9 రకాల చిరుధాన్యాలతో 190 రకాల ఉత్పత్తులు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ మిల్లెట్స్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం (సీఓఈఎం) చిరుధాన్యాలను ‘రెడీ టూ ఈట్‌’లా సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ సంస్థ.. ఔత్సాహికులకు ఆయా సాంకేతికతలను అందిస్తోంది. మైసూరులోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఎఐ) లో గతేడాది డిసెంబరులో సీఓఈఎం ఏర్పాటైంది. ఏడాది పూర్తి చేసుకోబోతున్న ఈ కేంద్రం.. చిరుధాన్యాలలో సాధించిన ఘన ఆవిష్కరణలు…

గంటకు 500 కిలోల సామర్థ్యం
చిరుధాన్యాల ఉత్పత్తిలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. రైతులు మాత్రం అవగాహన లేక నష్టపోతున్నారు. సీఓఈఎం ముందుగా రైతు నుంచి కార్యాచరణ మొదలుపెట్టింది. రూ.20 కోట్లతో 3 రకాల ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని నేరుగా ఈ కేంద్రాలకు తరలించేలా అవగాహన కల్పించింది. ధాన్యం నాణ్యత, శుద్ధి, అనుబంధ ఉత్పత్తుల తయారీ రైతుల కళ్లముందే చేపడుతోంది. ప్రత్యేక ప్రాసెసింగ్‌ యంత్రాలతో గంటకు 500 కిలోల ధాన్యం శుద్ధి చేసి, ఉత్పత్తులనూ తయారు చేయడంతో రైతులకు కేంద్రంపై గురి కుదిరింది.

మెక్‌ డొనాల్డ్‌ మెచ్చింది
సీఓఈఎంలో జొన్న, రాగి, సజ్జ తదితర ధాన్యాలతో చేసిన బన్‌.. మెక్‌డొనాల్డ్‌ సంస్థకు ఎంతో నచ్చింది. దాన్ని ‘మిల్లెట్‌ బన్‌ బర్గర్‌’గా మార్చి ప్రపంచ విపణికి పరిచయం చేసింది.

వివిధ రకాల ఉత్పత్తులు
చిరుధాన్యాలు శుద్ధి చేసేటప్పుడు వచ్చే వ్యర్థాలనూ ఈ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో వృథాగా పోనివ్వడం లేదు. రాగి పొట్టు నుంచి అయిల్‌, విరిగిన రాగులతో సేలాలు, పగుళ్లిచ్చిన గింజలతో ‘రాగి రైస్‌’, నూకతో రవ్వ, మురుకులు ఇలా.. ఒక్క రాగులతోనే 45 రకాల ఉత్పత్తులు చేస్తోంది. వాటికి అదనపు పోషకాలూ జోడిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో 9 రకాల ధాన్యాలను 190 రకాల ఉత్పత్తులుగా మలిచే వ్యవస్థలున్నాయి. బయో డిగ్రేడబుల్‌, తినదగిన ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు తయారు చేస్తోంది. వినియోగదారుడు కోరుకున్న రంగులు, రుచులను చేర్చేందుకు ఎలక్ట్రానిక్స్‌ నోస్‌, మౌత్‌ అప్లికేషన్లు, ప్యాకేజింగ్‌ వ్యవస్థలూ తీసుకొచ్చింది.

నిల్వకు పెద్దపీట..

  • చిరు ధాన్యాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. వాటి పిండి, రవ్వ ఇతర ఉత్పత్తుల నిల్వ కాలం తక్కువ.
  • సీఓఈఎం ప్రత్యేక పద్ధతుల్లో 4-5 నెలలపాటు నిల్వ చేసుకునేలా చేసింది.
  • ఇందుకు తొలుత వైబ్రో క్లీనర్ల ద్వారా ధాన్యం శుభ్రం చేసి, స్టీమింగ్‌ ట్యాంకర్లు, డ్రైయర్‌ బెడ్ల ద్వారా ఆరబెట్టి ఎప్పుడంటే అప్పుడు వాడుకు నేలా పాలిష్‌ చేస్తోంది.
  • ఆ తర్వాత వినియోగదారుడికి అవసరమైన ఉత్పత్తులుగా మార్చుతోంది.
  • ధాన్యం నిల్వకూ ఈ కేంద్రంలోనే గోదాములు ఏర్పాటు చేసింది.
Read More

నవంబరు 1 నుండి ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ 20.01 శాతం

తెలంగాణాలో ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు అంగీకరించకపోయినా అధికారులు, రైతు సంఘ ప్రతినిధులు పట్టుబట్టడంతో ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌- నూనె దిగుమతి శాతం) 20.01 శాతానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గెలల నుంచి వచ్చే నూనె దిగుమతిపై 20.01 శాతం, గింజల బరువుపై 10.08 శాతం ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ, ఉద్యానశాఖ కమిషనర్‌ యాస్మిన్‌ బాషా, సంయుక్త సంచాలకులు సరోజ, ఆయిల్‌ ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, రైతు సంఘ ప్రతినిధులు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, మహేశ్‌, బండి భాస్కర్‌, ప్రభాకరవర్మ, జ్యోత్స్న పలువురు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గెలలు, గింజలపై నుంచే కాక.. కెర్నల్‌ ఆయిల్‌పై కూడా రైతులకు వాటా చెల్లించాలని రైతు సంఘం ప్రతినిధులు అధికారులను కోరారు. నూతన ఓఈఆర్‌ 20.01 శాతం 2025 నవంబరు 1 నుంచి.. 2026 అక్టోబరు 31 క వరకు అమలులో ఉంటుందని, ఈ రేటు దేశంలోనే అత్యధికమని టీజీ ఆయిల్‌ ఫెడ్‌ జీఎం సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Read More

తడిసిన ధాన్యం కొంటాం

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు అందాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని, ప్రతి రైతునూ ఆదుకుంటామని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావిత కాలనీలు, నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయి… అక్కడి నుంచి మున్నేరుకు భారీగా వరద వస్తుండటంతో ఖమ్మంలోని కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.

Read More

ధాన్యం సేకరణపై పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలవారీగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల సంఖ్యనూ ఖరారు చేసింది. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ లక్ష్యంలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగతా 32 జిల్లాల్లో 39.08 లక్షల టన్నుల సన్నాలు, 35.91 లక్షల టన్నుల దొడ్డు రకాలు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
సన్నాలు, దొడ్డు రకాలు కలిపి- ఖమ్మం జిల్లాలో 2,78,892 టన్నులు కొనాలని అంచనా. 326 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో 2,44,522 టన్నులు, 244 కేంద్రాలు, నారాయణపేట 2,35,917 -117, మహబూబ్‌గర్‌ 2,26,418 – 190, భువనగిరి 2,26,410- 325, కొత్తగూడెం 2,23,272-193, మహబూబాబాద్‌ 2,18,373 – 237 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు.

Read More

దేశంలో తొలిసారి నారావారిపల్లెలో పాడి పశువుల్లో ఎద క్రమబద్ధీకరణ

కొన్ని పశువులు ఎదకు రాకపోకపోవడం.. లేదంటే ఒకట్రెండు ఈతలకే వట్టిపోతుండటం లాంటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లె పరిసరాల్లో దేశంలోనే తొలిసారిగా ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కృత్రిమ గర్భధారణతో 30-40 శాతం చూలు కట్టు శాతం ఉండగా.. ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమంతో 63 శాతం పశువులు గర్భం దాల్చాయి. నారావారిపల్లె సహా చుట్టుపక్కల 29 గ్రామాల్లో వెయ్యికి పైగా ఎదకు రాని పశువుల్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. తొలి విడతగా 172 మంది రైతులకు చెందిన 250 పశువులను ఎంపిక చేసుకుని మార్చి 29న పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 30 మంది పశు వైద్యులు, సహాయకులు ఎంపిక చేసుకున్న ప్రతి పశువు పునరుత్పాదక, గర్భాశయం, అండాశయ స్థితిగతులను అధ్యయనం చేసి వాటిని ఎదకు రప్పించే ప్రక్రియను ప్రారంభించారు. పశువుకు ఆరోగ్య పరీక్షలు చేసి ఎదకు రాకపోవడానికి కారణాలను గుర్తించారు. ప్రతి పశువుకు డీవార్మింగ్‌ మాత్రలు, 20 కిలోల సమీకృత దాణా, 20 మినరల్‌ మాత్రలు, యాంటీ బయాటిక్‌ మందులతో కూడిన రూ. 1500 విలువైన కిట్‌ను రూ.400కే అందజేశారు. మే నెలలో మేలుజాతి ఆంబోతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. దీంతో 156 వట్టి పోయిన పశువులు ఇప్పుడు చూలు కట్టాయి.

75 శాతం ఫలవంతం చేయడమే లక్ష్యం
ఎదకు రాని పాడి పశువు విలువ రూ. 15 వేలు మాత్రమే. అదే పశువు ఎదకు వచ్చి గర్భం దాల్చితే రూ.60-70 వేలు. ఆరు నెలల తర్వాత నారావారిపల్లెలోని 172 మంది రైతుల ఇళ్లలో పాల వెల్లువ ప్రారంభమవుతుంది. మంచి ఆదాయం లభించనుంది.
-ఎ. రవికుమార్‌, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి

Read More

‘రాజముద్ర’తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు ఎవరి చిత్రాలూ లేకుండా కేవలం రాజముద్రతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం ముద్రించింది. పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో 10 వేల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15న వీటిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More

సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం: మంత్రి తుమ్మల

  • దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • ప్రాథమిక సహకార సంఘాలు ‘ఒన్‌ స్టాప్‌ సెంటర్‌’గా మారాలి
  • ఎఫ్‌.పి.ఓ.లుగా ఎంపికైన ప్రాథమిక సహకార సంఘాలన్ని బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి
  • ఎన్‌.సి.డి.సి. సహకారంతో రాష్ట్రంలో 311 ప్రాథమిక సంఘాలు ఎఫ్‌.పి.ఓ.లుగా మార్పు : మంత్రి తుమ్మల

ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరియు వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా, రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకొన్నట్లయితేనే ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనకారిగా ఉండగలమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నేడు ఎన్‌.సి.డి.సి. మరియు కోఆపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 311 ఎఫ్‌.పి.ఓ.లతో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్‌ మోడల్‌గా గెలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావిస్తూ.. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తు, సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న సందర్భములో, ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలుగా’ మార్చి, వారికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, తదనుగుణంగా ‘నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ను క్లస్టర్‌ బేస్‌డ్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్‌.పి.ఓ.లుగా ఎన్నిక చేయడం జరిగిందని, వీటికి ఒక్కొకదానికి 15 లక్షల ఈక్విటీ గ్రాంటు మరియు 18 లక్షల మేనేజ్‌ మెంట్‌ ఖర్చు (మొత్తం 33 లక్షలు) అనగా 311 ఎఫ్‌.పి.ఓ.లకు సుమారు 167.93 కోట్లు (సిబిబిఓ ఇచ్చే రూ 21 లక్షలు / ఎఫ్‌.పి.ఓ.తో కల్పి) మంజూరు చేయగా ఈ రోజు మొదటి విడతాగా 9 కోట్లు 85 లక్షల 40 వేల రూపాయలు (ప్రతి పి.ఎ.సి.ఎస్‌.కు 3,16,849 రూ) విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్‌.పి.ఓ.లకు 2 కోట్లు వరకు లోన్‌ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందని, కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడి మీద ఉందన్నారు. ఈ సందర్భముగా మెడ్చల్‌ జిల్లా మరియు కొన్ని జిల్లాలలో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలు ఊటంకిస్తూ రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు.
రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను, అనగా మట్టినమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, డైరి, పౌల్ట్రీ ఇలా అన్నీ రంగాలలో వాటి సేవలను విస్తరించే విధంగా బిజినెస్‌ మోడల్‌ రూపకల్పన చేసుకోవాలని, అదే విధంగా సంఘ సమావేశాలలో ఆయరంగాల్లో నిష్ణాతుల సేవలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ సందర్భముగా మంత్రితోపాటు ఎన్‌.సి.డి.సి. రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌, తెలంగాణ కో ఆపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మన్‌ మోహన రెడ్డి, టి.జి.సి.ఎ.బి. ఛైర్మన్‌ రవీందర్‌ రావుతో పాటు డి.సి.సి.బి.ల ఛైర్మన్‌లు, కోఆపరేటివ్‌ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన 311 సొసైటీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

Read More

ధాన్యం కొనుగోళ్లలో ‘సాంకేతిక పరిజ్ఞానం’

  • దక్షిణాదిలో తొలిసారి 800 కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్ల వినియోగం
  • తాలు, తరుగు, తేమ సమస్యలు తగ్గాయంటున్న అధికారులు
  • వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ టూల్స్‌ ఉపయోగించి వర్షాలపై అప్రమత్తం
  • తెలంగాణ విధానాలపై పలు రాష్ట్రాల అధ్యయనం

ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌ ప్రక్రియలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాలు తెలంగాణ విధానాలపై అధ్యయనం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల 800 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను ఉపయోగించారు. వీటి వాడకంతో తాలు, తరుగు, తేమ వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయని.. దక్షిణాదిలో ఈ విధానాన్ని అవలంబించిన తొలి రాష్ట్రం తెలంగాణేనని పౌరసరఫరాలశాఖ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో మిగతా కేంద్రాల్లోనూ ప్యాడీ క్లీనర్లను ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. ధాన్యం సేకరణ సమయంలో వర్షాలు కురుస్తుండటం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ టూల్స్‌ని ఉపయోగించి వర్షం పడే ప్రాంతాల్ని గుర్తించి.. ఆయా కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ అప్రమత్తం చేస్తోంది.

రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం

  • డీఎస్‌ చౌహాన్‌, పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌
    ధాన్యం కొనుగోళ్లు వీలైనంత సాఫీగా జరిగేందుకు టెక్నాలజీని వాడుతున్నాం. ప్యాడీ క్లీనర్లు వినియోగించి రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం. ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వాతావరణ ముందస్తు హెచ్చరికల్ని ప్రభావిత కేంద్రాలకు పంపి ధాన్యం తడవకుండా వీలైనంత మేరకు తగ్గించాం. తెలంగాణ పౌరసరఫరాల శాఖ చేపడుతున్న సంస్కరణల్ని పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మరికొన్ని రాష్ట్రాలూ రానున్నాయి.

ఆసక్తి కనబరుస్తున్న ఇతర రాష్ట్రాలు
తేమ శాతం నిబంధనల్ని పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.మిల్లర్లకు గ్యారంటీ, బకాయిదారులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయడం తదితర విధానాలను అవలంబించింది. ఈ పరిణామాలు, సంస్కరణల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు తెలంగాణలో పర్యటించి ఇక్కడి విధానాలను అధ్యయనం చేస్తున్నారు.

Read More

కంద.. చేమ.. క్యారెట్‌..!

దుంపల సాగు విస్తీర్ణం పెంపుపై తెలంగాణా ప్రభుత్వం దృష్టి
నష్టాల నుంచి రైతులను గట్టెక్కించాలని నిర్ణయం

అకాల వర్షాలు, వరదలతో పంటలను కోల్పోతున్న రైతులను నష్టాల నుంచి గట్టెక్కిస్తూ ప్రజలకు పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దుంపల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించింది. రైతులను కంద, చేమ, బంగాళాదుంప, క్యారెట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, కర్రపెండలం వంటి పంటల సాగువైపు మళ్లించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన, కురుస్తున్న అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు, మామిడి, నిమ్మ తదితర పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నష్టాల నివారణకు ప్రత్యామ్నాయాలను సూచించాలని ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వారి సూచనలతో ఎక్కువగా దుంప పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న దుంప పంటలు 3,700 ఎకరాల మేరకే సాగవుతున్నాయి. అత్యధికంగా 2,200 ఎకరాల్లో కందగడ్డ (మొరంగడ్డ/ చిలగడదుంప) సాగవుతోంది. బంగాళాదుంప వినియోగం ఎక్కువగానే ఉన్నా.. రాష్ట్రంలో ఆ పంట కేవలం 452 ఎకరాల్లోనే సాగు అవుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 6 లక్షల టన్నుల మేరకు దుంపల వినియోగం ఉంటుండగా.. ఇక్కడ తక్కువగా సాగు అవుతుండటంతో వాటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న ఖరీఫ్‌లో రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల మేరకు దుంప పంటలను సాగుచేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తక్కువ నీరు.. ఎక్కువ నిల్వ: అకాల వర్షాలు, వరదలతో ఇతర పంటలు దెబ్బతింటున్నా.. దుంపలకు ఎలాంటి నష్టం కలగదని అధ్యయనాల్లో తేలింది. కోతకు వచ్చిన తర్వాత ఇతర పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. దుంప పంటలను మాత్రం ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే అవకాశముంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దుంపల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని, అధిక దిగుబడినిచ్చే రకాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Read More