వండని వంటలు అంటే, పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు పచ్చళ్ళు ఆహారంగా తయారు చేసుకోవడం.
ధాన్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలు మొదలగునవి ఉడికించినా, వేపినా, ఫ్రై చేసినా, వాటిలో ఉన్న జీవశక్తి నాశనం అవుతుంది, మృతాహారాన్ని తినవలసి వస్తుంది. మృత ఆహారం అంటే చనిపోయిన ఆహారం అని అర్థం.
మృతాహారం తింటే, మన శరీరానికి జీవశక్తి లభించదు. మనలో జీవశక్తి లోపిస్తే, వ్యాధి కారక శక్తులు ప్రవేశిస్తాయి. కోవిడ్ వైరస్ చెప్పిన పాఠాల్లో, అది ముఖ్యమైన పాఠం కద!
అమృతాహారాన్ని తినవలసిన మనుషులు, మృతాహారం తినడం వైపు పయనించారు! మృతాహారం, వ్యాధి కారకం!
వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినడం మంచిది.
అమృతాహారాన్ని తయారు చేసుకుని భుజిస్తే, మన ఆయురారోగ్యాలు పదిలంగా ఉంటాయి!
అమృతాహారం అంటే, చనిపోని ఆహారం అని అర్థం!
మిద్దెతోట, పెరటితోటల్లో మిర్చి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నప్పుడు, మధ్య మధ్య పండు మిరపకాయలతో రోటి పచ్చడి తయారు చేసుకోవాలి. అది బయటి ఉష్ణోగ్రతల వద్ద కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ అవసరం లేదు.
పెరటితోట మిద్దెతోట అంటే, పురుగుమందుల వాడకం లేని, సహజ ఉత్పత్తి అని కద! అప్పుడే అది అమృతాహారం అవుతుంది.
కాసిన్ని పండు మిరపకాయలను తెంపుకుని, క్లాత్‌తో శుభ్రంగా తుడిచి, తొడిమలు తీసేసి ముక్కలు ముక్కలుగా కోసి, ఆ పండుమిరపకాయలకు తగినంత కొత్త చింతపండు, తగినంత ఉప్పు (రాక్ సాల్ట్ అయితే బెటర్), వెల్లుల్లి పాయలను, కొద్దిగా పసుపు, జీలకర్రను వేసుకొని, రోటిలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడి బయట వాతావరణంలో కూడా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాకపోతే ఉప్పు తగినంత కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారీలో నీటి తేమ తగలకుండా తయారు చేసుకోవాలి.
పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. పోపు పెట్టడం అంటే, కాలిన నూనెను తినడం అవుతుంది. కాకపోతే అన్నం తినేటప్పుడు పచ్చి నూనెను – అదీ చెక్క గానుగ నూనెను కొద్దిగా వేసుకొని తినవచ్చు.
పాతకాలపు పండుమిరపకాయల పచ్చడినే, నూనె తాలింపు పెట్టకుండా వాడుకోవచ్చును!
నిల్వ పచ్చడి అంటేనే, ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
శారీరక శ్రమ చేసేవారు కాస్తా ఎక్కువ సార్లు తిన్నా పరవాలేదు కానీ, నీడపట్టున పనులు చేసేవారు రుచి కోసం అప్పుడప్పుడు తినడం మంచిది.
పండుమిరపకాయల్లో చింతపండుకు బదులుగా టొమాటో పండ్లను కూడా వేసుకొని పచ్చడి తయారు చేసుకోవచ్చు కానీ, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చు. బయట నిల్వ ఉండదు. ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు మూడు రోజుల పాటు వాడుకోవచ్చు.
మొదటిసారిగా చేసుకునేవారు, కొద్ది మొత్తంలో చేసుకుని, ఉప్పు, కారం, పులుపు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని, తరువాత మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. రోలు రోకలి లేనివారు మిక్సీలో వేసి తిప్పుకోవాలి.
మిక్సీలో వేసి తిప్పితే, పదార్ధం ఉష్ణోగ్రతకు గురౌతుంది, ఆ కారణంగా పదార్ధంలో ఎంతో కొంత జీవశక్తి లాస్ అవుతుంది. కనుక రోలు రోకలి వాడటం బెటర్. రోళ్ళు, రోకళ్ళు పట్టణాలలో అక్కడక్కడ రోడ్ల పక్కన పెట్టి అమ్ముతున్నారు. కొనుక్కుని తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పటికీ ఉపయోగపడుతుంది.