పశువుల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవిలో తీవ్రమైన వేడి గాలుల కారణంగా వడదెబ్బతో పశువుల ఆరోగ్యం, వాటి ఉత్పత్తుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు మరణాలకూ దారితీయవచ్చు కాబట్టి క్షేత్రస్థాయి సిబ్బందికి, పశుపోషకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు.
పశువులు అధిక మొత్తంలో నీటిని తీసుకునేందుకు వీలుగా నీటి తొట్టెలను నిండుగా పెట్టాలి. పశువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సామూహిక నీటితొట్టెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండే షెడ్లలో ఉష్ణోగ్రత పెరగకుండా నీటితో తడిపిన గోనె సంచులను చుట్టూ కట్టాలి, పైకప్పు మీద తరుచూ నీల్లు చల్లుతూ ఉండాలి. పశువులను మేతకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే వదలాలి. సంకర జాతి పశువుల షెడ్లలో తప్పనిసరిగా స్ప్రింకర్లు, ఫ్యాన్లు అమర్చాలి. పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం, నోటి నుంచి చొంగ కారడం, నిస్సత్తువగా ఉండడం, నీరు అదే పనిగా తాగడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ పశువులను చల్లని నీటితో తడపాలి, స్థానిక పశువైద్యులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో సంచార పశు ఆర్యోగ సేవా వాహనాలను వినియోగించుకోవాలి అని సూచించారు.

Read More

యుద్ధం వలన గుడ్ల ఎగుమతులకు దెబ్బ

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పది రోజులుగా రోజుకి రూ. 4 కోట్ల విలువైన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గుడ్లు కార్గో ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. బయటి నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం విపణిలో హోల్‌సేల్‌గా ఒక గుడ్డు ధర రూ.4.20 ఉండగా, రిటైల్ రూ. 5కు అమ్ముతున్నారు. మరోవైపు రిటైల్ అమ్మకందారులు తమ షాపుల్లోనే ఎక్కువగా ఉన్నాయని, కొత్తగా ఆర్డర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో పౌల్ట్రీఫాం యజమానులు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. ఇది పౌల్ట్రీ రంగానికి ఊహించని ఉత్పాతమని తెలంగాణ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More

రసాయన రహిత సహజ సాగు ప్రాజెక్టును తెలంగాణాలో ప్రారంభించాం

కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్‌పామ్ తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచుతామని, తెలంగాణా రాష్ట్రంలో సహజ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో సోమవారం మెగా రైతుమేళాకు ఆయన హాజరై ప్రసంగించారు. ‘రసాయన రహితంగా ఉండే సహజ సాగు ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించాం. రైతులకు శిక్షణ ఇచ్చి మరింత మంది దీన్ని అనుసరించేలా కార్యక్రమాలు చేపడతాం. మే 4-9వ తేదీ మధ్య గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన 12 అంశాలపై అవగాహన కల్పిస్తాం’ అని తెలిపారు.

Read More

రైతుకు మేలు చేసే గొల్లభామ

పురుగు మందుల వాడకం పెరగడం వల్ల అంతరించిపోతన్న గొల్లభామ (మిడత) అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కనిపించింది. దీని శాస్త్రీయనామం మాంటెడ అని.. దాని ముందరి కాళ్లు ప్రార్థన చేస్తున్నట్లు ఉండటంతో ‘ప్రేయింగ్ మాంటిస’ అని పిలుస్తారని అనకాపల్లి వ్యవసాయ సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ తెలిపారు. పంటలకు చీడపీడలు కలిగించే పురుగులను తినడం ద్వారా పరోక్షంగా అన్నదాతలకు సాయపడతాయన్నారు. గొల్లభామలు సాధారణంగా పచ్ౘ్రంగులో ఉంటాయని, ఇవి మాత్రం పరిసరాలు ఎలా ఉంటే ఆ రంగులో కలిసిపోతాయన్నారు.

Read More

మొక్కజొన్న పరిశోధనా కేంద్రంలో కీటకాల పెంపకం

మొక్కలలో పరాగ రేణువులు వ్యాప్తి చెందడానికి కీటకాలు ఎంతగానో తోడ్పడి దిగుబడి పెరుగుతుంది. అందుకోసమే ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కీటకాలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ గొట్టాల్లాంటి వెదురు పుల్లల్లో తుమ్మెద జాతి కీటకాలను ఉంచి, అవి గూళ్లు కట్టి, గుడ్లు పెట్టేలా చూస్తున్నారు. పంటలు పూత థకు వచ్చేసరికి అవి ఎగిరే థకు వస్తున్నాయి. తర్వాత ఆ మొక్క నుంచి ఈ మొక్క మీదకు వాలుతూ పరాగ సంపర్కానికి దోహదపడుతున్నాయి. రైతులు కూడా వ్యవసాయ క్షేత్రాల్లో వెదురుపుల్లలను అమర్చితే పంటలకు మేలుచేసే కీటకాలు వ్యాప్తి చెందుతాయని శాస్త్రవేత్త డాక్టర్‌ కె. మోహనరావు తెలిపారు.

Read More

అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం

– మిరప, మొక్కజొన్నల్లో భారీగా వాడుతున్నారు

– జొన్నలోనూ యూరియా వాడకం 417% అధికం

రసాయన ఎరువుల బస్తాలు ఎన్ని ఎక్కువ వాడితే.. పంట దిగుబడి అంత ఎక్కువగా వస్తుందనే ఆలోచనే రైతులను పరిమితికి మించిన వాడకం దిశగా నడిపిస్తోంది. పెట్టుబడి వ్యయం పెరగడానికి ఇదీ ఒక కారణం. ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 సంవత్సరంలో పంటల వారీగా చూస్తే ఎరువుల వాడకంలో మిరప అగ్రస్థానంలో ఉండగా మొక్కజొన్న రెండోస్థానంలో నిలిచింది. జొన్న, వేరు శనగ, పసుపు, పప్పుధాన్యాలు తదితర పంటలకూ యూరియాను కుమ్మరిస్తున్నారు. *మిరపలో ఎరువుల వాడకం అధికం* రాష్ట్రంలో రసాయన ఎరువులు అత్యధికంగా వాడే పంట మిరప.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే హెక్టారుకు 1,325 కిలోల వాడకం ఉంది. సిఫార్సు చేసిన మోతాదు కంటే యూరియా 78%, భాస్వరం 122% అధికంగా వాడుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులు ఇంతకు రెట్టింపుస్థాయిలోనే వాడుతున్నారు. ఫలితంగా మిరపకు ఎకరాకు రూ. 3 లక్షల పెట్టుబడి అవుతోంది. తీరా చూస్తే ధరలు దక్కడం లేదు. క్వింటాలుకు రూ.10 వేలు ఉన్నా గిట్టుబాటు కాని పరిస్థితి. లక్షల్లో నష్టపోతున్నారు. ఎరువుల వాడకం తగ్గించుకుంటే పెట్టుబడి కూడా తగ్గుతుందని ఆలోచించడం లేదు.*మొక్కజొన్న సాగులోనూ భారీగా…* ఎరువుల వినియోగం అధికంగా ఉండే రెండో పంట మొక్కజొన్న. హెక్టారుకు 565 కిలోలు వాడుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవ వినియోగం ఇంకా ఎక్కువే. రెండు మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో అధిక శాతం రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపిస్తున్నారు. ఇతర పంటల సాగులో నష్టాలతో.. ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్ననే ఎంచుకుంటున్నారు

.*జొన్న సాగుకు 417% అధికంగా యూరియా:* జొన్న సాగులో సిఫారసు చేసిన మోతాదుకు మించి 417% అధికంగా యూరియాను వినియోగిస్తున్నారు. వేరుశనగకు కూడా 303% అధికంగా వేస్తున్నారు. గడ్డి పెంపకానికి 283% అధికంగా వాడటం గమనార్హం.

*అపోహ మాత్రమే* భూసార పరీక్షలు చేయించుకుని.. అవసరం మేరకు రైతులు ఎరువులు వాడాలి. ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నత్రజని ఎక్కువగా వాడితే చీడపీడలు పెరుగుతాయి. వాటి నివారణకు పురుగుమందులు ఎక్కువగా చల్లాలి. పంటల నాణ్యత దెబ్బతింటుంది. భూగర్భజలాలు కలుషితమవుతాయి. ఎరువుల్ని సిఫార్సు మేరకు మాత్రమే అందించాలి. లేదంటే మొక్కల్లో రోగనిరోధకత తగ్గుతుంది. కరవు పరిస్థితుల్లో నానో ఎరువులు పిచికారి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే నేల ద్వారా అందించడమూ ముఖ్యమే.- *వి. శైలజ,* ప్రధాన శాస్త్రవేత్త, సాయిల్‌ సైన్స్‌, ప్రాంతీయ పరిశోధనాస్థానం, లాం, గుంటూరు

Read More
  • 1
  • 2