లోడర్, ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు : మంత్రి తుమ్మల

ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘ఎర్త్‌కాన్ ఎక్స్‌పో-2026’ ఎక్సిబిషన్లో ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల, స్టాల్‌లో ప్రదర్శించిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ, లోడర్, ఎక్సవేటర్ వంటి యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి యంత్రాలు రైతులకు పెద్ద ఎత్తున ఉపయుక్తమవుతాయని, తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునేందుకు తోడ్పడతాయని తెలిపారు. రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ తరహా వినూత్న యంత్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ
ఈ యంత్రాలను వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చినట్లయితే రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో పనిచేసే నమూనాలను కూడా త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు. బ్యాటరీ ఆధారిత యంత్రాలు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయాలని కోరగా, త్వరలోనే అలాంటి యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

2027 నాటికి ఈవీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ లక్ష్యం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.5 టన్నుల సామర్థ్యం గల మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మోడల్‌ను 2027 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే వినియోగదారుల కోసం ప్రత్యేక డెమో జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Read More

గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం

గొర్రెల పెంపకదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.

చిటుకు వ్యాధి గొర్రెలలో ఆకస్మిక మరణాలకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రెలు మేత తినకపోవడం, నీరసం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి.

అందువల్ల ఈ వ్యాధి నివారణకు టీకా వేయించడం అత్యంత అవసరం. టీకా ద్వారా గొర్రెలను చిటుకు వ్యాధి నుండి రక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను కూడా తగ్గించవచ్చు.

కావున అన్ని గొర్రెల కాపరులు, పెంపకదారులు తమ గ్రామాలలో నిర్వహించే ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి గొర్రెకు తప్పనిసరిగా టీకా వేయించాలి.

గొర్రెల ఆరోగ్యం – రైతు అభివృద్ధికి పునాది.
చిటుకు వ్యాధికి టీకానే రక్షణ!

Read More

నాణ్యమైన గొర్రెలు/మేకల మంద అభివృద్ధి కావాలంటే

ఆరోగ్యమైన మరియు జన్యుపరంగా మంచి నాణ్యత కలిగిన మందను అభివృద్ధి చేయాలంటే గొర్రెల/మేకల పెంపకందార్లు ప్రతి ఏటా “ఏరివేత”ని అవలంబించాలి. నాసిరకం జీవాలని ఎప్పటికప్పుడు గుర్తించి మందనుండి వేరుచేసి, ఆరోగ్యమైన జీవాలని మాత్రమే ఉంచడం వలన పోషణ ఖర్చు తగ్గి, జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.

పుట్టిన ఆడ జీవాల(పిల్లలు)లో ఆరోగ్యంగా, మంచి శరీర బరువు కలిగి ఉండి, జాతి లక్షణాలున్న వాటిని మందలో ఉంచుకోడానికి ఎంపిక చేసుకోవాలి. బలహీనంగా ఉండి, పెరుగుదల లేని, ఆరోగ్యంగా  లేని పిల్లల్ని, తల్లి పాలు సరిగా అందని వాటిని గుర్తించి ఏరివేయాలి. పుట్టిన పిల్లలకి పాలివ్వలేని తలుల్ని  వేరుచేసి, ఆరోగ్యంగా, పాలిచ్చే శక్తి కలిగిఉన్న తల్లుల్ని మాత్రమే మందలో ఉంచాలి. మంద సగటు బరువు కంటే తక్కువ బరువున్న జీవాల్ని, బలహీనంగా ఉన్నవాటిని, ఎదుగుదల లోపాలున్నవాటిని, ముసలివాటిని గుర్తించి ఏరివేయాలి. సకాలంలో ఎదకు రాని, చూలి నిలవని వాటిని, తరచుగా ఈడుసుకుని పోయే జీవాల్ని, పొదుగు వాపు సోకిన జీవాల్ని మందనుండి తీసివేయాలి. 

ఇక మగ జీవాల (పిల్లల) విషయానికొస్తే అధిక శరీర బరువు కలిగివుండి, జాతి లక్షణాలున్న 3-4 మగ జీవాల పిల్లల్ని మందలో ఉంచి, మిగితా వాటిని వేరు చేసి 6-7 మాసాలు పోషించి, మాంసం కొరకు అమ్మివేయాలి. మంచి జాతి లక్షణాలున్న మరికొన్నింటిని 12-18 నెలలు పోషించి పునరుత్పత్తి కోసం (విత్తనపు పొటేళ్లుగా) అమ్మివేయాలి. రెండు సంవత్సరాల పాటు మందలో ఉన్న పొట్టేలు/పోతులను తొలగించివేయాలి. లేనిచో మందలో “ఇన్ బ్రీడింగ” సమస్య  తలెత్తి, మంద నాణ్యత జన్యుపరంగా క్షీనిస్తుంది. కాబట్టి పొట్టేలు / పోతులను ప్రతి రెండేళ్లకోసారి మార్చుకోవాలి.

వంగిపోయిన కాళ్ళు, వెడల్పుగా ఉన్న భుజాలు, దవడ లోపాలు (పెద్దగా లేదా చిన్నగా ఉండడం), పగిలిన నోరు మొదలగు జన్యుపరమైన లోపాలున్న జీవాల్ని ఏరివేయాలి.  మంద పరిమాణం. వసతి, మేత వనరులు మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఏటా 10-20% జీవాల్ని ఏరివేయటం మంచిది.

డా. జె. సాయి ప్రసన్న, డా. సరిన్ కున్నత్, సహ ఆచార్యులు, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పీవీ నరసింహ రావు తెలంగాణ పశువైద్య విశ్వా విద్యాలయం, హైదరాబాద్. ఫోన్: 8008910925

Read More

స్థానిక విత్తన రకాలకు పటిష్ఠ సంరక్షణ

అస్థిర వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రత వంటి వాతావరణ మార్పులు వ్యవసాయానికి ముప్పుగా మారుతున్న తరుణంలో కరవును తట్టుకునే శక్తి, వ్యాధి నిరోధకత, అధిక పోషక విలువలున్న స్థానిక విత్తనాల సంరక్షణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇందుకు సామాజిక విత్తన బ్యాంకులు అవసరమని భావించి, సామాజిక విత్తన బ్యాంకుల నిర్వహణకు భారత ప్రమాణాల బ్యూరో (బీఎస్ఐ) రూపొందించిన నూతన మార్గ దర్శకాలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ సమాచారం ఇచ్చింది.

Read More

యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More

విస్తరణ సేవలను పటిష్టం చేస్తున్న కోరమాండల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గ్రోమోర్ గ్రామ్ పేరుతో వ్యవసాయ విస్తరణ సేవలను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో, 12 రాష్ట్రాల్లోని 101 గ్రామాలను కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎంపిక చేసింది. ఈ మోడల్ గ్రామాల రైతులు సమతుల్య పోషక పద్ధతులను అవలంబించి, స్థిరమైన దిగుమతులు సాధించేలా వారిని సాధికారులను చేస్తామని కోరమాండల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాధబ్ అధికారి తెలిపారు. భూసారానికి అనుగుణంగా ఎరువులు వాడటం, ఆధునిక సాంకేతికతతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ, రైతులకు కొత్త సాగు పద్దతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం లాంటివి ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు.

Read More

ప్రకృతిసాగుకు ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026’

ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్‌ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎనఎఫ్‌కు దక్కింది. ఈ అవార్డును స్వీడన్‌కు చెందిన కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తోంది. జూన్ 2న స్వీడన్‌లోని బస్టాడ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి. విజయ్ కుమార్, వ్యవసాయశాఖ ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 నామినేషన్లు రాగా.. అందులో ఏపీసీఎనఎఫ్ ఎంపికైంది. అవార్డు కింద ఏపీసీఎనఎఫ్‌కు 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14కోట్లు) అందజేశారు. ఫైనల్‌కు చేరిన కాన్షియస్ కిచెన్ (అమెరికా), నోపామ్ ఇంగ్రేడియంట్స్ (నెదర్లాండ్స్), సవన్నా ఇన్‌స్టిట్యూట్(అమెరికా) కు 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.4 కోట్ల) చొప్పున అందించారు. అవార్డు ద్వారా లభించే మొత్తంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రదర్శనా క్షేత్రాలు, ప్రత్యేక లీడర్‌షిప్ కోర్సు, రైతు శాస్త్రవేత్తలతో డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు రైతు సాధికార సంస్థ తెలిపింది. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితోనే ఈ అవార్డు సాధ్యమైంది. ఏపీలో 18 లక్షల రైతు కుటుంబాలు, 7లక్షల రైతు కూలీల కుటుంబాలు, మార్పునకు కారణమైన 3.4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళల తరపున ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం’ అని విజయ్‌కుమార్, రాజ శేఖర్ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట ప్రారంభించారు. అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా ఎదిగింది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళల్ని ఇందులో భాగస్వాములుగా చేశారు. తమ కుటుంబాలు ప్రకృతి వ్యవసాయం చేసేలా మార్పు తీసుకురావడంలో వీరు కీలకపాత్ర పోషించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)ల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 1,000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకులు ప్రత్యేక సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, కేఎఫ్ డబ్ల్యూ బ్యాంక్, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నాయి.

Read More

రైతులకు, మహిళా స్వయం సహాయ సభ్యులకు పాడిరంగంపై శిక్షణ

పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో పాడిపరిశ్రమ, విస్తరణ, అభివృద్ధి, దాని ఉత్పత్తుల తయారీ, పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాడి రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు శిక్షణనిచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ పశువైద్య కళాళాలలోని పశుగణన క్షేత్ర సముదాయంలో మంగళవారం పాడి రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. పశుపోషణ, వ్యాపార సరళిలో డెయిరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణనిచ్చారు. త్వరలో స్వయం సహాయక సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విస్తరణ విభాగం అధిపతి సత్యనారాయణ తెలిపారు.

Read More

జూన్ 12న తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

దేశంలోనే రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964 జూన్ 12 వ తేదీన రాజేంద్రనగర్‌లో ఏర్పాటు అయింది. ప్రస్తుత వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనంతో పాటు ఇతర మౌలిక వసతుల సముదాయాన్ని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జూన్, 1966 లో ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రముఖ తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్బంగా జూన్ 12 వ తేదీన నిర్వహించ తలపెట్టిన 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భారత హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఇవ్వనున్నారు. అదే విధంగా యం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ ఈ జాతీయ సదస్సు అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్, విధాన విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం
ఈ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం, ఇతర మౌలిక వసతులని ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించి 60 ఏళ్ళు అయిన సందర్బంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశ్వవిద్యాలయం కోరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని నిర్వహించనున్నట్లు అల్దాస్ జానయ్య తెలిపారు.1966-84 మధ్యలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసి దేశానికి ఆహార భద్రతని అందించిన ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని, ఆనాటి రైతు అనుకూల విధానాలని, వివిధ సంస్థలని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉప కులపతి పేర్కొన్నారు. అందుకే ఈ 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.

Read More

తెలంగాణాలో ఉచిత చేపపిల్లల పంపిణీ

రూ. 125 కోట్లతో తెలంగాణలో 2026-27 సంవత్సరానికిగాను 95 కోట్ల చేప, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర మత్స్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జులై ఆరంభంలో పంపిణీ చేపట్టేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ఈ పథకం సాగుతోంది. మొదట్లో మే నెలలో టెండర్లు పిలిచి జూన్‌లో చేపపిల్లలను పంపిణీ చేసేవారు. పెండింగ్ బిల్లులు, పథకం కొనసాగింపుపై సందిగ్ధత ఇతర కారణాల వల్ల కొన్నేళ్లుగా టెండర్ల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. గతానుభవాల దృష్ట్యా ఈ ఏడాది పథకం అమలులో లోటుపాట్లు లేకుండా అమలు చేసేందుకు మత్స్యశాఖ సన్నద్ధమవుతోంది.

Read More