వండని వంట… పిండి ఒడియాలు (తెలగ పిండొడియాలు)
- రచన : చల్ల కుసుమ దుర్గేశ్వరి, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్
నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత మిగిలే నువ్వుల పిండితో, పిండి ఒడియాలు తయారు చేస్తారు. కళింగాంధ్రలో ఈ పిండి వడియాలు చాలా ఫేమస్. ఉదయాన్నే చల్దన్నం, పెరుగన్నంతో నంజుకు తినేందుకు, ప్రతి పల్లెలో ఉపయోగించేవారు.
కావాల్సిన పదార్థాలు
- అరకిలో నువ్వుల పిండి (తెలగపిండి)
- పిండిలో ఇసుక లేకుండా చూసుకోవాలి
- పచ్చిమిర్చి 150 గ్రాములు (బాగా కారంగా ఉన్నవి) పేస్ట్ చేసుకోవాలి
- వాము 50 గ్రాములు
- వెల్లుల్లి 100 గ్రాములు (తొక్కు తీసి ముక్కలుగా చేయాలి)
- బియ్యం-2 టేబుల్ స్పూన్లు (దోరగా వేపుకుని పిండిగా చేసుకోవాలి- అయితే ఇవి వండని వంటలు కనుక, బియ్యాన్ని వేపకుండానే పిండి చేసుకోవాలి) బియ్యపు పిండి లేకపోతే ఇదే మోతాదులో జొన్నపిండి
- ఉప్పు- సరిపడినంత,
- నిమ్మకాయలు- 4 (పెద్దవి) లేదా బాగా పులుపు ఉన్న నారింజ కాయలు
తయారుచేయు విధానం: తెలగపిండిపై ముక్కలు మునిగేంత వరకూ నీరు పోసి 12 గంటలు నానబెట్టుకోవాలి. నానిన ముక్కలను బాగా ముద్దగా కలుపుకుని, ముద్దలో బియ్యపు పిండి, పచ్చిమిరపకాయల పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, వాము, తగినంత ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు మూతపెట్టి ఉంచాలి. అప్పుడప్పుడు కలిపి మళ్లీ మూతపెట్టుకోవాలి. ఈ పిండిని ఒడియాలుగా పెట్టుకునే ముందు, నిమ్మకాయల రసం పిండుకోవాలి. బాగా కలిపిన తరువాత ఒడియాలు పెట్టుకోవాలి (చిన్న వడలుగా గానీ, రౌండ్‌గా గానీ చుట్టుకోవాలి). వీటిని రెండు రోజులు మాత్రమే ఎండబెట్టాలి. గట్టిగా అయితే బాగోవు. ఇలా వడియాలుగానే కాకుండా ఫ్రిజ్‌లో పచ్చిముద్దగా ఉంచి నంజుకునేందుకు వాడుకోవచ్చు. (ఫ్రిజ్‌లో 20 రోజుల వరకూ నిల్వ ఉంటాయి)
ఎసిడిటీ, మలబద్ధకం, కిడ్నీ, లివర్ ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు! ముద్ద పైగానీ, ఒడియాల పైగానీ బూజు వచ్చే అవకాశం ఉంది. బూజు కనిపిస్తే వాడకూడదు.
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.











