివర్యులకు అందజేశారు.
    మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ.. AI, IoT ఆధారిత డిజిటల్‌ వ్యవసాయ సేవలతో ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలి. పంజాబ్‌లా మరో క్యాన్సర్‌ బెల్ట్‌గా తెలంగాణ మారకూడదు. నేల ఆరోగ్యాన్ని కాపాడే, రైతు ఆదాయాన్ని పెంచే, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయం మన లక్ష్యం కావాలి” అన్నారు. జర్మనీ – భారత్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని తొలి ITU ప్రమాణిత డిజిటల్‌ వ్యవసాయ యూజ్‌కేస్‌ను వేములవాడలో విజయవంతంగా అమలు చేసినట్లు ప్రతినిధులు వివరించారు. ఉపగ్రహ, డ్రోన్‌, మరియు సెన్సర్‌ ఆధారిత ఈ మోడల్‌ ద్వారా నేలలోని N,P,K మరియు సూక్ష్మ పోషకాల లభ్యత విశ్లేషణ చేసి, అవసరమైన ఎరువుల పరిమాణాన్ని మాత్రమే సిఫారసు చేస్తున్నామని, AI ఆధారిత పంట గుర్తింపు మోడల్‌, ఉపగ్రహ డేటాతో సబ్సిడీలు, బీమా, రుణాల పారదర్శక పంపిణీ వంటి అంశాలను కూడా మంత్రికి వివరించారు. సమగ్ర డిజిటల్‌ వ్యవసాయ ప్లాట్‌ఫార్మ్‌ను రూపొందించి, రైతులు, పరిశోధకులు మరియు విద్యార్థులు, అందరూ ఉపయోగించుకోగల వేదికగా అభివృద్ధి చేయాలని మంత్రి గారు సూచించారు. ”ఈ సాంకేతికత రైతుల వ్యయాన్ని తగ్గించేలా, నేల ఆరోగ్యాన్ని కాపాడేలా మరియు పంట నాణ్యతను పెంచేలా ఉండాలన్నారు. ”రైతు ఆలోచన దిశగా వ్యవసాయ విధానాలు రూపకల్పన చేస్తేనే స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డా. గోపి డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ, డా రఘు చాలిగంటి (ITU-T SG20), డా. సెబాస్టియన్‌ బోసె (ఫ్రాన్హోఫర్‌ హెచెచ్‌ఐ), శ్రీ యాన్‌-క్రిస్టియన్‌ రెడ్‌లిచ్‌ (బాండ్‌ కన్సల్టింగ్‌ GmbH), ప్రొఫెసర్‌ జానయ్య గారు (వైస్‌ ఛాన్సలర్‌, పీజేటీఎస్‌ఏయూ), మరియు రమేశ్‌ రెడ్డి (చైర్మన్‌, పర్యాటక శాఖ) పాల్గొన్నారు.
Read More

ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ

  • దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం
  • ఫ్యాక్టరీలో ట్రయల్‌ రన్‌ విజయవంతం
  • సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తరణ
  • ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుంది….
  • త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం: మంత్రి తుమ్మల

నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీతో ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం నాడు అధికారులతో కలసి సిద్దిపేట జిల్లా నర్మేట్టలో ఆయిల్‌ఫెడ్‌ 300 కోట్లతో నిర్మాణం చేసిన పామాయిల్‌ ఫ్యాక్టరీ పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామని, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, అంతర పంటల సాగుతో అదనపు లాభాలు రైతులకు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుందనీ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు.

Read More
  • 1
  • 2