డైరీ పశువులలో లూజ్ హౌసింగ్ సిస్టమ్ విధానం (Loose Housing System)

పరిచయం
పాడి పశువుల పెంపకంలో సరైన గృహ వసతి లేదా పశువుల షెడ్ చాలా ముఖ్యమైనది. పశువులకు మంచి గాలి, సరైన నీడ, పరిశుభ్రమైన నేల, స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటే అవి ఆరోగ్యంగా ఉండి మంచి పాల ఉత్పత్తిని ఇస్తాయి. పశువులను ఎల్లప్పుడూ ఒకే చోట కట్టివేయకుండా, వాటికి స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించే విధానాన్ని లూజ్ హౌసింగ్ సిస్టమ్ లేదా స్వేచ్ఛా గృహ విధానం అంటారు.

ఈ విధానంలో పశువులను సాధారణంగా ఒక పెద్ద ప్రదేశంలో స్వేచ్ఛగా ఉంచుతారు. పశువులకు విశ్రాంతి తీసుకోవడానికి కప్పు ఉన్న ప్రదేశం, బయట తిరగడానికి ఓపెన్ యార్డ్, మేత మరియు నీరు తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.

లూజ్ హౌసింగ్ సిస్టమ్ అంటే ఏమిటి?
లూజ్ హౌసింగ్ విధానంలో పశువులను వ్యక్తిగతంగా రోజంతా కట్టివేయరు. ఒకే వయస్సు లేదా ఒకే రకమైన పశువులను ఒక సమూహంగా ఉంచుతారు. పశువులు తమకు ఇష్టమైన విధంగా షెడ్‌లో లేదా బయట ఉన్న ఓపెన్ ప్రదేశంలో తిరగవచ్చు. వర్షం, ఎండ, చలి నుండి రక్షణ కోసం ఒక భాగంలో కప్పు ఏర్పాటు చేస్తారు. మిగిలిన భాగాన్ని ఓపెన్ యార్డ్‌గా ఉంచుతారు.

ఈ విధానం ముఖ్యంగా క్రింది పశువులకు అనుకూలంగా ఉంటుంది:
• పాలిచ్చే ఆవులు మరియు గేదెలు
• గర్భిణీ పశువులు
• ఎదుగుతున్న దూడలు
• హీఫర్లు
• పొడి పశువులు
అయితే పాల ఉత్పత్తి, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి పశువులను వేర్వేరు సమూహాలుగా ఉంచడం మంచిది.

లూజ్ హౌసింగ్ షెడ్‌లో ఉండవలసిన ముఖ్యమైన భాగాలు

  1. కప్పు ఉన్న ప్రదేశం
    పశువులు ఎండ, వర్షం మరియు చలి నుండి రక్షణ పొందడానికి కప్పు ఉన్న ప్రదేశం అవసరం. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పశువులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాయి.
    షెడ్‌లో:
    • తగినంత గాలి ప్రసరణ ఉండాలి.
    • పైకప్పు ఎత్తుగా ఉండాలి.
    • లోపల వేడి ఎక్కువగా ఉండకూడదు.
    • వర్షపు నీరు లోపలికి రాకుండా చూడాలి.
    • నేల పొడిగా మరియు పరిశుభ్రంగా ఉండాలి.
  2. ఓపెన్ యార్డ్
    కప్పు ఉన్న ప్రదేశం ముందు లేదా పక్కన పశువులు స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ యార్డ్ ఏర్పాటు చేయాలి.
    ఈ ప్రదేశంలో పశువులు:
    • స్వేచ్ఛగా తిరుగుతాయి.
    • ఎండలో నిలబడతాయి.
    • ఒకదానితో ఒకటి సహజంగా కలుస్తాయి.
    • వ్యాయామం పొందుతాయి.
    ఓపెన్ యార్డ్‌లో నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ ఉండాలి. వర్షాకాలంలో బురద ఏర్పడకుండా నేలను సక్రమంగా నిర్వహించాలి.
  3. మేత తొట్టి
    పశువులకు పచ్చిమేత, పొడి మేత మరియు దాణా అందించడానికి సరైన మేత తొట్లను ఏర్పాటు చేయాలి.
    మేత తొట్టి:
    • శుభ్రంగా ఉండాలి.
    • పశువులకు సులభంగా అందుబాటులో ఉండాలి.
    • మేత వృథా కాకుండా నిర్మించాలి.
    • ఒక పశువుకు తగినంత స్థలం ఉండాలి.
    దాణా తొట్టి నిర్మాణానికి అవసరమైన కొలతలు
    అంశం శాస్త్రీయ కొలత
    • దాణా తొట్టి వెడల్పు 0.6–0.75 m
    • దాణా తొట్టి లోతు 0.4–0.5 m
    • ఒక్క పశువుకు దాణా స్థలం 0.6–0.75 m
    • నీటి తొట్టి అంచు ఎత్తు సుమారు 0.5–0.6 m
    • ప్రతి పశువుకు కనీసం 60–75 సెం.మీ. దాణా స్థలం కల్పించడం మంచిది.
    పశువులు మేత కోసం పోటీ పడకుండా తగినంత పొడవు ఉన్న ఫీడింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.
  4. నీటి సదుపాయం
    పాడి పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండాలి. ప్రత్యేకంగా పాలిచ్చే పశువులు ఎక్కువ నీరు తాగుతాయి. కాబట్టి నీటి తొట్టిని:
    • ప్రతిరోజూ శుభ్రం చేయాలి.
    • ఎల్లప్పుడూ నీటితో నింపి ఉంచాలి.
    • పశువులు సులభంగా చేరుకునే ప్రదేశంలో ఏర్పాటు చేయాలి.
    వేసవికాలంలో చల్లని మరియు పరిశుభ్రమైన నీరు అందించడం మరింత ముఖ్యం.

లూజ్ హౌసింగ్ సిస్టమ్‌లో పశువులకు అవసరమైన స్థలం
పశువుల సంఖ్యను బట్టి సరైన స్థలం ఏర్పాటు చేయాలి. చాలా తక్కువ ప్రదేశంలో ఎక్కువ పశువులను ఉంచకూడదు. ఇలా చేస్తే పశువుల మధ్య పోటీ, కొట్లాటలు మరియు వ్యాధుల సమస్యలు పెరుగుతాయి.
సాధారణంగా ఒక పెద్ద పశువుకు:
• విశ్రాంతి కోసం కప్పు ఉన్న స్థలం అవసరం.
• స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ ప్రదేశం అవసరం.
పశువుల జాతి, పరిమాణం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి స్థల అవసరం మారుతుంది.
చిన్న దూడలు, పెద్ద పశువులు మరియు గర్భిణీ పశువులను ఒకే సమూహంలో ఉంచకుండా వేర్వేరుగా ఉంచడం మంచిది.

షెడ్ దిశ: సాధారణంగా షెడ్‌ను తూర్పు–పడమర దిశలో ఏర్పాటు చేయడం మంచిది. దీనివల్ల వేసవిలో నేరుగా పడే సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అయితే స్థానిక గాలి దిశ, భూమి పరిస్థితి మరియు నీటి పారుదల కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

నేల నిర్మాణం
• నేల గట్టిగా, జారిపోని విధంగా ఉండాలి.
• కాంక్రీట్ ఫ్లోర్ అయితే పశువులు జారకుండా రఫ్ ఫినిష్ ఇవ్వాలి.
• మూత్రం, నీరు నిల్వ ఉండకుండా స్వల్ప వాలు ఉండాలి.
• నేల ఎప్పుడూ తడిగా ఉండకుండా చూడాలి.
• తడి, జారుడు నేల వల్ల కాళ్ల వ్యాధులు, లేమినెస్ మరియు గాయాలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
షెడ్ నిర్మాణానికి అవసరమైన కొలతలు
అంశం శాస్త్రీయ కొలత
ఒక వయోజన ఆవు/గేదెకు మొత్తం స్థలం 3.5–4.5 m²
కప్పబడిన విశ్రాంతి స్థలం 3.0–3.5 m²/పశువు
ఓపెన్ వ్యాయామ ప్రదేశం 7–10 m²/పశువు
షెడ్ వెడల్పు 8–12 m
పశువుల షెడ్ పొడవు అవసరానికి అనుగుణంగా
షెడ్ ఎత్తు (ఈవ్స్ వద్ద) 3–4 m
పైకప్పు మధ్య ఎత్తు 4–5 m
దాణా తొట్టి వెడల్పు 0.6–0.75 m
దాణా తొట్టి లోతు 0.4–0.5 m
ఒక్క పశువుకు దాణా స్థలం 0.6–0.75 m
నీటి తొట్టి అంచు ఎత్తు సుమారు 0.5–0.6 m
ఫ్లోర్ వాలుదనం 1:40–1:60
షెడ్ చుట్టూ డ్రైనేజీ మంచి నీటి పారుదల తప్పనిసరి

గమనిక: జాతి, పశువు పరిమాణం, వాతావరణం మరియు నిర్వహణ విధానాన్ని బట్టి కొలతల్లో స్వల్ప మార్పులు చేయవచ్చు.

లూజ్ హౌసింగ్ విధానం యొక్క ప్రయోజనాలు

  1. పశువులకు స్వేచ్ఛ : ఈ విధానంలో పశువులను ఎల్లప్పుడూ కట్టివేయరు. అందువల్ల అవి స్వేచ్ఛగా తిరగగలవు. సహజంగా నడవడం వల్ల పశువులకు మంచి వ్యాయామం లభిస్తుంది.
  2. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది: స్వేచ్ఛగా తిరగడం వల్ల పశువుల రక్త ప్రసరణ మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పశువులు ఎక్కువ సమయం ఒకే చోట నిలబడాల్సిన అవసరం ఉండదు. సరైన పరిశుభ్రత మరియు నిర్వహణ ఉంటే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు.
  3. వేడి ఒత్తిడి తగ్గుతుంది: మన దేశంలో వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు పశువులపై ప్రభావం చూపుతాయి. లూజ్ హౌసింగ్ షెడ్‌లో మంచి గాలి ప్రసరణ ఉంటే పశువులకు వేడి ఒత్తిడి తగ్గుతుంది.
    అవసరమైతే:
    • ఫ్యాన్లు
    • ఫాగర్లు లేదా స్ప్రింక్లర్లు
    • మంచి నీడ
    వంటి సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు.
  4. పశువుల ప్రవర్తనను సులభంగా గమనించవచ్చు
    పశువులు స్వేచ్ఛగా ఉన్నప్పుడు వాటి సహజ ప్రవర్తనను రైతు గమనించవచ్చు.
    ఉదాహరణకు:
    • మేత తినడం
    • నీరు తాగడం
    • విశ్రాంతి తీసుకోవడం
    • ఈస్ట్రస్ లేదా వేడి లక్షణాలు చూపడం
    • ఇతర పశువులతో ప్రవర్తించడం వంటి విషయాలను సులభంగా గమనించవచ్చు.
  5. నిర్మాణ వ్యయం కొంత తగ్గవచ్చు
    సాంప్రదాయ పద్ధతిలో ప్రతి పశువుకు ప్రత్యేకంగా కట్టే స్టాల్ నిర్మించాల్సి రావచ్చు. కానీ లూజ్ హౌసింగ్ విధానంలో పశువులను సమూహంగా ఉంచవచ్చు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో నిర్మాణ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
  6. శ్రమ అవసరం తగ్గుతుంది
    సరైన పద్ధతిలో షెడ్‌ను రూపొందిస్తే పశువుల నిర్వహణలో శ్రమను తగ్గించవచ్చు.
    ముఖ్యంగా:
    • మేత పంపిణీ
    • నీటి సరఫరా
    • పేడ తొలగింపు
    వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

లూజ్ హౌసింగ్ విధానం వల్ల కలిగే నష్టాలు లేదా సమస్యలు
ప్రతి విధానానికి కొన్ని ప్రయోజనాలు, కొన్ని పరిమితులు ఉంటాయి. లూజ్ హౌసింగ్ విధానంలో కూడా సరైన నిర్వహణ లేకపోతే సమస్యలు వస్తాయి.

  1. పశువుల మధ్య పోటీ: బలమైన పశువులు బలహీనమైన పశువులను మేత లేదా నీటి దగ్గర నుండి తరిమివేయవచ్చు.
    అందువల్ల:
    • తగినంత మేత తొట్టి స్థలం
    • తగినన్ని నీటి తొట్లు
    • సరైన పశువుల సంఖ్య ఉండాలి.
  2. కొట్లాటలు జరిగే అవకాశం: కొత్త పశువును సమూహంలోకి తీసుకువచ్చినప్పుడు ఇతర పశువులతో కొట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త పశువులను వెంటనే ప్రధాన సమూహంలోకి చేర్చకుండా కొంతకాలం జాగ్రత్తగా గమనించడం మంచిది.
  3. పరిశుభ్రత సమస్యలు: పేడ మరియు మూత్రం సరిగా తొలగించకపోతే షెడ్‌లో అపరిశుభ్రత ఏర్పడుతుంది.
    దీనివల్ల:
    • ఈగలు పెరగడం
    • దుర్వాసన రావడం
    • వ్యాధులు వ్యాపించడం
    • పాదాల సమస్యలు రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి షెడ్‌ను ప్రతిరోజూ శుభ్రం చేయాలి.

లూజ్ హౌసింగ్ షెడ్ నిర్వహణ
లూజ్ హౌసింగ్ విధానం విజయవంతం కావడానికి సరైన నిర్వహణ చాలా అవసరం.

ప్రతిరోజూ చేయవలసిన పనులు

  1. పేడను తొలగించాలి: పశువుల విశ్రాంతి ప్రదేశం మరియు ఓపెన్ యార్డ్‌లో పేరుకుపోయిన పేడను క్రమం తప్పకుండా తొలగించాలి.
  2. నీటి తొట్టిని శుభ్రం చేయాలి: నీటి తొట్లో మురికి, పేడ లేదా మేత పడకుండా చూడాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
  3. మేత తొట్టిని శుభ్రంగా ఉంచాలి: పాత లేదా పాడైన మేతను తొలగించి తాజా మేత ఇవ్వాలి.
  4. అనారోగ్య పశువులను వేరుగా ఉంచాలి: అనారోగ్యంగా ఉన్న పశువులను వెంటనే గుర్తించి ఇతర పశువుల నుండి వేరుగా ఉంచాలి. అవసరమైతే పశువైద్యుని సలహా తీసుకోవాలి.
  5. పశువుల ఆరోగ్యాన్ని గమనించాలి: ప్రతిరోజూ పశువులలో ఆకలి, పాల ఉత్పత్తి, నడక, శరీర ఉష్ణోగ్రత, మలం మరియు మూత్రం, ఈస్ట్రస్ లక్షణాలు వంటి అంశాలను గమనించాలి.
    ముగింపు: లూజ్ హౌసింగ్ సిస్టమ్ అనేది పాడి పశువులను ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా మరియు సహజ వాతావరణంలో పెంచడానికి ఉపయోగపడే మంచి గృహ నిర్వహణ విధానం. ఈ విధానంలో పశువులకు కప్పు ఉన్న విశ్రాంతి ప్రదేశం, స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ యార్డ్, సరైన మేత మరియు శుభ్రమైన నీరు అందించబడతాయి.
    పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరియు సంక్షేమం మెరుగుపడటానికి సరైన గృహ వసతి చాలా అవసరం. లూజ్ హౌసింగ్ విధానంలో మంచి డ్రైనేజీ, పరిశుభ్రత, గాలి ప్రసరణ, తగినంత స్థలం మరియు సరైన నిర్వహణ ఉండాలి. సరైన ప్రణాళికతో లూజ్ హౌసింగ్ విధానాన్ని అమలు చేస్తే పశువులకు సౌకర్యవంతమైన జీవన వాతావరణం కల్పించడంతో పాటు రైతుకు పాడి పరిశ్రమ నిర్వహణలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
    రైతులకు ముఖ్య సందేశం

“మంచి షెడ్ – ఆరోగ్యకరమైన పశువు; ఆరోగ్యకరమైన పశువు – అధిక ఉత్పత్తి; అధిక ఉత్పత్తి – అధిక ఆదాయం.”

డా జె. సాయి కిరణ్ (శాస్త్రవేత, ఎల్ పి ఎం)
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్
Ph: 8121451017

Read More

గేదె పదేపదే ఎదకు వస్తోందా? గర్భం నిలవకపోవడానికి కారణాలు – రైతులు ఏం చేయాలి?

గేదె ఎదకు వచ్చింది… కృత్రిమ గర్భధారణ (AI) చేయించారు… కానీ గర్భం నిలవకుండా మళ్లీ ఎదకు వచ్చింది. మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించినా అదే పరిస్థితి. ఇలా పదేపదే జరిగితే రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా, రెండు ఈతల మధ్య కాలం పెరిగి పాల ఉత్పత్తి మరియు ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది.

గేదె సాధారణంగా ఎదకు వస్తున్నప్పటికీ, సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే దీనిని రిపీట్ బ్రీడింగ్ (Repeat Breeding) అంటారు.

దీనికి ఒకే కారణం ఉండదు. ఎదను సరిగ్గా గుర్తించకపోవడం, కృత్రిమ గర్భధారణ సమయం తప్పడం, ప్రసవం తర్వాత గర్భాశయ సమస్యలు, సమతుల్య ఆహారం అందకపోవడం, ఖనిజలవణాల లోపం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల గర్భం నిలవడం లేదని పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించడం కాకుండా, అసలు కారణాన్ని గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.

ఎదను సరిగ్గా గుర్తించండి
గేదెల్లో ఎద లక్షణాలు ఆవులతో పోలిస్తే కొన్నిసార్లు స్పష్టంగా కనిపించవు. ముఖ్యంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఎదకు వస్తే రైతు గమనించకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎదను సరిగ్గా గుర్తించకపోతే కృత్రిమ గర్భధారణ చేయించే సమయం కూడా తప్పిపోవచ్చు.

అందుకే ఉదయం, సాయంత్రం గేదెలను కొద్దిసేపు ప్రత్యేకంగా గమనించండి. ఇతర గేదె ఎక్కినప్పుడు కదలకుండా నిలబడటం ఎదకు ముఖ్యమైన లక్షణం. ఇతర పశువులపై ఎక్కడానికి ప్రయత్నించడం, యోని నుంచి పారదర్శకమైన జిగట స్రావం రావడం, తరచుగా మూత్రం పోయడం, సాధారణం కంటే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, తోకను ఎత్తడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

అయితే ఒక్క లక్షణాన్ని చూసి ఎదకు వచ్చిందని నిర్ణయించకుండా, రెండు మూడు లక్షణాలను కలిపి గమనించడం మంచిది.

రైతులకు సూచన: ఎద లక్షణాలు మొదట కనిపించిన తేదీతో పాటు సమయాన్ని కూడా రాసిపెట్టండి. సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించండి

ఎదను గుర్తించడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం కూడా అంతే ముఖ్యం. చాలా ముందుగా లేదా ఆలస్యంగా కృత్రిమ గర్భధారణ చేయిస్తే గర్భం దాల్చే అవకాశం తగ్గవచ్చు.
రైతులు సులభంగా గుర్తుంచుకోవడానికి సాధారణంగా ఉదయం ఎద స్పష్టంగా కనిపిస్తే అదే రోజు సాయంత్రం, సాయంత్రం ఎద కనిపిస్తే మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భధారణ చేయించడం అనుసరించే పద్ధతి.
ఎద ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియకపోతే ఊహించి సమయం నిర్ణయించకుండా, శిక్షణ పొందిన కృత్రిమ గర్భధారణ సిబ్బంది లేదా పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్య సూచన: గర్భం నిలవలేదని వెంటనే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు. ముందుగా ఎదను సరిగ్గా గుర్తించామా, కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో జరిగిందా అనే విషయాలను పరిశీలించాలి.

ప్రసవం తర్వాత ఆరోగ్యాన్ని గమనించండి
కొన్ని గేదెల్లో రిపీట్ బ్రీడింగ్ సమస్యకు కారణం గత ప్రసవం తర్వాతే మొదలవుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయం మళ్లీ ఆరోగ్యకరమైన స్థితికి రావాలి. మాయ పడటం ఆలస్యం కావడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం పడవచ్చు.

ప్రసవం తర్వాత గేదెను జాగ్రత్తగా గమనించండి. మాయ పడటం ఆలస్యమైనా, దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. జ్వరం, ఆకలి తగ్గడం లేదా బాగా నీరసంగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయిస్తే తరువాత వచ్చే పునరుత్పత్తి సమస్యలను తగ్గించుకోవచ్చు.

సమతుల్య ఆహారం అందించండి
గేదెకు కడుపు నిండా మేత ఇవ్వడం మాత్రమే సరిపోదు. పాల ఉత్పత్తితో పాటు గర్భం దాల్చడానికి కూడా అవసరమైన పోషకాలు తగినంతగా అందాలి. పచ్చిమేత, ఎండుమేత, దాణా సరైన పరిమాణంలో అందకపోవడం లేదా పాలిచ్చే గేదెకు అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల పశువు క్రమంగా బలహీనపడవచ్చు. ఇది ఎదకు రావడం మరియు గర్భం దాల్చడంపై కూడా ప్రభావం చూపవచ్చు.

అందువల్ల మంచి నాణ్యత గల పచ్చిమేత, ఎండుమేతతో పాటు పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇవ్వాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. గేదె క్రమంగా బలహీనపడుతున్నట్లు లేదా బక్కగా అవుతున్నట్లు కనిపిస్తే కేవలం దాణా పరిమాణం పెంచడం కాకుండా, రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.

ముఖ్య సూచన: పాలిచ్చే గేదెకు తగినంత మేతతో పాటు, అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందేలా చూడటం ముఖ్యం.

ఖనిజలవణాలపై శ్రద్ధ పెట్టండి
మేత బాగానే ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పశువుకు అవసరమైన ఖనిజలవణాలు తగినంత అందకపోవచ్చు. ఖనిజలవణాల లోపం పశువుల సాధారణ ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు.

అందువల్ల రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుడు లేదా పశుపోషణ నిపుణుడి సలహా మేరకు మంచి నాణ్యత గల ఖనిజలవణ మిశ్రమం (Mineral Mixture) ఇవ్వాలి. పదేపదే గర్భం దాల్చని గేదెల్లో పోషకాహారం లేదా ఖనిజలవణాల లోపం ఉందేమో కూడా పరిశీలించడం మంచిది.

గర్భాశయ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి
బయటకు గేదె ఆరోగ్యంగానే కనిపించినా కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోతే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం చూపవచ్చు.
దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా పశువైద్యుని సంప్రదించాలి. పలుమార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే గర్భాశయం మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల్లో ఏదైనా సమస్య ఉందా, ఎద సక్రమంగా వస్తోందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలను పశువైద్యునితో పరీక్ష చేయించాలి.

జాగ్రత్త: గర్భం దాల్చడం లేదని సొంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకండి. కారణాన్ని గుర్తించిన తర్వాత పశువైద్యుని సూచన మేరకే చికిత్స చేయించాలి.
పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించకుండా కారణాన్ని తెలుసుకోండి

ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత గర్భం దాల్చకపోవచ్చు. కానీ సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు.

అలాంటి గేదెను పశువైద్యునికి చూపించి గర్భం నిలవకపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఎదకు సంబంధించిన సమస్యలు, పోషకాహార లోపాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో పరీక్ష చేయించాలి.

కారణాన్ని బట్టి చికిత్స చేయించడం లేదా ఆహారం, నిర్వహణలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. ఇలా అసలు కారణాన్ని గుర్తిస్తే అనవసరంగా పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించే ఖర్చు మరియు సమయాన్ని తగ్గించుకోవచ్చు.

పునరుత్పత్తి వివరాలను రాసిపెట్టండి
ఒక చిన్న నోట్‌బుక్ కూడా రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గేదెకు సంబంధించిన ప్రసవ తేదీ, ఎద వచ్చిన తేదీ మరియు సమయం, కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ మరియు సమయం, ఎన్నవసారి కృత్రిమ గర్భధారణ చేశారు, గర్భ నిర్ధారణ వివరాలు రాసిపెట్టాలి.

ఇలా రికార్డు ఉంచితే గేదె ఎప్పుడు ఎదకు వచ్చింది, ఎప్పుడు కృత్రిమ గర్భధారణ చేశారు, ఎన్నిసార్లు కృత్రిమ గర్భధారణ చేశారు అనే విషయం ఇంట్లో ఎవరికైనా సులభంగా తెలుస్తుంది. రైతు ఇంట్లో లేకపోయినా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ వివరాలు చూసి అవసరమైనప్పుడు గేదెను పశువైద్యశాలకు తీసుకెళ్లవచ్చు. పశువైద్యునికి ఈ రికార్డు చూపిస్తే గత వివరాలు వెంటనే తెలుసుకొని, సమస్యను గుర్తించి సరైన సలహా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.

గేదె పదేపదే ఎదకు వస్తున్నా గర్భం దాల్చకపోతే అనవసరంగా మళ్లీ మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించకండి. ఎదను సరిగ్గా గమనించడం, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం, సమతుల్య ఆహారం అందించడం, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు సమయానికి చికిత్స చేయించడం ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. అయినప్పటికీ సమస్య కొనసాగితే ఆలస్యం చేయకుండా పశువైద్యునికి చూపించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

Dr.గడ్డం రాధిక, పశువైద్య అధికారి
P.V.C. ఉప్పరపల్లి, వరంగల్
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం
పశువైద్య కళాశాల, కోరుట్ల. Ph: 7093198419

Read More

వర్షాకాలంలో పశుసంపద సంరక్షణ – శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు

వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతంతో పాటు రోగకారక క్రిములు (బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు) వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల పశువులలో పాల దిగుబడి తగ్గడమే కాకుండా తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో పశుపోషణలో పాటించాల్సిన సమగ్ర శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు

1: షెడ్ల నిర్వహణ, పారిశుధ్యం మరియు గాలి-వెలుతురు (Shed Management & Sanitation)

వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం షెడ్ పరిశుభ్రతపైనే 80% ఆధారపడి ఉంటుంది.

ఏ . షెడ్ పరిశుభ్రత మరియు నీటి నిల్వ నివారణ:

  • నేల పొడిగా ఉంచడం: షెడ్ లోపల నీరు నిలవకుండా చూడాలి. కాంక్రీట్ లేదా మట్టి నేలపై వర్షం నీరు లేదా మూత్రం నిలిస్తే గిట్టల కుళ్లు (Foot rot) మరియు పొదుగు వాపు (Mastitis) వ్యాధులు వస్తాయి.
  • సున్నం మరియు క్రిమిసంహారకాలు: వారానికి కనీసం రెండు సార్లు షెడ్ నేలపై, మూలల్లో పొడి సున్నం (Quick lime) లేదా వరి పొట్టు చల్లాలి. ఇది తేమను పీల్చుకుని క్రిములను చంపుతుంది.
  • మురుగు నీటి కాలువలు: షెడ్ చుట్టూ ఉన్న కాలువలను శుభ్రం చేసి వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా చూసుకోవాలి.
  1. షెడ్ ఎత్తు మరియు గాలి, వెలుతురు:
  • కిటికీలు మరియు పరదాలు: వర్షం చినుకులు లోపలికి పడకుండా గోనె సంచులు లేదా తార్పాలిన్ పరదాలను అమర్చాలి. అయితే, షెడ్ లోపల అమ్మోనియా వాయువు నిలిచిపోకుండా గాలి ఆడటానికి పైన ఖాళీ (Ventilation) ఉంచాలి.
  • ఈగలు, దోమల నివారణ: వర్షాకాలంలో దోమలు, ఈగల తీవ్రత ఎక్కువ. వీటి నివారణకు సాయంత్రం వేళల్లో వేపఆకులు, సాంబ్రాణి పొగ వేయడం లేదా పొగచుట్ట పొడి ద్రావణాన్ని షెడ్ చుట్టూ పిచికారీ చేయడం చేయాలి.

2: మేత మరియు పోషక యాజమాన్యం (Feed & Nutrition Management)
వర్షాకాలంలో లభించే చిగురించిన పచ్చిమేత వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఏ . పచ్చిమేత వాడకంలో జాగ్రత్తలు:

  • లేత గడ్డి వల్ల ప్రమాదం: వర్షాలకు కొత్తగా పెరిగిన లేత పచ్చిమేతలో నీటి శాతం ఎక్కువ, పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉంటుంది. దీనిని నేరుగా తినిపిస్తే పశువులకు సార విరేచనాలు (Diarrhea) మరియు కడుపు ఉబ్బరం (Bloat) వస్తాయి.
  • ఎండుగడ్డి కలపడం: పచ్చిమేతతో పాటు తప్పనిసరిగా తగినంత వరిగడ్డి లేదా జొన్న చొప్ప (ఎండుమేత) కలిపి అందించాలి. పచ్చిమేత కోసిన వెంటనే వేయకుండా 2-3 గంటల పాటు నీడలో ఆరబెట్టి వేయాలి.

బి . బూజు పట్టిన మేత నివారణ (Aflatoxin Control):

  • వర్షాకాలంలో గాలిలో తేమ వల్ల నిల్వ ఉంచిన దాణా, శనగ పొట్టు, తవుడు బూజు పట్టే ప్రమాదం ఉంది.
  • బూజు పట్టిన దాణాను పశువులకు మేపకూడదు. దీనివల్ల కాలేయం పాడై ‘ఆఫ్లాటాక్సికోసిస్’ అనే విషప్రభావం ఏర్పడుతుంది. దాణాను నిల్వ చేసే ప్రదేశంలో ప్లాస్టిక్ షీట్ పరిచి దానిపై బస్తాలు ఉంచాలి.

సి . మినరల్ మిశ్రమం మరియు తాగునీరు:

  • ధాతు లవణాల మిశ్రమం (Mineral Mixture): వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ప్రతి పాడి పశువుకు రోజుకు 50-100 గ్రాముల మినరల్ మిశ్రమం దాణాలో కలిపి ఇవ్వాలి.
  • శుభ్రమైన నీరు: వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. పశువులకు పంపు నీరు లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాపాలి. గుంటల్లో నిలిచిన వర్షపు నీటిని తాపకూడదు.

3: వ్యాధుల వ్యాప్తి, నివారణ మరియు అత్యవసర జాగ్రత్తలు (Disease Control & Health Care)
వర్షాకాలంలో బ్యాక్టీరియల్ మరియు పరాన్నజీవుల (Parasites) ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువ.

ఏ . ముఖ్యమైన వ్యాధులు – ముందస్తు టీకాలు (Vaccinations):

వ్యాధి పేరు
గొంతువాపు (HS)

లక్షణాలు:
గొంతు వాచి శ్వాస తీసుకోవడం కష్టమవడం, తెల్లటి నురుగు రావడం

నివారణ / టీకా:
వర్షాకాలం ముందు లేదా ప్రారంభంలో H.S. టీకా వేయించాలి

వ్యాధి పేరు: జానపద వ్యాధి (BQ)

లక్షణాలు: పిరుదుల కండరాలు వాచి, తాకితే చప్పుడు రావడం, తీవ్ర జ్వరం

నివారణ / టీకా: B.Q. టీకా వేయించాలి

వ్యాధి పేరు: పొదుగు వాపు (Mastitis)

లక్షణాలు: పొదుగు గట్టిపడి పాలు ఎర్రగా/విరిగిపోయి రావడం

నివారణ / టీకా: పాలు పితికిన తర్వాత చనుమొనలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచాలి

వ్యాధి పేరు: పరాన్నజీవుల సమస్య

లక్షణాలు: బరువు తగ్గడం, కళ్ల వెంట నీరు, దవడ కింద వాపు

నివారణ / టీకా: నట్టల నివారణ మందు (Deworming) తాపించాలి

బి . గిట్టల సంరక్షణ (Foot Care):
• నేల తేమగా ఉండటం వల్ల గిట్టల మధ్య పుండ్లు పడతాయి (Foot rot).
• పరిష్కారం: వారానికి ఒకసారి పశువుల కాళ్లను 2% రాగి మైలుతుత్తం (Copper Sulphate) ద్రావణంతో కడగాలి.

  1. గొర్రెలు, మేకలు మరియు కోళ్ల ప్రత్యేక జాగ్రత్తలు:
    • గొర్రెలు/మేకలు: వీటిని వర్షంలో తడవనివ్వకూడదు. వర్షాకాలంలో PPR టీకా మరియు ఎంటరోటాక్సిమియా (ET) టీకా తప్పనిసరిగా వేయించాలి.
    • పెరటి కోళ్లు: కోళ్ల షెడ్లలో రంధ్రాలు లేకుండా చూసి, రాణిఖేత్ (RDV) టీకా వేయించాలి. తాగునీటిలో యాంటీబయోటిక్స్ లేదా విటమిన్లు కలిపి ఇవ్వడం శ్రేయస్కరం.

రైతులకు ముఖ్య గమనిక:
వర్షాకాలంలో పశువులలో ఏమాత్రం మేత తినకపోవడం, జ్వరం రావడం లేదా నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలో ఉన్న పశువైద్యుడిని (Veterinary Doctor) సంప్రదించి చికిత్స అందించాలి.

రచయిత: డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం). Ph: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

శాస్త్రీయ పద్ధతుల ద్వారా పశువుల ఎంపిక

రైతు సోదరులు, పశుపోషణలో సరైన జంతువులను ఎంపిక చేసుకోవడం అనేది లాభనష్టాలను శాసించే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. నాణ్యమైన, ఆరోగ్యకరమైన పశువులను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసుకోవాలి.

  1. పాడి పశువుల ఎంపిక (ఆవులు మరియు గేదెలు)
    పాడి పరిశ్రమలో అధిక పాల దిగుబడి మరియు నిరంతర ఆదాయం కోసం ఆవులు, గేదెలను ఎంచుకునేటప్పుడు ఈ క్రింది శారీరక, ఉత్పాదక లక్షణాలను గమనించాలి:

ఆ. శారీరక నిర్మాణం (Body Conformation)
• త్రిభుజాకార శరీరం (Wedge Shape): మంచి పాడి పశువు వెనుక భాగం వెడల్పుగా, ముందు భాగం (తల మరియు మెడ) సన్నగా ఉండి, పక్క నుండి చూస్తే త్రిభుజాకారంలా కనిపించాలి. ఇది పాలు ఇచ్చే సామర్థ్యానికి ప్రతీక.
• చర్మం మరియు కళ్లు: చర్మం పల్చగా, మెరుస్తూ, పట్టుకుంటే వదిలేసేలా వదులుగా ఉండాలి. కళ్లు చురుగ్గా, స్పష్టంగా ఉండాలి.
• వెన్నెముక మరియు కాళ్లు: వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్లు బలంగా, నిలబడే పద్ధతి సరిగ్గా ఉండి, గిట్టలు ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.

బి. పొదుగు మరియు చనుమొనల లక్షణాలు (Udder and Teats)
• పొదుగు పరిమాణం: పొదుగు పెద్దదిగా, వెనుక కాళ్ల మధ్య భాగంలో బాగా అమర్చబడి ఉండాలి. పాలు పితికిన తర్వాత పొదుగు పూర్తిగా ముడుచుకుపోవాలి (ఇది పొదుగులో కొవ్వు తక్కువగా, పాల గ్రంథులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది).
• పాల నరాలు (Milk Veins): పొదుగు ముందరి భాగం నుండి పొట్ట కింది వరకు సాగే పాల నరాలు లావుగా, వంకరలు తిరిగి స్పష్టంగా కనిపించాలి.
• చనుమొనలు: నాలుగు చనుమొనలు సమానమైన పొడవు, లావు కలిగి, ఒకదానికొకటి సమాన దూరంలో చతురస్రాకారంలో అమరి ఉండాలి. పొదుగు గట్టిగా ఉండకూడదు (పొదుగు వాపు వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి).

సి. వయస్సు మరియు ఈత (Age and Lactation)
• ఈత: మొదటి లేదా రెండవ ఈతలో ఉన్న పశువులను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.
• వయస్సు నిర్ధారణ: పశువు నోటిలోని పళ్లను చూసి వయస్సును శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు. 4 నుండి 6 శాశ్వత పళ్లు (దాదాపు 3 నుండి 5 సంవత్సరాల వయస్సు) ఉన్న పశువులు కొనుగోలుకు అనువైనవి.

డి. ఇతర ముఖ్యాంశాలు
• వీలైతే పశువును కొనేముందు వరుసగా మూడు పూటల పాలు పితికి చూసి, సగటు పాల దిగుబడిని లెక్కించాలి.
• తెలంగాణ వాతావరణానికి గేదెలలో ముర్రా (Murrah) లేదా స్థానిక గ్రేడెడ్ ముర్రా, ఆవులలో జెర్సీ క్రాస్ (Jersey Cross), హెచ్.ఎఫ్ క్రాస్ (HF Cross) లేదా దేశవాళీ జాతులైన గిర్ (Gir), సాహివాల్ (Sahiwal) అనుకూలమైనవి.

  1. గొర్రెలు మరియు మేకల ఎంపిక (Sheep and Goat Selection)
    మాంసం ఉత్పత్తి మరియు పిల్లల ద్వారా లాభాలు పొందడానికి జీవాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరం.

ఆ. పోతు జీవాల ఎంపిక (Breeding Rams / Bucks)
మంద అభివృద్ధి అంతా పోతు జీవం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని ఎంపిక అత్యంత కీలకం.
• లక్షణాలు: పోతు జీవం చురుగ్గా, పొడవుగా, ఎత్తైన శరీరంతో, వెడల్పాటి ఛాతి కలిగి ఉండాలి.
• ప్రజనన అవయవాలు: రెండు వృషణాలు (Testicles) సమాన పరిమాణంలో, బాగా అభివృద్ధి చెంది, కిందికి వేలాడుతూ ఉండాలి. వృషణాలలో ఎలాంటి వాపులు లేదా గడ్డలు ఉండకూడదు.
• వయస్సు: 1 నుండి 1.5 సంవత్సరాల వయస్సు (రెండు పళ్ల ప్రాయం) ఉన్న పోతులను మాత్రమే ప్రజననం (దాటించడం) కోసం వాడాలి.

బి. ఆడ జీవాల ఎంపిక (Ewes / Does)
• శరీర రూపురేఖలు: ఆడ జీవాల వెనుక భాగం వెడల్పుగా ఉండాలి, ఇది సులభంగా ఈనడానికి తోడ్పడుతుంది. నోరు, దవడలు సరిగ్గా అమరి ఉండి మేతను సులభంగా నమలగలగాలి.
• సంతానోత్పత్తి చరిత్ర: త్వరగా ఎదకు వచ్చేవి, తక్కువ వ్యవధిలో ఈనేవి మరియు ఒకే ఈతలో రెండు పిల్లలను (ముఖ్యంగా మేకలలో) కనే హిస్టరీ ఉన్న తల్లుల నుండి వచ్చిన పిల్లలను ఎంచుకోవాలి.
• పొదుగు ఆరోగ్యం: పొదుగును తాకి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. చనుమొనలు మూసుకుపోయి ఉండకూడదు.

సి. వయస్సు మరియు జాతులు
• వయస్సు: 1 నుండి 2 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ జీవాలు మొదటి ఈతకు సిద్ధంగా ఉంటాయి.
• తెలంగాణకు అనువైన జాతులు:
o గొర్రెలు: నెల్లూరు (జోడిపి, బ్రౌన్), నల్లగొండ స్థానిక జాతులు.
o మేకలు: మహబూబ్‌నగర్ లోకల్, ఉస్మానాబాదీ, తలచ్చేరి/బీటల్ క్రాస్ జాతులు.

  1. పెరటి కోళ్ల ఎంపిక (Backyard Poultry Selection)
    తక్కువ పెట్టుబడితో ఇళ్ల వద్ద, పెరట్లో కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం మరియు పోషకాహారం పొందవచ్చు.

ఆ. పిల్లల (Chicks) మరియు పెరిగే కోళ్ల ఎంపిక
• చురుకుదనం: కోడిపిల్లలు చురుగ్గా కదులుతూ, శబ్దాలకు త్వరగా స్పందిస్తూ ఉండాలి. కళ్లు ప్రకాశవంతంగా, గుండ్రంగా ఉండాలి.
• శరీర నాణ్యత: పొట్ట భాగం మెత్తగా ఉండాలి (సరిగ్గా కరగని సొన వల్ల పొట్ట గట్టిగా ఉండకూడదు). ఈకలు పొడిగా, శుభ్రంగా ఉండాలి. కాళ్లు బలంగా, నిటారుగా ఉండి ఎలాంటి వైకల్యాలు ఉండకూడదు.
• నాభి (Navel): పిల్లల నాభి భాగం పూర్తిగా ఎండిపోయి, మూసుకుపోయి ఉండాలి. తడి నాభి ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

బి. గుడ్లు పెట్టే కోళ్ల ఎంపిక (Layers)
• కలగిరి (Comb) మరియు గడ్డం (Wattles): గుడ్లు పెట్టే కోడి యొక్క కలగిరి/శిఖ పెద్దదిగా, ఎర్రగా, వెచ్చగా మరియు మెరుస్తూ ఉంటుంది. గుడ్లు పెట్టని కోళ్లలో ఇది చిన్నదిగా, తెల్లగా మారుతుంది.
• శరీర సామర్థ్యం (Pelvic Bones): కోడి వెనుక భాగంలోని తుంటి ఎముకల (Pelvic bones) మధ్య కనీసం 2 నుండి 3 వేళ్ల వెడల్పు స్థలం ఉండాలి. అలాగే తుంటి ఎముకకు, రొమ్ము ఎముక చివరి భాగానికి (Keel bone) మధ్య 3 నుండి 4 వేళ్ల ఖాళీ ఉంటే అది ఎక్కువ గుడ్లు పెట్టే మంచి కోడి అని అర్థం.
• గుభ్రం (Vent): గుడ్లు పెట్టే కోడి యొక్క గుభ్రం (మల విసర్జన ద్వారం) వెడల్పుగా, తేమగా మరియు గుండ్రంగా ఉంటుంది.

సి. మాంసం కోళ్ల ఎంపిక (Broilers/Cockerels)
• తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే సామర్థ్యం, వెడల్పాటి రొమ్ము భాగం మరియు బలమైన తొడలు ఉన్న కోళ్లను మాంసం కోసం ఎంచుకోవాలి.

డి. తెలంగాణకు అనువైన పెరటి కోళ్ల రకాలు
• రాజశ్రీ (Rajasri), వనరాజ (Vanaraja), గ్రామప్రియ (Gramapriya) మరియు స్థానిక నాటు కోళ్లు పెరటి పెంపకానికి, తెలంగాణ వాతావరణానికి ఎంతో అనుకూలమైనవి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి, తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి.

రైతులకు సాధారణ ఆరోగ్య సూత్రాలు (Health Check-list)
ఏ జంతువు లేదా పక్షిని కొనుగోలు చేసినా ఈ క్రింది ఉమ్మడి ఆరోగ్య లక్షణాలను తప్పక గమనించాలి:

  1. ఆకలి మరియు నెమరు: జంతువు మేతను బాగా తింటూ, చురుగ్గా నెమరు వేస్తూ ఉండాలి.
  2. మలమూత్ర విసర్జన: పేడ లేదా విసర్జితాలు సాధారణ రంగు, గట్టిదనం కలిగి ఉండాలి (సారగా/డయేరియా ఉండకూడదు).
  3. కళ్ల నుండి నీరు: కళ్లు, ముక్కు మరియు నోటి నుండి ఎలాంటి అసాధారణ జిగట స్రావాలు కారకూడదు.
  4. టీకాల రికార్డు: కొనుగోలు చేసే ముందే సదరు పశువులకు/జీవాలకు సకాలంలో టీకాలు (FMD, PPR, గాలికుంటు, పిడుగు రోగం, కోళ్లలో ఆర్‌.డి.వి వంటివి) వేశారో లేదో కనుక్కోవాలి.
    ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులను పాటించి పశుసంపదను ఎంపిక చేసుకుంటే పశుపోషణలో నష్టాలు రాకుండా నివారించవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

రైతులకు, మహిళా స్వయం సహాయ సభ్యులకు పాడిరంగంపై శిక్షణ

పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో పాడిపరిశ్రమ, విస్తరణ, అభివృద్ధి, దాని ఉత్పత్తుల తయారీ, పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాడి రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు శిక్షణనిచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ పశువైద్య కళాళాలలోని పశుగణన క్షేత్ర సముదాయంలో మంగళవారం పాడి రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. పశుపోషణ, వ్యాపార సరళిలో డెయిరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణనిచ్చారు. త్వరలో స్వయం సహాయక సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విస్తరణ విభాగం అధిపతి సత్యనారాయణ తెలిపారు.

Read More

పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి

నైరుతి రుతుపవన కాలంలో ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరత, పచ్చిమేత లభ్యత తగ్గడం, కరవు పరిస్థితులు రావచ్చన్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖ తెలిపింది. ఈ పరిస్థితి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఆరోగ్యం, ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పశుపోషకులకు సూచనలు చేస్తూ ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు.
నీటివసతి ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక, అధిక దిగుబడి వచ్చే పశుగ్రాస పంటలను సాగు చేయడం ద్వారా వచ్చే మేత లభ్యతను కొనసాగించాలి. పశువులకు తగినంత తాగునీరు, పచ్చిమేత, ఖనిజ లవణ మిశ్రమాల పోషకాహారం అందించాలి. వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా పశుగ్రాస సాగు చేపట్టాలి. అదనపు పశుగ్రాసాన్ని సైలేజ్ రూపంలో నిల్వచేయాలి.

Read More

ఏప్రిల్ 16 వరకు పాడి పశువుల పథకం దరఖాస్తు చేసుకోవాలి

ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక, ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ‘రెండు పాడి పశువుల పథకం దరఖాస్తు గడువు ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఎండీ హన్మంతునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఫొటో, ఆధార్, రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు, భూమి పట్టా పాస్‌బుక్‌లు కాపీ (జిరాక్స్)లతో ఒక సెట్ మండల పరిషత్ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు.

Read More