విడుదలైన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు
రైతుభరోసా రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో విడుదలైన వెంటనే జమ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుభరోసాపై ఆదివారం తన నివాసంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో సోమవారం సీఎం చేతుల మీదుగా 45,11,947 మంది రైతులకు మొత్తం 36,76,766 ఎకరాల కోసం రూ.2,206.06 కోట్ల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ సహా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు తెలియజేయాలని సూచించారు. సీఎం నిధులను విడుదల చేయగానే ఆ నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో వెంటనే జమ కావాలన్నారు. మొదటి విడతలో కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను నిలిపివేయడం వల్ల వారికి నిధులు అందలేదని, ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు.
శనగ, పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై పరిమితి ఎత్తివేయాలి*మొక్కజొన్న పంటను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు రావాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆదివారం లేఖ రాశారు. ‘పంటలకు మద్దతు ధరల ప్రకటనకే కేంద్రం పరిమితమవుతోంది. మద్దతు ధరకు మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోంది. కొనుగోలులో కొత్త విధానంతో పత్తి రైతులను నష్టపరిచేందుకు పథకం వేస్తోంది. శివరాజ్‌సింగ్ ఈ వ్యవహారాలను సమీక్షించి రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి’ అని తుమ్మల లేఖలో కోరారు.






