లక్ష ఎకరాలకు సాగు నీరు అందించగల ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు

తెలంగాణాలోని నారాయణపేట- కొడంగల్ సాగునీటి ఎత్తిపోతల పథకానికి (ఎన్‌కేఎలఐఎస్) కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎసఈఐ ఏఏ) పర్యావరణ అనుమతులు (ఈసీ) మంజూరు చేసింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టు ప్రభావిత రెండు మండలాల్లో కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖలు ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాయి. వీటి నివేదికలను ఎసఈఐఏఏకు అందజేయగా ఆ సంస్థ మదింపు చేసి.. పర్యావరణ అనుమతులకు పచ్చజెండా ఊపింది.
ఈ ఎత్తిపోతల పథకం కింద నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో 10 మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. రూ.4,885 కోట్లతో మూడు దశల్లో జూరాల నుంచి 7 టీఎంసీలను ఎత్తిపోయనున్నారు. పది జలాశయాల్లో 4 టీఎంసీలు నిల్వ చేస్తారు. దారి మధ్యలోని 123 గ్రామాలకు తాగునీరు అందిస్తారు.
ప్రాజెక్టు నిర్మాణాల వెంట రూ.3.92 కోట్లతో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేస్తారు. 55.85 హెక్టార్లలో 54,500 మొక్కలు పెంచుతారు.

Read More

నారాయణపేటలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

తెలంగాణాలోని నారాయణపేట జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.కోటి విలువైన పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డా. వినీత్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట మండలం బండగొండ, కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం ఆయా గ్రామాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. భూనీడ్‌కు చెందిన తండ్రీకొడుకులు బాలకృష్ణనాయుడు, శశివర్దన్‌నాయుడు ఇళ్ల నుంచి రూ.కోటి విలువైన 10 టన్నుల (100 క్వింటాళ్లు) నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను సరఫరా చేసినా, అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, ఎస్సైలు రాముడు, విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ బృందం, వ్యవసాయశాఖ అధికారులను అభినందించారు.

Read More