వరిలో అగ్గితెగులు నివారణకు పశువుల పేడ, మూత్రం – ఇంగువ ద్రావణం
పశువుల పేడ, మూత్రం ద్రావణంలో 200 గ్రా. ఇంగువను కలుపుట ద్వారా చాలా శక్తివంతమైన తెగుళ్ళ నాశినిని తయారు చేయవచ్చు. ఈ విధంగా తయారు చేసిన ద్రావణం వరిపైరులో అగ్గితెగులు మీద సమర్థవంతంగా పనిచేసినట్లు ఈ ద్రావణం వాడిన రైతుల అనుభవాలు చెబుతున్నాయి. దీనిలోని పశువుల పేడ వరిపంటలో వచ్చే బ్యాక్టీరియా తెగుళ్ళకు కూడా పనిచేస్తుంది.
పశువుల పేడ-మూత్రం-ఇంగువ ద్రావణం చాలా రకాల తెగుళ్ళ యాజమాన్యంలో పని చేస్తుంది. ఇంగువకు స్వతహాగా శిలీంధ్రనాశక గుణం ఉంది. దీనిలో సల్ఫర్ ఉండుట వలన శిలీంధ్రనాశక గుణం కలిగి వుంటుంది.
ఎలా పనిచేస్తుంది?
పశువుల పేడ, మూత్రంలో చాలా రకాల సూక్ష్మజీవుల చర్యల వలన పంటకి హాని చేసే జబ్బులను కలుగజేసే సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడం జరుగుతుంది. దీనివలన తెగుళ్ళు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందవు.
ఇంగువలో “సల్ఫర్” మూల పదార్థంగా ఉండుట వలన ఇది తెగుళ్ళు కలుగజేయు శిలీంధ్రాలను చంపడం ద్వారా మరియు వ్యాప్తిని నిరోధించడంలో ఉపయోగపడుతుంది.




